శ్రీకాకుళం, మార్చి 19: సరిగ్గా దశాబ్ధకాలం క్రితం సారవకోట జెడ్పీటిసీ సభ్యురాలుగా వరుదు కళ్యాణి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, వైసిపి ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం అసెంబ్లీ సీటుపై ఆమె ఆశలు పెంచుకున్నప్పటికీ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హై‘కమాండ్’తో టికెట్‌ను ఎగురేసుకుపోవడంతో కళ్యాణి భంగపడాల్సివచ్చింది. అయితే జడ్పీ పీఠానైనా తనకైనా, లేదా తన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా దక్కేలా చూడాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ నేపథ్యంలో వరుదు కల్యాణి తండ్రి వరుదు బాబ్జీరావు రంగంలోకి దిగి సారవకోట జెడ్పీటిసి స్థానానికి పోటీ చేసేందుకు తన కుమారుడు వంశీకి అవకాశం ఇవ్వాలని మంతనాలు జరిపారు. అయితే జిల్లాలో వైకాపా దిశనిర్దేశకులుగా శ్రమిస్తున్న తమను హైజాక్ చేస్తున్నట్లు పసిగట్టిన ధర్మాన సోదరులు మరో ఎత్తుగడ వేశారు. తాజాగా సారవకోట జెడ్పీటిసీ స్థానం నుంచి పద్మప్రియను రంగంలోకి దింపారు. అయితే పద్మప్రియ రంగ ప్రవేశంతో జడ్పీపీఠంపై పలు అనుమానాలు రేకెత్తాయి. ధర్మాన కుటుంబానికి జడ్పీపీఠం దక్కుతుందనే ప్రచారం జరుగడంతో వెంటనే కృష్ణదాస్ మరో ప్రకటనతో వాటికి చెక్ చెప్పారు. కాళింగ సామాజికవర్గానికే జడ్పీ పీఠం కట్టబెడతామని ప్రకటన చేసి ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. దీంతో వరుదు ఆశలు మరింత దిగజారాయి. మరోవైపు సారవకోట మండలంలో టిడిపి రోజురోజుకూ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో కూడా జెడ్పీటిసి స్థానం నుంచి బలమైన అభ్యర్థిని రంగంలో దించాలనే పద్మప్రియను రంగంలోకి దించాలని వ్యూహం రచించినట్లు ధర్మాన ద్వయం చెప్పుకొస్తుంది. మరోవైపు ఇక్కడ ఎం.పి.పి.గా స్థానిక మాజీ జెడ్పీటిసి చిన్నాల రామసత్యనారాయణ మండలంలో వాండ్రాయి ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఎం.పి.టి.సి స్థానానికి బరిలో దిగుతున్నారు. జెడ్పీటిసి అభ్యర్థిగా ఇతని సోదరుడు మాజీ ఎం.పి.పి చిన్నాల కూర్మినాయుడును రంగంలో దించాలని భావించినా వాటికీ ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇదిలావుండా పద్మప్రియ ప్రవేశంతో వరుదు కళ్యాణి కుటుంబ రాజకీయ స్పీడ్‌కు ధర్మాన సోదరులు మరింత బ్రేకులు వేసినట్లయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఓటుహక్కు గర్వకారణం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, మార్చి 19: దేశంలో నిర్వహించనున్న ఎన్నికల్లో ప్రతీ ఓటరు ఓటు వేయడం గర్వంగా భావించాలని భారత ఎన్నికల కమిషన్ డైరెక్టర్ జనరల్ అక్షయ్‌రౌత్ పేర్కొన్నారు. ఓటింగ్‌పై ప్రజల్లో అవగాహన కార్యక్రమంపై బుధవారం ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో కలసి కలెక్టర్, మీడియా, మోనటరింగ్ కమిటీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటుహక్కు వినియోగంపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామం లేదా పట్టణంలో శతశాతం ఓట్లు వేయడం గర్వకారణంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతీ ఓటరుచే ఒక మొక్క నాటించి పచ్చని ప్రజాస్వామ్యానికి రక్తదానం వంటి కార్యక్రమం నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, అనుమానిత వార్తాంశాలపై నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ జిల్లాలో కనీసం 88 శాతం ఓటింగ్ జరగడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 1.33 లక్షల ఓటర్లను ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో నమోదు చేశామని, 2009 ఎన్నికల్లో 74 శాతం పోలింగ్ జరిగిందని, ఇటీవలి నిర్వహించిన నరసన్నపేట ఉపఎన్నికలో 86 శాతం, పంచాయతీ ఎన్నికల్లో 88 శాతం పోలింగ్ నమోదైందన్నారు. గత ఎన్నికల్లో 587 పోలింగ్ కేంద్రాలు నిర్వహించగా 70 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైందని, ప్రస్తుతం 53 పోలింగ్ కేంద్రాలను అధికంగా ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1700 యువజన సంఘాలను ఓటింగ్ ప్రచారంలో భాగస్వాములను చేశామని చెప్పారు. ఓటింగ్ అవగాహనకు ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రభుత్వ సంబంధిత వ్యక్తులు ఉంటున్నారన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్, ఎజెసి హషింషరీఫ్, డిఆర్వో నూర్‌భాషాఖాసీం, సిపిఒ శివరామనాయకర్, తదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్లలో సామాజిక యుద్ధ్భేరి!
(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
ఎచ్చెర్ల నియోజకవర్గం ఒకప్రక్క తీరానికి అనుకొని మరోపక్క మెట్ట భూములతో కూడిన నాగావళి పరివాహక ప్రాంతంగా పేరుగాంచింది. సామాజిక వర్గాల పరంగా చూసినా..జిల్లాలో మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా వివిధ సామాజిక వర్గాల మేలుకలయికగా ఉన్న నియోజకవర్గం ఇది ఒక్కటే. కాపు, మత్స్యకార, రెడ్డిక, కళింగ వంటి వర్గాలు ఇక్కడి ప్రధానం కావటంతో అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలకి కత్తిమీద సామే. మాజీ శాసనసభ స్పీకర్ ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత తెచ్చిపెట్టగా, ప్రతిభాభారతిని ఒకసారి ఎదిరించి మరోసారి ఓడించిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ రాష్ట్రంలో గుర్తింపు తెచ్చారు. ప్రస్తుత ఎన్నికలలో వైసిపి, టిడిపిలు నియోజకవర్గంలో కాపువర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రస్తుత టిడిపి అభ్యర్థి కిమిడి కళావెంకట్రావు 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరుఫున పోటీ చేసి కాంగ్రెస్‌కు చెందిన మీసాల నీలకంఠంనాయుడి చేతిలో పరాజయం పాలయ్యారు. టిడిపి అభ్యర్థి పార్టీ ఫిరాయించి చివరిక్షణంలో ఎన్నికల బరిలోకి దిగడంవల్ల ప్రజల సానుభూతి లభించలేదు. దీంతో ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం కాకతప్పలేదు. సుదీర్ఘకాలం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రజారాజ్యం పార్టీలో జాతకాన్ని పరీక్షించుకొని అక్కడ టిక్కెట్టు గిట్టుబాటు కాకపోవడంతో ఇండిపెండెంటుగా నిలబడి డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేక పోయిన నియోజకవర్గం నేత గొర్లె హరిబాబునాయుడు ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత జిల్లా టిడిపి అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ) సొంత నియోజకవర్గం అయిన ఎచ్చెర్లలో ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి కళా వెంకటరావుకి, జిల్లా అధ్యక్షుడికి పూర్తిస్థాయిలో పొంతన కుదరలేదనే చెప్పకతప్పదు. పైగా, చౌదరి బాబ్జీ మనుమడు (వరుసకి) చౌదరి సతీష్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఏ విధంగా నెట్టుకొస్తుందో వేచి చూడాలి.
మరోపక్క కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం చివరి నిముషంలో వైకాపా గూటికి చేరారు. నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికలలో పోటీ చేయబోనని ప్రకటించడం వైకాపా ఆశావహులకు మరింత బలం చేకూరింది. పార్టీ టిక్కెట్ రేసులో ఎచ్చెర్ల మండలం నుంచి బల్లాడ జనార్థనరెడ్డి, రణస్థలం నుంచి గొర్లె కిరణ్‌కుమార్‌ల మధ్య పోటీ నెలకొన్నా గొర్లె వైపే అధిష్ఠానం మొగ్గుచూపుతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల రాకతో పార్టీకి లాభం చేకూర్చుతుందని ఆ పార్టీ శ్రేణలు భావిస్తున్నారు.
ఇక, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సోదిలోకి కూడా లేకుండాపోయింది. సాక్షాత్తూ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అతని అనుచరులు పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. దీంతో మాజీ పిసిసి చీఫ్ బొత్స తన మేనల్లుడు చిన్న శ్రీనును కాంగ్రెస్ నుంచి ఎచ్చెర్ల బరిలోకి దించాలనే యోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ డీలాతో టిడిపి, వైసిపి అభ్యర్థులు ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపో తున్నారు. టిడిపి అభ్యర్థి కళా వెంకటరావుకు చివరి క్షణంలో కూడా ప్రత్యర్ధులను తలకిందులు చేయగలిగే రాజకీయ చతురత కలిసివచ్చే అంశం. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల అనంతరం మాత్రమే ఎచ్చెర్ల ముఖచిత్రం పూర్తిస్థాయిలో స్పష్టం అవుతుంది. ఎం.పి.టి.సి., జెడ్పీటిసీ ఎన్నికలలో ఆశావహులందరినీ సమన్వయంతో ముందుకు నడిపిస్తే తప్ప అసెంబ్లీ ఎన్నికల నాటికి వైకాపా తనపట్టుని ఎచ్చెర్లోనిలబెట్టుకోలేదని విశే్లషకుల అంచనా. ఈ చివరివరకూ అటు సామాజిక వర్గ సమీకరణాలు, ఇటు స్థానిక ఎన్నికల విజయాలు మధ్య దోబూచులాడే అసెంబ్లీ విజయావకాశాలు ఎవరిని వరిస్తాయో వేచిచూడాల్సిందే!
నామినేషన్ల వెల్లువ
శ్రీకాకుళం(టౌన్), మార్చి 19: జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు బుధవారం అభ్యర్థులు పోటీపడ్డారు. గత రెండు రోజులుగా ఏడు నామినేషన్లు దాఖలుకాగా బుధవారం ఒక్కరోజే 95 నామినేషన్లు దాఖలైనాయి. దీంతో మొత్తం 102 నామినేషన్లు జెడ్పీటీసీ నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా పరిషత్ అధికారులు తెలియజేశారు. అత్యధికంగా తెలుగుదేశం పార్టీ తరుపున 45 నామినేషన్లు దాఖలు కాగా తరువాతి స్థానం వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున 39 అందాయి. కాగా ఇప్పటి వరకు జిల్లాలో గత పదేళ్లుగా తిరుగులేనిది భావిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన పుణ్యమాని అభ్యర్థులు లేక పోవడంతో పార్టీ అధినాయకుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడం, ఇందుకు ఎంపిటిసి, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు ప్రభావం కీలకం కావడంతో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. కాగా బుధవారం నాటికి జెడ్పీటీసీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తరుపున ఐదు నామినేషన్లు, సిపియం తరుపున మూడు, బిజెపి తరుపున ఐదు, లోక్‌సత్తా తరుపున ఒకటి, ఇండిపెండెంట్లుగా నలుగురు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు.
దేశంలో అగ్రగామిగా విశాఖ పోర్టు
శ్రీకాకుళం(టౌన్), మార్చి 19: దేశంలోనే అగ్రగామిగా విశాఖపట్నం పోర్టు నిలుస్తుందని పోర్టు డిప్యూటీ చైర్మన్ జివియల్ సత్యన్నారాయణ అన్నారు. బుధవారం స్థానిక హోటల్‌లో వాణిజ్య సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన వ్యాపార, వాణిజ్య వేత్తలకు పోర్టు విధివిధానాలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను ఆయన వివరించారు. సుమారు 4500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇతర పోర్టులకు ధీటుగా విశాఖ పోర్టు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. క్రమశిక్షణతో మెరుగైన నాణ్యమైన సేవలు అందిస్తూ, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతూ పర్యావరణ పరిరక్షణను కాపాడుతూ ఎగుమతి, దిగుమతి దార్లకు వివిధ రకాలుగా సేవలందించడమే లక్ష్యంగా పోర్టు అధికారులు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రైలు, రోడ్డు మార్గాలకు అందుబాటులో అన్నిరకాల కార్గో ఉత్పత్తులుకు అనువైన విధంగా పోర్టును తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఎనిమిది కాప్టివ్ బెర్త్‌లు, 15 మల్టిపర్పస్ బెర్త్‌లు కలిగి మల్టిలాజిస్టిక్‌ను హబ్‌ను అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.
జిల్లాలోని పారిశ్రామిక వేత్తలు విశాఖ పోర్టును వినియోగించుకోవడం ద్వారా ఎగుమతులకు సమయం ఆదాతో పాటు డబ్బుకూడా ఆదా అవుతుందన్నారు. కంటైనర్ల కొరత లేదని, స్టోరేజ్ రూంలు కొరతను త్వరలోనే అధిగమించగలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంటు అనిల్ నారాయణన్, ట్రాఫిక్ మేనేజర్ కె.సత్యన్నారాయణ రావు, మేనేజర్ వైభవ్ మిత్రా తదితరులు పాల్గొన్నారు.
గెలిపిస్తే అందుబాటులో ఉంటా..
* వైసీపీ ఎం.పి అభ్యర్థి శాంతి
ఆమదాలవలస, మార్చి 19: త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి శాంతి అన్నారు. బుధవారం మాజీ మంత్రి, వైకాపా నేత తమ్మినేని సీతారాం నివాస గృహంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తన కుటుంబానికి 60 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని, దివంగత వై.ఎస్ ఆశయాలు కొనసాగించాలన్న సంకల్పంతో తాను రాజకీయ అరంగ్రేటం చేసానన్నారు. తండ్రి పాలవలస రాజశేఖరం, సోదరుడు విక్రాంత్, అదేవిధంగా బంధువు మామిడి శ్రీకాంత్ కూడా అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారని వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తిరిగి కొనసాగించాలంటే జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో కేడరంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని సీతారాం, మామిడి శ్రీకాంత్, జె.జె.మోహనరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కోరుకుండ జయలక్ష్మీ, సాయి తదితరులు వైకాపా తీర్ధం పుచ్చుకున్నారు. వీరందరినీ పార్టీలోకి రెడ్డిశాంతి సాదరంగా ఆహ్వానించారు.
చంద్రబాబు సిఎం కాగానే..
బిసి జాబితాలోకి కళింగకోమట్లు
*టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కోరాడ
శ్రీకాకుళం(టౌన్), మార్చి 19: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతోనే కళింగ కోమట్లను బిసి జాబితాలో చేర్చనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కోరాడ వెంకటరమణ(బాబు) అన్నారు. బుధవారం ఆయన స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ కళింగకోమట్లకు, వ్యాపారస్తులకు ఎన్నో పథకాలు అమలుచేశారని తెలిపారు. నేటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని, కాంగ్రెస్ హయాంలో వ్యాట్ టాక్స్‌తో చిరు వ్యాపారస్తులు, రోడ్డుపై సైకిల్ వ్యాపారస్తులు సైతం వ్యాట్ టాక్స్ చెల్లించే విధంగా నిబంధనలు తీసుకువచ్చి కళింగ కోమట్లను ఇబ్బందులకు గురిచేసిన వైనం ఇంకా మరచిపోలేదన్నారు. ఎన్నో జాతులను బిసిల్లో చేర్చి కళింగకోమట్లను మాత్రం ఓసిలో ఉంచడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వస్తే బిసి జాబితాలో చేర్చనున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, బరాటం ఉదయ్‌శంకర్ గుప్త, నారంశెట్టి లక్ష్మణరావు, ఇప్పిలి తిరుమలరాజు, బరాటం భాస్కరరావు, జామి సుబ్బారావుతదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల జెడ్పీటిసి అభ్యర్థులు ఖరారు
* టిడిపి నుంచి చైతన్య * వైకాపా నుంచి జనార్ధనరెడ్డి
ఎచ్చెర్ల, మార్చి 19: జెడ్పీటిసి ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను బుధవారం ఖరారు చేశాయి. నామినేషన్లకు మరో 24 గంటలే గడువు ఉండడంతో సామాజిక వర్గాలవారీగా కసరత్తు చేసి చివరకు ఆయా పార్టీలు కొలిక్కి తీసుకొచ్చాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకున్న తెలుగుదేశం పార్టీజిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి కుమార్తె చైతన్యకు అభ్యర్థినిగా నియోజకవర్గం ఇన్‌చార్జి కళావెంకట్రావు నివాసంలో పార్టీ పెద్దలు నిర్ణయించారు. అలాగే వైసిపి నుంచి జెడ్పీటిసి అభ్యర్థిగా మాజీ ఎం.పి.పి బల్లాడ జనార్ధనరెడ్డి ఈ అవకాశం ఇచ్చేందుకు వారంతా అంగీకరించారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎం.పి.పి.గా ఇప్పటికే బల్లాడ వెంకటరమణారెడ్డి పేరు ఖరారైన విషయం తెలిసిందే. వైసిపి తరుఫున ఎచ్చెర్ల మాజీ సర్పంచ్ జరుగుళ్ల శంకర్రావు, మాజీ జెడ్పీటిసి సనపల నారాయణరావుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.