రాజమండ్రి, మార్చి 20: గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కన్నా బిజెపి టిక్కెట్లకే ఎక్కువ గిరాకీ కనిపిస్తోంది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో జరుగుతున్న మున్సిపల్, జెడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కన్నా కొద్దో గొప్పో బిజెపివైపే జనం మొగ్గు చూపిస్తున్నారు. అందులోనూ తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదిరే అవకాశాలు ఉండటంతో బిజెపి టిక్కెట్ల కోసం ఒక్కసారిగా ఎక్కడలేని డిమాండ్ వచ్చిపడింది. తాము పార్టీలో చేరతామని, తెలుగుదేశం పొత్తులో భాగంగా తమకు టిక్కెట్టు ఇప్పిస్తే గట్టిగా ఖర్చు పెట్టి విజయం సాధిస్తామంటూ చాలా తెలివిగా కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల్లోని ముఖ్యనాయకులు కూడా సీమాంధ్ర బిజెపికి తెగ ఆఫర్లు ఇస్తున్నారు. ఇతర పార్టీల్లో కాస్తంత ధనికులైన నాయకులంతా బిజెపి నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, తమకే టిక్కెట్టు వచ్చేలా చూడాలంటూ బిజెపి నాయకులను ఒత్తిడి చేస్తున్నారు. నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఒక డబ్బున్న మారాజైతే ఏకంగా లోక్‌సభ నియోజకవర్గంలోని సగం ఓట్లను కొనేస్తానని, అది కాకుండా పార్టీ ఫండుగా ఎంతో కొంత ఇస్తానంటూ బంపర్ ఆఫర్లు ఇవ్వటం చూసి బిజెపి నాయకులు విస్తుపోతున్నారు. తెలుగుదేశంతో పొత్తు ఉండవచ్చన్న ఉద్దేశ్యంతోనే తమ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు ఉత్సాహపడుతున్నారన్న విషయం బిజెపి నాయకులకు కూడా తెలుసు. అయితే తెలుగుదేశంతో పొత్తు ఉంటే కనుక గోదావరి జిల్లాల్లో 3లోక్‌సభ, 8అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని బిజెపి కోరే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థానాలపై ఇప్పటికే బిజెపి నాయకులు కొంత కసరత్తు కూడా చేసారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గాలను, తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీ, ముమ్మిడివరం, పిఠాపురం, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాలపై బిజెపి గురిపెట్టింది. లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజమండ్రి, కాకినాడ, నర్సాపురం స్థానాలను పొత్తులో కోరాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు. తెలుగుదేశం, బిజెపి మధ్య ఎన్నికల పొత్తు కనుక ఉంటే రాజమండ్రి విషయంలో రెండు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాజమండ్రి లోక్‌సభ స్థానాన్ని బిజెపి రెండు సార్లు గెలిచింది. గోదావరి జిల్లాల్లో మిగిలిన కాకినాడ, నర్సాపురంలో ఒక్కొక్కసారే బిజెపి గెలిచింది. అందువల్ల రాజమండ్రిపైనే బిజెపి గట్టిగా పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునేందుకు బిజెపిలోని కొంత మంది జాతీయ నాయకులు తహతహలాడుతున్నప్పటికీ, సీమాంధ్ర నాయకులు, కార్యకర్తలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే పొత్తు కుదిరితే మాత్రం తెలుగుదేశం పార్టీపై బిజెపి వైపు నుండి తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
రేపు కాంగ్రెస్ బస్సుయాత్ర
టూర్ కో-ఆర్డినేటర్ సుధాకర్‌బాబు
కాకినాడ, మార్చి 20: జిల్లాలో ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు పిసిసి ప్రధాన కార్యదర్శి, టూర్ కో-ఆర్డినేటర్ పిజెఆర్ సుధాకర్‌బాబు తెలిపారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేఖర్లకు వివరాలను వెల్లడించారు. 22వ తేదీన తునిలో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి అన్నవరం, కత్తిపూడి, గొల్లప్రోలు, పిఠాపురం మీదుగా కాకినాడ చేరుకుని సాయంత్రం 6 గంటలకు స్థానిక సూర్యకళా మందిరంలో జిల్లా పార్టీ కార్యకర్తలతో విస్త్రృత సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ బస్సు యాత్రలో సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి, కేంద్ర మంత్రులు చిరంజీవి, ఎం ఎం పళ్ళంరాజు, పనబాక లక్ష్మిలతో పాటు నాయకులు బొత్స సత్యనారాయణలు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ తరుపున పోటీ చేయాలనుకునే వారి వివరాలను తీసుకుంటామన్నారు. కార్యకర్తల నుండి సలహాలు, సూచనలను తీసుకుంటామన్నారు. నాయకులంతా రాత్రికి కాకినాడలో బస చేసి బస్సు యాత్ర ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు బయలుదేరి వెళుతుందని వివరించారు. ఈ యాత్రలో రాష్ట్ర విభజన ఏర్పాటుకు సహకరించిన ప్రతిపక్షాల పాత్రపై ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బోనం భాస్కర్, బదిరెడ్డి గోపి, తుమ్మల పద్మ, అనూష, జె రాము, నాయుడు, పి రాజు తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ల వెల్లువ
*జడ్పీటీసీలకు 537
*ఎంపిటిసిలకు 5,812
*ముగిసిన స్వీకరణ ఘట్టం
కాకినాడ, మార్చి 20: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 57 జడ్పిటిసి స్థానాలకు గురువారం 391 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంమీద నాలుగురోజుల్లో 537 జడ్పిటిసి నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 1063 ఎంపిటిసి స్థానాలకు గాను చివరిరోజు 3వేల 620 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంమీద 5వేల 812 ఎంపిటిసి నామినేషన్లు దాఖలయ్యాయి. జడ్పిటిసికి సంబంధించి బిఎస్‌పి 6, బిజెపి 7, సిపిఐ 4, సిపిఎం 4, కాంగ్రెస్ 65, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 183, తెలుగుదేశం 205, లోక్‌సత్తా 3, ఇతరులు 11, స్వతంత్రుల తరపున 39 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపిటిసి నామినేషన్లలో బిఎస్‌పి 18, బిజెపి 32, సిపిఐ 20, సిపిఎం 17, కాంగ్రెస్ 258, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 2,237, తెలుగుదేశం 2,471, లోక్‌సత్తా 9, ఇతరులు 12, స్వతంత్ర అభ్యర్ధులు 738 మొత్తం 5,812 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో 57 జడ్‌పిటిసి, 1063 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత నామినేషన్‌లను పరిశీలన ప్రారంభిస్తారు. నామినేషన్‌ల తిరస్కరణకు సంబంధించి అప్పీళ్లుంటే ఈనెల 22వ తేదీన ఎన్నికల అధికారులైన ఆర్డీఓలకు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. అప్పీళ్లను ఈనెల 23వ తేదీ సాయంత్రం 5గంటలలోపు పరిష్కరిస్తారు. ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటలలోపు నామినేషన్‌లను ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్ధుల వివరాలను ప్రకటిస్తారు.
కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, మార్చి 20: టిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యలపై కోనసీమ జెఎసి అధ్యక్షుడు విఎస్ దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహనరావులు నిరసన వ్యక్తంచేశారు. కెసిఆర్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆంధ్రా ఉద్యోగులు హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలని, పోలవరం నిర్మాణం జరగనివ్వమని తదితర వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని జెఎసి నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో మంత్రిప్రగడ వేణుగోపాల్, ఎస్‌ఆర్‌ఎస్ కొల్లూరి, ఎంఎకె భీమారావు, ఉండ్రు బాబ్జి, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, సంసోను, ఎ శరభరాజు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ రోబో!
-ఆదిత్య ఇంజనీరింగ్ విద్యార్థుల సృష్టి
గండేపల్లి, మార్చి 20: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కళాశాలలో శ్రీ ఆదిత్య ఇంజినీరింగ్ బిటెక్ తృతీయ సంవత్సరం విద్యార్థులు రైతులకు ఉపయోగపడే అగ్రికల్చర్ రోబోను తయారుచేశారు. విద్యార్థులు పి. పృధ్వి, పి. సాయిచరణ్, కెవిఎస్ ఉదయ్ వ్యవసాయానికి ఉపయోగపడే రోబోను తయారుచేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయంలో వ్యయాన్ని తగ్గించడానికి ఈ రోబో ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయంలో పంట భూమిని చదును చేయడం, దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం, పంటకు నీరు పెట్టడం వంటి పనులు ఏకకాలంలో ఈ రోబో చేయగలదన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల వైస్ ఛైర్మన్ ఎన్. సతీష్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ఎ. రమేష్, ఎం. శ్రీనివాసరెడ్డి, టి. రామకృష్ణ విద్యార్థులను అభినందించారు.
సమన్వయంతో పనిచేయాలి
ఎన్నికల కోడ్ అమలుపై రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ సమావేశంలో కలెక్టర్ నీతూప్రసాద్
కాకినాడ సిటీ, మార్చి 20: మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపిటిసి, సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళులను పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పటిష్టంగా అమలుచేయాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ కోరారు. గురువారం కలెక్టర్ నీతూప్రసాద్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విజయకుమార్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డిలతో కలిసి ఎన్నికల నిర్వహణ అంశాలపై పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన స్టాటిక్ సర్వైలెన్స్ టీములు, ప్లైయింగ్ స్క్వాడ్‌లు, చెక్‌పోస్ట్‌ల సమన్వయంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జరిగే ప్రయత్నాలను పూర్తి స్థాయిలో అరికట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న బెల్ట్ షాపులన్నిటిని తొలగించాలని, కాపు సారాను అరికట్టాలని తెలిపారు. లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలకు అనుమతించిన ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల అమ్మక వేళలను కచ్చితంగా పాటించేలా పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల బరిలోని అభ్యర్ధులు, పార్టీలు ప్రచారానికి జరిపే వ్యయంపై సునిశితమైన పరిశీలన పాటించాలని, నింబంధనల ప్రకారం వ్యయం రిజిష్టర్లు నిర్వహించాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు విద్యా సంస్థలకు చెందిన ప్రదేశాలలో మీటింగ్‌లు నిర్వహించేందుకు అనుమతించరాదన్నారు. ప్రచారంలో వాడే పోస్టర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, బానర్ల పై ప్రింటర్ పేరు, ఫోన్ నెంబరు తప్పనిసరిగా ముద్రించాలన్నారు. నమోదైన ప్రతి ఓటరూ ఓటింగ్‌లో పాల్గొనేలా విస్తృతంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించి సగటు పోలింగ్ 85 శాతం మించేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ రవికుమార్‌మూర్తి, ఐటిడిఎ పిఒ గంధం చంద్రుడు, ఏజెసి డి మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల విస్తృత తనిఖీలు
రాజమండ్రి, మార్చి 20: కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం, ఇతర సామాగ్రిని తరలించకుండా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం నగరంలో 9 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి రోజూవారీగా వందలాది వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వైఎస్సార్‌సిపి పార్టీ నాయకుడి వాహనంలో భారీగా నగదును తరలిస్తున్నారన్న సమాచారంతో గురువారం మధ్యాహ్నం వై జంక్షన్ వద్ద అనుమానాస్పద వాహనాన్ని తనిఖీ చేయగా, 500 పార్టీ జెండాలు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఎన్నికల ప్రవర్తనా నియమావళి విభాగానికి అప్పగించినట్లు వన్‌టౌన్ సిఐ సత్యనారాయణ తెలిపారు. అలాగే చర్చిపేట వద్ద ఒక వాహనంలో తరలిస్తున్న రూ. 2.30లక్షల నగదును స్వాధీనం చేసుకుని అధికారులకు స్వాధీనం చేసినట్లు చెప్పారు.
పోలీసుల దూకుడు
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తూ వ్యాపారులకు సంబంధించిన సామాగ్రిని, డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారని చాంబర్ అధ్యక్షుడు అశోక్‌కుమార్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు చర్యల వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన వాణిజ్య కేంద్రమైన రాజమండ్రిలోని వర్తకులు వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసమస్యలపై ఈనెల 22న చాంబర్‌లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
పరువు కోల్పోయిన కాంగ్రెస్
రావులపాలెం మండలంలో 24 ఎంపిటిసిలకు కేవలం 7 నామినేషన్లు
రావులపాలెం, మార్చి 20: రావులపాలెం మండల పరిషత్ చరిత్రలో జరిగిన గత నాలుగు ఎంపిటిసి ఎన్నికల్లోను విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి పరువు నిలిచే పరిస్థితులు కూడా కానరావడం లేదు. నామినేషన్ల ప్రక్రియ గురువారం సాయంత్రానికి ముగిసే సమయానికి 24 ఎంపిటిసిలున్న రావులపాలెం మండలానికి కాంగ్రెస్ తరపున కేవలం 7 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. మండలంలో ప్రస్తుత పరిస్థితిని విశే్లషిస్తే రాష్ట్ర విభజన తరువాత జరుగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికలతో గ్రామ రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. వలసలతో ఎవరు ఏ పార్టీలో వున్నారో తెలియని పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటుండగా కార్యకర్తల్లో సైతం అదే పరిస్థితి నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ మూడవ రోజు గడిచేనాటికి కూడా చాలా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక జరగకపోవడం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎట్టకేలకు ఆఖరి రోజుకు పెద్దఎత్తున నామినేషన్లు వచ్చి పడ్డాయి. అయితే మొత్తంగా 165 నామినేషన్లు దాఖలు కాగా, వీరిలో నుండి ప్రధాన రాజకీయ పక్షాలు తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడం ఆయా పార్టీలకు సవాల్‌గానే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీని మండలంలో గత 25 ఏళ్లుగా తన భుజస్కంధాలపై నడిపించిన డిసిఎంఎస్ ఛైర్మన్ కెవి సత్యనారాయణరెడ్డి రాష్ట్ర విభజన నేపథ్యంలో తొలిసారిగా కాంగ్రెస్‌ను వీడి మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేసిన జై సమైక్యాంధ్ర పార్టీవైపు నడిచారు. అలాగే నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దీంతో మండలంలో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఎదురైంది. డిసిసిబి మాజీ డైరెక్టర్ ఆకుల రామకృష్ణ పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటికీ కేవలం ఏడు నామినేషనే్ల దాఖలు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. రావులపాలెం మండల పరిషత్‌కు గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున టివి సత్యనారాయణరెడ్డి, చిన్నం సుబ్బిరెడ్డి, కె. సత్యప్రభ, ఏనుగుపాటి గంగాధరరావు గెలిచి ఎంపిపి పీఠాన్ని అధిష్ఠించారు. ప్రస్తుతం ఎంపిపి పీఠానికి పోటీ టిడిపి, వైసిపి, జై సమైక్యాంధ్ర పార్టీల మధ్యే వుంటుందన్నది విశే్లషకుల అంచనా. ఈ నేపథ్యంలో తొలిసారిగా కాంగ్రెసేతర నాయకులు ఎంపిపి పీఠాన్ని అధిరోహించే అవకాశాలుండటంతో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందోనన్నది మండలంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా వుంది.
కాంగ్రెస్‌కు రాజీనామా చేయలేదు: ఎమ్మెల్యే రాపాక
మలికిపురం, మార్చి 20: తాను కాంగ్రెస్‌కు రాజీమానామాచేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. రానున్న ఎన్నికల్లో తాను ఏ పార్టీ నుండి పోటీ చేయటంలేదని, తన అనుచరులు వారికి నచ్చిన పార్టీలో చేరారని ఆయన తెలిపారు. ఇదిలావుండగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ముత్యాలకాశి భార్య ముత్యాల సుధ మలికిపురం జెడ్‌పిటిసి స్థానానికి వైసిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. లక్కవరం గ్రామానికి చెందిన మంగిన భూదేవి టిడిపి అభ్యర్థిగా జెడ్‌పిటిసి స్థానానికి నామినేషన్ దాఖలుచేశారు.
నిబంధనల కొరడాతో తగ్గిన హడావుడి
రాజమండ్రి, మార్చి 20: జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు లేకుండా ఎన్నికల ప్రచారాన్ని ఊహించలేం. ఎన్నికలంటే ఆయా నగరాలు, పట్టణాల్లో ఒక పండుగ వాతావరణం కనిపించేది. ఎక్కడ చూసినా నాయకుల ప్రసంగాలతో సందడి ఉండేది. డప్పుల హడావుడి మధ్య కార్యకర్తలు జెండాలతో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేయడం ఇక గత చరిత్రగానే కనిపిస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ప్రచారసరళిపై నిశిత దృష్టిసారించారు. ప్రభుత్వ ఆస్తులపై పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. ప్రైవేటు ఆస్తులపై కూడా వారి అనుమతితోనే ప్రచార సామాగ్రిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై కూడా ఓ కనే్నసి ఉంచారు. ఈనేపథ్యంలో నగరంలోని రోడ్డపై ఎక్కడా బ్యానర్లు, ఫ్లెక్సీలు కనిపించడం లేదు. దీంతో అభ్యర్థులు కూడా ఎలాంటి హడావుడి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అద్దె కార్యకర్తలతో ఇల్లిల్లూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గత కార్పొరేషన్, సాధారణ ఎన్నికలను చూసిన వారికి రాజమండ్రిలో అసలు ఎన్నికలు జరుగుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. ప్రచార పర్వంలో కూడా పెద్దగా సందడి కనిపించడం లేదు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇంకా ప్రచారాన్ని పూర్తిస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది.
చీపుర్లతో ఆప్ ప్రచారం
స్థానిక 44వ వార్డు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూర రమేష్‌ప్రసాద్ తమ పార్టీ గుర్తు చీపుర్లతో గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 21వ వార్డు టిడిపి తిరుగుబాటు అభ్యర్థి బూర రామచంద్రరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే 42వ వార్డు వైఎస్సార్‌సిపి అభ్యర్థి తేతలి ఉమమాహేశ్వరి, 48వ వార్డు టిడిపి అభ్యర్థి గరగా పార్వతి, 24వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఎండి షెహన్‌షా ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు.
నేడు కాకినాడలో ప్రజా ఐక్యవేదిక సదస్సు
-బివి రామారావు
కాకినాడ, మార్చి 20: జై ఆంధ్ర ప్రజా ఐక్య వేదిక ఉభయ గోదావరి జిల్లాల ప్రజాచైతన్య సదస్సును శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని శ్రీ సూర్యకళామందిరంలో నిర్వహించనున్నట్టు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బివి రామారావు తెలియజేశారు. కాకినాడ నగరంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ ఐక్య సదస్సుకు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు, మేధావులు, కుల సంఘాల ప్రతినిధులు తదితరులను ఆహ్వానించినట్టు చెప్పారు. సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జై ఆంధ్ర ప్రజా ఐక్యవేదిక తరఫున తమ అభ్యర్ధులు బరిలో ఉంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారని, వారు కోస్తా ప్రాంత అభివృద్ధికి ఏ విధమైన కృషి చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ కారణంతోనే కోస్తాతీరానికి చెందిన 9 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ విధంగా చేస్తే కోస్తాంధ్ర మరో జపాన్, సౌత్ కొరియా మాదిరిగా అభివృద్ధి చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే స్ఫూర్తితో జై ఆంధ్ర ప్రజా ఐక్య వేదిక ఉద్యమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు.
ప్రజల జీవితాలను మార్చే ఎన్నికలు
వైసిపి నేత జగన్
రామచంద్రపురం, మార్చి 20: రానున్న సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర ప్రజల జీవితాలను మార్చే ఎన్నికలని, తనను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ప్రజలకు మేలు చేసే 5 పథకాలపై ప్రమాణ స్వీకారోత్సవ అనంతరం తొలి సంతకాలు పెడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రామచంద్రపురం పట్టణంలో రామకృష్ణ సెంటరు వద్ద గురువారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్‌రెడ్డి ప్రసంగించారు. డ్వాక్రా మహిళలకు వెసులుబాటు కల్పించేందుకు తాను అధికారంలోకి రాగానే 24 వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని ప్రకటించారు. గ్రామాల్లో నివసించే ప్రజలు తమ వౌలిక సదుపాయాల కల్పనకోసం అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగనక్కరలేదని, గ్రామంలో ఒక ఆఫీసు ఏర్పాటుచేస్తామని అన్నారు. ఎవరికి ఏది కావాలన్నా అక్కడే తక్షణమే పరిష్కారమవుతుందన్నారు. 5 సంవత్సరాల్లో దేశంలో 40 లక్షల ఇళ్లు నిర్మాణం జరిగేదని, వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు నిర్మాణం జరిగాయని అన్నారు. అయితే తాను ముఖ్యమంత్రి కాగానే 5 సంవత్సరాల్లో 50 లక్షల ఇళ్లు నిర్మించడానికి కార్యాచరణ పథకాన్ని రూపొందించానన్నారు. రానున్న 45 రోజులు ఎన్నికల రోజులని, ఇప్పటి నుండే కార్యకర్తలు శ్రమించి, రాష్ట్రంలోని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లలో వైసిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రామచంద్రపురం నియోజకవర్గం నుండి బోసన్న, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుండి విశ్వరూపన్న పోటీ చేస్తున్నారని, వారిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పించారు. ఈ సభకు గతంతో పోల్చుకుంటే అత్యంత తక్కువ ప్రజానీకం హాజరయ్యారు. వేదికపై జగన్‌తో పాటు పినిపే విశ్వరూప్, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎంపిపి కట్టా సూర్యనారాయణ, పురపాలక ఛైర్‌పర్సన్ అభ్యర్థి అడ్డూరి జగన్నాధవర్మ ఆశీనులయ్యారు. అంతకు ముందు రామచంద్రపురం నియోజవకర్గ పరిధిలోని కుయ్యేరు మీదుగా బాలాంత్రం, ఎర్రపోతవరం, వేగాయమ్మపేటల మీదుగా ద్రాక్షారామ చేరుకున్నారు. బాలాంత్రం నుండి ద్రాక్షారామ వరకు ఆయన నిర్వహించిన రోడ్ షోకు జనం కరువయ్యారు. ద్రాక్షారామలోని మండాలమ్మపేట వద్ద అంబేద్కర్ విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం తాళ్లపొలం మీదుగా రామచంద్రపురం చేరుకున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి అడ్డూరి జగన్నాధవర్మ ఇంటివద్ద సుమారు 4 గంటల పాటు విశ్రాంతి తీసుకుని 6.30 గంటల సమయంలో రామకృష్ణ సెంటరులో సమావేశానికి హాజరయ్యారు.
3‘కోట’లో రూ.5 లక్షల నగదు స్వాధీనం
సామర్లకోట: ఎన్నికల సందర్భంగా స్థానిక కాకినాడ రోడ్డులోని పెట్రోలు బంకు సమీపంలో పోలీసులు నిర్వహిస్తున్న చెక్‌పోస్టు వద్ద సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.5 లక్షలు నగదును సామర్లకోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం స్థానిక కాకినాడ రోడ్డులో కాకినాడ నుండి సామర్లకోటకు మోటార్‌సైకిల్‌పై ఒక బ్యాగ్‌లో రూ.5 లక్షల సొమ్మును స్థానిక ఇండియన్ ఇన్ఫోలిన్ పైనాన్స్ లిమిటెడ్ చెందిన మేనేజర్ చిన్నారావు, సిసి సుబ్రహ్మణ్యంలు తీసుకువస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి, నగదు బ్యాగ్‌ను ఆపుచేశారు. స్థానిక అడిషనల్ ఎస్సై నాగార్జున్ వారిని అదుపులోకి తీసుకున్నారు. సకాలంలో నగదుకు ఆధార పత్రాలు చూపకపోవడంతో రాత్రి 7 గంటలకు తహసీల్దార్ కోర్టులో డిప్యూటీ తహసీల్దార్ సూర్నీడు సత్యనారాయణకు నగదును అప్పగించారు. అయితే బాధితుడు చిన్నారావు మాట్లాడుతూ బంగారంపై తమ సంస్థ రుణాలు అందిస్తుందని, తమ కార్యాలయంలో నగదు కొరత ఉండటంతో వాకలపూడి కార్యాలయం నుండి రూ.5 లక్షలు నగదు తెస్తున్నామన్నారు. నగదుకు చెందిన కంప్యూటర్ ఎకనాలెడ్జిమెంట్ చూపించినా పోలీసులు అనుమతించలేదన్నారు. అసలు పత్రాలు తెచ్చేసరికి కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ సూచనల మేరకు సొమ్మును ప్రభుత్వ ఖజానాకు తరలించనున్నట్టు తెలిపారు.
మెదక్ జిల్లా దుర్ఘటనపై మానవహక్కుల సంస్థ విచారణ
రాజమండ్రి, మార్చి 20: మెదక్‌జిల్లాలో ఏఎస్‌ఐ బూటికాలితో తొక్కడం వల్ల 4నెలల పసిపాప మృతి చెందిన సంఘటనపై అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ విచారం వ్యక్తం చేసింది. ఈసంఘటనపై విచారణ నిర్వహిస్తామని, న్యాయపోరాటం చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో సంస్థ భారతదేశ చైర్మన్ నీమ్‌సింగ్ ప్రేమీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాల వల్ల దేశ సమగ్రతకు విఘాతం కలుగుతుందన్నారు. దేశంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలపై తమ సంస్థ పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్ర చైర్మన్‌గా నియమితుడైన పి అవినాష్ దేవ్‌చందర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా సంఘటన మానవహక్కులను ఉల్లంఘించడమేనన్నారు. ఆర్పీసీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ పేపరుమిల్లు వల్ల ఏర్పడుతున్న జలకాలుష్యంపై తాము చేపట్టిన ఉద్యమానికి సంస్థ సహకరిస్తోందన్నారు. జలుకాలుష్యంపై సంస్థకు ఫిర్యాదు చేశామన్నారు. ఓఎన్జీసి డిజిఎం డి శామ్యూల్‌జాన్ మాట్లాడుతూ మానత్వానికి కులమతాలు అడ్డుకారాదన్నారు. దేశంలో దోపిడీ వ్యవస్థను నిర్మూలిస్తే సమసమాజం సాధ్యమవుతుందన్నారు. ఈసందర్భంగా అవినాష్‌కు నీమ్‌సింగ్ నియామకపత్రాన్ని అందజేశారు. ఈసమావేశంలో సూర్యప్రభావతి, రాష్ట్ర కార్యదర్శి ఎండి నజీబ్ తదితరులు పాల్గొన్నారు.