కర్నూలు, మార్చి 19 : అనుకోని అతిథిలా సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన పురపాలక సంఘాల ఎన్నికలు ప్రధాన పార్టీలైన టిడిపి, వైకాపాకు తలపోటుగా మారాయి. సరిగ్గా రాష్ట్ర విభజన అనంతరం ఎన్నికలు రావడంతో ఇబ్బందులో పడిన కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం, వైకాపాల్లోకి వలసలు వెల్లువెత్తాయి. దీంతో ఈ రెండు పార్టీలు పురపాలక సంఘాలకు పోటీలో నిలబెట్టడానికి అభ్యర్థుల ఎంపికకు శ్రమించాల్సి వచ్చింది. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో అగ్ర నేతల చేరికతో అంతకు ముందున్న నాయకుల మధ్య మనస్పర్థలు రాకుండా ఇరువర్గాలకు న్యాయం జరిగేలా ఎంపిక ప్రక్రియ కొనసాగింది. అయితే తెలుగుదేశం పార్టీ అన్ని సంఘాల్లోనూ ఇబ్బందుల నుంచి గట్టెక్కినా ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో ఐదుగురు, నందికొట్కూరు పురపాలక సంఘంలో ముగ్గురు అభ్యర్థుల నుంచి తిరుగుబాటు ఎదురైంది. ఈ రెండు సంఘాల్లో ఆ పార్టీ కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉండటంతో మొదట నామినేషన్లు వేయించామని అయితే వర్గ సమీకరణలు, నాయకుల చేరిక వంటి కారణాల రిత్యా కొందరికి అవకాశం కల్పించలేకపోయామని టిడిపి నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ ముగిసినా వారిని ఒప్పించి అభ్యర్థుల విజయానికి కృషి చేసేలా అంగీకరింపజేశామని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో తమ పార్టీకి ఎక్కడా తిరుగుబాటు అభ్యర్థులు లేరని పేర్కొన్నారు. కాగా వైకాపాలో కూడా పురపాలక ఎన్నికల్లో పోటీ కోసం వార్డు నేతలు క్యూ కట్టారు. దీంతో నాయకులు అన్ని వైపులా ఆలోచించి అభ్యర్థులను ప్రకటించి బి ఫారాలు అందించారు. దీంతో ఆ పార్టీ తరపున ఎమ్మిగనూరులో ఒకరు, నందికొట్కూరులో ఐదుగురు అభ్యర్థులు తిరుగబాటు జెండా ఎగురవేసి నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. దీంతో ఆ ఐదు వార్డుల్లో పార్టీ ఓట్లలో చీలిక వచ్చి ప్రత్యర్థుల విజయానికి బాటలు వేసినట్లవుతుందని ఆందోళన చెందుతున్నారు. తిరుగుబాటు అభ్యర్థులతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు చర్చలు జరిపినా ఫలితం కనిపించ లేదు. అయినా తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించే పనిలో జిల్లాస్థాయి నేతలు కూడా రంగంలోకి దిగి చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా వైకాపా జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ విజయంపై ధీమా ఉన్నందునే పోటీ అభ్యర్థులు తయారయ్యారని, అయితే దీని వల్ల నష్టం జరుగుతుందని వార్డు నేతలకు నచ్చజెప్పి వారిని పోటీ నుంచి తప్పుకునేందుకు ఒప్పించినట్లు తెలిపారు. అన్ని పురపాలక సంఘాలను క్రైవసం చేసుకుంటామన్నారు. ఇక జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అయిందని భావిస్తున్నా ఎమ్మిగనూరులో ఆ పార్టీకి తిరుగుబాటు అభ్యర్థులు ఉండటం విశేషం. ఈ పురపాలక సంఘంలో వార్డు అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడిన ఇద్దరు అభ్యర్థులు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మళ్లీ ఇదేంటని ఆ పార్టీ నేతలు తిరుగుబాటు అభ్యర్థులతో చర్చలు ప్రారంభించారు. ఎమ్మిగనూరులో విజయావకాశాలు ఉన్నాయని దీన్ని దెబ్బ తీయవద్దని భవిష్యత్‌లో తగిన గుర్తింపునిస్తామని నచ్చజెప్పి బుధవారం నాటికి వారిని అధికారిక అభ్యర్థితో ప్రచారంలోకి దింపారు. దీంతో ఆ పార్టీ ఆనందంలో మునిగిపోయింది. అనుకోని రీతిలో వచ్చిన పురపాలక సంఘాల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని సత్తా చాటాలనుకుంటున్న నేతలు ప్రస్తుతం విజయం కోసం చెమటోడుస్తున్నారు.
నేడు నామినేషన్లకు చివరి రోజు
* 1186 ఎంపిటిసి, 71 జెడ్పిటిసిలకు దాఖలు
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, మార్చి 19 : జిల్లాలో జరగనున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి బుధవారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. గత మూడు రోజులుగా ఎంపిటిసి స్థానాలకు 1186, జెడ్పీటీసీ స్థానాలకు 71 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రెండు రోజుల్లో ఎంపిటిసి 112, జెడ్పీటీసీ ఆరు నామినేషనే్ల రాగా బుధవారం ఒక్కరోజే ఎంపిటిసి స్థానాలకు 1074, జడ్పీటీసీ స్థానాలకు 65 దాఖలు చేయడం గమనార్హం. పురపాలక సంఘాల మాదిరిగానే టిడిపి, వైకాపా జోరుగా నామినేషన్లు దాఖలు చేయగా కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. టిడిపి తరుపున ఎంపిటిసి స్థానాలకు 461, జెడ్పీటీసీ స్థానాలకు 30 నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. వైకాపా తరుపున ఎంటిపిసి 472, జెడ్పీటీసీ స్థానాలకు 24 నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ విషయానికొస్తే వస్తే ఎంపిటిసి స్థానాలకు 87, జెడ్పీటీసీ స్థానాలకు తొమ్మిది నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 53 జెడ్పీటీసీ, 815 ఎంపిటిసి స్థానాలకు పోటీ జరుగుతోంది. నామినేషన్ల దాఖలకు గురువారం సాయంకాలంతో గడువు ముగియనుంది. దీంతో చివరి రోజున ఇంకా భారీ సంఖ్యలో నామినేషన్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. కాగా స్థానిక సంస్థల్లో ఆధిక్యతను చాటుకునేందుకు తెలుగుదేశం, వైకాపా తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఆయా పార్టీల నేతలు బలమున్న గ్రామాల నుండి ఎంపిటిసిలను ఏకగ్రీవం చేసుకునేందుకు ముమ్మర కరసత్తు చేస్తున్నారు. మరోవైపు తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పించుకునేందుకు ఈ రెండు పార్టీల నాయకులు చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ పరిధిలో పూర్తిగా బలహీన పడిపోగా, కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఒకరమైన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలోనే విజయావకాశాలు ఉండడంతో ఆ పార్టీ విజయం కోసం శ్రమిస్తోంది.
కృష్ణమ్మ ఒడి నుంచి బయటపడిన
సంగమేశ్వరాలయ గోపురం
ఆత్మకూరు రూరల్, మార్చి 19 : కృష్ణమ్మ ఒడి నుంచి సప్తనదుల సంగమేశ్వరాలయ గోపురం బుధవారం బయటపడింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు రావడంతో గత ఏడాది ఆగస్టు మాసం మూడవ వారంలో ఆలయం మొత్తం నీట మునిగింది. అప్పటి నుంచి కృష్ణమ్మ గర్భంలో ఉన్న ఆలయం బుధవారం బయటపడింది. శ్రీ లలితా సంగమేశ్వర ఆలయ గోపురం బయటపడిన సంగతి తెలుసుకున్న భక్తులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దూరం నుంచే సంగమేశ్వరుడికి పూజలు నిర్వహించారు. కొంతమంది తెప్పల్లో ఆలయ శిఖరం వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి పూజలు జరిపారు. ప్రతి ఏట సప్తనదుల సంగమేశ్వరాలయం జూలై, ఆగస్టు నెలల్లో నీట మునుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీశైలం జలాశయం నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పట్టినప్పుడు ఆలయం బయటపడుతుంది. ఇలాగే గత ఏడాది ఉగాది పర్వదినానికల్లా ఆలయం మొత్తం బయట పడడంతో వేపదారు లింగాన్ని దర్శించుకున్నామని భక్తులు పేర్కొంటున్నారు. ఈసారి కూడా ఉగాది పర్వదినానికి గర్భాలయం బయటపడవచ్చని భక్తులు అంటున్నారు.
ఎన్నికల తర్వాత వైకాపా ఖాళీ
* కాంగ్రెస్ మూతపడిన కర్మాగారం
* టిడిపి నేత సిఎం రమేష్
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, మార్చి 19: రాష్ట్రంలో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ ఖాలీ కాగా ఎన్నికల అనంతరం వైకాపా ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. ఈ నెల 21న కర్నూలులో నిర్వహించనున్న ప్రజాగర్జన సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి బుధవారం ఆయన కర్నూలుకు వచ్చారు. ఈ సందర్భంగా వేదిక వద్ద విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మూతబడిన కర్మాగారం లాంటిదని అభివర్ణించారు. దీంతో ఆ పార్టీలోని కీలక నేతలంతా ప్రజాబలం ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారన్నారు. వైకాపా అధినేత జగన్ వ్యవహార శైలిని దూరం నుంచి చూసిన వారు ఆ పార్టీలో చేరారని, ఆ తరువాత ఆయన మానసిక పరిస్థితి దగ్గర్నుంచి చూసి జీర్ణించుకోలేక వెనుదిరుగుతున్నారన్నారు. ఎన్నికల అనంతరం ఇప్పుడున్న నాయకులు కూడా ఉండబోరని తెలిపారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని తేలిపోయిందన్నారు. దీంతోపార్టీని రక్షించుకోవడానికి అవాస్తవలతో కూడిన సర్వేలు వెల్లడిస్తున్నారన్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకున్న తరువాతే తమ పార్టీలోకి ఇతర పార్టీ నేతలు వలస వచ్చారని ఆయన అన్నారు. పొత్తుల విషయంలో పార్టీ సీనియర్ నేతలు నిర్ణయం తీసుకుంటారని దీనిపై తానేమీ మాట్లాడబోనని అన్నారు. ఎవరితో కలుస్తామో ఇపుడే చెప్పడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
నయనానందకరం.. తెప్పోత్సవం
ఆళ్లగడ్డ, మార్చి 19 : పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బుధవారం శ్రీ ప్రహ్లాద వరదునికి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ మేనేజర్ రామానుజన్ ఆధ్వర్యంలో ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను గ్రామోత్సవంగా ఆలయం సమీపంలో వున్న కోనేరు వద్దకు తీసుకొని వెళ్లి ప్రత్యేకంగా తయారు చేసిన తెప్పలో స్వామిని కొలువుంచారు. 46వ జియ్యర్ స్వామి స్వామికి పూజలు నిర్వహించిన అనంతరం కోనేరులో తెప్పను ఆరు పర్యాయములు విహరింపజేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో అలసి పోయిన స్వామి తెప్పలో విహరిస్తారని అన్నారు. రెండవ రోజు ఐదు పర్యాయములు విహరించారు.
అందరూ ఓటుహక్కు వినియోగించుకునేలా
చొరవ తీసుకోవాలి
* ఎన్నికల కమిషన్ డైరెక్టర్ జనరల్ అక్షయ రౌత్
కర్నూలు ఓల్డ్‌సిటీ, మార్చి 19 : రాష్ట్రంలోని ప్రతిజిల్లాలో 85 శాతంపైగా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేలా చొరవ తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ డైరెక్టర్ జనరల్ అక్షయ రౌత్ ఆయా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. బుధవారం సార్వత్రిక ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారులతో హైదారాబాద్ నుండి డైరెక్టర్ జనరల్ అక్షయ రౌత్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ అక్షయ రౌత్ మాట్లాడుతూ ఓటింగ్ శాతం తక్కువగా ఉన్న నియోజకవర్గాలను దృష్టి సారించాలన్నారు. ఎన్నికల బూత్‌ల్లో అన్ని వౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పోలింగ్ రోజున ఓటర్లకు ఎలాంటి ఆసౌకర్యాలు కల్గించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాటిపై పరిశీలించి ఓటుహక్కు కల్పించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన అన్ని కమిటీలు నిబంధనల మేరకు చరుగ్గా పని చేయాలన్నారు. పెయిడ్ న్యూస్, ఎలక్ట్రానిక్ మీడియాల వచ్చే వార్తలను మీడియా సర్ట్ఫికెషన్ అంతా మానిటరింగ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఓటుహక్కు నమోదు, ఓటుహక్కు వినియోగించుకునేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఎఫ్‌ఎం రెడియో, కరపత్రాలు తదితర వాటి ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించామన్నారు. గత ఎన్నికల్లో కర్నూలు అర్బన్‌లో 52 శాతం, ఆదోని అర్బన్‌లో 57 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో దాదాపు 85 శాతం పోలింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జెసి ఆనంద్ కుమార్, వివిధ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
అభ్యర్థుల వేటలో నాయకులు
డోన్, మార్చి 19 : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో జడ్పిటిసి, ఎంపిపి పదవులకు అభ్యర్థులను ఎవరిని ఎంపిక చేయాలోనని ఆయా పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. వీరి ఎంపికలో ఎక్కువగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. పదవులు రాని వ్యక్తులు అలిగి ప్రత్యర్థుల గూటికి ఎక్కడ చేరుతారోనని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డోన్ మండలంలో 18 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి. ఎంపిపి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటికే టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థుల కోసం గాలిస్తున్నారు. వైకాపా తరుపున కమలాపురం రేగటి అర్జునరెడ్డి లేదా రేగటి రామ్మోహన్‌రెడ్డి కుటుంబీకులు రంగం లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా వెంకటాపురం గ్రామానికి చెందిన డిఎస్పీ బంధువుల పేరు కూడా వినిపిస్తోంది. టిడిపి తరుపున వలస వచ్చే నేతలకు ఇవ్వనున్నట్లు సమాచారం. సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉండే నేతల కోసం గాలిస్తున్నారు. అదే విధంగా ప్యాపిలి జడ్పిటిసి పదవికి కూడా తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవలే పార్టీలో చేరిన జలదుర్గం కృష్ణమూర్తి తనయులు మాజీ ఎంపిపి ఆర్ ఇరాఘవేంద్ర, నాగరాజుల్లో ఒకరికి ఇస్తామని కెయి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ పదవి తమకే ఇవ్వాలని మాజీ జడిటిసి వై నాగేశ్వర రావుయాదవ్ గట్టిగా పట్టుపట్టినట్లు తెలిసింది. ఎంపిపి పదవిని ఇస్తామని చెప్పినా జడ్పిటిసినే కావాలని మొండికేసినట్లు వినికిడి. వైకాపా తరుపున కాంగ్రెస్ పార్టీ నుంచి వలస నేతలకు ఆ పదవులను కట్టబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. జడ్పిటిసి పదవికి రాందాస్ యాదవ్ లేదా ప్రసాదరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఎంపిపి పదవికి రాజా నారాయణ మూర్తి, బూరుగల శ్యాం పేర్లు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలిసింది. బేతంచెర్లలో వైకాపా తరుపున ఎంపిపి అభ్యర్థిగా రూబెన్ కుటుంబీకులు, జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా కుమ్మరి రమణ కుటుంబీకుల పేర్లు వినిపిస్తున్నాయి. మరో రెండురోజుల్లో నామినేషన్ల గడువు ముగుస్తుండడంతో ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఏ పార్టీలో చేరి పదవులను కైవసం చేసుకుంటారోనని అందరిలో ఆసక్తి నెలకొంది.