విజయవాడ/ మచిలీపట్నం, మార్చి 20: జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. 49 జడ్‌పిటిసి స్థానాలకు గాను 422 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున 161 నామినేషన్లు దాఖలవ్వగా అత్యల్పంగా లోక్‌సత్తా, సిపిఐ (ఎంఎల్) పార్టీల తరఫున ఒక్కొక్క నామినేషన్ దాఖలయ్యాయి. టిడిపి తరఫున 146 నామినేషన్లు, కాంగ్రెస్ తరఫున 41 నామినేషన్లు, బిజెపి తరఫున ఎనిమిది నామినేషన్లు, బిఎస్‌పి తరఫున 11 నామినేషన్లు, సిపిఎం తరఫున 16 నామినేషన్లు, ఇండిపెండెంట్లుగా 36 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సిపిఐ పార్టీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం 41 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అత్యధికంగా తిరువూరు మండలానికి 19 నామినేషన్లు అందాయి. అత్యల్పంగా మొవ్వ, వీరుళ్ళపాడు మండలాల్లో నాలుగు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మండలాల వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఎ.కొండూరుకు ఏడు, ఆగిరిపల్లికి 13, అవనిగడ్డకు 13, బంటుమిల్లికు తొమ్మిది, బాపులపాడుకు ఏడు, చల్లపల్లికు తొమ్మిది, చందర్లపాడుకు తొమ్మిది, చాట్రాయికు తొమ్మిది, జి.కొండూరుకు ఏడు, గంపలగూడెంకు 14, కంకిపాడుకు 12, కోడూరుకు 11, కృత్తివెన్నుకు 10, మచిలీపట్నంకు తొమ్మిది, మండవల్లికి ఏడు, మోపిదేవికు 14, మొవ్వకు నాలుగు, ముదినేపల్లికు ఏడు, ముసునూరుకు ఎనిమిది, మైలవరంకు 11, కైకలూరుకు ఆరు, కంచికచర్లకు 10, గుడివాడకు ఎనిమిది, జగ్గయ్యపేటకు 10, గుడ్లవల్లేరుకు ఐదు, గూడూరుకు 12, గన్నవరంకు ఆరు, ఘంటసాలకు తొమ్మిది, ఇబ్రహీంపట్నంకు తొమ్మిది, కలిదిండికు ఐదు, రెడ్డిగూడెంకు ఎనిమిది, తోట్లవల్లూరుకు తొమ్మిది, తిరువూరుకు 19, ఉంగుటూరుకు ఏడు, వత్సవాయికు ఏడు, వీరుళ్ళపాడుకు నాలుగు, విజయవాడ రూరల్ కు ఐదు, విస్సన్నపేటకు తొమ్మిది, ఉయ్యూరుకు 12, నాగాయలంకకు ఆరు, నందిగామకు ఐదు, నందివాడకు ఏడు, నూజివీడుకు ఆరు, పామర్రుకు నాలుగు, పమిడిముక్కలకు ఎనిమిది, పెడనకు ఎనిమిది, పెనమలూరుకు తొమ్మిది చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాగా శుక్రవారం నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉప సంహరణ అనంతరం సోమవారం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు.
కాంగ్రెస్ బస్సు యాత్రే అంతిమ యాత్ర: దేవినేని ఉమ
ఉయ్యూరు, మార్చి 20: సీమాంధ్రకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బస్సు యాత్ర ఆ పార్టీకి అంతిమయాత్ర అవుతుందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం మాజీ శాసనమండలి సభ్యుడు వై.వి.బి.రాజేంద్రప్రసాదు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసులు ప్రజలను ఇంకా మోసం చేయవచ్చని భావించడం అవివేకమన్నారు. కె.ఎల్.రావు వంటి మేధావులు ప్రాతినిథ్యం వహించిన విజయవాడ పార్లమెంటు స్థానానికి జగన్ ఆస్థుల కేసులో ముద్దాయి అయిన కోనేరు ప్రసాదును నిలబెట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నించడం విచారకరమన్నారు. పిల్ల కాంగ్రెసును గెలిపిస్తే జిల్లాకో చర్లపల్లి జైలు ఉద్భవిస్తుందని, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే జిల్లాకో హైటెక్ సిటీ వస్తుందన్నారు. తమ పార్టీ ఈ నెల 27న విజయవాడలో నిర్వహించనున్న ప్రజాగర్జనను మహిళా గర్జనగా పేరు మార్చామని, ఈ సభకు సుమారు 3లక్షల మంది హాజరుకానున్నారని తెలిపారు. రాజేంద్రప్రసాదు మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక మున్సిపాలిటీలను, మండల పరిషత్‌లతో పాటు జిల్లా పరిషత్‌ను కూడా కైవసం చేసుకుని చంద్రబాబుకు కానుకగా అందించనున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ఎస్.సి సెల్ కార్యదర్శి చేదుర్తిపాటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పేటలో కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన
జగ్గయ్యపేట, మార్చి 20: శుక్రవారం జగ్గయ్యపేట నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విస్తృతంగా పర్యటించనున్నట్లు జై సమైక్యాంధ్ర పార్టీ నియోజకవర్గ నేత పాటిబండ్ల వెంకట్రావు తెలిపారు. శుక్రవారం ఉదయం 10గంటలకు కిరణ్‌కుమార్ రెడ్డి జగ్గయ్యపేటకు విచ్చేస్తారని, ప్రచార రథం నుండి పట్టణ వీధుల్లో పర్యటించి మున్సిపల్ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలకు తరలివెళతారని పాటిబండ్ల తెలిపారు. తొలుత మాజీ సిఎం హెలికాఫ్టర్‌లో వస్తారని వార్తలు అందినా హైదరాబాదు నుండి కారులోనే జగ్గయ్యపేటకు రానున్నట్లు సమాచారం.
చంద్రబాబు పోరాటాల ద్వారా సాధించిందేమిటి..?
నూజివీడు, మార్చి 20: ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత తొమ్మిది సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాలు చేశారు. ఎన్నో గర్జనలు నిర్వహించారు. దీని ద్వారా సాధించిన ప్రగతి చెప్పాలని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావుడిమాండ్ చేశారు. స్వార్థ ప్రయోజనాలు, ఆర్థిక సంబంధాలే ప్రధాన లక్ష్యంగా పోరాటాలు జరుగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. గురువారం సాయంత్రం ఆయన నూజివీడులో విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అదేవిధంగా అటవీ శాఖకు చెందిన వేలాది ఎకరాల భూములు కూడా ఆక్రమణల్లో ఉన్నాయి. వీటి గురించి అధికార పార్టీలో ఉండి కూడా పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దీనికి కనీసం చంద్రబాబు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేవలం అర్థికాంశాలు, పార్టీ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పోరాటాలు చేశారే తప్ప ప్రజల ప్రధాన సమస్యలపై కాదని చెప్పారు. కేవలం కాంగ్రెస్ పార్టీ దుషిస్తూ, సమస్యలను తప్పుదారి పట్టించే విధంగా ఆయన పోరాటాలు చేశారని, దీని వెనుక పిరికితనం ఉందని ఆయన స్పష్టం చేశారు. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ ఆస్థులపై ఎందుకు పోరాటం చేయలేదని పాలడుగు ప్రశ్నించారు. దొంగల నాయకుడుగా చంద్రబాబు తయారు అవుతున్నాడని వ్యాఖ్యానించారు. పోరాటాల ద్వారా సాధించిన ప్రగతిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం, ఆర్థికాభివృద్ధి కోసం పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళుతుంటే చంద్రబాబు స్వాగతం పలకటం విడ్డూరంగా ఉందని అన్నారు. రాజకీయ పార్టీలు మారే వ్యక్తులకు పేదలతో కలసి బతకటం ఇష్టం ఉండదని, కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉండి, అక్రమార్జనద్వారా సంపాదించిన వ్యక్తులు నేడు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో వారికి కావాల్సిన ఎత్తుగడల కోసం పార్టీలు మారుతున్నారని ఆయన వివరించారు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రణాళికా సంఘం సూచన మేరకు ప్రణాళికలు తయారు చేస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా పేదల ఆర్థిక పరిస్థితులు మెరుగు అయ్యేందుకు అవసరమైన మార్గాలు అనే్వషిస్తూ ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా సమాజంలోని చిరువ్యాపారులు, మోటారు మెకానిక్‌ల ఆర్థికాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విద్య వైద్య రంగాలు, పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి కలుగుతుందని దీనిపై దృష్టి సారిస్తున్నామని పాలడుగు వెంకటరావు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ముందు నామినేషన్ వేసెయ్... తర్వాత చూద్దాం!
మైలవరం, మార్చి 20: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఒక ప్రహసనంగా సాగింది. మైలవరం మండలంలో మొత్తం 19 ఎంపీటీసి స్థానాలుండగా దాదాపు అన్ని స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీలు పడి నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని సిగ్మెంట్లలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు ఒకే స్థానానికి నామినేషన్ దాఖలు చేయటం గమనార్హం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి అనేక స్థానాల్లో లెక్కకు మించి నామినేషన్లు దాఖలు చేశారు. నేతల హామీలు లభించిన స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్‌లు దాఖలు చేయగా కొన్ని సిగ్మెంట్లలో పలువురు అభ్యర్థులు పోటీ పడగా వారిని బుజ్జగించేందుకు స్థానిక ఎమ్మెల్యే దూతలు, స్థానిక ద్వితీయశ్రేణి నేతలు అనేక పాట్లు పడాల్సి వచ్చింది. మన పార్టీ అధికారంలోకి వస్తుంది, నీకు ఫలానా పదవి ఇస్తాం దయచేసి విరమించుకోమంటూ తాయిలాలు హామీ ఇచ్చినా కొందరు ససేమిరా అంటున్నారు. మరోవైపు నామినేషన్ దాఖలుకు చివరి గడియలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల బుజ్జగింపులు కొలిక్కి రాకపోవటంతో చివరికి చేసేది లేక ముందు నామినేషన్లు వేసేయండి తర్వాత చూద్దాం అంటూ తమ పార్టీ నేతల్ని పురమాయించి పంపారు. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది కానీ బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. ఏయే వార్డుల్లో ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేశారు? ఎవరిని ఉపసంహరింపజేయాలనే దానిపై నేతలు తర్జన భర్జనలు పడుతున్నారు. ఈనెల 21న స్కూృట్నీ అనంతరం రంగంలో మిగిలిందెవరో తెలుసుకుని బుజ్జగింపులకు శ్రీకారం చుట్టాలని ద్వితీయశ్రేణి నేతలు చెబుతున్నారు.
ఎసిబి వలలో పంచాయతీ ఇఓ
రూ. 8వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
కైకలూరు, మార్చి 20: అవినీతి నిరోధక శాఖ వలకు ఓ అవినీతి చేప చిక్కింది. ప్రతి పనికి ఓ రేటును ఫిక్స్ చేసి లంచగొండితనంతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న పంచాయతీ అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే... కైకలూరు పంచాయతీ పరిధిలో ఉన్న ఏలూరు రోడ్డు పక్కన మండవల్లి మండలం చింతపాడుకు చెందిన సైదు ఆనందరావు మూడంతస్థుల బిల్డింగ్ నిర్మాణానికి గతంలో కైకలూరు మేజర్ పంచాయతీ నుండి అనుమతి తీసుకున్నాడు. అనుమతి తీసుకున్నాక గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే నిర్మాణ పనులు చేశారు. తర్వాత అనివార్య కారణాల వల్ల బిల్డింగ్ నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. తిరిగి బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పంచాయతీ ఇవో భవానీప్రసాద్‌ను అనుమతి ఇవ్వాలని వారం రోజుల క్రితం కోరారు. బిల్డింగ్ నిర్మాణానికి రెన్యువల్ సర్ట్ఫికెట్ ఇవ్వాలంటే రూ.20వేల లంచం ఇవ్వాలని ఇఓ డిమాండ్ చేశాడు. ఓ మధ్యవర్తి ద్వారా రూ. 8వేలు లంచం ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. పంచాయతీ ఇవో వ్యవహారశైలితో మనస్థాపానికి గురైన ఆనందరావు రెండు రోజుల క్రితం ఎసిబి అధికారులను ఆశ్రయించి విషయం చెప్పాడు. ఎసిబి అధికారుల సూచన మేరకు మధ్యవర్తి లైసెన్స్‌డ్ సర్వేయర్ జగన్నాధరరావు ద్వారా భవానీప్రసాద్ మండల పరిషత్ కార్యాలయం వద్ద లంచం తీసుకుని నోట్లను లెక్కించుకుని నీ దగ్గర ఉంచు... తర్వాత తీసుకుంటానని చెబుతుండగా అప్పటికే మాటు వేసిన ఎసిబి డిఎస్పీ విజయ్‌పాల్, సిఐ నాగరాజు, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు దాడి చేసి భవానీప్రసాద్‌ను పట్టుకున్నారు. లంచంగా ఇచ్చిన నోట్లపై భవానీప్రసాద్ వేలిముద్రలు స్పష్టంగా ఉండటంతో భవానీప్రసాద్, మధ్యవర్తి లైసెన్స్‌డ్ సర్యేయర్ జగన్నాధరావులపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను ఎసిబి అధికారులు విజయవాడలోని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. నిందితులను ఎసిబి కోర్టుకు హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
ముగిసిన జడ్‌పిటిసి నామినేషన్ల ఘట్టం
* 49 జడ్‌పిటిసి స్థానాలకు 422 నామినేషన్లు * తిరువూరు జడ్‌పిటిసి స్థానానికి అత్యధికంగా 19 నామినేషన్లు
మచిలీపట్నం, మార్చి 20: జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. 49 జడ్‌పిటిసి స్థానాలకు గాను 422 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున 161 నామినేషన్లు దాఖలవ్వగా అత్యల్పంగా లోక్‌సత్తా, సిపిఐ (ఎంఎల్) పార్టీల తరఫున ఒక్కొక్క నామినేషన్ దాఖలయ్యాయి. టిడిపి తరఫున 146 నామినేషన్లు, కాంగ్రెస్ తరఫున 41 నామినేషన్లు, బిజెపి తరఫున ఎనిమిది నామినేషన్లు, బిఎస్‌పి తరఫున 11 నామినేషన్లు, సిపిఎం తరఫున 16 నామినేషన్లు, ఇండిపెండెంట్లుగా 36 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సిపిఐ పార్టీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం 41 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అత్యధికంగా తిరువూరు మండలానికి 19 నామినేషన్లు అందాయి. అత్యల్పంగా మొవ్వ, వీరుళ్ళపాడు మండలాల్లో నాలుగు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మండలాల వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఎ.కొండూరుకు ఏడు, ఆగిరిపల్లికి 13, అవనిగడ్డకు 13, బంటుమిల్లికు తొమ్మిది, బాపులపాడుకు ఏడు, చల్లపల్లికు తొమ్మిది, చందర్లపాడుకు తొమ్మిది, చాట్రాయికు తొమ్మిది, జి.కొండూరుకు ఏడు, గంపలగూడెంకు 14, కంకిపాడుకు 12, కోడూరుకు 11, కృత్తివెన్నుకు 10, మచిలీపట్నంకు తొమ్మిది, మండవల్లికి ఏడు, మోపిదేవికు 14, మొవ్వకు నాలుగు, ముదినేపల్లికు ఏడు, ముసునూరుకు ఎనిమిది, మైలవరంకు 11, కైకలూరుకు ఆరు, కంచికచర్లకు 10, గుడివాడకు ఎనిమిది, జగ్గయ్యపేటకు 10, గుడ్లవల్లేరుకు ఐదు, గూడూరుకు 12, గన్నవరంకు ఆరు, ఘంటసాలకు తొమ్మిది, ఇబ్రహీంపట్నంకు తొమ్మిది, కలిదిండికు ఐదు, రెడ్డిగూడెంకు ఎనిమిది, తోట్లవల్లూరుకు తొమ్మిది, తిరువూరుకు 19, ఉంగుటూరుకు ఏడు, వత్సవాయికు ఏడు, వీరుళ్ళపాడుకు నాలుగు, విజయవాడ రూరల్ కు ఐదు, విస్సన్నపేటకు తొమ్మిది, ఉయ్యూరుకు 12, నాగాయలంకకు ఆరు, నందిగామకు ఐదు, నందివాడకు ఏడు, నూజివీడుకు ఆరు, పామర్రుకు నాలుగు, పమిడిముక్కలకు ఎనిమిది, పెడనకు ఎనిమిది, పెనమలూరుకు తొమ్మిది చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాగా శుక్రవారం నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం సోమవారం రంగంలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు.
అభ్యర్థులు, అనుచరులతో కిక్కిరిసిన ‘జిల్లా పరిషత్’
మచిలీపట్నం టౌన్, మార్చి 20: జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్‌దారులతో పోటెత్తింది. జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన వేలాది మందితో జడ్‌పి ప్రాంగణం కళకళలాడింది. నామినేషన్‌దారులతో జిల్లా పరిషత్ సమావేశ మందిరం కిక్కిరిసింది. జడ్‌పిటిసి పదవులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి రోజు కావటంతో భారీగా నామినేషన్‌దారులు తమ అనుచరులతో జిల్లా పరిషత్ కార్యాలయానికి తరలి వచ్చారు. అభ్యర్థుల తాకిడితో నామినేషన్లు స్వీకరించే అధికారులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే జడ్‌పి సమావేశ మందిరంలోకి అనుమతించారు. తొలి మూడు రోజుల్లో 112 నామినేషన్లు మాత్రమే దాఖలవ్వగా చివరి ఒక్క రోజునే అత్యధికంగా 310 నామినేషన్లు దాఖలవ్వడం విశేషం. అన్ని మండల జడ్‌పిటిసి పదవులకు చివరి రోజు నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 422 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి దాసరి సుదర్శన్ తెలిపారు. ఉదయం 11గంటల నుండి రాత్రి 8గంటల వరకు ఏకధాటిగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్‌దారులతో జిల్లా పరిషత్ కార్యాలయం తిరునాళ్ళ వాతావరణాన్ని తలపించింది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. జిల్లా పరిషత్ ప్రధాన ద్వారాన్ని మూసి వేసి అభ్యర్థులతో పాటు నలుగురు, ఐదుగురిని మాత్రమే లోనికి అనుమతించారు. కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డస్క్, చెట్ల కింద కూర్చుని అభ్యర్థులు నామినేషన్‌పత్రాలు పూరించారు. మధ్యాహ్నం భోజనం లేక అల్లాడిపోయారు. కనీసం తాగునీటి సౌకర్యాన్ని కూడా అధికారులు కల్పించడంలో విఫలమయ్యారని పలువురు ఆరోపించారు. కూర్చోవడానికి కూర్చులు లేక, తాగడానికి మంచినీళ్ళు లేక నానా అవస్థలకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థుల నామినేషన్ల దాఖలును ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపి కొనకళ్ళ నారాయణరావు పర్యవేక్షించారు. దేవినేని ఉమా చివరి వరకు ఉండి అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించి వెళ్ళారు.
తిరుపతమ్మకు పుట్టింటి పసుపు కుంకుమల సమర్పణ
పెనుగంచిప్రోలు, మార్చి 20: స్థానిక శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన గురువారం పుట్టింటి వారి పసుపు కుంకుమ సమర్పణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కన్నులపండువగా నిర్వహించారు. మండలంలోని అనిగండ్లపాడు గ్రామంలో ఉన్న అమ్మవారి పుట్టింటికి చెందిన వంశీయులు కొల్లా శ్రీనివాసరావు ఇంటి వద్ద పసుపుకుంకుమలకు వేదపండితులు, ఆలయ పూజారులు, అర్చకుల ఆధ్వర్యంలో చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ, కార్యనిర్వహణ అధికారి హనుమంతరావులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా ఇంటి నుండి బయటకు తీసుకువచ్చిన పసుపు కుంకుమ భరిణలను విద్యుత్ దీపాలు, పూలదండలతో అందంగా అలంకరించిన బండిపై ఉంచి ఊరేగింపుగా పెనుగంచిప్రోలుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పసుపు కుంకుమ బండ్ల ముందు అడుగడుగునా మహిళలు వార్లు పోస్తూ కొబ్బరికాయలు కొడుతూ తమ భక్తిని చాటుకోవడంతో పాటు మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనిగండ్లపాడులో 5గంటలకు సుమారు 200 బండ్ల ర్యాలీగా బయలు దేరిన పసుపు కుంకుమల ర్యాలీ పెనుగంచిప్రోలు అమ్మవారి ఆలయానికి చేరుకునే సమయానికి 8గంటల సమయం పట్టింది. జగ్గయ్యపేట సిఐ ప్రసన్నవీరయ్య గౌడ్, పెనుగంచిప్రోలు ఎస్‌ఐ నాగ ప్రసాద్‌లు పసుపుకుంకుమ బండ్లను ప్రత్యేక రోప్‌వే ద్వారా పెనుగంచిప్రోలుకు తరలించారు. కాగా అమ్మవారి చిన్న తిరునాళ్ల మహోత్సవాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పసుపుకుంకుమ సమర్పణ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. వీరు సాయంత్రం 4గంటల నుండే ఆలయం వద్ద ఉన్న సిసి రోడ్లపై కూర్చుని అమ్మవారి భక్తిపాటలు పాడుతూ పసుపుకుంకుమ బండ్ల రాకకై ఎదురుచూశారు. జగ్గయ్యపేట రాంకో సిమెంట్స్ ప్రెసిడెంట్ పిబి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలను ఇఇ వైకుంఠరావు, ఎఇఒ మేడా గోపాలరావు, చల్లా రామకృష్ణ ప్రసాద్, పాలకమండలి సభ్యుడు గంగూరి గోపి మురళి, స్వామి గోపాలరావు, సూరంపల్లి శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు బిక్కి నర్శింహరావు, అత్తులూరి అచ్చుతరావు, తదితరులు పాల్గొన్నారు. అలాగే జై సమైక్యాంధ్ర పార్టీ నియోజకవర్గ నాయకుడు పాటిబండ్ల వెంకట్రావు పసుపుకుంకుమ బండ్లను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నామినేషన్ వేసిన టిడిపి చైర్‌పర్సన్ అభ్యర్థిని ‘అనురాధ’
* హాజరైన టిడిపి అతిరధులు కొనకళ్ళ, దేవినేని, వర్ల
మచిలీపట్నం టౌన్, మార్చి 20: విజయవాడ పార్లమెంట్ మాజీ సభ్యులు గద్దె రామ్మోహనరావు సతీమణి గద్దె అనురాధ గురువారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తిరువూరు, కంకిపాడు, ఉంగుటూరు మండలాల జడ్‌పిటిసి పదవులకు ఆమె నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మూడు మండలాల్లో ఎక్కడి నుండైనా ఆమె పోటీ చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థినిగా అనురాధ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆమె తన కుమారుడు, కుటుంబ సభ్యులతో పాటు బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, టిడిపి జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి వర్ల రామయ్య, మాజీ జడ్‌పి చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, తిరువూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి బచ్చుల అర్జునుడుతో కలిసి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన కృష్ణాజిల్లా పరిషత్ చైర్మన్ పదవికి అధిష్ఠానం ఆదేశం మేరకు పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
సహచట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం ..
విస్సన్నపేట, మార్చి 20: సమాచార హక్కు చట్టం విషయమై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా సహచట్టం కమిషనర్ లాం తాంతియాకుమారి పేర్కొన్నారు. గురువారం ఆమె మండలంలోని నర్సాపురంలోగల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల రికార్డులను కులంకుశంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు వౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహించిన దాని విషయమై అడిగి తెలుసుకునేందుకు సహచట్టం ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా లేదా గ్రామంలో సమస్యల పరిష్కారంపై అధికారులకు విన్నవించిన వారు నిర్లక్ష్యం వహిస్తే సమాచార హక్కు చట్టం ద్వారా నిలదీసి అడగవచ్చని ఆమె స్పష్టం చేశారు. అతి తక్కువ ఖర్చుతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులపై కూడా అడిగే హక్కు సహచట్టం ద్వారా లభిస్తుందని అన్నారు. అనంతరం ఆమె విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజన పదార్థాలను పరిశీలించారు. నాణ్యమైన పదార్థాలను విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. వారానికి ఒక సారి పిల్లలకు సహచట్టంపై అవగాహన కల్పించాలని ప్రిన్సిపాల్ రమణమ్మను ఆదేశించారు. పాఠశాలలో 41/బి రిజిష్టరు నిర్వహించినట్లయితే పాఠశాల నిర్వహణ తీరుతెన్నులు, జమాఖర్చులు స్పష్టంగా రికార్డు చేసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థినిల తెలివితేటలపై పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. ప్రభుత్వం ఎన్నో వనరులను సమకూర్చి విద్య నేర్పుతున్నందువల్ల కష్టపడి ఉన్నత స్థితికి ఎదగాలని కోరారు.
ఉయ్యూరు గెలుపు చంద్రబాబుకు కానుక కావాలి:రాజేంద్ర
ఉయ్యూరు, మార్చి 20: ఉయ్యూరు నగర పంచాయతీని కైవసం చేసుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తొలి కానుకగా ఇచ్చేందకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని మాజీ శాసనమండలి సభ్యుడు వై.వి.బి.రాజేంద్రప్రసాదు పిలుపునిచ్చారు. ఉయ్యూరు నగర పంచాయతీకి పోటీలో ఉన్న అభ్యర్థులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్గ విభేదాలు విస్మరించి కార్యకర్తలను కలుపుకుంటూ విజయానికి చేరువకావాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలను నేరుగా కలసి ఓట్లు అభ్యర్థించాలని, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో దివంగత చలసాని వెంకటేశ్వరరావు(పండు) సతీమని చలసాని పద్మావతి మాట్లాడుతూ ప్రత్యర్థుల బలాన్ని అంచనావేసుకొని ప్రతి అడుగు ఆచితూచి వేసి విజయానికి చేరువకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి భీమవరపు పిచ్చిరెడ్డి, రాష్ట్ర పార్టీ ఎస్.సి విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి చేదుర్తిపాటి ప్రవీణు తదితరులు పాల్గొన్నారు.
గుడివాడ మున్సిపాలిటీలో హోరాహోరీ పోరు
గుడివాడ, మార్చి 20: గుడివాడ మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. పట్టణంలోని 36వార్డుల్లో అత్యధికంగా 20సీట్లను గెల్చుకుంటామని వైఎస్సార్‌సిపి, టిడిపిలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల బరిలో 109మంది అభ్యర్థులు మిగిలారు. వీరంతా ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మొత్తం 36వార్డుల్లో వైఎస్సార్‌సిపి, టిడిపి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీల్లో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయో ఆ పార్టీ అభ్యర్థులే చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులను చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం పార్టీలు మొత్తంగా 6స్థానాలకే పరిమితమయ్యాయి. ఈ మూడు పార్టీలకు గెలిస్తే కౌన్సిలర్ పదవులు మాత్రమే దక్కుతాయి. ఇక ఇండిపెండెంట్‌ల విషయానికొస్తే 31మంది అభ్యర్థులు వైఎస్సార్‌సిపి, టిడిపి అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వార్డుస్థాయిలో గెలుపు, ఓటమిలు స్వల్ప ఓట్లు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్‌ల భయం పట్టుకుంది. ప్రచారంలో ఇండిపెండెంట్ అభ్యర్థులను కట్టడి చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌సిపి, టిడిపిలకు సమానంగా లేక కొద్దిపాటి వ్యత్యాసంలో వచ్చినా ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే చాలా వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల విజయం కన్నా వారి వల్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయాలు తారుమారు అయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. అయినప్పటికీ వైఎస్సార్‌సిపి, టిడిపి నేతలు మాత్రం అత్యధిక స్థానాలను చేజిక్కించుకోవడం ద్వారా మున్సిపాలిటీ పగ్గాలు చేపడతామనే సంకేతాలు ఓటర్లకు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మారే అభ్యర్థుల బలాబలాలను బట్టి విజయావకాశాలు ఒక కొలిక్కి వస్తాయని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు.
22న మాజీ సిఎం కిరణ్‌కుమార్ పర్యటన
పెడన, మార్చి 20: ఈనెల 22న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి పెడన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివిఆర్ ఫౌండేషన్ అధినేత, జై సమైక్యాంధ్ర నాయకులు డా. వాకా వాసుదేవరావు ఈ విషయాన్ని గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో తెలిపారు. 9.30 గంటలకు గూడూరు నుండి ప్రారంభమయ్యే రోడ్ షో పెడనకు చేరుకుంటుంది. రైల్ గేటు సమీపంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం బస్టాండు సెంటరులో పబ్లిక్ మీటింగ్ ఉంటుందని తెలిపారు. మీటింగు తరువాత బల్లిపర్రు ఎస్టేటు సందర్శించి బంటుమిల్లి వెళతారని వివిఆర్ తెలిపారు.
కాంగ్రెస్‌ను ఎవరూ భూస్థాపితం చేయలేరు:దేవినేని అవినాష్
జగ్గయ్యపేట, మార్చి 20: కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఎవరి వల్లా కాదని ఆ పార్టీ యువనేత దేవినేని అవినాష్ తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. పట్టణంలో మాజీ వైస్ చైర్మన్ నూకల కుమార్‌రాజా సారథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవినేని అవినాష్ పలు కూడళ్లలో మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీ కనుమరుగు చేస్తామని కొందరు చేస్తున్న ప్రసంగాలు సుష్కవాగ్దానాలని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కుమార్ రాజా నివాసం నుండి సాగిన భారీ ర్యాలీ బలుసుపాడు రోడ్డు, మిట్టగూడెం, బాలికల హైస్కూల్, తదితర ప్రాంతాల గుండా సాగింది. ఈ కార్యక్రమంలో మాజీ యార్డ్ చైర్మన్ కర్నాటి అప్పారావు, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు గూడపాటి చిట్టెమ్మ, తదితర నేతలు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో వ్యక్తి నుంచి
రూ. 2.96 లక్షల స్వాధీనం
విజయవాడ , మార్చి 20: ఎన్నికల కమిషన్ నియమావళి అమలుపై నగర పోలీసు కమిషనరేట్ యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన సిబ్బందిని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం రవాణా, పంపిణీలపై నిఘా ఏర్పాటు చేసి నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన స్టాటిజికల్ సర్వే టీం (ఎస్‌ఎస్‌టి) సత్పలితాలిస్తోంది. తాజాగా నగరంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచార బృందంలోని ఓ వ్యక్తి నుంచి గురువారం సాయంత్రం లక్షల్లో నగదు స్వాధీనం చేసుకోడంతో ఎస్‌ఎస్‌టి పాత్ర కీలకమనే చెప్పాలి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రచార బృందంలో నగదు స్వాధీనానికి సంబంధించి మాచవరం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడవ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి వెంకట సత్యనారాయణ (అరవ సత్యం) ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గురువారం సాయంత్రం గుణదల గంగిరెద్దుల దిబ్బ గంగానమ్మగుడి ప్రాంతంలో అరవసత్యం తన బృందంతో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ప్రచారంలో డబ్బు పంపిణీ జరుగుతున్నట్లు ఎస్‌ఎస్‌టి బృందానికి, మాచవరం పోలీసులకు సమాచారం అందింది. దీంతో మాచవరం సిఐ సిహెచ్ మురళీకృష్ణారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లి విస్తత్ర తనిఖీలు చేపట్టిన మీదట ప్రచార బృందంలో ఉన్న గవర్నర్‌పేట మ్యూజియం రోడ్డుకు చెందిన చెరుకూరి విష్ణు ప్రసాద్(54) అనే వ్యక్తి వద్ద నుంచి రెండు లక్షల 96 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అరవసత్యం ఎన్నికల ప్రచారంలో ఓ వ్యక్తి నుంచి పోలీసు బృందం భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్న సమాచారం ఉన్నతాధికారుల దృష్టికి చేరగా మరోవైపు రాజకీయ పక్షాల్లో కలవరం మొదలైంది. ఇదే సమయంలో అరవసత్యంపై పోటీలో ఉన్న ప్రత్యర్థులకు చక్కటి అస్త్రం దొరికిందనే చెప్పాలి. నగదు స్వాధీనం చేసుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నగదు విషయమై ప్రశ్నించగా తాను వ్యవసాయదారుడినని, తనకు చెందిన మొక్కజొన్న పంట అమ్మగా వచ్చిన డబ్బు జేబులో పెట్టుకుని నేరుగా ప్రచారానికి వచ్చానంటూ సెలవిచ్చాడు. స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి ఏ విధమైన ఆధారాలు లేనందున నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయ పన్ను శాఖాధికారులకు పంపి విచారణ జరుపుతున్నారు.
విభజనతో ఉద్యోగశ్రీ తాత్కాలికంగా వాయిదా!
విజయవాడ, మార్చి 20: సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డితో పోరాడి ఆపై చేతులు కలిపి సాధించుకున్న ఉద్యోగ ఆరోగ్య బీమా పథకం నేటికీ బాలారిష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగశ్రీ పేరిట ప్రారంభించిన ఈ పథకం కింద హెల్త్‌కార్డుల జారీ నేటికీ కొలిక్కి రాలేదు. ఈ పథకం అమలు కోసం మార్చి నెల జీతం నుంచి గెజిటెడ్ అధికారులయితే రూ.1200, నాన్ గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లయితే రూ.90లు చొప్పున మినహాయించాల్సి ఉంది. అయితే రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో పథకం అమలు భవిష్యత్‌లో ఎలా ఉంటుందోననే సంశయంతో తాత్కాలికంగా నెలవారీ చందా వసూళ్లను నిలిపివేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి గురువారం జీవో నెం.68 జారీ చేశారు. తరువాతి ఉత్తర్వులు వచ్చేవరకు ఉద్యోగులందరికీ గతంలో మాదిరిగా మెడికల్ బిల్లులకు రీయింబర్స్‌మెంట్ విధానం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ పథకం కింద 10లక్షల మంది ఉద్యోగులు, 10 లక్షల మంది పెన్షనర్లు లబ్ధిపొందాల్సి ఉంది.