గుంటూరు, మార్చి 20: జడ్‌పిటిసి, ఎంపిటిసి నామినేషన్ల ఘట్టం ఎట్టకేలకు ముగిసింది. చివరిరోజైన గురువారం జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. జడ్‌పిటిసిలకు సంబంధించి గురువారం ఒక్కరోజే 402 నామినేషన్లు దాఖలుకాగా, గత నాలుగురోజుల్లో మొత్తం 508 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 57 మండలాలకు గాను దాఖలైన నామినేషన్లలో అత్యధికంగా వైఎస్సార్ సిపి తరపున 201, టిడిపి 196, కాంగ్రెస్ 61, సిపిఎం 15, బిఎస్‌పి 11, సిపిఐ 3, బిజెపి 3, జనం పార్టీ తరపున ఒకరు, ఇండిపెండెంట్లుగా 17మంది నామినేషన్లు దాఖలుచేశారు. జడ్‌పిటిసిలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తున్న గుంటూరు జిల్లాపరిషత్ సమావేశపు హాలు, పరిసరాలు అభ్యర్థులు వారి మద్దతుదారులతో కిటకిటలాడాయి. ఎంపిటిసిలకు సంబంధించి ఆయా మండల కార్యాలయాల్లో కోలాహలంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. ఇదిలావుండగా తెలుగుదేశం పార్టీ తరపున జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా బోనబోయిన సుజాత అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆమె అమరావతి, భట్టిప్రోలు జడ్‌పిటిసి స్థానాల నుంచి గురువారం నామినేషన్లు దాఖలుచేశారు. సుజాత భర్త శ్రీనివాసయాదవ్ ప్రస్తుతం గుంటూరు నగర టిడిపి కన్వీనర్‌గా ఉన్నారు. ఆయన కూడా రేపల్లె జడ్‌పిటిసి స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. నిన్నమొన్నటి వరకు మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన బోనబోయిన సడన్‌గా జడ్‌పిపై కనే్నశారు. జడ్‌పి పీఠం బిసి మహిళకు రిజర్వ్ కావడంతో తన భార్య సుజాతతో నామినేషన్ దాఖలుచేయించారు. జిల్లాలోని పలువురు పార్టీ పెద్దల ఆశీస్సులతో ఆయన జిల్లాపరిషత్ వైపునకు మొగ్గుచూపినట్లు సమాచారం. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ తరపున దేవళ్ల రేవతి బెల్లంకొండ జడ్‌పిటిసి స్థానం నుంచి ఇప్పటికే నామినేషన్ దాఖలుచేశారు. పార్టీ అధినేత జగన్ ఈమెకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తమీద జిల్లాపరిషత్ పీఠమే లక్ష్యంగా టిడిపి, వైఎస్సార్ సిపి తమతమ అభ్యర్థులను రంగంలోకి దించడంతో స్థానిక ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.
ఇసుక టిప్పర్ ఢీకొని ఇంటర్ విద్యార్థిని దుర్మరణం
తెనాలి, మార్చి 20: ఇసుక టిప్పర్ ఢీకొన్న ఘటనలో సంఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డ ఇంటర్ విద్యార్థిని ఉదంతం స్థానిక ఐతానగర్‌లో గురువారం కలకలం రేపింది. ఐతానగర్ పేరంటాలమ్మ గుడి సమీపంలో నివాసముండే పాలేటి సుబ్బారావు, సునీత దంపతులకు కుమార్తె దీప్తి(17) దగ్గరలోని అమ్మమ్మ గారింటికి వెళ్ళి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఇసుక టిప్పర్ దీప్తిని ఢీకొట్టి వెనుక టైరు దీప్తి తలపైకి వెళ్ళడంతో సంఘటనా స్థలంలోనే దీప్తి మృత్యువాత పడింది. స్థానిక లింగారావు సెంటర్‌కు సమీపంలో చోటుచేసుకున్న ఈఘటన ఐతానగర్‌లో కలకలం రేపింది. ఓ ప్రైవేటు కళాశాలలో దీప్తి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అనుకోని ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదచ్ఛాయలు చోటుచేసుకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, ప్రజా సంఘాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, జరిగిన ఘోరంపై చలించిపోయారు. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న స్థానికులు దేహశుద్ధిచేసి, అతడ్ని పోలీసులకు అప్పగించారు. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అన్నాబత్తుని శివకుమార్, స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి బాలిక మృతదేహాన్ని సందర్శించి జరిగిన ఘోరాన్ని తెలుసుకుని, మృతురాలి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. టూటౌన్ సిఐ జి.లక్ష్మయ్య తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
హెలెన్, లెహర్ తుపాన్లకు
1.45 లక్షల హెక్టార్లలో పంటనష్టం
గుంటూరు, మార్చి 20: గతే ఏడాది గుంటూరు జిల్లాలో హెలెన్, లెహర్ తుపానుల బీభత్సం, భారీ వర్షాల వల్ల లక్షా 45వేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని కేంద్ర బృందం సభ్యులు తెలిపారు. గురువారం తెనాలి, కొల్లిపర మండలాల్లో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను ఎస్‌ఇ క్వాలిటీ కంట్రోల్ (హైదరాబాద్) ఎ కృష్ణప్రసాద్ నేతృత్వంలోని బృందం పరిశీలించింది. తెనాలిలోని ఐతానగర్, కొల్లిపరలో రైతులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గుంటూరుకు చేరుకున్న బృందం కలెక్టర్ సురేష్‌కుమార్, వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు, హెలెన్, లెహర్ తుపానుల వల్ల లక్షా 45వేల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, వరదల వల్ల 46వేల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని తెలిపారు. 92వేల మంది రైతులు నష్టపోయారని, వీరికి సుమారు 46.22 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ కింద అందాల్సి ఉందన్నారు. ఉద్యానవన పంటలకు సంబంధంచి 198 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతినగా 450 మంది రైతులు నష్టపోయారని, వీరికి 24.24 లక్షలు పెట్టుబడి రాయితీ కింద చెల్లించాల్సి ఉందన్నారు. వీటికి సంబంధించి నివేదికను మూడునెలల క్రితమే రాష్ట్రప్రభుత్వానికి పంపామన్నారు. జరిగిన నష్టాన్ని ప్రస్తుతం మరోసారి అంచనా వేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని, తద్వారా ఆర్థిక సహాయం త్వరగా రైతులకు అందేలా చూస్తామని ఆయన వివరించారు. బృందంలో పల్స్ డెవలప్‌మెంట్ డైరెక్టరేట్ (్భపాల్)కు చెందిన ఆర్‌పి సింగ్, రూరల్ డెవలప్‌మెంట్‌కు చెందిన కె రామవర్మ, తదితరులు ఉన్నారు.
బడ్జెట్ రూపకల్పనపై ప్రత్యేక దృష్టి
గుంటూరు (కార్పొరేషన్), మార్చి 20: గుంటూరు నగరపాలకసంస్థ బడ్జెట్ రూపకల్పనలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని నగరపాలకసంస్థ కమిషనర్ నాగవేణి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం తన ఛాంబర్‌లో నగరపాలకసంస్థ ఎగ్జామీనర్, వివిధ విభాగాధిపతులు, సూపరింటెండ్‌లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014-15కు సంబంధించి విభాగాల వారీగా ఇంజనీరింగ్, పట్టణప్రణాళిక, ప్రజారోగ్య, అభివృద్ధి పనులు, త్రాగునీరు, విద్యుత్, ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించి బడ్జెట్‌ను రూపకల్పన చేయాలన్నారు. సమస్యలను గుర్తిస్తూ వాటి పరిష్కారాలకు, అభివృద్ధిపనులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ సాయిశ్రీకాంత్, ఎస్ ఇ ఆదిశేషు, ఇ ఇలు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్, మేనేజర్ సత్యప్రసాద్, ఆర్ ఓలు ప్రసాద్, వెంకటరామయ్య, హెల్త్ సెక్షన్ సూపరింటెండెంట్ శివన్నారాయణ, ఇంజనీరింగ్ సెక్షన్ సూపరింటెండెంట్ మధు, ప్రజారోగ్యశాఖాధికారి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
తుఫాన్ వచ్చిన ఆర్నెల్లకు నష్టంచనాలా?
కొల్లిపర/తెనాలి రూరల్, మార్చి 20: హెలెన్, లెహర్ తుఫానుల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంటనష్టం అంచనాలను వేసేందుకు గురువారం కొల్లిపర వచ్చిన కేంద్ర బృందంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం తుఫాన్‌లు వచ్చి పంటను నష్టపరిస్తే ఇప్పుడు కేంద్ర బృందం వచ్చి పంట నష్ట వివరాలను ఎలా సేకరిస్తుందని ప్రశ్నించారు. నష్టం జరిగినప్పుడే ఈబృందం వస్తే ఖచ్చితమైన పంటనష్టం అంచనాలు వేసే వీలు కలిగేదన్నారు. ఈసందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ డైరెక్టర్ కె రామవర్మ మాట్లాడుతూ రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలో 3600హెక్టార్ల మేరకు పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారన్నారు. హెక్టారుకు 10వేల రూపాయలు పంటనష్టం ప్రకటించినా చాలటంలేదని రైతులు ఆయనకు వివరించారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేలా వరి వంగడాలను తయారుచేసే దిశగా కేంద్ర బృందం ప్రయత్నించాలని రైతులు సూచించారు. ఎకరాకు 10బస్తాల మేరకు వరి దిగుబడి తగ్గిందని, రైతులు బృందానికి వివరించారు. అనంతరం తెనాలి మండలం ఐతానగర్ పరిసర ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. పంట నష్టం అంచనాలపై అధికారులు, రైతులతో చర్చలు జరిపింది. రైతులు అధైర్యపడవద్దని, త్వరలోనే నష్టపరిహారం అందజేస్తామని అధికారులు బృందం రైతులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం హెక్టారుకు 10వేలు అందజేస్తామని ప్రకటించారని ఆ మొత్తం తమకు సరిపోదని రైతులు అధికారుల బృందానికి వివరించారు. వరి పడిపోయిన కారణంగా ఎకరాకు 3వేల వరకు మొత్తంగా ఎకరాకు 20వేల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోయారు. ఈనష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, నాలుగు మాసాల తరువాత పరిహారం అంచనాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌ఫోర్టు అధారిటీస్ డైరెక్టర్ ఎ కృష్ణప్రసాద్ , డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ ఆర్‌పి సింగ్, వ్యవసాయశాఖ జెడి శ్రీ్ధర్, ఆర్డీఓ ఎస్ శ్రీనివాసమూర్తి, హార్టీకల్చర్ అధికారులు చంద్రబాబు, దయాకరబాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
చికున్ గున్యాతో అన్నవరం వాసుల బెంబేలు
నూజెండ్ల, మార్చి 20: చికెన్‌గున్యా వ్యాధితో అన్నవరం గ్రామస్థులు బెంబేలెత్తిపోతున్నారు. తెల్లబాడు పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున మంచం పట్టారు. కీళ్ల నొప్పులు, వళ్లునొప్పులతో అల్లాడుతున్నారు. గత వారంరోజులుగా సుమారు 25మందికిపైగా వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన పైరుబోయిన రాములు, కొమ్మా కుమారి, వెలుగు రాగమ్మ, నారాయణ, కొమ్మా శ్రీనివాసరావు, వెలుగు శ్రీలక్ష్మి, అంకారావు, సుబ్బాయమ్మలతో పాటు మరికొందరు గున్యా వ్యాధితో అల్లాడుతున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టినా వ్యాధి అదుపులోకి రావడం లేదని రోగులు వాపోయారు. గ్రామంలో తాగునీటికోసం ఉపయోగిస్తున్న మంచినీటి ట్యాంకును శుభ్రపరచకపోవడంతో నీరు కలుషితంగా మారి రోగాల బారిన పడుతున్నామని బాధితులు తెలిపారు. అలాగే గ్రామంలో క్షీణించన పారిశుద్ధ్యం మరొక కారణమని చెప్తున్నారు. రోగాల బారిన పడినప్పటికీ వైద్యులు మా గ్రామంవైపు కనె్నత్తి చూడలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆరోగ్యశాఖ స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అవినీతిమయంలో రాజకీయ పార్టీలు
రేపల్లె, మార్చి 20: అవినీతి కంపులో రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయని, నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు పార్టీ టిక్కెట్లు కేటాయిస్తూ పార్టీలు తమపబ్బం గడుపుకొంటున్నాయని ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు ఎం శ్రీనివాసరావు అన్నారు. గురువారం స్థానిక అయోవా బాలికల పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపి సీట్ల కోసం అభ్యర్థులు 50-30కోట్ల వరకు పార్టీలకు ఫండ్ పంపే అభ్యర్థులకే టిక్కెట్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటుకోసం 100-1000వరకు బిర్యాని, మందు బాటిల్స్ ఓటర్లకు పంపిణీ చేస్తూ వారిని ప్రలోభపెట్టి తమ ఓట్లు గుంజుకుంటున్నారని ఆరోపించారు. కోట్ల రూపాయలు పార్టీలకు ఫండ్‌గా ఇచ్చిన రాజకీయ నాయకులు ఆ నగదను తిరిగి సంపాదించుకోవడానికి అవినీతి మార్గంలో నడుస్తున్నారని తెలిపారు. పాలకులు సేవ చేస్తామని ముందుకు వచ్చి పార్టీలకు అతీతంగానే వారు అనేక వక్రమార్గాల్లో నడుస్తున్నప్పటికీ పార్టీల హైకమాండ్స్ వారిని అదుపులో పెట్టడానికి తరం కావటంలేదని ఆయన ఆరోపించారు. స్వతంత్య్ర వచ్చి ఆరు దశాబ్ధాలు అవుతున్నా.. అభివృద్ధిలో మన రాష్ట్రంలో ఎంతో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లధనాన్ని పెకలిస్తేనే దేశ పురోభివృద్ధి సాధ్యవౌతుందని చెప్పారు. రాష్ట్ర విభజన జరగడానికి అనేక మంది రాజకీయ నాయకులు కారణమని తెలిపారు. రాజకీయ పార్టీలను జరుగనున్న ఎన్నికల్లో ఓటరు గుర్తెరిగి తమ అమూల్యమైన ఓటును మంచి సేవకునికే వేసి వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో ఆపార్టీ నాయకులు రమణబాబు, భాస్కర్, డిఎస్పీ, లోకేష్, జాన్‌బాబు, అనిల్‌కుమార్, రత్నబోస్, రామారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
78 ఎంపిటిసి అభ్యర్థులు నామినేషన్లు
నిజాంపట్నం, మార్చి 20: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గురువారం వరకు మొత్తం 78ఎంపిటిసి అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలుచేసినట్లు ఎన్నికల అధికారి ఏసుదాసు తెలిపారు. నామినేషన్ల చివరిరోజైన గురువారం ఒక్కరోజే 66నామినేషన్లు అందినట్లు ఆయన వివరించారు. అందులో వైఎస్‌ఆర్‌సిపి- 36, టిడిపి- 30, కాంగ్రెస్-17, ఇండిపెండెంట్లు -4మంది మొత్తం 78 నామినేషన్లు అందాయి. అభ్యర్థులు, వారి అభిమానులకు మంచినీటి సౌకర్యం అధికారులు కల్పించలేకపోవటంతో వారు ఇబ్బందులు పడ్డారు. టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తల మధ్య కొంత తోపులాట జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాల చెల్లాచెదురు చేశారు.
రేపల్లె మండలంలో 76నామినేషన్లు
రేపల్లె, మార్చి 20: స్థానిక ఎంపిటిసి ఎన్నికల్లో భాగంగా గురువారం వైఎస్‌ఆర్‌సిపి- 29, టిడిపి- 28, కాంగ్రెస్ -8, ఇండిపెండెంట్లు -11 మొత్తం 76మంది అభ్యర్థులు తమ నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి లక్ష్మానాయుడు వివరించారు.
నగరం మండలంలో 74మంది
నగరం, మార్చి 20: మండలంలోని ఎంపిటిసి నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసినట్లు ఎన్నికల అధికారి టివి సుబ్బారావు తెలిపారు. మండలంలో 18ఎంపిటిసిలకు 74నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో కాంగ్రెస్- 10, టిడిపి- 27, వైఎస్‌ఆర్‌సిపి- 30, ఇండిపెండెంట్లు -7 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వివరించారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ప్రారంభవౌతుందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ జ్యోతిర్మయి, ఇఓపిఆర్‌డి విజయలక్ష్మి, కాంతమ్మ తదితర అధికారులు పాల్గొన్నారు.
చుండూరు మండలంలో 66మంది
చుండూరు, మార్చి 20: మండలంలో మండల పరిషత్ ఎన్నికల చివరరోజు మొత్తం 66మంది నామినేషన్లు ఎంపిటిసిలుగా నామినేషన్లు దాఖలుచేశారు. వీరిలో వైఎస్‌ఆర్‌సిపి- 34, టిడిపి- 28, కాంగ్రెస్- 2, ఇండిపెండెంట్లు ఇద్దరు తమ నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి టి లావణ్య తెలిపారు. ఆలపాడు సెగ్నెంట్‌లో మండల వైఎస్‌ఆర్‌సిపి ఎంపిపి అభ్యర్థిగా వుయ్యూరి అప్పిరెడ్డి, నిన్నటివరకు కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షులుగా ఉన్న కుర్రి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ తరుపున ఎంపిపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేస్తున్న వెంకటరెడ్డి ఎంపిపి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ కనకదుర్గ్భావాని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చివరిరోజు 82 నామినేషన్లు దాఖలు
చెరుకుపల్లి, మార్చి 20: మండలంలోని 17ఎంపిటి, ఒక జెడ్పీటిసి స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ రోజైన గురువారం 82నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి పివి రమేష్‌కుమార్ తెలిపారు. టిడిపి- 37, వైఎస్‌ఆర్‌సిపి- 35, కాంగ్రెస్- 7, స్వతంత్య్ర అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్లు వేసినట్లు ఆయన తెలిపారు. చివరి రోజైనా గురువారం ఒక్కరోజే 71నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వివరించారు. శుక్రవారం ఎంపిటిసి కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగనున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ బి ప్రమీల, ఎంపిడిఓ మహబూబ్ సుభాని, ఇఓపిఆర్‌డి ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
15ఎంపిటిసి స్థానాలకు 106నామినేషన్లు
నూజెండ్ల, మార్చి 20: నామినేషన్లు ముగింపురోజైన గురువారం 15ఎంపిటిసి స్థానాలకు 95నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. ఒకానొకదశలో మద్దతుదారులను అదుపుచేసేందుకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం 11నామినేషన్లు దాఖలు కాగా గురువారం 95నామినేషన్లు అందినట్లు ఆయన తెలిపారు. నామినేషన్లు పూర్తి వివరాలు అందించేందుకు సమయం పడుతుందని ఎన్నికల అధికారి శ్రీనివాస్‌కుమార్ తెలిపారు.
68నామినేషన్లు దాఖలు
శావల్యాపురం, మార్చి 20: మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలకు 68 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి భాస్కరరావు గురువారం తెలిపారు. తెలుగుదేశం 33, వైయస్సార్‌సీపీ 22,కాంగ్రెస్ ఎనిమిది, స్వతంత్ర అభ్యర్థులుగా ఐదుగురు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.
సోలారుపై అవగాహనా, వస్తు ప్రదర్శన
నరసరావుపేట, మార్చి 20: డివిజన్‌లోని ప్రజలకు సోలార్ వినియోగంపై అవగాహనతో పాటు వస్తు ప్రదర్శన నిర్వహించనున్నట్లు నెట్‌క్యాప్ డైరెక్టర్ జి హరనాధబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవగాహన ఈనెల 22,23 తేదీల్లో నిర్వహించనున్నాట్లు పేర్కొన్నారు. ప్రదర్శన స్థానిక భువనచంద్ర టౌన్‌హాల్లో ఉదయం పది గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఉంటుందన్నారు. పట్టణ ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎంపిటిసిలకు 84 నామినేషన్లు
కొల్లిపర, మార్చి 20: మండలంలోని 16ఎంపిటిసిలకు మొత్తం 84నామినేషన్ల దాఖలైనట్లు ఎన్నికల అధికారి రామకృష్ణారెడ్డి గురువారం తెలిపారు. కాంగ్రెస్- 28, వైఎస్‌ఆర్‌సిపి- 26, టిడిపి- 27, స్వతంత్రులు ముగ్గురు తమ నామినేషన్లు వేసినట్లు తెలిపారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపిటిసి అభ్యర్థులు తూములూరు అడ్డరోడ్ నుండి ప్రదర్శనగా వెళ్ళి నామినేషన్ దాఖలుచేశారు.
కోలాహలంగా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు
పిడుగురాళ్ళ, మార్చి 20: మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు చివరి రోజైన గురువారం కోలాహలంగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకు గానూ నామినేషన్లు దాఖలుచేసేందుకు ఆయా గ్రామాల నుండి అభ్యర్థులు పార్టీ శ్రేణులతో తరలివచ్చారు. మొత్తం ఎంపీటీసీ స్థానాలకు గానూ 88 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి బలరామమూర్తి తెలిపారు. వీటిలో టిడిపి నుండి 39, వైయస్సార్‌సీపీ నుండి 45, కాంగ్రెస్ ఒకటి, బిజెపీ ఒకటి, ఇండిపెండెంట్ రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.
77 నామినేషన్లు దాఖలు
బొల్లాపల్లి, మార్చి 20: ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ దాఖలుకు చివరిరోజైన గురువారం 77 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి సూర్యకుమార్ తెలిపారు. మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకు గానూ 110 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. వీటిలో వైయస్సార్‌సీపీ నుండి 45, టిడిపి నుండి 39, కాంగ్రెస్ నుండి 21, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.
గురజాల మండలంలో 128 నామినేషన్లు
గురజాల, మార్చి 20: నియోజకవర్గ కేంద్రమైన గురజాల మండలంలో ఉన్న 19 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేసరికి 128 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి డిజె బెన్నీ గురువారం తెలిపారు.
ఈపూరు మండలంలో 93 నామినేషన్లు
ఈపూరు, మార్చి 20: మండలంలోని ఎంపీటీసీ స్థానానికి గురువారం 61 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి శ్రీ్ధర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుండి 13మంది, వైయస్సార్‌సీపీ నుండి 35 మంది, తెలుగుదేశం పార్టీ నుండి 42మంది, స్వతంత్ర అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్లు దాఖలు చేసినట్లు శ్రీ్ధర్ తెలిపాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో పాటు శివశక్తి పౌండేషన్ అధ్యక్షురాలు గోనుగుంట్ల లీలావతి హాజరయ్యారు. ఈమేతో పాటు ఈపూరు మండల టిడిపి అధ్యక్షుడు రాపర్ల జగ్గారావు, మోదుగుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుండి ప్రజాచైతన్య భేరీ
గుంటూరు (రూరల్), మార్చి 20: రాబోయే ఎన్నికలకు డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛమైన నాయకులను ఎన్నుకోవాలని ప్రజా హక్కుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం జెఎసి కన్వీనర్ జొన్నలగడ్డ వెంకటరత్నం అధ్యక్షతన సిటీ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో మేధావులు, యువకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ 21వ తేదీ నుండి ప్రజాచైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయిల్ పేట నుండి ఉదయం 10 గంటలకు యాత్ర బయల్దేరి నగరంలోని అన్ని డివిజన్లలో యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో మిరియాల ప్రసాదరావు, గోపికుమార్, సిహెచ్ సత్యనారాయణ, బిసి సెల్ నాయకులు కస్తూరి సైదులు, పాశం రవీంద్రయాదవ్, సముద్రాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పెదనందిపాడులో పోటాపోటీగా నామినేషన్లు...
ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్
పెదనందిపాడు, మార్చి 20: గ్రామీణ ప్రాంతంలో ప్రారంభమైన రాజకీయ సందడి గురువారం పోటాపోటీగా దాఖలు చేసిన నామినేషన్లతో ఊపందుకుంది. మండలంలో 12 ఎంపిటిసి స్థానాలకు 45 మంది నామినేషన్లు వేశారు. ఇందులో 23 మంది టిడిపి, 20 మంది వైఎస్‌ఆర్ సిపి, ఇద్దరు స్వతంత్య్ర అభ్యర్థులున్నారు. ప్రత్తిపాడు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రాభవాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకునేందుకు కూడా ఒక్క నామినేషన్ సైతం రాష్ట్ర విభజన జరిగిన నేటి తరుణంలో లేకపోవడం పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో గమనార్హం. ఎంపిపి పదవిని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున పెదనందిపాడు-1,2 ఎంపిటిసి స్థానాలకు అక్కాతమ్ముడు ముద్దన రాజకుమారి, నర్రా బాలకృష్ణ తమ మద్దతు దారులతో కోలాహలంగా వచ్చి ఎండిఒ కార్యాలయంలో నామినేషన్ వేశారు. వైఎస్‌ఆర్ సిపి చెందిన అభ్యర్థులు ఎవరికి వారే నామినేషన్లు వేసి వెళ్లారు. కాకుమాను మండలంలో 13 ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి టిడిపి తరపున 30, వైఎస్‌ఆర్ సిపి 31 మంది, ఒక స్వతంత్య్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. కాగా పెదనందిపాడులో తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని మాజీ ఎంపిపి ఎన్ బాలకృష్ణ ప్రారంభించారు.
ఓపెన్ స్టేట్ బిలియర్డ్స్, స్నూకర్ పోటీలు
గుంటూరు (స్పోర్ట్స్), మార్చి 20: ఎల్‌విఆర్ అండ్ సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర ఓపెన్ బిలియర్డ్స్, స్నూకర్ పోటీలు జరగనున్నట్లు ఎల్‌విఆర్ అండ్ సన్స్ క్లబ్ కార్యదర్శి మొవ్వా చంద్రవౌళి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక క్లబ్ ఆవరణలో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో చంద్రవౌళి మాట్లాడారు. రాష్టవ్య్రాప్తంగా స్నూకర్ ఈవెంట్‌లో 123 ఎంట్రీలు, బిలియర్డ్స్‌లో 30 ఎంట్రీలు వచ్చాయన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, సౌత్ సెంట్రల్ రైల్వేస్, ఖమ్మం, సికింద్రాబాదు నుండి ప్రముఖ క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. ఈ పోటీలు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయని, గత ఏడాది స్నూకర్ విజేతలు ఐవి రాజీవ్ (కాకినాడ), శంకర్ (గుంటూరు), బిలియర్డ్స్ విజేతలు వెంకటేషం (రైల్వేస్), సింహాచలం (రైల్వేస్) పాల్గొననున్నారని తెలిపారు. క్రీడాకారులకు ఎల్‌విఆర్ అండ్ సన్స్‌క్లబ్ ఉచిత వసతి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు రాష్ట్ర పోటీలను నిర్వహించగా ఈ ఏడాది 6వ సారి ప్రతిష్ఠాత్మకంగా ఈ పోటీలు నిర్వహించ తలపెట్టామన్నారు. కార్యక్రమంలో ఎల్‌విఆర్ క్లబ్ అధ్యక్షుడు అంచె మారుతీవరప్రసాద్, ఉపాధ్యక్షుడు వెంకటరత్నం, కొమ్మినేని వెంకటేశ్వర్లు, తాతినేని పాండురంగారావు, చిన్నం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు
పొన్నూరు, మార్చి 20: ఎన్నికల నిబంధనలను అతిక్రమించి వ్యవహరించవద్దని, ఎన్నికల మార్గదర్శకాలను పాటించాలని మున్సిపల్ కమిషనర్ అన్నవరపు వెంకటేశ్వర్లు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి పబ్లిక్ ప్రాంతాల్లో బ్యానర్లు ఏర్పాట్లు, ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించినా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొన్నూరు మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు కౌన్సిల్ హాలులో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఎన్నికల నిబంధనలు, ఖర్చుల విషయమై సూచనలు చేశారు. ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసిన నాటి నుండి అభ్యర్థులు చేసిన ఖర్చు వివరాలను ఏరోజుకారోజు తెలపాలన్నారు. ఎన్నికల ఖర్చుల వివరాలు తెలపకపోతే వారు గెలిచినప్పటికీ అనర్హులుగా ప్రకటిస్తామన్నారు. ఎన్నికల ఖర్చుల్లో తప్పుడు లెక్కలు చూపవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన షాడో మొబైల్ టీంలు ఖర్చులు నమోదు చేస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదని వెంకటేశ్వర్లు వివరించారు. అర్బన్ సిఐ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై దుష్ప్రచారాలు చేయడం, గొడవలు, అల్లర్లకు దిగడం చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అనుమతి లేకుండా వాహనాలకు స్టిక్కర్లు అంటించుకుని తిరగవద్దని, రాత్రి 10 గంటల దాటిన తర్వాత ప్రచారాలు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. తహశీల్దార్ ఉమాదేవి మాట్లాడుతూ ఓటరు స్లిప్‌లను పార్టీ అభ్యర్థులకు పంచే అవసరం లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిఎల్‌ఒలే స్లిప్‌లను అందజేస్తారన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అభ్యర్థులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మున్సిపల్ మేనేజర్ కెవిఎస్‌ఎన్ శర్మ, ఎఒ శిరీషారెడ్డి, అర్బన్ ఎస్‌ఐ చరణ్ తదితరులు పాల్గొన్నారు.