మక్కువ, మార్చి 19: ఎట్టకేలకు మక్కువ పరిసర ప్రాంతాల్లో బుధవారం వర్షం కురిసింది. దీంతో మండలంలోని రైతులు ఆనందంను వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రైతులు రబీ వ్యవసాయం చేస్తున్న వరి మక్కువ, చెముడు, కొయ్యన్నపేట, ములక్కాయవలస, తదితర గ్రామాల్లో రబీ వరిచేను చివరి దశకు చేరడంతో వెంగళరాయసాగర్ నీరందక రైతులు నీరందిస్తున్నారు. వర్షం పడడంతో రైతులు వరమని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వాహన తనిఖీల్లో పట్టుబడిన నగదు
పాచిపెంట, మార్చి 19: మండలంలో పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద బుధవారం పోలీసులు నిర్వహిస్తున్న వాహానాల తనిఖీలో 9లక్షల రూపాయిలు పట్టుబడినట్లు సాలూరు సిఐ సి.దేవుళ్లు తెలిపారు. ఆయన వివరాలు ఇలా ఉన్నాయి. పై మొత్తాన్ని ఒడిస్సా రాష్ట్రం సుంకి గ్రామం నుండి రాయఘడకు నల్లబ్యాగ్‌లో బీహార్‌కు చెందిన అభిషేక్ కుమార్, వీరట్‌యాదవలు మాక్సీక్యాబ్ వాహానంలో తరలిస్తున్నారు. అయితే ఎన్నికల దృష్ట్యా పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద స్థానిక పోలీసులు వాహాన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పై మొత్తాన్ని కానిస్టేబుల్ గోపి గుర్తించారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో నగదు స్వాధీనం పరుచుకుని మండల తహశీల్దార్‌కు అప్పగిస్తామని సిఐ తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలు
విజయనగరం (కంటోనె్మంట్), మార్చి 19: విశాఖలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు వివిధ క్రీడాపోటీల్లో 16 పతకాలను సాధించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను జిల్లా ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ బుధవారం తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రివార్డులు అందజేస్తామని తెలిపారు. అలాగే జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఇదేవిధంగా ఉత్తమ ప్రతిభను చూపించి పతకాలను సాధించాలని కాంక్షించారు. ఈ పోటీల్లో 8 బంగారు, 7 వెండి, 1 కాంస్య పతకాన్ని సాధించారు. ఈ జట్లకు మేనేజర్‌గా ఎ.ఆర్.డిఎస్పీ బి.శ్రీనివాసరావు వ్యవహరించారు. ఈ అభినందన కార్యక్రమంలో ఒఎస్‌డి కోయ ప్రవీణ్, ఓఎస్‌డి (పాలన) ఎం.సుందర్రావు, విజయనగరం డిఎస్పీ జి.శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ఎస్వీ అప్పారావు, నాగేశ్వరరావు, జిల్లా పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామా పాల్గొన్నారు.
ఓటింగ్ శాతం పెరిగేలా
చర్యలు తీసుకోవాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 19:త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన భారత ఎన్నికల కమిషనర్ డైరెక్టర్ జనరల్ (స్వీప్) అక్షయ్‌రౌత్‌తో కలసి వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు చేసుకున్న ప్రతి ఓటరు దానిని వినియోగించుకునేలా చూడాలన్నారు. జిల్లాల వారీగా గత ఎన్నికల్లో పోలైన శాతాన్ని, తక్కువ పోలింగ్ కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఏ రకమైన చర్యలు చేపట్టారో కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఓటరు స్లిప్పులను సక్రమంగా పంపిణీ చేయడం, ఓటర్లకు రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గంలో తక్కువ ఓటింగ్ నమోదైందన్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్న వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక ప్రచారం చేపట్టామన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో చెల్లింపు వార్తలను పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మీడియా సర్ట్ఫికేషన్ మోనటరింగ్ కమిటీని నియమించినట్టు భన్వర్‌లాల్ తెలిపారు. ఈ కమిటీలు రాజకీయ స్వభావం గల ప్రకటనలను ధ్రువీకరించి అభ్యర్థుల ఎన్నికల వ్యయం కింద జమచేస్తారని ఆయన వివరించారు. ఈ కమిటీ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలలో వచ్చే రాజకీయ ప్రకటనలను పరిశీలిస్తుందని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలకు ఇవిఎంలు కేటాయింపు: కలెక్టర్
విజయనగరం(రూరల్), మార్చి 19 : జిల్లాలో విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాల్టీలకు ఈనెల 30వ తేదీన జరగనున్న పురపాలక సంఘ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇవిఎంలను 16వ తేదీన ఆదివారం కలక్టరేట్‌లో ఉన్న ఎస్‌ఐసిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి విడత పరిశీలించి ప్రక్రియ పూర్తి చేశారు. విజయనగరం పురపాలక సంఘం 40 వార్డులకుగాను 212 ఇవిఎం యూనిట్లు, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరులకు ఒక్కొక్క మున్సిపాల్టీకి 50 ఇవిఎంలు కేటాయించారు. ఈ నేపధ్యంలో బుధవారం నాలుగు పురపాలక సంఘాలలో పోటీల్ల ఉన్న వివిధ రాజకీయ అభ్యర్ధుల సమక్షంలో ఈ నేపధ్యంలో బుధవారం నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్ధుల సమక్షంలో ఎన్‌ఐసిలో ఇవిఎం యూనిట్ల నెంబర్లు, బ్యాలెట్ యూనిట్ నెంబర్లు, కంప్యూటర్ ద్వారా చేసి ఆయా నెంబర్లుతో సరిపోల్చి ఆయా మున్సిపాలిటీలకు కేటాయించారు. జెసి బి.రామారావు, ఎజెసి నాగేశ్వరరావు, రెవిన్యూ అధికారి బిహెచ్‌ఎస్ వెంకటరావు, మున్సిపల్ కమిషనర్లు ఆర్.సొమన్నారాయణ, రమణ, పార్టీల నాయకులు పాల్గొన్నారు.
‘సాలూరులో లయన్స్ నేత్ర వైద్యాలయం’
విజయనగరం (్ఫర్టు), మార్చి 19: పేదలకు కోసం సాలూరులో లయన్స్ నేత్ర వైద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు లయన్స్‌క్లబ్ గవర్నర్ డాక్టర్ విఎస్‌విడి శివప్రసాద్ తెలిపారు. అధికార పర్యటన సందర్భంగా మంగళవారం పట్టణంలో జరిగిన అనేక సేవా సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ విజయనగరం లయన్స్‌క్లబ్ 60ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మన్ననలను పొందిందన్నారు. లయన్స్‌క్లబ్ తరపున పేదలకు స్థానిక శ్రీరామమూర్తి ఆసుపత్రిలో ప్రతీనెలా ఉచితంగా కేనర్స్ స్క్రీనింగ్‌టెస్ట్‌లు నిర్వహించి అవసరమైన వారికి విశాఖలో ఉచితంగా శస్తచ్రికిత్సలు చేయించి మందులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఉచిత కంటివైద్యశిబిరాల నిర్వహణ ద్వారా గడచిన 60 ఏళ్లలో వేలాదిమందికి కంటిచూపు ప్రసాదించడం జరిగిందన్నారు. లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు మహేంద్రకుమార్‌జైన్, కార్యదర్శి కె.నరసింహం, ఫర్వేజ్‌హష్మి, వెత్సా సత్యనారాయణమూర్తి, ఎల్‌కెజైన్, శర్మ, సుంకర సత్యారావుతదితరులు పాల్గొన్నారు.ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి ఉపకారవేతనం అందజేశారు. అనంతరం కణపాక మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలకు ఎలక్ట్రానిక్ యాంప్లిఫైర్‌ను అందించగా, కుసుమహరనాథ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. పూల్‌భాగ్ అయ్యప్పస్వామి ఆలయంలో మొక్కలను నాటారు.
ఉత్సాహంగా పరిషత్ నామినేషన్ల పర్వం
గంట్యాడ, మార్చి 19 : మండలంలోని 19 ఎంపిటిసి పదవులకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మూడవ రోజైన బుధవారం 66 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్‌సిపి, స్వతంత్ర అభ్యర్ధులు ర్యాలీలతో అట్టహాసంగా గంట్యాడకు తరలివచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగరాణికి నామినేషన్ పత్రాలు అందజేశారు. గంట్యాడ ఎంపిటిసి పదవికి తెలుగుదేశం తరపున నలుగురు, స్వతంత్ర అభ్యర్ధులుగా ఇద్దరు నామినేషన్లు వేశారు. పెదవేమలికి తెలుగుదేశం తరపున ఇద్దరు, కాంగ్రెస్ తరపున ఇద్దరు, పెదమజ్జిపాలానికి కాంగ్రెస్ తరపున ఇద్దరు, వైసిపి తరపున ఒకరు, నరవకు తెలుగుదేశం తరపున ఒకరు, కాంగ్రెస్ తరపున ఇద్దరు, వైఎస్సార్ తరపున ఇద్దరు నామినేషన్లను వేశారు. అలాగే నీలావతికి తెలుగుదేశం తరపున ముగ్గురు. కాంగ్రెస్‌కు ఇద్దరు, వైసిపికి ఇద్దరు, పెంట శ్రీరాంపురంనకు తెలుగుదేశం తరపున ఇద్దరు, పెనసాంనకు తెలుగుదేశం తరపున ఇద్దరు, కాంగ్రెస్‌నకు ఇద్దరు, వైసిపికి ఒకరు, బుడతనాపల్లికి వైసిపి తరపున ఇద్దరు, రేగుబిల్లికి తెలుగుదేశం తరపున ఇద్దరు, కాంగ్రెస్‌కు ఇద్దరు, వైసిపికి ఒకరు నామినేషన్ వేశారు. వసాది ఎంపిటిసికి తెలుగుదేశం తరపున ఇద్దరు, వైసిపికి ఒకరు, రామవరంనకు తెలుగుదేశం, కాంగ్రెస్ తరపున ఒక్కొక్క నామినేషన్ వేసారు. మదనాపురం ఎంపిటిసికి కాంగ్రెస్ తరపున ఐదుగురు, వైసిపికి ఇద్దరు, లక్కిడాంనకు తెలుగుదేశం తరపున ఇద్దరు, వైసిపి తరపున ముగ్గురు సిరిపురంనకు కాంగ్రెస్‌నకు ఇద్దరు, తాటిపూడికి కాంగ్రెస్ తరపున ముగ్గురు, బోనంగికి తెలుగుదేశం తరపున ఇద్దరు, వైసిపికి ఒకరు, వసంతకు కాంగ్రెస్ తరపున ఒకరు నామినేషన్ వేశారు.
వ్యూహరచనలో విజయమెవరిదో?
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 19:మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనబోతున్న ప్రధాన రాజకీయ పార్టీల ప్రత్యర్థుల వ్యూహాలను ఎప్పటికప్పుడు ప్రతి వ్యూహాలను పన్నుతున్నారు. వార్డుల్లో తమకు విశ్వాసపాత్రులుగా ఉన్న అనుచరులను నియమించి ప్రత్యర్థుల ఎత్తుగడలను పరిశీలిస్తూ ఎప్పటికపుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అందుకనుగుణంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు డబ్బు వెదజల్లుతున్నారు. మున్సిపాల్టీలో మురికివాడల్లో నివసించే వారిపై ఈ విధమైన ప్రయత్నాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఇలా నేతలు రాత్రి వేళల్లో వ్యూహాలను అమలుపరుస్తూ పగటి వేళల్లో ప్రచారాలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్, వైకాపా పార్టీలతోపాటు సీపిఎం, బీజేపి అభ్యర్థులు ప్రచారాలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో టిడిపి అత్యధిక స్థానాలను రాబట్టుకునే దిశగా పావులు కదుపుతొంది. జిల్లాలో సమైక్యాంధ్ర ప్రభావం వల్ల తెలుగుదేశం పార్టీకి ఆదరణ మరింత పెరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ పట్ల కొంత విముఖత ఏర్పడింది. కాగా, రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండా పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టిన తమకే పట్టం కట్టాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. అదే సమయంలో తెలుగుదేశం చైర్మన్ అభ్యర్థి ప్రసాదుల కనకమహాలక్ష్మి మాట్లాడుతూ టిడిపి హయాంలో పట్టణంలో వౌలిక వసతులు కల్పించామని, అందువల్ల తమకే ప్రజలు పట్టం కట్టాలని ప్రచారం చేస్తున్నారు. వైకాపా నేత అవనాపు విజయ్, విక్రమ్‌లు మాత్రం దివంగత వైఎస్ హయాంలో చేపట్టిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని వైకాపాకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ విధంగా మూడు పార్టీల ప్రచారం జోరందుకుంది. ఇటువంటి సమయంలో అటు ఇటుగా ఉన్న వార్డులలో ఎలాగైనా స్ధానాలను కైవశం చేసుకునే దిశగా టిడిపి, కాంగ్రెస్‌లు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఈ వ్యూహంలో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి.
‘ఎన్నికల నిర్వహణకు సహకరించండి’
విజయనగరం (్ఫర్టు), మార్చి 19: పట్టణంలో మున్సిపల్ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ కోరారు. బుధవారం ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమన్నారాయణ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణానికి విజయనగరం పట్టణం మారుపేరు అని, అందువల్ల ఈ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయపార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులతోపాటు అన్నిరాజకీయపార్టీలు ఎన్నికల నియమాళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్థేరించిన మార్గదర్శిక సూత్రాలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ఓటర్లను ఎటువంటి ప్రలోభావాలకు గురిచేయకుండా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రచారం చేయాలని కోరారు. విజయనగరం పట్టణంలో 40 వార్డులు ఉన్నాయని, అన్నివార్డుల్లోను ఓటర్లకు అందుబాటులో ఉండేవిధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
టిడిపిలో చేరికలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 19:జిల్లాలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణాలు జోరందుకున్నాయి. మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరద రామారావు, ఆయన తనయుడు వాసిరెడ్డి తిలక్‌కుమార్, కోడలు వాసిరెడ్డి చంద్రికలతోపాటు పలువురు మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, 18 మంది సర్పంచ్‌లు టిడిపిలో చేరారు. బుధవారం అశోక్‌బంగ్లాలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు సమక్షంలో వీరు చేరారు. అలాగే చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన ఎఎంసి మాజీ చైర్మన్ మీసాల వరహాలనాయుడు, చీపురుపల్లి సర్పంచ్ మీసాల సరోజిని టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపి అత్యధిక మెజార్టీతో ఎక్కువ స్ధానాలను చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
గుర్ల, : మండలంలో పెనుబర్తి, కోటగండ్రేడు పకీరుకిత్తలి, తాతావారి కిట్టలి గ్రామాల నుంచి కాంగ్రెస్‌ను వీడి తెదేపాలో పలు కుటుంబాలు చేరారు. చీపురుపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జ్ కెటిఆర్, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు , కిరణ్‌బాబు, మాజీ ఎంపిపి వినె్న సన్యాసినాయుడు సమక్షంలో చేరారు. కోటగండ్రేడు గ్రామం నుంచి అంబటి శ్రీనువాసరావు, త్రినాధ, సూరిబాబు, కరణంబాబు, పెనుబర్తి గ్రామం నుంచి మండల అప్పలనాయుడు పకీరుకిట్టలి నుంచి సర్పంచ్ రాగోలు సూరినాయుడు, పతివాడ రామునాయుడు చేరారు. మాజీ ఎంపిటిసి సభ్యుడు గొర్లి రామునాయుడు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.
ప్రాదేశిక నామినేషన్ల జోరు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 19:జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్లు జోరందుకున్నాయి. బుధవారం జిల్లాలోని 34 జెడ్పీటీసీ స్ధానాలకు 73 నామినేషన్లు, 547 ఎంపీటీసీ స్ధానాలకు 1285 నామినేషన్లు దాఖలయ్యాయి. జెడ్పీటీసీ నామినేషన్లకు సంబంధించి టిడిపి చైర్మన్ అభ్యర్ధి శోభ స్వాతిరాణితోపాటు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీల వారీగా నామినేషన్ల వివరాలిలా ఉన్నాయి. బీజేపి 1, సిపిఎం 1, కాంగ్రెస్ 15, వైకాపా 15, టిడిపి 45, లోక్‌సత్తా 1, స్వతంత్రులు 4గురు నామినేషన్లు వేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 82 మంది జెడ్పీటీసీ స్ధానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఎంపీటీసీ నామినేషన్ల విషయానికి వస్తే మొత్తం 1423 నామినేషన్లకు సంబంధించి పార్టీల వారీగా ఇలా ఉన్నాయి. సిపిఐ 1, సిపిఎం 28, కాంగ్రెస్ 336, వైకాపా 377, టిడిపి 606, లోక్‌సత్తా 1, ఇతరులు 19, స్వతంత్ర అభ్యర్ధులు 55మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక జెడ్పీటీసీకి సంబంధించి ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన వారిలో నెల్లిమర్ల కాంగ్రెస్ అభ్యర్ధిగా పి.సత్యనారాయణ, మెరకముడిదాం టిడిపి అభ్యర్ధిగా పి.సింహాచలం, గుర్ల టిడిపి అభ్యర్ధిగా తిరుమలరాజు పద్మిని, కురుపాం టిడిపి మర్రాపు సూర్యనారాయణ, జిఎల్ పురం వైకాపా అభ్యర్థిగా డి.సత్యనారాయణ, గరుగుబిల్లి కాంగ్రెస్ అభ్యర్ధిగా సీర విజయకుమారి, మక్కువ టిడిపి అభ్యర్థిగా ఎస్.తిరుపతి, పార్వతీపురం టిడిపి అభ్యర్ధిగా జి.గౌరీశ్వరి, తెర్లాం టిడిపి అభ్యర్ధిగా ఎన్.లక్ష్మి, బోగాపురం టిడిపి అభ్యర్ధిగా పి.రాజేశ్వరీ, చీపురుపల్లి కాంగ్రెస్ అభ్యర్ధిగా రౌతు సునీత, గజపతినగరం వైకాపా అభ్యర్ధిగా తాడ్డి పార్వతీ, బాడంగి టిడిపి అభ్యర్ధిగా వాసిరెడ్డి చంద్రిక, గజపతినగరం టిడిపి అభ్యర్ధిగా మక్కువ శ్రీదర్ తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు.
........................