ఒంగోలు, మార్చి 20: రిజర్వేషన్ల దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఓసి వర్గానికి కేటాయించింది. అసలే ఓసి వర్గాలకు సీట్ల కేటాయింపు తక్కువగా ఉంటుంది. ఈక్రమంలో ఆ వర్గాన్ని కాదని బిసి వర్గానికి చెందిన నేతలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టడటంపై ఒసి వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోను జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బిసి మహిళకు కేటాయించారు. ఆ సమయంలో కాంగ్రెస్‌పక్షాన బిసి వర్గానికి చెందిన కాటం అరుణమ్మ జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించిన వెంటనే జిల్లాపరిషత్ స్థానం జనరల్ కేటాయించటంతో ఆ వర్గంలో ఆనందం పెల్లుబుకింది. తీరా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం బిసి వర్గానికి చెందిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీకి కట్టబెట్టింది. దీంతో ఆయన పుల్లలచెరువు జడ్‌పిటిసి స్థానం నుండి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఒసి వర్గానికి చెందిన జిల్లాపరిషత్‌ను బిసిలకు కేటాయించటమేమిటన్న ప్రశ్న ఆ వర్గంలో నెలకొంది. ఇక్కడే తిరుకాసు ఉంది. వైకాపా తరపున జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో ఉన్న నూకసాని బాలాజీ కందుకూరు నియోజకవర్గాన్ని ఆశిస్తున్నారు. దీంతో అసలు సమస్య మొదలైంది. మాజీ ఎంఎల్‌సి పోతుల రామారావుకు కందుకూరు టిక్కెట్ కేటాయించి బిసి వర్గానికి అన్యాయం జరగకుండా జిల్లాస్థాయి పదవి ఇస్తున్నామన్న ప్రచారం చేసుకునేందుకే ఈ తంతు జరిగిందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలాఉండగా జిల్లాలో 56 జడ్‌పిటిసిలు ఉండగా అందులో 26 జడ్‌పిటిసిలను ఒసిలకు రిజర్వేషన్ల దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించిన వెంటనే ఒసి వర్గానికి చెందినవారు ఒసి మండలం ఎక్కడ ఉందా అని వెతుకులాట ప్రారంభించేలోపే ఆ సీటును బిసిలకు కేటాయించటంపై ఒసి వర్గాల్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మళ్ళీ జిల్లా పరిషత్‌కు ఎన్నికలు జరిగితే ఒసి వర్గానికి ఎన్ని సంవత్సరాలకు వస్తుంది, అప్పటివరకు తాము పార్టీని నమ్ముకుని ఉండాల్సిందేనన్న అసహనాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. వైకాపా అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని చారిత్రాత్మక తప్పిదంగా అభివర్ణిస్తూ ఒసి వర్గానికి చెందిన కొంతమంది నేతలు మండిపడుతున్నారు. ఇదిలాఉండగా తెలుగుదేశం పార్టీ తరుపున మాజీ శాసనసభ్యుడు ఈదర హరిబాబు, యర్రగొండపాలెం టిడిపి సీనియర్ నేత మనె్నం రవీంద్రలు జడ్‌పి చైర్మన్ రేసులో ఉన్నారు. మొత్తంమీద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం తీసుకున్న నిర్ణయంతో ఒసి వర్గాల్లో ఆందోళన వ్యక్తవౌతోంది.
ముగిసిన జడ్‌పిటిసి, ఎంపిటిసిల
నామినేషన్ల ఘట్టం
టిడిపి, వైకాపా తరపునే అత్యధిక నామినేషన్లు
జడ్‌పి చైర్మన్ రేసులో టిడిపి అభ్యర్థులు ఈదర, మనే్న
ఒంగోలు, మార్చి 20: జిల్లావ్యాప్తంగా 56 జడ్‌పిటిసి, 790 ఎంపిటిసి స్థానాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. జిల్లాలోని పాత జిల్లా పరిషత్‌హాలు, ఎంపిడిఒల కార్యాలయాలన్నీ నామినేషన్లు వేసే అభ్యర్థులతో కోలాహలంతో మారింది. నామినేషన్లకు చివరిరోజు కావటంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి జడ్‌పిటిసిలకు పోటీచేసే అభ్యర్థులతోపాటు, పార్టీల నాయకులు, కార్యకర్తలు నామినేషన్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. ప్రధానంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తరపున మాత్రమే జడ్‌పిటిసిలు, ఎంపిటిసిలకు భారీ స్థాయిలో నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున మాత్రం మొక్కుబడిగానే నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. భారతీయ జనతాపార్టీకి చెందిన అభ్యర్థులు కేవలం ఐదు జడ్‌పిటిసిలకే పరిమితమయ్యారు. ఇదిలాఉండగా జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో తెలుగుదేశం పార్టీ తరుపున మాజీ శాసనసభ్యుడు ఈదర హరిబాబు, జిల్లాపరిషత్ వైస్ మాజీ చైర్మన్ మనె్న రవీంద్రలు నామినేషన్లను దాఖలు చేశారు. ఈదర కొండెపి నియోజకవర్గం పొన్నలూరు జడ్‌పిటిసిగా, దర్శి నియోజకవర్గం దొనకొండ జడ్‌పిటిసిగా మనె్న రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ఈపాటికే వైకాపా తరపున వైకాపా జిల్లాపార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ పుల్లలచెరువు జడ్‌పిటిసి నుండి పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు వైకాపా, తెలుగుదేశం పార్టీల మధ్యే పోటీ నెలకొన్న నేపధ్యంలో ఆ రెండు పార్టీల నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముందుగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తరువాత జరిగే ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల ప్రభావం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. దీంతో గ్రామస్థాయి నుండి పార్టీ అభ్యర్థులను ఈపాటికే గెలిపించుకునే పనిలో నేతలు నిమగ్నమయ్యారు.
కాగా మునిసిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు వైకాపా రాష్ట్ర నాయకురాలు షర్మిల జిల్లాలో విస్తృత ప్రచారం చేపట్టారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర ఈనెలాఖరునాటికి జిల్లాకు చేరుకునే అవకాశాలున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. కాగా మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి నూతనంగా స్థాపించిన జైసమైక్యాంధ్ర పార్టీ తరుపున అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీచేసే అభ్యర్థులకోసం వెతుకులాట ప్రారంభించారు. వైకాపా, తెలుగుదేశం పార్టీల్లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలకు జై సమైక్యాంధ్ర పార్టీ షెల్టర్ జోన్ కానుంది. మొత్తంమీద నామినేషన్ల ఘట్టం ముగియటంతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం ఊపందుకుంది.
జగనన్నను సిఎంని చేయండి
* రాజన్న పాలన తెస్తాం
వైకాపా నాయకురాలు షర్మిల పిలుపు
చీమకుర్తి, మార్చి 20: రాష్ట్రంలో జరుగనున్న మున్సిపల్, ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు షర్మిల పిలుపునిచ్చారు. అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని తద్వారా జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. జగనన్న ద్వారా రాజన్న పాలన తెస్తామన్నారు. గురువారం చీమకుర్తిలో జనభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచారన్నారు. రైతులకు సబ్సిడీ , ఇన్‌పుట్ సబ్సిడీ, నష్టపరిహారం, రైతు రుణమాఫీ అన్ని వైఎస్ ఘనతేనన్నారు. ప్రతి ఎకరానికి నీరిచ్చి రైతుల కంటనీరు తుడవాలనే జలయజ్ఞం ప్రారంభించారన్నారు. చంద్రబాబు రైతుకు రూపాయి వడ్డీకి రుణం ఇప్పిస్తే వైఎస్ పావలా వడ్డీకే ఇప్పించారన్నారు. పేదరికంలో ఉనర్న ఏ ఒక్కరి గుండె ఆగకూడదని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారన్నారు. ప్రతి బిడ్డ చదవాలని లక్షల కొలది విద్యార్థులకు ఉచిత విద్యనందించారని తెలిపారు. రాష్ట్రంలో 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌కే దక్కుతుందన్నారు. ఐదు సంవత్సరాల్లో దేశం మొత్తం 45 లక్షల పక్కా గృహాలు నిర్మిస్తే ఒక్క రాష్ట్రంలోనే 45 లక్షలు ఇండ్లు కట్టించిన ఘనత వైయస్‌దేనన్నారు. ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే వచ్చే 108 వాహనం ఏమైందన్నారు. 104, అభయహస్తం, ఉపాధి హామీ పనులు రాజశేఖర్‌రెడ్డి చాలా బాగా నిర్వహిస్తే నేటి ప్రభుత్వం ఈ పథకాలను మూలన పడేసిందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ చార్జీలు కాని, కరెంట్ చార్జీలు కాని ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా చేసిన నాయకుడు వైఎస్ అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి రైతులకు ఏమీచేయలేదని, ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదని విమర్శించారు. పరిశ్రమలకు కరెంట్ లేక మూతపడ్డాయని, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలను ఒక్కరోజు కూడా పట్టించుకోకుండా కొత్త పార్టీలు పెట్టి ప్రజలను ఏం ఉద్ధరిస్తారని కిరణ్‌ను ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 70 లక్షల మందిని మోసం చేసిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలిపి రాష్ట్రాన్ని విడగొట్టారన్నారు. మంచివాడని చంద్రబాబును చేరదీసి మంత్రి పదవి ఇస్తే దానితో తృప్తిపడక ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నేడు రైతులకు ఏదో చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బ్యాంకుల్లో అప్పులు, బయట బాకీలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే చూడలేక వైఎస్‌ఆర్ రైతులకు రుణమాఫీ చేశారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి జగన్ సిఎం అయితే రాజన్న పాలనను మళ్లీ తెస్తామని, మరి చంద్రబాబు ఏ పాలన తెస్తారన్నారు. వైఎస్ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టకుండా ఉండేందుకు వైకాపా చివరివరకు ప్రయత్నం చేసిందన్నారు. ఆర్టికల్-3ను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ఆంధ్ర రాష్ట్రం రెండు ముక్కలైందని, నేడు చేయగలిగిందేమీ లేదన్నారు. మన రాష్ట్రాన్ని మనం కొత్తగా నిర్మించుకోవాలన్నారు. వైకాపాకు ఎక్కువ ఎంపి సీట్లు ఇస్తే ప్రధానిని మనమే నిర్ణయించుకొని రాష్ట్రాన్ని కొత్తగా నిర్మించుకుందామన్నారు. జగనన్న నాయకత్వంలో నూతన అధ్యాయాన్ని సృష్టించాలన్నారు. జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి ఆయన జీవితం మీకు ధారపోస్తాడన్నారు. ఇచ్చిన మాట కోసం జగనన్న పదవులు వదులుకొని జైలుకు వెళ్లారన్నారు. రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జగనన్న నాయకత్వాన్ని మీరంతా బలపర్చాలని అభ్యర్థించారు. మీ అందరి అభిమానం, ఆప్యాయత, అనురాగానికి చేతుల జోడించి నమస్కారాలు తెలుపుతున్నానన్నారు. చీమకుర్తి పట్టణంలోని బివిఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద నుండి ప్రధాన రహదారి గుండా రోడ్ షో నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో ప్రసంగించి ఎన్‌ఎస్‌పి కాలనీ వద్ద ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కనిగిరికి బయలుదేరి వెళ్ళారు. ఈ జనభేరి కార్యక్రమంలో ఆమె వెంట వైకాపా కేంద్ర కమిటీ సభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శివప్రసాద్‌రెడ్డి, సుబ్బారెడ్డి, మాజీ ఎంపిపి వెంకాయమ్మ, సమన్వయ కమిటీ సభ్యులు ఆదిమూలపు సురేష్, వెంకారెడ్డి, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. షర్మిల రాకతో చీమకుర్తిలో వైకాపా కార్యకర్తల్లో ఉత్తేజం నెలకొంది. షర్మిల మాట్లాడుతున్నంతసేపు కార్యకర్తలు కేరింతలు కొట్టారు.
ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఒంగోలు, మార్చి 20: త్వరలో జరగనున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, లేనిపక్షంలో ఊరుకునేది లేదని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ అధికారులను హెచ్చరించారు. స్థానిక సిపిఒ కాన్పరెన్స్‌హాలులో గురువారం రిటర్నింగ్, సహాయరిటర్నింగ్, ఎంపిడిఒ నోడల్ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ఈసందర్భంగా జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడ ఏ రకమైన పక్షపాతానికి తావివ్వకుండా కేటాయించిన విధులను సక్రమంగా పనిచేయాలని లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల విధులను నిశితంగా పరిశీలించి అంకితభావంతో కేటాయించిన పని పూర్తిచేయాలన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, సజావుగా సాగాలంటే అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ, మనుగడ పెంపొందించాలంటే న్యాయబద్దంగా ఎన్నికలు జరగాలని, ఆ దిశగా ప్రతిఒక్కరూ తమవంతు కర్తవ్యంగా దృఢనిశ్చయంతో ముందుకు పోవాలన్నారు. ఓటరు నమోదుకు ధరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈనెల 30వ తేదీ వరకు ఓటరు గుర్తింపుకార్డు జారీ చేయాలన్నారు. గత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 76.88 ఓటింగ్ శాతం జరిగిందని, ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు కృషి చేయాలన్నారు. ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలో 2804 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో సజావుగా జరిగేందుకు ముందుస్తు ఎన్నికల ప్రణాళిక తయారుచేసుకోవాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పర్యవేక్షణ, పరిశీలనకోసం నియమించిన ఎంపిడిఒలు ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా, నైతికంగా ఓటుహక్కు వినియోగించుకునే వీలుగా మద్యం, డబ్బు ప్రవాహాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎన్నికల్లో రాజకీయపార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక నిఘా పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఎన్నికల ఖర్చులు ప్రాధాన్యత సంతరించుకుందని ఎన్నికల వ్యయ నియంత్రణకు వివిధ బృందాలను నియమించామని చెప్పారు. ఎన్నికల నేపధ్యంలో అభ్యర్థుల ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, సినిమా థియేటర్, ఆకాశవాణి కేంద్రాల్లో ఇచ్చే ప్రకటనలపై దృష్టిసారించాలని కలెక్టర్ ఆదేశించారు.
బాబు పాలనలోనే రాష్ట్రం సుభిక్షం
* జిల్లాపరిషత్ మాజీ వైస్‌చైర్మన్ మనె్న
మార్కాపురం, మార్చి 20: రాష్ట్ర విభజన జరిగినందున తిరిగి అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశంపార్టీ అధికారంలోనికి రావాల్సి ఉందని ప్రకాశం జిల్లాపరిషత్ మాజీ వైస్‌చైర్మన్ డాక్టర్ మనె్న రవీంద్ర అన్నారు. గురువారం ఉదయం పట్టణంలోని 24,25, సాయంత్రం 8,9వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ రవీంద్ర మాట్లాడుతూ విజన్ ప్రకారం అభివృద్ధి చేయడంలో చంద్రబాబు దిట్టఅని, ప్రస్తుత ఎన్నికల్లో టిడిపి అధికారంలోనికి వస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి ఫలాలు పేద, బడుగు, బలహీనవర్గాలకు అందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వక్కలగడ్డ రాధికను చైర్మన్‌ను చేస్తే పట్టణ అభివృద్ధి ముందుకు వెళ్తుందని కందుల అన్నారు. టిడిపి అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ కనుమరుగైందన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వక్కలగడ్డ రాధిక, మాజీమున్సిపల్ చైర్మన్ షేక్ షెక్షావలి, డాక్టర్ మగ్బుల్‌బాషా, 25వార్డు అభ్యర్థి దాసరి ఆంజనేయులు, 6వార్డు కౌన్సిలర్ వక్కలగడ్డ మల్లికార్జున్‌తోపాటు పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పైవార్తకు కలర్ ఫోటో పంపుతున్నాము.
20యమ్‌ఆర్‌కె 1: 24వార్డులో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే కందుల, డాక్టర్ రవీంద్ర
విజయమే లక్ష్యం కావాలి : జూపూడి
జరుగుమల్లి, మార్చి 20: రానున్న ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల్లో వైసిపి విజయమే ప్రతి కార్యకర్త లక్ష్యం కావాలని కొండపి వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎంఎల్‌సి జూపూడి ప్రభాకరరావు కార్యకర్తలకు సూచించారు. గురువారం మండల కేంద్రం జరుగుమల్లిలో ఎన్నికల ఆంశంపై మండల కన్వీనర్ గాలి శ్రీను, వైసిపి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన జూపూడి మాట్లాడుతూ మండలంలోని అత్యధిక స్థానాలకు కైవసం చేసుకునేందుక ప్రతి కార్యకర్త ఇప్పటి నుండే కృషి చేయాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో నాయకులు తాడి జయప్రసాద్, హనుమాన్‌రెడ్డి, నారాయణరెడ్డి, శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
వైకాపాలో చేరిక...
ఎడ్లూరుపాడు గ్రామానికి చెందిన 100 కాంగ్రెస్ కుటుంబాలు జూపూడి సమక్షంలో గురువారం వైకాపాలో చేరాయి. ఈసందర్భంగా జూపూడి అందరిని పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాలను కప్పారు.
స్వయం సహాయక సభ్యులు వలసలు వెళితే
ఎపిఎం, ఎపివోలపై చర్యలు:కలెక్టర్
ఒంగోలు అర్బన్, మార్చి 20: స్వయం సహాయక సంఘాల సభ్యులు పనులు లేక వలసలు వెళితే సంబంధిత మండలాల ఎపిఎం, ఎపివోలపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్ హెచ్చరించారు. గురువారం స్థానిక సిపివో సమావేశ మందిరంలో డిఆర్‌డిఏ, డ్వామా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జిల్లాలో పేద ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి వలసలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న ఏప్రిల్, మే , జూన్ నెలల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు పనులు కల్పించాలన్నారు. పేద వారికి పనులు కల్పించేందుకు కూలివేతనం కూడా గిట్టుబాటు అయ్యే విధంగా ధరలు పెరిగాయన్నారు. ఈనెల 29 నాటికి బ్యాంకు లింకేజి రుణాల లక్ష్యాలను నూరుశాతం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు 660 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజి రుణాలు అందించేందుకు లక్ష్యం కాగా ఇప్పటికే 500 కోట్ల రూపాయలు అందించామన్నారు. 25వ తేదిలోగా మిగతా వంద కోట్ల బ్యాంకు లింకేజి రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమయం తక్కువగా ఉన్నందున బ్యాంకు లింకేజీ రుణాల మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. స్ర్తినిధి రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలోని దోర్నాల, చినగంజాం, కొరిశపాడు, కందుకూరు, వలేటివారిపాలెం, మార్కాపురం , గిద్దలూరు, పామూరు, లింగసముద్రం, ఒంగోలు, కొత్తపట్నం, వెలిగండ్ల, అద్దంకి, పొదిలి, పర్చూరు, దర్శి, తాళ్లూరు, జరుగుమల్లి మండలాలకు కేటాయించిన వంద శాతం లక్ష్యాలను సాధించినందుకు జిల్లా కలెక్టర్ విజయ్‌కుమార్ ప్రత్యేకంగా అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఏ పిడి పద్మజ తదితరులు పాల్గొన్నారు.
జడ్‌పి చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి పాశం
ఒంగోలు, మార్చి 20: కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా మాజీ జడ్‌పిటిసి నాయకుడు పాశం వెంకటేశ్వర్లును బలపర్చుతూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈమేరకు డిసిసి అధ్యక్షుడు ఉగ్రనరసింహారెడ్డి, మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి ఆశీస్సులతో హనుమంతునిపాడు జడ్పీటీసీ స్థానానికి గురువారం ఒంగోలులో నామినేషన్ దాఖలు చేశారు. బిసిల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేసినట్లు పాశం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున 56 మండలాల నుండి కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్నందున మిగిలిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బంకా శ్రీనివాసరావు, బిసి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఆవుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.