శ్రీకాకుళం, మార్చి 20: రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ సీమాంధ్రలో జవసత్వాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అధిష్ఠానం నిస్తేజంలో ఉన్న పార్టీలో కొంతమేరకైనా జోష్ నింపాలనే లక్ష్యంతో నేటి నుండి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలో సీమాంధ్ర పిసిసి చీఫ్ రఘువీరా, చిరంజీవి, బొత్స, ఆనం తదితరులు హాజరుకానున్నారు. పుర, స్థానిక సమరంలో నామినేషన్ల ప్రక్రియలోనే ఉనికిని కోల్పోయిన పార్టీకి ఆక్సిజన్ అందించేందుకు ఈ బస్సు ఎంతవరకు దోహదపడు తుందోనన్న ఆసక్తి నెలకొంది. అయితే మంచి శకునాలకు సిక్కోలు సెంటిమెంట్ కలివస్తుందని రాజకీయ పక్షాల విశ్వాసం. చిరంజీవి రాజకీయ ప్రవేశంలోను, దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కూడా రెండు పర్యాయాలు అధికారం దక్కించుకోవడంలో సిక్కోలు సెంటిమెంటే కలిసొచ్చింది. ఇదే ఫార్ములాను కాంగ్రెస్ అమలుచేసేందుకు నడుంబిగించింది. కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అరకొర కేడర్‌లో ఆత్మస్థైర్యం నింపడమే కాకుండా సీమాంధ్ర ప్యాకేజీతో జనంలో విశ్వాసం చూరగొనేందుకు ఈ బస్సు యాత్రకు తెరలేపారు. జిల్లాలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కేంద్ర మంత్రి కృపారాణి, రాష్ట్ర మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ సారధ్యంలో పది నియోజకవర్గాలో ఈ బస్సుయాత్ర కొనసాగేలా కార్యక్రమాన్ని రూపొందించారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీపై సామాన్యులు సైతం అక్కసును పెంచుకోగా,..జెండాను నమ్ముకున్న కేడర్ అంతా మిగిలిన ఆ రెండు పార్టీల వైపు వలసబాట పట్టారు. ఇంతలో స్థానిక ఎన్నికలు వచ్చిపడటంతో అటు ఓటర్లు, ఇటు కేడర్ తీరిక లేకుండా గడపాల్సిన ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి రాజకీయ కోలాహాలం నడుమ కాంగ్రెస్ బస్సుయాత్ర అధిష్టానం ఆశించిన ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు జిల్లాలో కనిపించడం లేదు. జిల్లా పరిషత్ ప్రాదేశికాలు 38 ఉండగా కేవలం ఎనిమిది మంది మాత్రమే ఆ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం, మండల పరిషత్ ప్రాదేశికాలు 675 ఉండగా 50 మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్లు వేయడం ఈ పార్టీ పరిస్థితి జిల్లాలో ఎలా తయారైందో ఇట్టే అర్ధమవుతోంది. ఇటువంటి స్థితిలో బస్సుయాత్ర అభాసుపాలవుతుందని రాజకీయ విశే్లషకులు సైతం సుస్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ బస్సుయాత్రను సిక్కోలు వాసులు స్వాగతిస్తారో..తిరస్కరిస్తారో వేచిచూడాలి మరి.
ముగిసిన నామినేషన్ల ఘట్టం
శ్రీకాకుళం, మార్చి 20: జిల్లాలో మండల ప్రాదేశిక, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులకు నిర్వహించనున్న ఎన్నికలకు గాను గురువారం సాయంత్రం ఐదు గంటలతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. జిల్లా పరిషత్ ప్రాదేశికాలకు సంబంధించి గురువారం నాటికి 296 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం పార్టీ తరుపున 110 నామినేషన్లు దాఖలు కాగా వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున 121 నామినేషన్లు అందాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన పుణ్యమాని అభ్యర్థులు లేక 23మందితో సరిపెట్టుకోవలసి వచ్చింది. బిఎస్‌పికి రెండు, బిజెపికి 12 మంది, సిపిఐ, సిపియం పార్టీలకు 14మంది, లోక్ సత్తా పార్టీకి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయగా ఇండిపెండెంట్లు 12 మంది నామినేషన్లు వేశారు. కాగా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసేందుకు జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో జెడ్పీ ఆవరణ కోలాహలంగా మారింది. పోలీసులు ముందస్తుగా పటిష్ట బందోబస్తు నిర్వహించి పోటీచేయు అభ్యర్థితో పాటు నలుగురును మాత్రమే లోపలికి విడిచిపెట్టడంతో జెడ్పీ రోడ్డు ఆయా వ్యక్తుల మనుషులతో నిండిపోయింది. దీంతో ట్రాఫిక్‌ను వేరే మార్గం గుండా మళ్లించారు.
అడవితల్లి దీవెన ఎవరికో?
శ్రీకాకుళం, మార్చి 20: విస్తారమైన అటవీప్రాంతం..అత్యంత పురాతనమైన మానవ సమాజ అవశేషం..వామపక్ష భావజాలం ఇంకా బలంగా కొనసాగుతున్న నియోజకవర్గం పాలకొండ. షెడ్యూల్ తెగలకు కేటాయించిన ఈ నియోజకవర్గం కొంతకాలం షెడ్యూల్ తరగతులకు కేటాయించారు. ఈ నియోజకవర్గం రాజకీయాలు అడవితల్లి బిడ్డల హక్కు అయినా, మైదాన ప్రాంతం నేతలే శాసిస్తారు. బహుశా అతి తక్కువ ఖర్చుతో గట్టేక్కే ఎమ్మెల్యే నియోజకవర్గం సీమాంధ్ర ప్రాంతంలో పరిశీలిస్తే పాలకొండది ప్రథమస్థానం. 1963 - 1978 కాలంలో శ్రీకాకుళం జిల్లాకు చరిత్రపుటల్లో ప్రాధాన్యత కల్పించిన శ్రీకాకుళ గిరిజన ఉద్యమ రణ క్షేత్రం ప్రధానభాగం పాలకొండ నియోజకవర్గమే. 1983 నుంచి తెలుగుదేశం ఏలుబడి కాలమంతా నిరాటంకంగా ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించారు పాలకొండ ఓటర్లు. నియోజకవర్గం సామాజిక కూర్పుని పరిశీలిస్తే షెడ్యూల్ తెగలలో సవర, జాలాపు, గదబ ప్రధానంగా కన్పిస్తాయి. వీటిల్లో సవరలు శ్రీకాకుళం ఏజెన్సీకి మాత్రమేకాక మొత్తం మానవ చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైనవారు. కాగా, జాతాపులు నాగరిక సమాజంతో అనుబంధం పెంచుకొని అవకాశాలను కొంతవరకు అందిపుచ్చుకున్నారు. గడచిన అన్ని ఎన్నికలలో వీరే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. గదలు చాలా తక్కువ సంఖ్యలో కన్పిస్తారు. ఇప్పటికి ఆదిమ దేవుళ్ళను, సంప్రదాయ వైద్యాన్ని, ఆశ్రయించి జీవిస్తారు సవరలు. సవరలకు ఎన్నికలలో ప్రాతినిధ్యం ఇచ్చిన మొదటి వ్యక్తి దివంగత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి. 2004 ఎన్నికలలో స్థానికేతురులైన మినతిగొమాంగో (సవర)కు కాంగ్రెస్ టిక్కెట్టు ఇవ్వటం వైఎస్సార్ చేసిన సాహసోపేతమైన నిర్ణయమనీ రాజకీయ పరిశీలకులు భావిస్తారు. దీంతో సవరల మధ్య ఐక్యమత్యం ఏర్పడి కాంగ్రెస్ అభ్యర్థి సునాయాసంగా విజయం సాధించింది. 2009 ఎన్నికల నాటికి ఆమె అభ్యర్థిత్వంకు వ్యతిరేక పవనాలు ఏర్పడి ఏజెన్సీ ప్రధాన కేంద్రంలో స్థానికుడైన నిమ్మక సుగ్రీవులును కాంగ్రెస్ టిక్కెట్టు వరించింది.
2009 ఎన్నికల నాటికి వీరఘట్టం ప్రాంతానికి చెందిన నిమ్మక కుటుంబం తెలుగుదేశం పార్టీలో గడ్డు పరిస్థితులో ఉంది. భామిని మండలం కలవడం, కొత్తూరు మండలం విడిపోవడంతో రాజకీయ సమీకరణాలు తెలుగుదేశంకి ప్రతికూలంగా మారాయి. కిమిడి కళావెంకటరావు ప్రజారాజ్యం బాట పట్టడంతో పాలకొండ, వీరఘట్టం లోని మైదాన ప్రాంతాలలో కాపు సామాజిక వర్గం టిడిపికి దూరమైంది. కలమట కుటుంబంతో సుదీర్ఘ వైరుధ్యం కూడా భామినిలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలిగానే మారింది. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి చవిచూసారు.
గత ఎన్నికల తర్వాత తొలి మూడేళ్ళు కాంగ్రెస్ పార్టీని పదిలంగా కాపాడుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే సుగ్రీవులు అనతికాలంలో జిల్లా కాంగ్రెస్ నాయకత్వంతో అంటిముట్టనట్టు మసలుకోవడం ప్రారంభించారు. హైకమాండ్‌లో పలుకుబడివున్న కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ గూటికి చేరిపోయారు. అంతేకాకుండా ధర్మానను టార్గెట్ చేసుకొని సాగిన కనె్నధార అంశంలో కూడా ఏదో ఒక వైఖరిని తీసుకోవడంలో విఫలమయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో కిశోర్‌చంద్రదేవ్ తెలంగాణ అనుకూల వైఖరి తీసుకోవడంతో సుగ్రీవులు కూడా రాష్ట్ర విభజనకు అనుకూలమన్న అభిప్రాయానికి జనం వచ్చేసారు. రోడ్డు ప్రమాదంలో తనయుడ్ని కోల్పోయినా ఆ సానుభూతి వచ్చే ఎన్నికల్లో సుగ్రీవులకు ఎంతవరకు పనిచేస్తుందో చూడాల్సివుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిక్కెట్టు రేసులో విశ్వాసరాయ కళావతి దాదాపు ముందున్నారనే ప్రచారం జరుగుతోంది. గడచిన పదేళ్ళలో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు ఆమె అందుబాటులో ఉండటం, ఆమె తండ్రి విశ్వసరాయ నరసింగరావు (వండవదొర) గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆమెకు కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. దీంతోపాటుగా ఏజెన్సీ ప్రాంతంలో పెరిగిన మైనారిటీల సంఖ్య కూడా వైకాపాకు అంతర్గతంగా దన్నుగా నిలుస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గూడల్లో, వాడల్లో రాత్రిళ్ళు సమావేశాలు జోరుగా సాగుతున్న ప్రచారం కొండకోనల్లో వినిపిస్తుంది. ఇప్పటికీ అంతర్గతంగా, బాహ్యంగా సర్దుబాట్లు పూర్తి చేసుకోలేని అశక్తిత తెలుగుదేశంలో ఉంటే, ఇటీవల ఆ పార్టీలోకి వస్తున్న వరుస వలసలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. ఇక కాంగ్రెస్ నిద్రలోంచి మేల్కొన లేదనే చెప్పాలి. మే 7న. జరిగే ఎన్నికల వేళకి ఎవరు ముందంజలోకి చేరుకుంటారో, విజయాన్ని వరిస్తారో ఆసక్తి కల్గిస్తున్న అంశం!
27న ప్రజాగర్జన
శ్రీకాకుళం, మార్చి 20: త్వరలో జరుగనున్న స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను విజయపథంలో నడిపించేందుకు వీలుగా ఈ నెల 27న జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన నిర్వహించతలపెట్టింది. ఈ కార్యక్రమానికి అధినేత చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ప్రజాగర్జన ద్వారా జిల్లాలో పార్టీకి మరింత ఊపువస్తుందని తెలుగుతమ్ముళ్లు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. పది నియోజకవర్గాల బాధ్యులు, ముఖ్య నాయకులతో సమావేశాన్ని కూడా గర్జన విజయవంతం కోసం నిర్వహించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించినట్లు తెలిసింది. జిల్లా నలుమూలల నుంచి ఈ గర్జనకు ముఖ్య నేతలంతా హాజరయ్యేలా వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 21న నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అధినేత బాబు దీనిని వాయిదా వేసిన విషయం విధితమే.
ఓటుహక్కు మరువకు..
పాతశ్రీకాకుళం, మార్చి 20: ప్రజాస్వామ్య విలువలను నిలిపే ప్రధానమైన ఓటు ప్రాధాన్యతపై ఎన్నికల కమిషన్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి సౌరభ్‌గౌర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్ల వద్ద భారీ కటౌట్లు, బేనర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో పాలకొండ రోడ్, జి.టి.రోడ్, పాతబస్టాండ్, ఏడురోడ్లకూడలి, ఆర్టీసి కాంప్లెక్స్, అరసవల్లి, పాతశ్రీకాకుళంలతోపాటు వివిధ వాహనాలపై కూడా బేనర్లను ఏర్పాటుచేస్తూ ఓటు ప్రాధాన్యతను వివరిస్తున్నారు. అదేవిధంగా ఓటర్లుగా నమోదుకు వచ్చే నెల పదోతేది వరకు అవకాశం కల్పించడంతో మరింత ఆసక్తికి, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల నిర్వహణ చరిత్రలో ఓటు విలువను తెలిపే ప్రచారం ఎన్నడూ జరుగలేదంటూ స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
పలాస వ్యాపారి హత్యకు కుట్ర
శ్రీకాకుళం, మార్చి 20: జిల్లాలో పలాసకు చెందిన వ్యాపారస్తుడు సంతోష్‌కుమార్ అగర్వాల్‌ను ముగ్గురు వ్యక్తులు హత్య చేసేందుకు కుట్రపన్ని పోలీసుల చేతికి చిక్కారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ నవీన్ గులాఠీ ఈ సంఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. పలాస రైల్వే కాలనీ ఇనిస్టిట్యూట్ వద్ద దేశవాళీ తుపాకితో డబ్బీరు తేజ అనే వ్యక్తి సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న కాశీబుగ్గ సిఐ నేతృత్వంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే విచారణలో తేలిన విషయాలతో పోలీసులు విస్తుపోయారు. పలాసకు చెందిన సంతోష్‌కుమార్ అగర్వాలా కుమారె్తైను తన అన్న చిరంజీవి ప్రేమించి బిలాస్ పూర్ తీసుకెళ్లి పెళ్లి చేసుకోగా, వారి సమాచారం తెలుసుకున్న అగర్వాలా తన కుమారె్తైను తీసుకెళ్లి కోల్‌కతాలోని తన బంధువుల ఇంటిలో ఉంచాడు. అక్కడ నుండి ఆమె తప్పించుకుని చిరంజీవి వద్దకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తమ్ముడు తేజతో అగర్వాలా ఘర్షణ పడటంతో తన పరువు పోయిందని భావించిన తేజ, తనతో ఘర్షణ పడిన అగర్వాలా, అతని అనుచరులు పాఠక్ మరో ముగ్గురుని చంపడానికి కుట్ర పన్నాడు. ఇందుకు తేజ తన స్నేహితులు సోమేశ్వరరావు, భాస్కరరావు సహాయం తీసుకొని ఖరగ్‌పూర్ వద్ద రూ.20వేలతో ఓ నాటుతుపాకీని కొనుగోలు చేశాడు. అనంతరం బుధవారం అర్థరాత్రి కాశీబుగ్గలోని అగర్వాలా ఇంటిముందు రెక్కీ నిర్వహించి హత్యకు పథకం రూపొందించుకునే ప్రయత్నంలో పోలీసులకు చిక్కాడు. తేజ, అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో తుపాకీ లభ్యమవడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారని, విచారణలో మరిన్ని వివరాలు తెలియగలవని తెలిపారు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్న కాశీబుగ్గ పోలీసులకు ఎస్పీ నగదు ప్రోత్సాహకం ప్రకటించారు.
హిజ్రాల్లో ‘ఓటు’ చైతన్యం!
శ్రీకాకుళం, మార్చి 20: ఉత్తరాంధ్ర జిల్లాల్లో 11,047 మంది హిజ్రాలకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కలిగింది. హిజ్రాలు ఓటు నమోదు కోసం కార్యాలయాల చుట్టూ తిరిగితే ఎదురయ్యే చులకన భావం, హేళనతో కూడిన వ్యాఖ్యలకు ఈసారి ఎన్నికల సంఘం ‘ఆన్‌లైన్’ విధానంతో చెక్‌పెట్టిందని చెప్పాలి. శ్రీకాకుళం జిల్లాలో 158 హిజ్రాలు ఓటు హక్కు పొందగా వారిలో 122 మంది ఆల్‌లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకున్నవారే! ఎన్నికల కమిషన్ దరఖాస్తుల్లో ‘ఇతరులు’ కాలమ్‌లో అవకాశం కల్పించి ఓటు హక్కు ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో పలాస, ఆమదాలవలస, ఇచ్చాపురం ప్రాంతాలతోపాటు చీపురుపల్లి, విజయనగరం రైల్వే స్టేషన్ల పరిధిలో గల 158 మంది హిజ్రాలకు ఓటు హక్కు వచ్చింది. కొనే్నళ్లుగా ఓటరుకార్డు, రేషన్‌కార్డు, ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశమే ఇక్కడ అధికారులు ఇవ్వలేదని పలువురు హిజ్రాలు వాపోయారు. దరఖాస్తులు పెట్టుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొవల్సివచ్చేదని, ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ‘ఆన్‌లైన్’లో ఓటు హక్కు నమోదు చేసుకున్నామంటూ భవానీ అనే హిజ్రా తెలిపింది.
ఆదిత్యుని సన్నిధిలో దేవాదాయ కమిషనర్
శ్రీకాకుళం, మార్చి 20: దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ వెలుగునంది ముక్తేశ్వరరావు గురువారం అరసవల్లి సూర్యనారాయణస్వామి వారిని దర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆ శాఖ జిల్లా ఇన్‌చార్జి, సహాయ కమిషనర్ శ్యామలాదేవి, ఆలయ ఇ.ఒ పుష్పనాధం ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతించారు. అర్చకులు పూర్ణకుంభంతో మేళతాళాలు మధ్య వేదమంత్రోచ్ఛరణలతో ఆహ్వానం పలికారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అనివెట్టి మండపం వద్ద ఆయనకు ఆశీర్వచనాలందించి తీర్ధప్రసాదాలందించారు.
ఆలయ సమస్యలపై విన్నపాలు..
ఎన్నికల కోడ్ పేరుతో విలేఖరులతో మాట్లాడటానికి నిరాకరించిన దేవాదాయ కమిషనర్, అర్చకులు, ఆలయ సిబ్బంది సమస్యలను విని స్పందించారు. ప్రధానార్చకులు శర్మ మరో ఐదుగురు అర్చకులు, పరిచారకులకు అనుమతిని కోరారు. ఆలయ ఆస్థాన సన్నాయి వాయిద్యం కళాకారుల భర్తీకి, సిబ్బంది పదోన్నతిపై ఆలయ ఇ.ఒ పుష్పనాధం వివరించిన అభ్యర్థనలకు ఆయన స్పందిస్తూ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
* ఆర్.ఐ.ఒ అన్నమ్మ
నరసన్నపేట, మార్చి 20: ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయని ఆర్.ఐ.ఒ అన్నమ్మ తెలిపారు. గురువారం స్థానిక జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియేట్ పరీక్షలను ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో 93 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామని, మొదటి ఇంటర్‌లో 26,453 మంది, ద్వితీయ ఇంటర్‌లో 23,799 మంది, ప్రైవేట్‌గా 3,782 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. అలాగే ఒకేషనల్‌కు సంబంధించి మొదటి సంవత్సరం 1396 మంది, రెండవ సంవత్సరానికి 2,030 మంది ప్రైవేట్‌గా 310 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొంటున్నారని వివరించారు. ఇప్పటివరకు మాస్ కాపీయింగ్ చేస్తున్న సుమారు పది మంది విద్యార్థులను డిబార్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్రావు, డెక్ మెంబర్ జి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
16 నుండి సార్వత్రిక దూరవిద్యా పరీక్షలు
రణస్థలం, మార్చి 20: పదోతరగతి, ఇంటర్ దూరవిద్యా సార్వత్రిక పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ నుండి జరుగుతాయని దూరవిద్యా సమన్వయకర్త శ్రీనివాస్‌నాయక్ తెలిపారు. ఈ మేరకు దూరవిద్య అభ్యర్థులు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సంప్రదించి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరారు.
నాయనమ్మ, మనవరాళ్ల సవాల్
*తమ్మినేని కుటుంబంలో మరో పోరు
ఆమదాలవలస, మార్చి 20: త్వరలో జరుగనున్న మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికలకు గాను మండలంలో అన్నిచోట్ల నుండి ఆయా పార్టీల తరఫున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే కలివరం నియోజకవర్గంలో నాన్నమ్మ- మనమరాళ్ల మధ్య పోటీ నెలకొని ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం తల్లి తమ్మినేని ఇందుమతి నామినేషన్ వేయగా, తమ్మినేని శ్యామలరావు కుమార్తె సుజాత టిడిపి తరుఫున పోటీ చేస్తున్నారు. ఇరవై ఏళ్ల వయస్సు గల సుజాత, 80 ఏళ్ల ఇందుమతి కి స్వయాన మనవరాలు కావడం ఇక్కడి విశేషం. ఒకే కుటుంబంలో మనవరాలు-నాయనమ్మ మధ్య పోటీ నెలకొనడం, రెండు కుటుంబాల మధ్య సాగుతున్న రాజకీయ పోరులో ఈ వృద్ధురాలు ఓ కొడుకు తరపున మరో కుమారుని కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ పడుతుండడం ఇక్కడ చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని ఓటర్లు ఆసక్తి రేగుతోంది.