Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నామినేషన్ల ఘట్టం సమాప్తం

$
0
0

ఏలూరు, మార్చి 20: స్థానిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం సమాప్తమై ప్రచార పర్వానికి తెర లేచింది. గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఇక శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. పార్టీల మధ్య సయోధ్య లేకుండానే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటం గమనార్హం. నామినేషన్ల చివరి రోజు గురువారం 46 జడ్పీటీసీ స్థానాలకు 300 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం మీద జిల్లాలోని 46 జడ్పీటీసీ స్థానాలకు 391 నామినేషన్లు దాఖలయ్యాయి. టిడిపి తరఫున 154, వైసిపి తరఫున 147, బిఎస్పీ తరఫున 9, బిజెపి 15, సిపిఎం 9, కాంగ్రెస్ 17, ఇండిపెండెంట్లు 34, ఇతరులు ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని ఎంపిటిసి స్థానాలకు గురువారం 3503 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం మీద 903 ఎంపిటిసి స్థానాలకు 5426 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో టిడిపి తరఫున 2192, వైసిపి తరఫున 2106, బిఎస్పీ 12, బిజెపి 49, సిపిఐ 22, సిపిఎం 106, కాంగ్రెస్ 110, ఇండిపెండెంట్లు 747, ఇతరులు 82 నామినేషన్లు దాఖలు చేశారు. ఏలూరు, ద్వారకాతిరుమల, పెదవేగి, తాడేపల్లిగూడెం, నిడమర్రు, నల్లజర్ల, నిడదవోలు, ఇరగవరం, తణుకు, పెరవలి, ఉండ్రాజవరం, అత్తిలి, నరసాపురం, ఆచంట, యలమంచిలి, పెనుగొండ, వీరవాసరం, పెనుమంట్ర, పాలకొల్లు మండలాల పరిధిలోని ఎంపిటిసి స్థానాలకు కాంగ్రెస్ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం విశేషం. అలాగే బిజెపి తరఫున 22 మండలాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. లోక్‌సత్తా తరఫున కేవలం ఉండ్రాజవరం మండలంలోనే నామినేషన్లు దాఖలు కావడం విశేషం.
శాంతియుత వాతావరణంలో ఎన్నికలకు అభ్యర్థులతో సమావేశాలు: కలెక్టర్
నిడదవోలు, మార్చి 20: ఈ నెల 30వ తేదీన జరగనున్న పురపాలక సంఘ ఎన్నికలు సజావుగా శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి పోటీలో వున్న అభ్యర్థులు, రాజకీయ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ సిద్దార్ధ జైన్ అన్నారు. గురువారం స్థానిక ఎస్‌విడి మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని సమావేశ మందిరంలో వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులతో అవగాహన సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఏడు పురపాలక సంఘాలు, ఒక నగరపంచాయతీ పరిధిలోని వార్డుల్లో ఈ నెల 30న పోలింగ్ జరుగుతుందన్నారు. వార్డుల్లో అభ్యర్థులు తమ ప్రచారాలకు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి తీసుకోవలసిన అనుమతులు, నియమ నిబంధనల గురించి తెలియజేశామని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు ఓటర్లను ఎటువంటి డబ్బు, మద్యం, విందులు, వినోదాలు, బహుమతులు ఇతర ప్రలోభాలకు లోబరచడానికి ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సంఘటన, ప్రచారం, సభలు, సమావేశాలకు వీడియోలు తీస్తారని తెలిపారు. అభ్యర్థులు తమ ప్రచారాలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే చేపట్టాలని సూచించారు. మైకులు, ఊరేగింపులు, ఇతర ప్రచారాలకు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. పోలింగ్ తేదీనాడు అభ్యర్థులు ఉపయోగించే వాహనాలకు ప్రత్యేక అనుమతి తీసుకోవాలన్నారు. వారి వాహనాలపై ఎటువంటి గుర్తులు, ప్రచార సమాచారం వుండరాదన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉపయోగించే విధానం గురించి పోటీల్లో వున్న అభ్యర్థుల ఏజంట్లు ముందుగా తెలుసుకోవాలన్నారు. ప్రచారానికి ఉపయోగించే ఖర్చు, వీడియోగ్రఫీ, ఇతర టీమ్‌లు రికార్డు చేసిన ప్రతి అంశం మోడల్ కోడ్ టీమ్‌కు అందజేస్తారన్నారు. ఈ నెల 28వ తేదీన సాయంత్రం 5 గంటల తరువాత ఎటువంటి ప్రచారాలు చేయరాదని తెలిపారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా వుంచి, గస్తీ ఏర్పాటుచేయాలన్నారు. అనంతరం నిడదవోలు 28 వార్డుల్లోను పోటీలో వున్న అభ్యర్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. వార్డు సభ్యులుగా పోటీచేసే అభ్యర్థి తమ ప్రచారానికి లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేసుకోవాలన్నారు. అభ్యర్థికి తెలియకుండా ఇతరులెవరైనా ఖర్చుచేసే ప్రతి ప్రచారానికి సంబంధించి వివరాలు ఆయా అభ్యర్థులు తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. బాబూరావునాయుడు, అదనపు జెసి బి. నరసింహరావు, మున్సిపల్ కమిషనర్ జి. కృష్ణమోహన్, డిఎస్పీ వి. రాజగోపాల్, కొవ్వూరు, నిడదవోలు తహసీల్దార్లు, మున్సిపల్ డిఇ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం
నలుగురు జిల్లా వాసులు మృతి
శుభకార్యానికి వెళ్ళొస్తూ అనంతలోకాలకు..
అశ్వారావుపేట, మార్చి 20: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వుంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు గ్రామానికి చెందిన మల్లూరి శ్యామనభాస్కర్‌రావు, భార్య లక్ష్మి, సమీప బంధువు తణుకు పట్టణానికి చెందిన లంకా చారుమతిదేవి, విజయ, నిడదవోలు గ్రామానికి చెందిన డ్రైవర్ మామిడి శ్రీనివాసరావు బుధవారం ఓ వివాహ వేడుకకు ఖమ్మం జిల్లా పాల్వంచ వెళ్లారు. పాల్వంచ నుంచి తిరుగు ప్రయాణంలో గురువారం ఉదయం అశ్వారావుపేట సమీపంలోని కారాయిగూడెం గ్రామం వద్ద కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో శ్యామనభాస్కర్‌రావు(62), శ్రీనివాసరావు(50) అక్కడికక్కడే మృతిచెందారు. 108 ద్వారా స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేస్తుండగా లక్ష్మి(60), చారుమతిదేవి(48) మృతిచెందారు. విజయను మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అక్కడి నుంచి విజయవాడలకు తరలించారు. భాస్కర్‌రావకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె సింగపూర్‌లో, కుమారుడు ప్రకాశ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో నిడదవోలులో విషాదఛాయలు అలముకున్నాయి. తణుకు గ్రామానికి చెందిన చారుమతిదేవికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె వికలాంగురాలు. మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. దుర్ఘటన స్థలాన్ని స్థానిక సిఐ సురేష్‌కుమార్ పరిశీలించారు. ఎస్‌ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ జాయింట్ డైరెక్టర్ గౌరీశంకర్
వీరవాసరం, మార్చి 20: రాష్ట్రంలో హెలెన్, లెహర్ తుపానుల కారణంగా రూ.360.46కోట్లు పంటనష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ అధికారులు తెలియచేశారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పేర్ని గౌరీశంకర్ తెలిపారు. తుపానుల కారణంగా సంభంవించిన పంటనష్టాల సమగ్రనివేదికను సత్వరమే కేంద్రప్రభుత్వానికి అందచేసి రైతాంగానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గురువారం వీరవాసరం మండలంలోని వీరవాసరం, మత్స్యపురి గ్రామాల్లో కేంద్రబృందం పర్యటించి గ్రామాల్లో రైతులను నష్టాలపై అడిగి తెలుసుకున్నారు. టీం లీడర్ డాక్టర్ పేర్ని గౌరీశంకర్‌తో పాటు బికె. బాత్లా, పంకజ్ త్యాగీలు పర్యటించి రైతులతో చర్చించారు. రాష్ట్రంలో హెలెన్, లెహర్ తుపానులపై నష్టాల అంచనాకు ఎనిమిది మంది సభ్యులతో బృందాన్ని కేంద్రప్రభుత్వం నియమించిందని, హెల్‌న్ తుపాను వల్ల 10 జిల్లాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయని, అందులో పశ్చిమ, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి గురువారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించి నష్టాలను పరిశీలించామన్నారు. శుక్రవారం హైదరాబాద్ చేరుకుని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్.నరసింహాన్ చర్చించి నష్టాల నివేదికను సమర్పిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 10 జిల్లాల్లో నష్టం రూ.344కోట్లు వాటిల్లిందని రాష్ట్రప్రభుత్వం తమ నివేదికలో కేంద్రానికి తెలియచేసిందన్నారు. అనంతరం గ్రామాల్లో రైతులు పిప్పళ్ళ సత్యనారాయణ, బోడపాటి రంగబాబు, కురెళ్ళ గణేష్‌రావు, కురెళ్ళ బాపూజీ తదితర రైతులు కేంద్రం బృందం సభ్యులకు తమ బాధలను చెప్పుకున్నారు. ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్దరైతులకు న్యాయం జరుగుతుందని, చిన్న రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. రెండోపంటకు సాగునీరు లేదని కేంద్ర బృందానికి తమ బాధలను విన్నవించుకున్నారు. సాగునీటి సమస్యపై స్పందించిన కేంద్రం బృందం టీం లీడర్ డాక్టర్ పేర్ని గౌరీశంకరరావు నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వీరవాసరం మండలంలోని మత్స్యపురి గ్రామంలో రెండోపంటకు నీరులేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ఈ గ్రామాన్ని సందర్శించి రెండవ పంటకు సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆదేశించారు. దీంతో రైతులు హార్షం వ్యక్తం చేసి కేంద్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కె.సత్యనారాయణ, డిఎంఅండ్‌హెచ్‌ఒ టి.శకుంతల, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీమన్నారాయణ, పంచాయితీరాజ్ ఎఇ కె.వేణుగోపాల్, విద్యుత్‌శాఖ డిఇఇ పి.నాగేశ్వరరావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆధిపత్య ఆరాటం
కార్పొరేషన్ కాదు కామధేనువు
ఏలూరు, మార్చి 20: కామధేనువు లాంటి కార్పోరేషన్... ఆకర్షణీయమైన ఆర్ధిక వనరులు... అందరి చూపు కార్పోరేషన్‌పైనే... ఎన్నికల్లో ఆధిపత్యం చాటుకోగలిగితే ఆర్ధిక వనరులపై పట్టు చిక్కినట్లే... సుమారుగా కార్పోరేషన్ బడ్జెట్ 25కోట్ల రూపాయల పైమాటే... దీనిలో ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు అందరి పర్సంటేజీలు 10శాతం పైమాటే. అంటే బడ్జెట్‌లో దాదాపు 2.5కోట్ల రూపాయలు. నోరూరించే ఫిగర్... ఎవరు మాత్రం వదులుకుంటారు... ప్రజాసేవ ముసుగులో లక్షలు కుమ్మరించి కార్పోరేటర్లుగా విజయం సాధించేందుకు బరిలో నిలిచారు. రానున్న అయిదేళ్లలో బడ్జెట్ మరింత పెరిగే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఆమేరకు ప్రతిఫలం కూడా పెద్దగానే సమకూర్చుకోవచ్చు. దీంతో కార్పోరేషన్‌పై పట్టుకు ప్రధాన పార్టీ నేతలు దృష్టిసారించారు. వీలైనంత మంది ఎక్కువ అనుచరులను గెలుపించుకుని కౌన్సిల్ తమ కనుసన్నల్లో నడిచేలా వ్యూహరచన చేస్తున్నారు. కౌన్సిల్ ద్వారా అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు.
కార్పోరేషన్ అంటే అధికారులకు, కాంట్రాక్టర్లకు కామధేనువు వంటిదని చెప్పవచ్చు. ప్రజాప్రతినిధులు, కార్పోరేటర్లకు కల్పవృక్షం. అందుకే వీరు గద్దల్లా వాలుతున్నారు. కోట్ల రూపాయల్లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి గ్రాంట్లు వస్తుంటే, ఇక ప్రజల నడ్డి విరిచి తెచ్చే కోట్ల రూపాయల పన్నులు, ఆర్ధిక సంస్ధల నుంచి వచ్చే అప్పులు ఏడాదికి 25కోట్ల రూపాయలపైనే ఖజానాకు జమ అవుతున్నాయి. 2005లో కార్పోరేషన్‌గా అవతరించిన తర్వాత కార్పోరేషన్‌లో జరిగే తంతును చూసిన చాలామంది దానిపై రాజకీయ ఆధిపత్యం సాధించేందుకు రాజకీయనాయకులు ఆరాట పడుతున్నారు. అడ్డదార్లు తొక్కయినా గెలవాలని వెంపర్లాడుతున్నారు. ఆపై కార్పోరేటర్లుగా, ప్రజాప్రతినిధులుగా అవతారం ఎత్తి ప్రజలపై పెత్తనం చెలాయించేందుకు, పేదల నెత్తిన పన్నుల మొట్టికాయలు వేసేందుకు పోటీలు పడుతున్నారు.
అంతా అధినాయకుల చలువే...
అధినాయకుల చలవతో అనుకోకుండా అందివచ్చే పదవులను అడ్డుపెట్టుకుని నగరంలో సెటిల్‌మెంట్లు, అక్రమవ్యాపారులకు తెగ బడుతున్నారు. ఇలా కోట్ల రూపాయలకు పడగలెత్తిన కొందరు నేటి ఎన్నికల్లో కూడా గెలుపుకోసం పోరాడుతున్నారు. నాయకులు అక్రమ దినచర్యలకు ఒకటే తారకమంత్రంగా అనుంగులను కార్పోరేషన్‌లో ఏజెంట్లుగా చొప్పించేందుకు యత్నిస్తున్నారు. కొందరు నాయకులు స్వప్రయోజనం కోసం అడ్డగోలు తీర్మానాలు కూడా చేయించుకుని ప్రజల సొమ్మును సొంత ఖజానాలకు దారి మళ్లించుకుంటున్నారు. అపై ముఖ్య నాయకుల చలువతో కార్పోరేటర్లే కాంట్రాక్టర్ల అవతారం కూడా ఎత్తేస్తున్నారు. అధికార నిర్ణయాలకు తిలోదకాలిప్పిస్తూ సొంత తీర్మానాలతో కౌన్సిల్‌లో పెత్తనం సాగిస్తున్నారు. నీకు ఎన్నికల్లో సీటిచ్చా.. ఇక నీవు ఏమన్నా చేసుకో... నాపనులు సజావుగా సాగేలా చూడు... అన్నట్లు సంకేతాలు ఉంటున్నాయి. గత కౌన్సిల్‌లో కూడా అధినాయకులకు అనుకూలమైన తీర్మానాలు కౌన్సిల్ ద్వారా చేయించడానికి నానాతంటాలు పడిన సందర్భాలున్నాయి. అంతేకాకుండా పేదలకు అందాల్సిన పింఛన్లను కొంతమంది కార్పోరేటర్లు, మరికొంతమంది కార్పోరేషన్ సిబ్బంది కలిసి భోంచేసిన సంఘటనలు అందరికి తెల్సిందే. ఒక డివిజన్ పరిధిలో 25నుంచి 30వేల రూపాయల వరకు ఒక్కొ కార్పోరేటర్‌కు నెలకు అక్రమ సంపాదన వచ్చిందంటే అతిశయోక్తి కాదు. పలు పరిశీలనలలో ఈ విషయం బహిర్గతం అయినా చర్యలు శూన్యం. ఈవిధంగా అధికార పార్టీకి చెందిన పలువురు కార్పోరేటర్లు లక్షాధికారులు అయిపోయారంటే ఆశ్చర్యం కాదు. రోజుకు టికనా లేనివారు కూడా నేడు లక్షలు సంపాదించి ఫోజులు ఇవ్వటం నగరప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ఇక ఇందిరమ్మ గృహాలు, డ్వాక్రా రుణాల విషయంలో కూడా పెద్దఎత్తున గోల్‌మాల్ జరిగింది.
నగరం స్వర్గ్ధామం కాదా...
అందివస్తున్న నిధులు దుర్వినియోగం కాకుండా సక్రమంగా వినియోగించగలిగితే, అభివృద్ధికి బంగారుబాటలు వేస్తే నగరం స్వర్గ్ధామంగా మారేందుకు ఎక్కువ సమయం పట్టదు. దీర్ఘకాలిక సమస్యలుగా ఉన్న ఎన్నింటినో పూర్తిచేసేందుకు వీలుకలిగేది. కానీ కోట్లు కమీషన్ల పంపకాలుగా పోతుంటే ఇక నగరం అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని ప్రజలు అంటున్నారు. కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల నుంచి ఏడాదికి కోట్ల రూపాయల్లోనే గ్రాంటుగా కార్పోరేషన్‌కు జమ అవుతుంది. ఇక పన్నులు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా కూడా కోట్ల రూపాయలు కార్పోరేషన్ ఖజానాకు జమ అవుతాయి. ప్రభుత్వ సంస్ధల నుంచి వివిధ పన్నుల రూపంలో వచ్చే మొత్తాలు కూడా అధికంగానే ఉంటాయి. ఇక హడ్కో, ఆర్ధిక సంస్ధలు, బ్యాంకులు, ప్రపంచబ్యాంకు వంటి సంస్ధల నుంచి తెచ్చే అప్పులు గురించి చెప్పనవసరం లేదు. ఈ మొత్తాలకు సంబంధించి కమీషన్ల రూపంలోనే అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు బొక్కేందుకు కోట్ల రూపాయలే అందుబాటులో ఉంటాయి. ఈ భవిష్యత్‌ను ఊహించుకునే కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపుకోసం అభ్యర్ధుల ఆరాటం, వారిని గెలిపించుకునేందుకు నాయకుల పోరాటం.

24న ‘్భమవరం ప్రతిజ్ఞ’
*ఎన్నికల అధికారి బాలస్వామి
భీమవరం, మార్చి 20: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు, ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు మార్చి 24వ తేదీన 3్భమవరం ప్రతిజ్ఞ2 కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు ఎన్నికల అధికారి బి.బాలస్వామి గురువారం చెప్పారు. మార్చి 30వ తేదీన మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనున్నాయన్నారు. ఈ నేపధ్యంలో జరిగే పోలింగ్‌లో ఓటర్లను రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురిచెయ్యకుండా ఉండేందుకు చైతన్యవంతమైన కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని ఎన్నికల అధికారి తెలిపారు. మార్చి 21వ తేదీ నుంచి పట్టణంలోని 39 వార్డుల్లోని కళాజాతాలు పర్యటిస్తాయన్నారు. నీతివంతమైన ఓటు వేసి మంచిపాలకులని ఎన్నుకోవాలని కళాజాతాలు వీధి నాటికల ద్వారా ఓటర్లలో చైతన్యం తీసుకువస్తారన్నారు. 22వ తేదీన పట్టణంలో ఓటును నోటుకు అమ్ముకోకుండ ఉండాలని ప్రజలకు తెలియచేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటుచెయ్యడం జరిగిందన్నారు. 23వ తేదీన 10కె వాక్‌ను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి వివరించారు. ఇది కూడా ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు వినూత్నరీతిలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కార్యక్రమాలను ఏర్పాటుచేసామని చెప్పారు. ఇక మార్చి 24వ తేదీన జరిగే భీమవరం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని పట్టణంలోని లక్షా 42 వేల మంది ప్రజలు వీరిలో1,02,725 మంది ఓటర్లు, వ్యాపారసంస్ధలు, విద్యార్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిజీ, బిఇడి తదితర కోర్సులను అభ్యసిస్తున్న వారందరూ ఉదయం 11 గంటల నుంచి 11.10 నిముషాల వరకు ప్రతిజ్ఞ చెయ్యాలని కోరారు.

27నుండి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
రీజనల్ మేనేజరు రామారావు
ఏలూరు, మార్చి 20: పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధుల సౌకర్యార్ధం ఈనెల 27నుండి ఏప్రిల్ 15వ తేదీవరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజరు రామారావు తెలిపారు. పాలకొల్లు నుండి దొడ్డిపట్ల వరకు ఉదయం 6.25, 7.05, 7.45 వరకు, తణుకు నుండి ఇరగవరం వరకు ఉదయం 6.15, 7గంటలకు బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. పెనుగొండ నుండి సిద్దాంతం వరకు ప్రతి 10నిముషాలకు, మార్టేరు-ఆచంట-కొడమంచిలికి ఉదయం 6.30, 7.30గంటలకు బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. పాలకొల్లు-వీరవాసరం-్భమవరంనకు ప్రతి పది నిముషాలకు బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. నరసాపురం నుండి సీతారామపురం, కాళీపట్నం, పాతపాడులకు ఉదయం 5.45, 6.10, 6.15, 6.30, 7.30గంటలకు, నరసాపురం నుండి ఎల్‌బిచర్లకు ఉదయం 6.30గంటలకు, నరసాపురం నుండి కొప్పర్రు, మత్స్యపురిలకు ఉదయం 6.15, 7.15 గంటలకు, వీరవాసరం నుండి కొణితివాడకు ప్రతి 20 నిముషాలకు నవుడూరు వరకు బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. వీరవాసరం, రాయకుదురుకు ఉదయం 7గంటలకు బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. ఏలూరు నుండి విజయరాయి, ధర్మాజీగూడెం, లింగపాలెం, చింతలపూడిలకు ప్రతి 15 నిముషాలకు బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. చింతలపూడి నుండి ప్రగడవరం, రంగాపురంలకు ఉదయం 7గంటలకు తిరిగి రంగాపురం నుండి మధ్యాహ్నం ఒంటిగంటకు బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. చింతలపూడి నుండి టి నర్సాపురం, బొర్రంపాలెంనకు ఉదయం 6గంటలకు, 7గంటలకు, చింతలపూడి నుండి లక్కవరంనకు ఉదయం 5.30గంటలకు, 7గంటలకు దేవులపల్లి జంక్షన్ నుండి లక్కవరంనకు బస్సులు తిరుగుతాయన్నారు. కామవరపుకోట నుండి తిమ్మాపురం, దొరసానిపాడు, ద్వారకాతిరుమల, పంగిడిగూడెం, పోలసానిపల్లి, భీమడోలుకు ఉదయం 7.15 నుండి, ద్వారకాతిరుమల నుండి ప్రతి 10నిముషాలకు బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. నారాయణపురం నుండి నిడమర్రు, చానమిల్లి, అడవికొలను, చిననిండ్రకొలనులకు ఉదయం 7గంటలకు బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. తాడేపల్లిగూడెం నుండి నల్లజర్ల, జంగారెడ్డిగూడెంలకు ప్రతి 15నిముషాలకు, కొవ్వూరు నుండి వేగేశ్వరపురం, తాళ్లపూడి, గూటాలకు ప్రతి 30 నిముషాలకు, కొయ్యలగూడెం నుండి పోలవరం వయా కన్నాపురం మీదుగా ప్రతి 30 నిముషాలకు, నిడదవోలు నుండి చాగల్లుకు ప్రతి 30 నిముషాలకు బస్సు సౌకర్యం ఉంటుందన్నారు.

ఏలూరు, మార్చి 20: ఈనెల 23న ఏలూరు రానున్న కాంగ్రెస్ నేతల బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డిసిసి అధ్యక్షులు, డిసిసిబి ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం) తెలిపారు. స్ధానిక డిసిసి కార్యాలయంలో గురువారం బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులతో ఆయన సమీక్షించారు. సీమాంధ్ర పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవితోపాటు ఇతర నాయకులు కూడా బస్సుయాత్రలో భాగంగా ఏలూరు చేరుకుంటారన్నారు. ఆరోజున స్ధానిక మర్చంట్స్ ఛాంబరు కళ్యాణమండపంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశామన్నారు. తొలుత డిసిసి కార్యాలయంలో దీన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించినప్పటికీ కార్యకర్తలతో చర్చించిన పిదప మర్చంట్స్ ఛాంబర్ కళ్యాణమండపంలో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుని పూర్వవైభవాన్ని సాధిస్తుందని చెప్పారు. జిల్లాలో జరిగే బస్సుయాత్రను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు కమ్ముల కృష్ణ, రాజనాల రామ్మోహనరావు, కాటూరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
నిడదవోలు, మార్చి 20: బెంగుళూరు అమ్మాయి, నిడదవోలు అబ్బాయి ఒకటయ్యారు. పెద్దలు అంగీకరించరన్న భయంతో రహస్యంగా వివాహం చేసుకుని నిడదవోలు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే... బెంగుళూరుకు చెందిన చిట్టూరి దివ్యప్రతిమ (21) బెంగుళూరులో బికాం ఫైనలియర్ చదువుతోంది. నిడదవోలుకు చెందిన ఆర్నిపల్లి సాయిలక్ష్మణ్‌నాయుడు (22) నిడదవోలు రైల్వేస్టేషన్ సెంటరులో సిద్ధివినాయక సెల్ షాపు యజమాని. వీరిద్దరూ రామచంద్రపురంలో 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు. అప్పటి నుండి వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రతిమ తండ్రి సత్యనారాయణమూర్తి వ్యాపారం రీత్యా ఆమె కుటుంబం బెంగుళూరు వెళిపోయారు. నెల క్రితం ప్రతిమ కాకినాడలోని ఆమె బంధువుల ఇంటికి వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిరువురు ఫోన్‌లో మాట్లాడుకుని బుధవారం రాత్రి అన్నవరం వెళ్లిపోయారు. అక్కడ వివాహం చేసుకుని గురువారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయి తండ్రి ఒప్పుకోరన్న భయంతో వీరిరువురు పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరారు.

22న మోడి ఫర్ పిఎం
*వెంకయ్యనాయుడు రాక*్భరీఎత్తున ఏర్పాట్లు:బిజెపి నేతలు
ఏలూరు, మార్చి 20: పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న మోడి ఫర్ పిఎం కార్యక్రమంలో భాగంగా ఈనెల 22వ తేదీ శనివారం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు బిజెపి నేతలు తెలిపారు. బిజెపి జాతీయ నేత, రాజ్యసభ సభ్యులు ఎం వెంకయ్యనాయుడుతోపాటు సీమాంధ్ర ప్రాంత బిజెపి అధ్యక్షులు కంభంపాటి హరిబాబులు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా పాల్గొంటారన్నారు. స్ధానికంగా గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర మహిళామోర్చ అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, జాతీయ కిసాన్‌మోర్చా సభ్యులు పివి వర్మ, జాతీయ కార్యవర్గసభ్యులు కలపర్తి సీతారామశర్మ, పట్టణ అధ్యక్షులు నెర్సు నెలరాజు, నూతనంగా పార్టీలో చేరిన విద్యావేత్త కోనేరు సురేష్‌బాబు మాట్లాడారు. నరేంద్రమోడి నాయకత్వంలో దేశం అభివృద్ధిపదంలో ముందుకు వెళ్తుందని దేశ ప్రజలు పూర్తిస్ధాయిలో నమ్ముతున్నారని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి 272 స్ధానాల కన్నా అధికంగా గెల్చుకుని కేంద్రంలో సుస్ధిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనలో భాగంగా సీమాంధ్ర ప్రాంతానికి అనేక మేళ్లు కలిగేలా రాజ్యసభలో వెంకయ్యనాయుడు విశేష కృషి చేశారన్నారు. త్వరలో సీమాంధ్ర ప్రాంతంలో భారీ బహిరంగసభలు నిర్వహించటం జరుగుతుందని, వీటిలో నరేంద్రమోడి కూడా పాల్గొంటారని వారు తెలిపారు. ఈనెల 22వ తేదీన జరిగే బహిరంగసభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు.

ఆర్టీసీ డిపో ఎదుట ఎన్‌ఎంయు ధర్నా
జంగారెడ్డిగూడెం, మార్చి 20: సీమాంధ్ర ఆర్టీసీ కార్మికులపై యాజమాన్యం కక్ష సాధింపు చర్యలు విడనాడాలని డిమాండ్ చేస్తూ గురువారం భోజన విరామ సమయంలో డిపో ఎదుట డిపో నేషనల్ మజ్థూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో డిపో కార్యదర్శి కె.ఎం.రావు మాట్లాడుతూ 2013లో చేసిన జై సమైక్యాంధ్ర సమ్మె రెండు నెలల కాలానికి జీతం చెల్లిస్తామని ఇచ్చిన హామీని యాజమాన్యం పాటించడం లేదని ధ్వజమెత్తారు. ఈ నెల 20న ఒక నెల జీతం, మే నెలలో మరొక నెల జీతం చెల్లిస్తామని అంగీకరించిన యాజమాన్యం ఇప్పుడు సమ్మెకాల జీతం ఇవ్వం అని మొరాయించడం సీమాంధ్ర కార్మికులపై కక్షసాధింపేనని విమర్శించారు.
కష్టపడే తత్వాన్ని ఇష్టంతో అలవర్చుకోవాలి: దర్శకుడు గోపీచంద్
ద్వారకాతిరుమల, మార్చి 20: కష్టపడే తత్వాన్ని ఇష్టంతో అలవర్చుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని ప్రముఖ సినీ దర్శకుడు మలినేని గోపీచంద్ అన్నారు. చిన్న వెంకన్న ఆలయాన్ని గురువారం ఆయన కుటుంబ సమేతంగా సందర్శించి తన కుమారునికి అన్నప్రాశన కార్యక్రమం జరిపించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విఐపి లాంజ్‌లో ఆయన మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో ఎన్నో కష్టనష్టాలను చవిచూసి తాను ఈ స్థాయికి వచ్చానన్నారు. పదేళ్లు అసోసియేట్‌లో ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి తరువాత ఇవివి సత్యనారాయణ, శ్రీను వైట్ల, మురుగుదాస్‌ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానన్నారు. బాడీగార్డ్, డాన్ శ్రీను, బలుపు చిత్రాల ద్వారా తనకు మంచి పేరు వచ్చిందన్నారు. ప్రస్తుతం సినీ హీరో రామ్, హన్సికల కాంబినేషన్‌లో పండుగ చేసుకో అనే చిత్రాన్ని ఏప్రిల్ రెండోవారంలో ప్రారంభిస్తున్నాన్నారు. తరువాత దిల్‌రాజు సంస్థలో అల్లు అర్జున్‌తో చిత్రం ఉంటుందన్నారు. పవన్‌కల్యాణ్ రాజకీయ ఆరంగ్రేటంపై ఆయన మాట్లాడుతూ సినీ జీవితం తరువాత అందరూ రాజకీయాల్లోకి వెళుతుంటే, పవన్‌కల్యాణ్ సినీ జీవితాన్ని ప్రజాసేవకోసం వదులుకున్నారన్నారు. ఆయన ప్రసంగంలోనే నిజం, సామాన్యుడి ఆవేదన ఉందన్నారు.

నరసాపురం మండలంలో కేంద్ర బృందం పర్యటన
హెలెన్, లెహర్ తుపాన్ల నష్టాల అంచనా
నరసాపురం, మార్చి 20: గత ఏడాది సంభవించిన హెలెన్, లెహెర్ తుపాన్ల ధాటికి వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన బృందం గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించింది. కేంద్ర బృంద సభ్యులు పేర్ని గౌరీ శంకరరావు, బికె బాత్లా, పంకజ్ త్యాగీ ముందుగా స్ధానిక మునిసిపల్ కార్యాలయంలో సమాచార శాఖ తుపాను నష్టాలను వివరిస్తూ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్, ఆర్ అండ్‌బి, పంచాయితీ రాజ్, మత్యశాఖాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బృంద సభ్యుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ పేర్ని గౌరీ శంకరరావు మాట్లాడుతూ హెలెన్, లెహెర్ తుపాన్ల కారణంగా రూ.344 కోట్లు నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదించిందన్నారు. నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి కేంద్రం ఎనిమిది మంది సభ్యులతో బృందాన్ని నియమించిందన్నారు. ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉందన్నారు. వరి, ఉద్యానవన పంటలుతో పాటు రహదారులు, విద్యుత్, నీటి పారుదల శాఖల ఎక్కువగా నష్టపోయాయన్నారు. నివేదికను త్వరలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.
రూ.5కోట్ల నీలం పరిహారం మంజూరు
నీలం తుపాను కారణంగా సంభవించిన నష్టానికి సంబంధించి జిల్లాకు రూ.5 కోట్లు పరిహారం సొమ్ము మంజూరయిందని కేంద్ర బృంద సభ్యులు గౌరీశంకర్ తెలిపారు. మండలంలోని కొప్పర్రు గ్రామంలో కేంద్ర బృంద సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీఫణి బృందానికి వినతిపత్రం అందించారు. బృందం వెంట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు విడివి కృపాదాస్, ఆర్డీవో జె.ఉదయ భాస్కరరావు, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి కె.సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శకుంతల, ఆర్ అండ్ బి శాఖ, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ ఎస్‌ఇలు శ్రీమన్నారాయణ, కె.వేణుగోపాల్, సూర్య ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ పిసి విజయకుమార్, పంచాయితీరాజ్ డిఇఇ విజయకుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ డిఇఇ కృష్ణారెడ్డి, ట్రాన్స్‌కో డిఇఇ నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు భాస్కర్, మత్స్య శాఖ అధికారి కృష్ణానందం తదితరులు పాల్గొన్నారు.

* 46 జడ్పీటీసీ స్థానాలకు 391 * 903 ఎంపిటిసి స్థానాలకు 5426
english title: 
nominations

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>