Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆపరేషన్ శేషాచలం విజయవంతం

$
0
0

తిరుపతి, మార్చి 20: కాకులకోన, పాపవినాశనం, తుంబురుతీర్థం ప్రాంతాల్లో చెలరేగిన మంటలను ఆర్పడం కోసం డిఫెన్స్, ఆర్మీ బృందం హెలికాప్టర్లతో చేపట్టిన ఆపరేషన్ శేషాచలం విజయవంతమైందని టిటిడి ఇఓ ఎం.జి.గోపాల్ వెల్లడించారు. గురువారం హెలికాప్టర్లతో గగనతలం నుండి మంటలను అదుపుచేసిన అనంతరం ఇఓ అధ్యక్షతన అన్నమయ్యభవన్‌లో ఆర్మీ, డిఫెన్స్, కేంద్ర, రాష్ట్ర అగ్నిమాపక, అటవీశాఖ, టిటిడి ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అటవీశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నుండి అనుమతులు పొందుతామన్నారు. ఫైర్‌లైన్స్, వాల్స్ ఏర్పాటు చేయడం వలన ఇలాంటి అగ్నిప్రమాదాల సందర్భంగా నష్టాన్ని నివారించవచ్చునన్నారు. ఇందుకు అటవీశాఖ సహకారాన్ని సంప్రదించగా, వారు సానుకూలంగా స్పందించారన్నారు. ఈ అగ్నిప్రమాదాలకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని వీరిలో టిటిడి సివిఎస్‌ఓ, తిరుమల జెఇఓ, వైల్డ్‌లైఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అగ్నిమాపక నిపుణులు ఉంటారన్నారు. వీరు ప్రస్తుతం జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి అధ్యయనం చేస్తారని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా రోజువారీ పరిశీలనలను కూడా చేస్తూ ఉంటారన్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, శుక్రవారం కూడా మరో పర్యాయం హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుకుని ఆపరేషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర అటవీశాఖ డిజి గార్బియోన్ మాట్లాడుతూ ఈ అగ్నిప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడంతో తాము డిఫెన్స్, ఆర్మీ బృందాలను రంగంలోనికి దింపామన్నారు. మూడు ప్రాంతాల్లో అగ్నికీలలు గుర్తించినట్లు తెలిపారు. పాపవినాశనం, తుంబురుతీర్థం ప్రాంతాల్లో అగ్నికీలలు అదుపుచేశామన్నారు. తక్కిన ప్రాంతాల్లో కొంతమేర ఈ అగ్నిమంటలు ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు. వాటిని శుక్రవారం అదుపుచేస్తామన్నారు. ఇదిలా ఉండగా తుంబురుతీర్థం ముక్కోటి సందర్భంగా అక్కడకు వెళ్లిన భక్తులు వంటలు వండుకుని వదిలిన నిప్పులతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని ఆయన సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. వాస్తవానికి ఈ విషయాన్ని ఆంధ్రభూమిలో ముందుగానే ప్రస్తావించిన విషయం పాఠకులకు విదితమే. ఇలాంటి అగ్నిప్రమాదాలు ఈ ప్రాంతానికి కొత్త కావచ్చునని, హిమాలయాలు, మిజోరం వంటి ప్రాంతాల్లో వేసవికాలం వస్తే అక్కడ సర్వసాధారణమని గార్బియోన్ తెలిపారు. వాస్తవానికి పెద్దస్థాయిలో అగ్నిప్రమాదాలు జరిగితే 65 హెలికాప్టర్లను వినియోగించడం జరుగుతుందన్నారు. ఇప్పుడు శేషాచలకొండలకు వినియోగించింది ఆర్మీ హెలికాప్టర్లు అన్నారు. ఇవి కాకుండా అగ్నినిరోధక హెలికాప్టర్లు ప్రత్యేకంగా ఉన్నాయన్నారు. అలాంటి వాటిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అధికారులకు, టిటిడి అధికారులకు సూచించారు. రాష్ట్ర డిజి ఫైర్‌సర్వీస్ బి.సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. తిరుమల పుణ్యక్షేత్రం కావడంతో కేంద్ర అధికారులు కూడా తీవ్రంగా స్పందించారన్నారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో 12 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని కూడా భర్తీ చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతి పొంది వాటిని భర్తీ చేస్తామన్నారు. ఎపి ఫైర్ సర్వీస్ డిజి సాంబశివరావు మాట్లాడుతూ ఇది కొత్త అనుభవం అని ఇంతవరకు ఇలాంటి ఆపరేషన్‌లో పాల్గొనలేదన్నారు. వాస్తవానికి గ్రేహౌండ్స్ ఇలాంటి పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగపడుతారన్నారు. నిప్పుల్లో కూడా వెళ్లి మంటలను ఆర్పే శక్తి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఫైర్ సర్వీసెస్ సలహాదారు షమీ, టిటిడి సివిఎస్‌ఓ శ్రీనివాస్, జెఇఓలు శ్రీనివాసరాజు, భాస్కర్, సిసిఎఫ్ రవికుమార్, ఇతర అటవీశాఖ, అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు.

ముగిసిన మొదటి అంకం
* జిల్లాలో నామినేషన్ల వెల్లువ
* జడ్పిటిసి 692, ఎంపిటిసి 6299
* నేడు నామినేషన్ల పరిశీలన
* కనిపించని హస్తం హవా
చిత్తూరు, మార్చి 20: జడ్పిటిసి, ఎంపిటిసి స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం నామినేషన్ స్వీకరించే మొదటి అంకం ముగిసింది. గురువారం నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు తమ మద్దతుదారులతో వేలాదిగా చిత్తూరుకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిటిసి స్థానాలకు కూడా వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 65 జడ్పిటిసి, 901 ఎంపిటిసి స్థానాలకు గాను నామినేషన్లు వెల్లువలా వచ్చి చేరాయి. శుక్రవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ఎన్నికల అధికారులు నిర్వహించనున్నారు. నాలుగు రోజులు జరిగిన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి జడ్పిటిసి స్థానాలకు 692, ఎంపిటిసి స్థానాలకు 6299 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా పరిషత్ స్థానాలకు టిడిపి 258, వైసిపి 258, కాంగ్రెస్ 49, బిజెపి 16, సిపిఐ 3, సిపిఎం 5, బిఎస్‌పి 8, లోక్‌సత్తా 2, అంబేద్కర్ కాంగ్రెస్ 2, ఇండిపెండెంట్ 90, మహాజన సోషలిస్టు పార్టీ 1నామినేషన్లను దాఖలు చేశారు. ఎంపిటిసి స్థానాలకు చివరి రోజైన గురువారం బిఎస్‌పి 5, బిజెపి 49, సిపిఐ 28, సిపిఎం 16, కాంగ్రెస్ 171, వైఎస్సార్‌సిపి 1554, టిడిపి 1580, లోక్‌సత్తా 1, ఇతర పార్టీలు 3, స్వతంత్రులు 534మంది నామినేషన్లు వేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి టిడిపి, వైఎస్సార్‌సిపి తరపున అభ్యర్థులు పోటీపడగా, కాంగ్రెస్ తరపున నామినేషన్ వేసేవారి సంఖ్య మూడవ స్థానానికి చేరుకుంది. కొన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. ఇదిలా వుండగా ఎన్నికల నిర్వహణకు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు బ్యాలెట్ బాక్సులు చేరుకోగా, ఇంకా అవసరమైన బ్యాలెట్ బాక్సులను తమిళనాడు రాష్ట్రం నుండి తెప్పించేందుకు జడ్పిసిఇఒ వేణుగోపాల్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిపేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గజరాజుల కదలికల నియంత్రణకు చర్యలు
* దక్షిణాది రాష్ట్రాల అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష
తిరుపతి, మార్చి 20: ఇటీవల కుప్పంలో గజరాజులు బీభత్సం సృష్టిస్తూ తీవ్రనష్టం కల్పించిన నేపథ్యంలో గజరాజుల కదలికల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దక్షిణాది రాష్ట్రాల ఉన్నతాధికారుల ప్రత్యేక సమావేశం గురువారం తిరుపతిలో నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి ఏనుగులు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలకు తరలి వచ్చిన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో అధికారుల సమీక్షలో ఏనుగుల కదలికలపై లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా ఏనుగులు జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో సంచరించడంపై ప్రత్యేకంగా చర్చించి సోలార్ ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దట్టమైన అటవీప్రాంతాల నుండి ఎందుకు ఏనుగులు ఇలా వస్తున్నాయనే విషయంపై కూడా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. కేంద్ర అటవీశాఖ డిజి గార్బియాల్, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటకకు చెందిన ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆప్ ఫారెస్ట్ అధికారులు డిఎస్‌ఎస్ రెడ్డి, లక్ష్మీనారాయణ, గోపీనాథ్, వినయ్‌లూత్రా పాల్గొన్నారు.

మదనపల్లె నియోజకవర్గంలో 273 నామినేషన్లు
* టిడిపి 106, వైకాపా 107, ఇండిపెండెంట్‌లు 33
* కాంగ్రెస్ 2, బిజెపి 3, బిఎస్‌పి 1
* నేడు నామినేషన్‌ల పరిశీలన
మదనపల్లె, మార్చి 20: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మదనపల్లె నియోజకవర్గంలో 273 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో టిడిపి 106, వైకాపా 107, ఇండిపెండెంట్‌లు 33, కాంగ్రెస్ 2, బిజెపి 3, బిఎస్‌పి 1 వంతున నామినేషన్లు దాఖలయ్యాయి. మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె, రామసముద్రం, మదనపల్లె మండలాల్లో టిడిపి, వైకాపా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు కాగా మదనపల్లె మండలం కోటావారిపల్లె పంచాయతీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు, బిజెపి ఒకరు వంతున నామినేషన్‌లు దాఖలు చేశారు. నిమ్మనపల్లె మండలంలో బిజెపి పాగా వేసి తవళం, ముష్టూరు, కొండయ్యగారిపల్లె ఎంపిటిసి స్థానాల్లో పోటీకి దిగారు. గురువారం మదనపల్లె ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని తహశీల్దారు రామక్రిష్ణారెడ్డి పరిశీలించారు. నామినేషన్‌లో దాఖలు చేయని ధ్రువపత్రాలు శుక్రవారం జరుగు పరిశీలనలో సమర్పించాలని ఎన్నికల అధికారి రమణారెడ్డి తెలిపారు. ఎంపిటిసి స్థానాలకు నామినేషన్‌లు వేసిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో శుక్రవారం ఉదయం 11గంటల నుంచి జరుగు నామినేషన్ల పరిశీలనకు హాజరు కావాలని ఎన్నికల అధికారి రమణారెడ్డి కోరారు.
నామినేషన్ కేంద్రం వద్ద 144సెక్షన్
నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎంపిడిఓ కార్యాలయం సమీపంలో 144సెక్షన్ అమలుచేసినట్లు రూరల్ సిఐ చంద్రశేఖర్ హెచ్చరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీలు, సమావేశాలు, మైక్ ప్రచారాలు నిర్వహించరాదన్నారు. పల్లెలో పోటీ అభ్యర్థులు వ్యక్తిగత దూషణలు చేయకుండా వ్యక్తిగతంగా ప్రచారం చేసుకోవాలని తెలిపారు. ఈసందర్భంగా ఎన్నికల నామినేషన్లు పరిశీలించారు.

18 మార్లు గగనతలం నుండి నీళ్లు వెదజల్లాం
* పైలెట్ పాండ్రేకర్ వెల్లడి
తిరుపతి, మార్చి 20: శేషాచలం కొండల్లో మంటలను ఆర్పడానికి రెండు హెలికాప్టర్లతో 18మార్లు గగనతలం నుండి అడవుల్లో నీళ్లు వెదజల్లినట్లు హెలికాప్టర్ల బృందం పైలెట్ పాండ్రేకర్ తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఒక్కో పర్యాయం 3వేల లీటర్లను కుమారధార, పసుపులేటి ధార ప్రాజెక్టు నుండి నీటిని తోడినట్లు పేర్కొన్నారు. నీటిని తోడే సమయంలో 500లీటర్ల నీరు వృధా అయి ఉండవచ్చునని, 2500 లీటర్ల నీటిని ఒక్కో పర్యాయం అడవులపై చల్లినట్లు చెప్పారు. పైలెట్ పాండ్రేకర్ బృందాన్ని టిటిడి అధికారులు అభినందించారు.

పేలుడు సామగ్రి పట్టివేత; ముగ్గురు అరెస్ట్
శాంతీపురం, మార్చి 20: పేలుడు సామాగ్రి కలిగివున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి జెలిటిన్‌స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్టు కుప్పం సిఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. రాళ్లబూదుగూరు పోలీస్‌స్టేషన్‌లో నిందితులను ఉంచారు. మండల పరిధిలోని సాదు గ్రామం వద్ద ఓ ప్రైవేటు గ్రానైట్ ఫ్యాక్టరీ సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా 208 జెలిటిన్ స్టిక్స్, 88 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు కలిగివున్న ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. వారిలో కడపల్లె గ్రామానికి చెందిన శ్యామప్ప, తమిళనాడు కాటూరు నివాసి షణ్ముగం, యామనూరు వాసి వడివేలును అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ప్రధాన నిందితుడు యామనూరు గ్రామానికి చెందిన శరవణ పరారీలో వున్నట్లు ఆయన తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కుప్పం కోర్టులో హాజరుపర్చనున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్, సిబ్బంది భాషా, మునస్వామి, తదితరులను సిఐ అభినందించారు.

విద్యార్థిని ఆత్మహత్య
మదనపల్లెటౌన్, మార్చి 20: గురువారం డిగ్రీ పరీక్షలు జరుగుతాయనగా బుధవారం రాత్రి ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పుంగనూరు మండలంలో జరిగింది. ఆవులపల్లెకు చెందిన నరసింహులు కుమార్తె సుగుణ (19) మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గురువారం పరీక్షలు జరుగుతుండడంతో బుధవారం రాత్రి నుంచే సుగుణ ముభావంగా ఉంది. తల్లిదండ్రులు సొంత పని మీద బయటకువెళ్లడంతో ఎవరూ లేని సమయం చూసి పొలాల కోసం తెచ్చిన పురుగుల మందును సుగుణ తాగింది. పనులు ముగించుకొని ఇంటికి చేరిన కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలో వున్న కుమార్తెను చూసి కంగారుగా రాత్రికిరాత్రే మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సుగుణ మృతి చెందింది. అయితే సుగుణ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం వెల్లడికాలేదు. పరీక్షల భయంతో ఆత్మహత్యకు పాల్పడిందా మరో ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకుందా అన్న విషయం పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి వుంది. పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు 15 సంవత్సరాలు
స్వయంప్రతిపత్తి కల్పించాలి: ‘ఆప్స్’ డిమాండ్
తిరుపతి, మార్చి 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15 సంవత్సరాలు స్వయంప్రతిపత్తి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ పోరాటసమితి (ఆప్స్) నాయకులు డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని 2009లో శాప్స్‌ను స్థాపించి అనేక ఒడిదుడుకుల మధ్య సమైక్యాంధ్ర కోసం మొక్కవోని విశ్వాసంతో పోరాటం చేశామన్నారు. దురదృష్టవశాత్తు కొందరు రాజకీయ నాయకుల స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించడం జరిగిందన్నారు. 65రోజులు తిరుపతిలో నిరాహారదీక్షలు చేసినపుడు ప్రతిరోజు వేలాది మంది వచ్చి మాకు మద్దతు తెలిపారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఇందుకోసం తాము అనేకమంది మేధావులు, విద్యార్థులు, న్యాయవాదులు, ప్రైవేటు విద్యాసంస్థల అధినేతలతో కలసి ఆప్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వారందరు ఇందులో సభ్యులుగా చేరవచ్చునన్నారు. ఆప్స్ గౌరవాధ్యక్షులుగా డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, గౌరవ సలహాదారులుగా కృష్ణయ్య, డాక్టర్ కృష్ణప్రశాంతి, ఫణిరాజ్‌కుమార్, స్వరాజ్యలక్ష్మి, అధ్యక్షులుగా రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తమ్మినేని వెంకటేశ్వర్లులతో పాటు ఉపాధ్యక్షులుగా ఏడుగురు, సహాయ కార్యదర్శులుగా 8మందిని, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై సూచనల కోసం ఏప్రిల్ 2న స్థానిక ఉదరుూ ఇంటర్నేషనల్‌లో చర్చాగోష్టి నిర్వహించనున్నట్లు తెలిపారు.

అరగంట ఆలస్యంగా డిగ్రీ పరీక్షలు ప్రారంభం
* విద్యార్థుల ఆందోళన
మదనపల్లె, మార్చి 20: తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతి పరీక్షకు 45 నిమిషాల ముందు విద్యార్థులను లోనికి అనుమతించి ఓఎంఆర్ షీట్ తనిఖీ, సంతకాలు తదితరాలు పూర్తిచేయాల్సివుంది. అయితే మదనపల్లె పట్టణం దొంతివీధిలోని వివేకానంద డిగ్రీ కళాశాల సెంటర్‌లో మధ్యాహ్నం జరగాల్సిన డిగ్రీ పరీక్ష అరగంట ఆలస్యంగా నిర్వహించారు. మధ్యాహ్నం 1.45గంటలకు సెంటర్‌లోకి అనుమతించకపోవడంతో విద్యార్థులు ఆందోళనతో తల్లిదండ్రులకు, అభ్యసించిన కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జ్ఞానాంబిక కళాశాల కరస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు విశ్వనాధ్, విద్యార్థుల తల్లిదండ్రులు సెంటర్ వద్దకు పరుగులు తీశారు. అప్పటికే 2.15 గంటల సమయం కావస్తుండటంతో సెంటర్ ఛీప్ ఎగ్జామినర్‌ను నిలదీశారు. పరీక్షాకేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమవుతోందన్నారు. దీంతో సెంటర్ నిర్వాహకులు ఎట్టకేలకు 2.30గంటలకు విద్యార్థులను లోనికి అనుమతించారు. విద్యార్థుల హాల్‌టికెట్ నెంబర్లు సైతం సెంటర్ నోటీస్‌బోర్డులో వేయకపోవడంతో విద్యార్థులు మరో 10నిమిషాల పాటు తికమకపడ్డారు. ఇలాంటి పొరపాట్లు మున్ముందు జరక్కుండా చూస్తామని సెంటర్ నిర్వాహకులు చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు వెనుదిరిగారు.

* ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు * రింగ్‌రోడ్లు, ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తాం * టిటిడి ఇఓ ఎం.జి.గోపాల్ వెల్లడి
english title: 
eo gopal

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>