విశాఖపట్నం, మార్చి 18: కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆ ఐదుగురిలో (గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకటరామయ్య, కన్నబాబురాజు) ఈ ఎన్నికల్లో టిక్కెట్‌లు ఎంతమందికి వస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు ద్రోహం చేసిందన్న నినాదంతో వీరంతా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి చేరికపై నిన్న మొన్నటి వరకూ జనాల్లో చర్చ జరిగింది ఆ విషయం పక్కన పెడితే.. టిడిపిలో చేరిన వీరిలో ఎంతమందికి టిక్కెట్‌లు వస్తాయన్న అంశంపై తాజా చర్చ మొదలైంది. గంటా శ్రీనివాసరావు జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం టిడిపి అధిష్ఠానం కల్పించింది. ఆయన అనకాపల్లి అసెంబ్లీకే పోటీ చేస్తానని చెపుతున్నా, మారుతున్న సమీకరణల నేపథ్యంలో వేరే నియోజకవర్గానికి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇక పంచకర్ల రమేష్‌బాబుకు ఉత్తర నియోజకవర్గాన్ని దాదాపు ఖరారు చేశారనే చెపుతున్నారు. ఆఖరి నిముషంలో ఆయనను అనకాపల్లి ఎంపిగా కూడా బరిలోకి దించుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇక అవంతి శ్రీనివాసరావు విషయానికి వస్తే, ఆయన భీమిలి నియోజకవర్గం నుంచే తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి టిడిపి టిక్కెట్ ఆశిస్తున్న పలువురు నాయకులు స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలని నినదిస్తున్నారు. కాపులకే ఈ నియోజకవర్గాన్ని కేటాయించాలని పార్టీ నిర్ణయించడంతో, తమకు కాకుంటే, అప్పల నరసింహరాజుకైనా ఇవ్వాలని కోరుతున్నారు. ఇక కన్నబాబు రాజు విషయానికి వస్తే, యలమంచిలి అసెంబ్లీ, లేదా, అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. అవంతి, కన్నబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టిడిపి టిక్కెట్ ఆశిస్తున్న నాయకులను కాదని వీరిద్దరికీ టిక్కెట్ ఇవ్వాలంటే, జెడ్‌పి ఎన్నికల్లో తమ పట్టు నిరూపించుకోవటం గీటురాయి కావచ్చు. ఇక చింతలపూడి వెంకటరామయ్య పరిస్థితే డోలాయమానంగా ఉంది. ఆయన ప్రస్తుతం గాజువాక నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టిడిపిలో చేరిన తరువాత ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనన్న మీమాంశ వ్యక్తం అవుతోంది. జివిఎంసి పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గాన్ని యాదవులకు కేటాయించాలి. గతంలో ఉత్తర నియోజకవర్గాన్ని యాదవులకు కేటాయించారు. ఇప్పుడు ఆ స్థానంలో పంచకర్ల వచ్చి చేరడంతో, యాదవులకు మిగిలింది గాజువాక. పల్లా శ్రీనివాస్‌ను టిడిపిలోకి తీసుకుంటున్న నేపథ్యంలో చింతలపూడికి ఎక్కడ ప్రాతినిథ్యం కల్పిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా గంటాను నమ్ముకుని వచ్చిన వారిని ఎక్కడో చోట అవకాశం కల్పిస్తారు. మారుతున్న సమీకరణలు, సామాజికవర్గాల నేపథ్యంలో గంటాను నమ్ముకున్న నలుగురికి టిక్కెట్‌లు వస్తాయా అన్నది ప్రశ్నార్థకమే!
జెడ్‌పి చైర్‌పర్సన్ అభ్యర్థిపై
పార్టీల మల్లగుల్లాలు
* నారాయణ సమక్షంలో టిడిపి నేతల సమాలోచనలు
* తమకు సమాచారం లేదంటున్న వైకాపా నేతలు
* తరువాత చూద్దామంటున్న కాంగ్రెస్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 19: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకన్నా ముందు వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి అన్ని పార్టీలూ. ఇందులో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల పరిశీలకుడు, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకటరామయ్య తదితరులు బుధవారం రాత్రి సమావేశమయ్యారు. జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థికి సంబంధించి నలుగురి పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపమని చంద్రబాబు ఆదేశించడంతో వీరు సమావేశమయ్యారు. వెలమ సామాజికవర్గం నుంచి రాంబిల్లి మండలానికి చెందిన లాలం భవాని, చీడికాడ మండలం నుంచి రెడ్డి సత్యనారాయణ కోడలు బొడ్డు లక్ష్మి, కాపు సామాజికవర్గానికి చెందిన కశింకోట మాజీ ఎంపిపి ధనమ్మ, నాగవంశ సామాజికవర్గానికి చెందిన భీమిలి మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ గాడు లక్ష్మీకుమారి పేర్లను పంపించారు.
ఇక వైకాపా మాత్రం చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. తాజాగా పార్టీలోకి రావాలనుకుంటున్న నర్సీపట్నం ఎమ్మెల్యే బోళెం ముత్యాల పాపను జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలోకి దించుతారని భావించారు. కానీ ఆమె ఈ నెల 22న పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జెడ్‌పి ఎన్నికలకు నామినేషన్ గడువు గురువారంతో ముగియనుంది. అయితే, తాము జెడ్‌పికి నామినేషన్ దాఖలు చేయడం లేదని ముత్యాలపాప కుటుంబీకులు బుధవారం ‘ఆంధ్రభూమి’కి తెలియచేశారు. కాగా, చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయమై పార్టీ నాయకులను ఎవరిని ప్రశ్నించినా, తమకేమీ తెలియదని అంటున్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థిని ప్రకటించే పరిస్థితుల్లో లేదు. ఈ విషయమై మాజీ మంత్రి బాలరాజు ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ జెడ్‌పి చైర్‌పర్సన్ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించబోమని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెపుతున్నారు.
గంటాతో కంభంపాటి భేటీ!
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 18: తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావుతో, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు బుధవారం రాత్రి భేటీ అయ్యారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతున్న నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు, సాధారణ ఎన్నికల్లో కూడా ఇరు పార్టీల వారు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. సీట్ల సర్దుబాటులో ఇరుపార్టీల అభ్యర్థులకు నేతలు పరస్పర సహకారాన్ని అందించుకోవాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కంభంపాటి బాధ్యతల స్వీకరించిన తరువాత తొలిసారిగా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చైతన్యరాజు, కన్నబాబు, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకటరామయ్య, కెఎస్‌ఎన్ రాజు, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు, తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ‘బల్క్ ఎక్స్‌ప్రెస్’ సేవలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 19: విశాఖ పోర్టులో సుమారు 13 సంవత్సరాల పాటు సేవలందించిన భారీ ఫ్లోటింగ్ క్రేన్ బల్క్ ఎక్స్‌ప్రెస్ తన సేవలను ఇక్కడ ముగించింది. విశాఖ సీపోర్ట్స్ ఈ క్రేన్ నిర్వహణను ఇప్పటి వరకూ చేపట్టింది. 1996 ఆగస్ట్ 26న ఈ క్రేన్ విశాఖ పోర్టుకు వచ్చింది. అతి భారీ నౌకలు విశాఖ పోర్టులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఒక ఓడలోనే ఏర్పాటు చేసిన ఈ క్రేన్ ద్వారా ఔటర్ హార్బర్‌లో భారీ నౌకల ద్వారా వచ్చే సరుకును కొంత వరకూ అన్‌లోడ్ చేసి, ఆ తరువాత ఆ నౌకలను పోర్టులోకి పంపించేవి. 2002-03 నుంచి పానమాక్స్ వెసల్స్, విశాఖ పోర్టుకు రావడం మొదలుపెట్టాయని విశాఖ సీపోర్ట్స్ సిఇఓ రాగం కిషోర్ తెలియచేశారు. ఈ క్రేన్ అందించిన సేవల గురించి ఆయన వివరిస్తూ, మొదట రోజుకు 13 వేల టన్నుల కార్గోను అన్‌లోడ్ చేసిన రికార్డు ఉందని అన్నారు. 2004 తరువాత రోజుకు 22 వేల టన్నుల కార్గోను హ్యాండిల్ చేసేదని ఆయన చెప్పారు. సుమారు 13 సంవత్సలాపాటు సేవలందించిన ఈ నౌకను ప్రస్తుతం వెస్టిండీస్‌కు తరలిస్తున్నారు.
నాయకత్వంలో ఆత్మవిశ్వాశాన్ని నింపాలి
* మన పార్టీవారే విషబీజాలు నాటారు
* కార్యకర్తల సమావేశంలో ద్రోణంరాజు
* నమ్ముకున్న కార్యకర్తలకు చేసిందేమిటి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 19: విభజనానంతర పరిణామాలతో నెమ్మదించిన కాంగ్రెస్ నాయకత్వంలో కార్యకర్తలే ఆత్మవిశ్వాశాన్ని నింపాలని మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయకులకు ధైర్యం మీరే ధైర్యం చెప్పాలని కార్యకర్తలను కోరారు. విపక్షాలు చేసిన రాజకీయంతోనే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని, అయితే ఆనెపాన్ని కాంగ్రెస్ ఆపాదించి రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. తెదేపా, వైకాపా, బిజెపి పార్టీలు విభజనకు మద్దతివ్వడం వల్లే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్న వాస్తవాన్ని కార్యకర్తలే ప్రజలకు వివరించాలని అన్నారు. మన పార్టీలో ఉంటూ పదవులు అనుభవించిన వారే కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన సోనియాపై కిరణ్‌కుమార్‌రెడ్డి విషాన్ని కక్కారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పదవులు అనుభవించిన వారే నాయకులు పార్టీని వీడుతున్నా కార్యకర్తల బలం మాత్రం పార్టీకుందని అన్నారు. రానున్న ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈనెల 22న స్వర్ణ్భారతి స్టేడియంలో జరిగే సమావేశానికి భారీగా జనసమీకరణ జరపాలని నిర్ణయించారు. ఒక్కో కార్యకర్త సైనికుని మాదిరి పనిచేసే ఇక్కడకు వచ్చే కాంగ్రెస్ నాయకత్వానికి పార్టీ సత్తాచూపాలన్నారు. పిసిసి కార్యదర్శి, మాజీ మేయర్ పులుసు జనార్ధన రావు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీది సుదీర్ఘ పయనమని పేర్కొన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ 22న జరిగే సభకు పార్టీ సీమాంధ్ర సారధి రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ సారధి చిరంజీవి, ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నారని, కార్యకర్తల్లో నెలకొన్న అపోహలను తొలగించడంతో పాటు వారికి ధైర్యం చెప్పేందుకే ఈసభను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ వర్మ మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు ఎప్పుడూ ఉంటుందన్నారు. కష్టసమయంలో పార్టీకి అండగా నిలిచి భవిష్యత్‌లో విజయాలను అందించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సోడాదాసు సుధాకర్, చుక్కా చినఅప్పారావు, గడసాల అప్పారావు, ఎస్‌కె భాషా, రవి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, ప్రభాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎవరికి గుర్తింపు
కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు నిచ్చే విషయంలో స్థానిక నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బి.ఎన్.రాజు ఆరోపించారు. ఏళ్ల తరబడి పార్టీకోసం పనిచేస్తున్న తమను కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులను కట్టబెట్టడం వల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. గత పదేళ్ల కాలం అధికారంలో ఉన్నప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో మహిళా కాంగ్రెస్ ప్రతినిధి పేడాడ రమణికుమారి ప్రసంగం పూర్తిచేయగా మరోసారి బి.ఎన్.రాజు మండిపడ్డారు. వేరే పార్టీ నుంచి వచ్చిన నీనుంచి నీతులు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదంటూ ఘాటుగా సమాధానమివ్వడంతో సభలో మరోసారి గందరగోళం నెలకొంది. దీంతో మాజీవిప్ ద్రోణంరాజు, నగర పార్టీ అధ్యక్షుడు భాస్కరరావు సర్దిచెప్పారు.
టెన్త్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి
* హెచ్‌ఎంలకు జివిఎంసి కమిషనర్ క్లాసు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 19: జివిఎంసి పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి అగ్రస్ధానంలో నిలిచేలా వారని తీర్చిదిద్దాలని కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ ఆదేశించారు. పాతకౌన్సిల్ హాల్‌లో హెచ్‌ఎంలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగర పరిధిలోని 27 ఉన్నత పాఠశాలల నుంచి 1915 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరవుతుండగా, ఎంతమంది ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉందని ఆరాతీశారు. చదువులో వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి వారికోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే ముఖ్యమైన పాఠ్యాంశాలను వారితో బట్టీపట్టించాలని సూచించారు. ముఖ్యంగా టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకేళ్లే విధంగా వారిని సన్నద్ధం చేయాలన్నారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులైతే వారిని కార్పొరేట్ కళాశాలలో చేర్పించే బాధ్యతను కూడా జివిఎంసి తీసుకుంటుందన్న నమ్మకాన్ని కల్గించాలన్నారు. అలాగే గతంలో జివిఎంసి పాఠశాల నుంచి టెన్త్ పరీక్షలకు హాజరై తప్పినవారిని గుర్తించి వారిని సైతం ప్రోత్సహించాలని సూచించారు. టెన్త్ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించిన విద్యార్థులతో పాటు పాఠశాలను గుర్తించి వారికి బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను వచ్చే ఏడాది పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఈవేసవిలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, ఉప విద్యాశాఖ అధికారి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
రూ 14 లక్షల విలువైన గుట్కా పట్టివేత
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 19: అక్రమంగా నిల్వ ఉంచి, విక్రయిస్తున్న నిషేధిత గుట్కాను జివిఎంసి ఫుడ్‌సేఫ్టీ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కొబ్బరితోట, చలవతోట ప్రాంతాల్లో వ్యాపారులు గుట్కా విక్రయాలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు జనార్ధనరావు, జివి అప్పారావు సిబ్బందితో దాడిచేసి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ 14లక్షలు విలువ చేసే రెండు టన్నుల గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని గుట్టుగా విక్రయిస్తున్న ఎర్రిబాబు,గౌరిలపై ఫుట్‌సేఫ్టీ చట్టం అనుసరించి కేసులు నమోదు చేశారు. ఈసందర్భంగా జివిఎంసి కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ మాట్లాడుతూ నిషేధిత గుట్కా తదితర పొగాకు ఉత్పత్తులను విక్రయించడం నేరంగా పరిగణించబడుతుందన్నారు. అక్రమ నిల్వలపై నిఘాను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. పెద్దమొత్తంలో గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకున్న ఫుడ్‌సేఫ్టీ అధికారులను ఈసందర్భంగా ఆయన అభినందించారు.
కట్టలు కట్టలుగా దొరుకుతున్న సొమ్ము
* 15 రోజుల్లో రూ 74.15 లక్షలు పట్టివేత
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 19: ఎన్నికల వేళ నియోజకవర్గాల్లో లక్షల రూపాయలు పోలీలు స్వాదీనం చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత గత 15 రోజుల్లో నిఘా మరియు పోలీసు యంత్రాంగం లెక్క చూపని రూ 74.15 లక్షలను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నర్సీపట్నం, యలమంచిలి అసెంబ్లీ సెగ్మెంట్లలోనే రూ 24.75 లక్షలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. యలమంచిలి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని యలమంచిలి పట్టణంలో విజయలక్ష్మి పెట్రోల్ బంక్ వద్ద రూ 2.15 లక్షలను ఈనెల 8న పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. యలమంచిలి రైల్వేగేట్ సమీపంలో ఈనెల 12న మరో రూ 3 లక్షలను స్వాదీనం చేసుకున్నారు. మునగపాక మండలం ఒంపోలు వద్ద రూ 7.6 లక్షలను స్వాదీనం చేసుకున్నారు. ఇక నర్సీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఈనెల 11 నుంచి ఇప్పటి వరకూ రూ 12 లక్షలను స్వాదీనం చేసుకున్నారు. భీమునిపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నీళ్లకుండీలు చెక్‌పోస్టు వద్ద రూ 19 లక్షలను స్వాదీనం చేసుకున్నారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పరిధిలోని మద్దిలపాలెం వద్ద రూ 3.04 లక్షలను స్వాదీనం చేసుకున్నారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పరిధి గోపాలపట్నం పెట్రోల్ బంక్ వద్ద ఈనెల 10న రూ 6 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. గాజువాక నియోజకవర్గం పరిధిలో జాతీయ రహదారిపై ఈనెల 16న రూ 2.29 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టే అంశాలపై ఎన్నికల సంఘం నిరంతర నిఘా కొనసాగిస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.