విశాఖపట్నం, మార్చి 20: మండల, జిల్లా పరిషత్‌లకు నామినేషన్ల ఘట్టం గురువారంతో తెరపడింది. జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలకు ఇక్కడ జెడ్పీ కార్యాలయంలో ముఖ్యకార్య నిర్వాహణాధికారి మహేశ్వర రెడ్డి నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్లు వేసేందుకు సాయంత్రంతోనే సమయం ముగిసినప్పటికీ ప్రదాన రాజకీయ పార్టీలు ముందుగానే జెడ్పీ కార్యాలయంలోకి చేరుకుని నామినేషన్లతో సిద్ధ పడ్డారు. నిర్ణీత సమయానికి ముందుగానే కార్యాలయానికి చేరుకున్న వారిని నామినేషన్ల స్వీకరణకు అనుమతించారు. దీంతో జెడ్పీ సిఇఓ కార్యాలయం వద్ద అభ్యర్థులు బారులు తీరారు. ప్రతి నామినేషన్‌ను ఎన్నికల అధికారితో పాటు సహాయకులు పూర్తిగా పరిశీలించిన మీదటే వాటిని పరిగణలోకి తీసుకోవడంతో నామినేషన్ల ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. తొలిమూడు రోజుల్లో నామినేషన్లు దాఖలు చేసిన వారి సంఖ్య తక్కువగా ఉండటంతో అధికారులపై ఒత్తిడి పడలేదు. చివరి నిముషంలో రాజకీయ పార్టీలు పోటీకి ఆసక్తి కనబరచడంతో రద్దీ తప్పలేదు. గురువారం రాత్రి 10 గంటల సమయానికి 240 మంది అభ్యర్థులు జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. జెడ్పీ స్థానాలకు మరికొన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. తొలి మూడు రోజుల్లో జెడ్పీటీసీ స్ధానాలకు 131 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లు ఎన్నికల అధికారికి అందజేశారు. ఎంపిటిసీ స్థానాలకు తొలి మూడు రోజుల్లో 1888 మంది నామినేషన్లు వేశారు. గురువారం సిపిఎం పార్టీ తరపున 9 మండలాలకు 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
* ఏడు కంపేనీల కేంద్ర బలగాలు రంగంలోకి
* అక్రమంగా తరలే నగదు, మద్యంపై ప్రత్యేక నిఘా
* హద్దు మీరితే తాట తీస్తా...ఆంధ్రభూమితో సిపి శివధరరెడ్డి
విశాఖపట్నం, మార్చి 20: రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఇప్పటి నుండే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు నగర పోలీసు కమిషనర్ బి.శివధరరెడ్డి తెలిపారు. ఎన్నికల సందర్భంగా తీసుకుంటున్న భద్రత చర్యల గురించి గురువారం సిపి ‘ఆంధ్రభూమి’కి వివరించారు. గత ఎన్నికల్లో నాలుగు కంపెనీల కేంద్ర బలగాలను ఉపయోగించామని, ఈ సారి జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక ఎన్నికల రీత్యా ఏడు కంపెనీల కేంద్ర బలగాలను ఉపయోగించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. నగర కమిషనరేట్ పరిధిలో 21చెక్‌పోస్టులను ఎర్పాటు చేశామని, ఎన్నికల నియామవళి అమలులోకి వచ్చిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు పది వేల మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ప్రత్యేక ఎర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో పోలీసుల తనిఖీల్లో రూ.30లక్షల 30వేల నగదును స్వాధీనం చేసుకుని, ఓ కారును కూడ సీజ్ చేసినట్టు సిపి తెలిపారు. భారీ మొత్తంలో నగదును వాహనాల్లో తీసుకుని వెళ్లేవారు తప్పనిసరిగా నగదుకు సంబంధించిన ఆధారాలను చూపించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందును ఎవరు కూడ భారీ నగదును తీసుకుని వెళ్ళరాదని సిపి సూచించారు. ఎన్నికలకు ఎటువంటి ఆటంకం కలగకుండ ఉండేందుకు నగర కమిషనరేట్ పరిధిలో ఆయా పోలీసు స్టేషన్లల్లో ఇప్పటికే 185మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేసినట్టు పేర్కొన్నారు. నగరంలో 780మంది తుపాకీ లైసెన్స్‌లు కలిగి ఉన్నారని, ఎన్నికల దృష్ట్యా 600మంది నుండి తుపాకులను డిపాజిట్ చేసుకుని, వాటిని విశాఖ హెడ్‌క్వార్టర్స్‌లో భద్ర పరిచినట్టు తెలిపారు. మిగిలిన తుపాకీలు పోలీసు అధికారులు, 65బ్యాంక్‌ల సెక్యూరిటీ ఎజెన్సీల వద్ద ఉన్నట్టు సిపి వివరించారు. ఎన్నికలు జరిగేంత వరకు అక్రమంగా తరలించే నగదు, మద్యంపై నిఘాను మరింత ముమ్మరం చేయనున్నట్టు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, పౌరులు పోలీసులతో సహకరించాలని కోరారు. ఎన్నికల సందర్భంగా ఎవరైన చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే, వారంతేటి వారైన ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
పెరుగుతున్న విద్యుత్ కోతలు
విశాఖపట్నం, మార్చి 20: విద్యుత్ కోతలు పెరిగిపోతున్నాయి. వేసవి సీజన్ ప్రారంభంలోనే ఎదురవుతున్న ఈ సమస్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టణ ప్రాంతాల్లోనే రోజుకీ కనీసం మూడు గంటలపాటు కోతలు అమల్లో ఉన్నాయి. ఇది కాకుండా మధ్యలో కొద్దిసేపు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తప్పడంలేదు. మునిసిపాలిటీలు, మండల కేంద్రాల్లోను గంటల తరబడి విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి చెప్పనక్కర్లేదు. అసలే ఇంటర్ విద్యార్థులకు పరీక్షల కాలం. మరో వారం రోజుల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ సమయంలో గంటల తరబడి విధిస్తున్న కోతలతో గ్రామీణ, మండల కేంద్రాలకు చెందిన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థుల్లో పరీక్ష భయం కంటే కరెంటు కష్టాలపైన ఆందోళన చెందాల్సి వస్తోంది. రాత్రిళ్ళు ఇష్టానుసారం నిలిచిపోయే విద్యుత్ సరఫరాతో ఇబ్బందులు తప్పడంలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఉత్పత్తికేంద్రాల్లో సమస్యతోనే
రాష్ట్రంలో విద్యుత్‌ను అందించే పలు ఉత్పత్తి కేంద్రాల్లో సాంకేతిపరమైన సమస్యలు నెలకొనడం వలనే గత రెండు రోజులుగా కోతలు అనివార్యమైనట్టు సంస్థ అధికారులు చెబుతున్నారు. పరిస్థితి మెరుగుపడితే యధావిధిగా సరఫరా ఉంటుందని, డిమాండ్ పెరుగుతున్నా, మండుటెండలు తీవ్రంగా ఉన్నా గత కొద్దిరోజులుగా అమలవుతున్న కోతలే తప్ప ప్రత్యేకించి అదనంగా వీటిని పెంచలేదని తెలిపారు.
వేసవి ప్రత్యేక ఎసి రైళ్ళు
విశాఖపట్నం, మార్చి 20: పెరుగుతున్న రైళ్ళ రద్దీని, వేసవి సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని వాల్తేరు డివిజన్ అధికారులు ప్రత్యేక ఎసి రైళ్ళను నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం-సికింద్రాబాద్ (02727) ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నంలో ప్రతి శనివారం రాత్రి 7.05 గంటలకు బయలుదేరుతుంది. వచ్చేనెల 19, 26 తేదీల్లోను, మళ్ళీ మే 3, 10, 17, 24, 31 తేదీల్లో (ఏడుసార్లు) ఇది నడుస్తుంది. ఈ విధంగా శనివారం రాత్రి బయలుదేరి వెళ్ళే ఇది సికింద్రాబాద్‌కు మరుసటిరోజున 7.50 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం (02728) సికింద్రాబాద్‌లో ప్రతి శుక్రవారం రాత్రి 10.10 గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 10.35 గంటలకు ఇక్కడికి చేరుతుంది. ఇది వచ్చేనెల 18, 25 తేదీలు, మే 2, 9, 16, 23, 30 తేదీల్లో నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఎలూరు, విజయవాడ, వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ఇది నడుస్తుంది. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని వాల్తేరు డివిజన్ కమర్షియల్ విభాగం అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఆగస్టు జీతం చెల్లించాలి సమస్యలు పరిష్కరించాలి
ఆర్టీసీ స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్
విశాఖపట్నం, మార్చి 20: సమ్మె విరమణ ఒప్పందం ప్రకారం ఆగస్టు జీతాన్ని తక్షణమే చెల్లించాలని ఆర్టీసీ స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విశాఖ రీజియన్ అధ్యక్షురాలు ఎ.సీతాలక్ష్మి అన్నారు. రీజియన్ ఆధ్వర్యంలో గురువారం భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె విరమణ సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం ఆగస్టు జీతాన్ని కార్మికులకు చెల్లించాలన్నారు. వేతనం చెల్లింపులో జాప్యం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గడువు పూర్తయినా ఇంత వరకు ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదని, ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సాకుతో కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. సమ్మె విరమణతో గుర్తింపు సంఘానికి, యాజమాన్యానికి జరిగిన ఒప్పందం ప్రకారం కార్మికులకు ఇచ్చిన అడ్వాన్స్ రికవరీ కొనసాగుతుందన్నారు. 59 రోజుల ఎర్న్‌డ్ లీవులను కార్మికుల అకౌంట్ల నుండి రికవరీ చేస్తున్నారన్నారు. అయిదు మాసాలు గడిచిన తరువాత ఆర్థిక పరిస్థితి బాగోలేదనడం సరైంది కాదన్నారు. ఇటువంటి చర్యల వలన సంస్థ పట్ల కార్మికుల్లో ఉన్న అంకితభావం దెబ్బ తింటుందని అన్నారు. ఈ ధర్నాలో కార్మికులు పాల్గొన్నారు.
రూరల్ డిపో వద్ద
ఆర్టీసీ స్ట్ఫా అండ్ వర్కర్స్ యూనియన్ విశాఖ రీజియన్ ఆధ్వర్యంలో మద్దిలపాలెం డిపో వద్ద గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కార్మికులు ధర్నాకు దిగారు. ఈ నెల 20న చెల్లించాల్సిన వేతనాల గురించి ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదన్నారు. ఈ కారణంగానే ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.వి. గిరి, ఎం.ఎల్. రావు, వై.ఎ. నారాయణ, ఎం.కె. రావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సభావేదిక మార్పు
* మున్సిపల్ స్టేడియంలో సభ
విశాఖపట్నం, మార్చి 20: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బస్సుయాత్రలో భాగంగా ఈనెల 22న నిర్వహించనున్న బహిరంగ సభకు తొలి అవాంతరం తప్పలేదు. గత మూడు రోజులుగా కార్యకర్తల ఆధ్వర్యంలో బహిరంగ సభను జివిఎంసికి చెందిన స్వర్ణ్భారతి ఇండోర్ స్టేడియంలో నిర్వహించాలని భావించారు. అనుకోకుండా గురువారం రాత్రి వేదికను మార్చాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. సభను యధావిధిగా 22న ఉదయం 9 గంటలకు మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు నగర పార్టీ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు ప్రకటించారు. ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహించడం ద్వారా సౌండ్ సిస్టం వల్ల ఇబ్బందులుంటాయని, రీసౌండ్ వల్ల నేతల ప్రసంగాలకు అంతరాయమేర్పడుతుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
వుడా కార్యాలయలం వేలం ప్లాట్ల వివరాలు
విశాఖపట్నం, మార్చి 20: వేలం ద్వారా కేటాయింపు చేపట్టనున్న వుడా ప్లాట్ల వివరాలను లేఅవుట్ల వారీగా తెలుసుకునేందుకు వెసలుబాటు కల్పిస్తూ వుడా కార్యాలయం మూడవ అంతస్తులో లేఅవుట్ల మ్యాప్‌లను ఏర్పాటు చేశారు. విశాఖ, విజయనగరం పరిధిలో వుడా సొంతంగా అభివృద్ధి చేసిన 13 లేఅవుట్‌లో 260 ప్లాట్లను వేలం ద్వారా కేటాయించేందుకు ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వచ్చేనెల 5వ తేదీ వరకు గడువిచ్చారు. ఈ ప్లాట్ల వివరాలను ఇప్పటి వరకు వుడా వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంచగా వాటిని వుడా వెబ్‌సైట్‌లో సమగ్రంగా చూసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోందంటూ పలువురు దరఖాస్తుదారులు వీసీ డాక్టర్ ఎన్.యువరాజ్ దృష్టికి తీసుకోవడంతో దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం ప్లాట్ల వివరాలతో కూడిన లేఅవుట్ల మ్యాప్‌లను పెద్దవి చేసి ఏర్పాటు చేశారు. దీంతో కోరుకున్న ప్లాటు వివరాలను తేలికగా చూసుకునే అవకాశం కలిగింది. ఆనందపురం-అనకాపల్లి రహదారిపై ఆనందపురం జంక్షన్ నుండి ఏడో కిలోమీటర్ వద్ద అభివృద్ధి చేసిన శొంఠ్యాం లేఅవుట్‌లో అత్యధికంగా 165 ప్లాట్లు ఉన్నాయి. ఈ లేఅవుట్‌లో ప్లాట్లన్నీ రెసిడెన్షియల్ క్యాటగిరిలో 166.66, 222.22, 260.66, 350 చదరపు గజాల సైజుతో అందుబాటులో ఉన్నాయి. శొంఠ్యాం లేఅవుట్‌లో వేలం కనీస ధర చదరపు గజానికి రూ.2500గా నిర్ణయించారు. విశాఖ-్భమిలి బీచ్‌రోడ్డుపై కార్తీకవనం ఎదురుగా ఉన్న ఆదిభట్లనగర్ లేఅవుట్‌లో సిఆర్‌జెడ్ నిబంధననలకు లోబడి రెసిడెన్షియల్ క్యాటగిరిలో 360 చదరపు గజాల విస్తీర్ణంలో 16ప్లాట్లు 577.77 చదరపు గజాల సైజుతో ఒక ప్లాటు ఉండగా, వేలం కనీస ధరను చదరపు గజానికి రూ.11,400గా ప్రకటించారు. మధురవాడ ఐటీ ఎస్‌ఇజెడ్‌కు ఆనుకుని ఉన్న సైబర్ వేలీ సెక్టార్-1 సెక్టార్-2లేఅవుట్‌లో 266.66, 288, 311, 456, 311 చదరపు గజాల సైజుతో 35 ప్లాట్లు ఉండగా, చదరపు గజానికి రూ.16,037 వేలం కనీస ధరగా నిర్ణయించారు. వచ్చేనెల 20వ తేదీన వేలం నిర్వహించేందుకు ప్రతిపాదించిన ఈ ప్లాట్ల కేటాయింపునకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. వుడా వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వుడా.గవర్స్.ఇన్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలని వుడా ఉపాద్యక్షుడు యువరాజ్ తెలిపారు.
కేడర్‌లోనూ కీచులాటలు
విశాఖపట్నం, మార్చి 20: కీలక నేతలు ఒకరొకరుగా పార్టీని వీడిపోగా నాయకత్వ లేమితో కునారిల్లుతున్న కాంగ్రెస్‌కు కేడర్ మధ్య స్పర్థలు కొత్త తలనొప్పులను తెచ్చి పెడుతున్నాయి. స్థానిక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు నాయకత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర విభజన పూర్తి చేయడంతో జిల్లాకు చెందిన మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సహా మరో అయిదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడివెళ్లిపోయారు. మరో ఎమ్మెల్యే కూడా ఊగిసలాటలో ఉన్నారు. మరో మాజీమంత్రి పి.బాలరాజుతో పాటు మాజీవిప్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాత్రమే పార్టీలో ఉన్నారు. మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కనీసం కేడర్‌నైనా కాపాడుకునేందుకు జిల్లా పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కొద్దిరోజులుగా నగర పార్టీ కార్యాలయంలో పలు సందర్భాల్లో నాయకులు, ఇతర కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఏ సమావేశం కూడా సజావుగా సాగిన దాఖలాల్లేవు. కాంగ్రెస్‌లో ఇప్పటి వరకూ నాయకులకు మాత్రమే పరిమితమైన కీచులాటలు వారు పార్టీలు మారాక కిందిస్థాయి కార్యకర్తలకు కూడా సోకాయి. కార్యకర్తలను గుర్తించకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా పార్టీ నిర్ణయాలనుతీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రస్తుత పరిణామాలపై మండి పడుతున్నారు. పార్టీ సీమాంధ్ర సారధి రఘువీరారెడ్డి తదితరులు బస్సుయాత్ర పేరిట తలపెట్టిన సభను విజయవంతం చేయాలంటూ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. బుధవారం నాటి సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ ప్రతినిధి బి.ఎన్.రాజు తదితరులు నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారికి ఇస్తున్న ప్రాధాన్యతపై పార్టీ నాయకత్వాన్ని నిలదీయగా, గురువారం నాటి సమావేశంలో మహిళా నేత ప్రభాగౌడ్‌ను వేదికపైకి ఆహ్వానించడంపై మరికొంతమంది సీనియర్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ప్రతినిధి పీతల మూర్తియాదవ్, మహిళా ప్రతినిధి అమీనా బేగం తదితరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరాను నిలదీశారు. కొత్తగా వచ్చిన వారికి పెద్దపీటవేస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై ఉన్న వీరిద్దరూ ఇతర పార్టీల నుంచి అంతగా చెప్పాలంటే రాజకీయాల్లోకి వచ్చి ఎన్నాళ్లయింది, వారికి అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారంటూ నిలదీస్తున్నారు. వీరికి సర్ది చెప్పలేక నాయకులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా బస్‌యాత్ర పర్యవేక్షణకు పిసిసి నుంచి వచ్చిన పర్యవేక్షకుడు సుధాకర్‌బాబు ఎదుటే కార్యకర్తలు ఈ విషయాలను బాహాటంగా వ్యతిరేకించడంతో నాయకులు అవాక్కయ్యారు. మాజీవిప్ ద్రోణంరాజు శ్రీనివాస్ సహా వేదికపైనున్న వారు సర్దిచెప్పేందుకు చేసిన యత్నాలు విఫలం కావడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. దీంతో ప్రభాగౌడ్ వేదికదిగి కార్యాలయం కింది అంతస్తులోకి వెళ్లిపోయింది. ఇలాఉంటే ఇవే సంఘటనలు పునరావృతమైతే క్రమశిక్షణ తప్పిన కార్యకర్తలను బహిష్కరిస్తామంటూ మాజీవిప్ ద్రోణంరాజు, నగర పార్టీ అధ్యక్షుడు బెహరా భాస్కరావు హెచ్చరించడం గమనార్హం. కొద్దిసేపటి తర్వాత విలేఖరులు మాట్లాడేందుకు ప్రయత్నించగా పార్టీలో పనిచేసేందుకు సీనియర్, జూనియర్ అనే బేధాలు ఉండవని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు.
అమ్మో! ఎండలు
విశాఖపట్నం, మార్చి 20: ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అదీ మార్చి 20న ఈ పరిస్థితి నెలకొంది. వేసవి సీజన్ ప్రారంభంలోనే ఇవి తీవ్రంగా ఉంటున్నాయి. రెండేళ్ళ తరువాత మళ్ళీ ఇదే సీజన్‌లో ఒక్కసారిగా పెరిగిన ఎండల తీవ్రతకు నగరవాసులు విలవిల్లాడుతున్నారు. విశాఖ విమానాశ్రయంలో గురువారం నమోదైన గరిష్ణ ఉష్ణోగ్రత 39.2 డిగ్రీలు. 2013 మార్చి 20న ఇదే ఉష్ణోగ్రత నమోదుకాగా, మళ్ళీ ఇపుడు ఇదే ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సైతం ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతిలో 39.7, భద్రాచలంలో 39.4 డిగ్రీలు, తునిలో 39.4, నందిగామలో 39.1, మహాబూబ్‌నగర్‌లో 39.5, కర్నూలులో 38.9, అనంతపూర్‌లో 38.9, అదిలాబాద్‌లో 38.0, రెంట చింతలలో 38.2 డిగ్రీల వంతున గురువారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే మునుపెన్నడూ లేనివిధంగా ఎపుడూ చల్లని వాతారణంతో ఉండే విశాఖ నగరం వీటితో పోటీ పడుతూ ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండల తీవ్రతతో వృద్ధులు, పిల్లలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. మండుతున్న ఎండలతో పాఠశాలల నుంచి బయటకు వచ్చేందుకు సైతం పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచే నగర వీధులు, శివారు ప్రాంతాల్లో జనం మధ్యాహ్నాం సంచరించడం తగ్గిపోతుంది. అసలే మధ్యాహ్నా సమయంలో విద్యుత్‌కోతలు అమలుకావడం, మండుతున్న ఎండల తీవ్రతతో ఉక్కపోత, వేడి గాలులు నగరవాసులకు బెంబేలెత్తినట్టు చేస్తున్నాయి. ఇప్పటి నుంచే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా అంటూ నగరవాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సీనియర్లు పార్టీ వీడారు... కేడర్‌కు ఇప్పుడే అవకాశం
గోపాలపట్నం, మార్చి 20: కాంగ్రెస్‌లో పదవులు, అధికారాలు అనుభవించిన సీనియర్లు పార్టీని వీడారని, వారు వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెస్‌కు ఎదురయ్యే నష్టం ఏమీలేదని ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం నుండి శ్రీకాకుళం జిల్లాలో బస్సుయాత్రను ప్రారంభించేందుకు గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకున్న ఆయన విమానాశ్రయంలో కలిసిన మీడియాతో మాట్లాడారు. సీనియర్లు పార్టీని వీడి వెళ్లడం వల్ల ఎన్నోఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న ద్వితీయశ్రేణి కార్యకర్తలకు అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. విభజనకు తాము వ్యతిరేకం కాదంటూ కేంద్రానికి లేఖలు ఇచ్చిన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాలు ఇప్పుడు కాంగ్రెస్‌ను దోషిని చేశాయన్నారు. ఈవాస్తవాలను సీమాంధ్ర ప్రజలకు వివరించడంతో పాటు కార్యకర్తలు, నాయకులకు నూతనోత్తేజాన్ని కల్పించాలన్న లక్ష్యంతోనే బస్సుయాత్రను సంకల్పించినట్టు రఘువీరా వెల్లడించారు. విభజనానంతరం సీమాంధ్ర సర్వతోముఖాభివృద్ధి కాంగ్రెస్ పార్టీవల్లే సాధ్యమవుతుందని ఆయన ఈసందర్భంగా స్పష్టం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ సారథి చిరంజీవి మాట్లాడుతూ పార్టీని వీడింది నాయకులు మాత్రమేనని, కేడర్ మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే ఉందన్నారు. విభజన విషయంలో తెదేపా,వైకాపాలు ద్వంద్వ వైఖరిని అవలంభించాయని, వారితీరును ప్రజలకు వివరిస్తామన్నారు. యాత్రను ఉద్యమ జిల్లా సిక్కోలు నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ అంశాన్ని విలేఖరులు ప్రస్తావించగా, మాట్లాడేందుకు ఇది సమయం కాదని దాటవేశారు. వీరివెంట కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీమంత్రి సి.రామచంద్రయ్య వచ్చారు.
ఎక్సైజ్ శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష
విశాఖపట్నం, మార్చి 20: ఎన్నికల నిర్వహణ కాలంలో మద్యం వాడకం, నిల్వలు, కొనుగోళ్ళపై ఎలక్షన్ కమిషన్ నుండి స్పష్టమైన ఆదేశాలున్నాయని, ఆదేశాలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ పని చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సాల్మన్ ఆరోఖ్యరాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన జిల్లా ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది మార్చిలో మద్యం ఎంత ఎక్సైజ్ అమ్మారు, ఈ నెల ఇంతవరకు ఎంత అమ్మారు, నెలాఖరులోపు ఎంత అమ్మబోతున్నారు అనేక అంశాలను ఎక్సైజ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో షాపులవారీగా జరిగిన అమ్మకాలను కలెక్టర్ పరిశీలించారు. బెల్టుషాపులను మూసివేయించాలన్నారు. పట్టుబడిన అక్రమ మద్యం, కేసులో అక్రమంగా మద్యం తరలించిన షాపుల లైసెన్సులు రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఎక్సైజ్ అధికారులు జిల్లావ్యాప్తంగా పర్యటించాలని, తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నిత్యం మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తుండాలన్నారు. తాము కూడా తనిఖీలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.సత్యనారాయణ, ఐఎంఎల్ డిపోల చీఫ్ మేనేజర్ జె.సుధారత్నకుమార్, కె.నాగభూషణరావు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా
‘హస్తం’ గుర్తు కనుమరుగు
* టిడిపి, వైకాపా మధ్యే ముఖాముఖి
అనకాపల్లి, మార్చి 20: ఎన్నికల్లో గెలవడం మాటెలాగున్నా అథమం పోటీచేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరూ ముందుకు రావడం లేదు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో హస్తం గుర్తుపై పోటీచేసి ప్రజల్లో గుర్తింపుపొందేందుకు స్వతహాగా కొందరు తహతహలాడేవారు. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో హస్తం గుర్తుపై పోటీకి అందరూ మొహం చాటేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలమని దర్పాలు పలుకుతూ పార్టీ తరపున పదవులు అనుభవించిన వారు గత్యంతరం లేని స్థితిలో ఆ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ గుర్తుపై పోటీకి దిగేందుకు మొహం చాటేస్తున్నారు. పలుచోట్ల కాంగ్రెస్ మద్ధతుదారులు ఇండిపెండెట్లుగానైనా బరిలో దిగేందుకు సిద్ధపడుతున్నారు తప్పితే కాంగ్రెస్ పేరు చెప్పుకునేందుకు బెంబేలెత్తిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వరుసగా రెండు ఎన్నికల్లోను అనకాపల్లి నుండి కొణతాల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు కేబినెట్ మంత్రి పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు ఒకరు వైకాపాలో ఉంటే మరొకరు దేశం పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో తుమ్మపాల సుగర్స్ మాజీ చైర్మన్ దిలీప్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్లు కె.రాంజీ, జగన్, సిడిసి చైర్మన్ గెంజి సత్యారావు నేతలు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతమంది నేతలున్నప్పటికీ మండలంలోని బవులవాడ ఎంపిటిసి స్థానానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. సిడిసి చైర్మన్ సత్యారావు ప్రోద్భలంతో కాంగ్రెస్ అభ్యర్థిగా గుత్తల ప్రభావతి నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ జనతాపార్టీ తరపునుండి కొత్తూరు ఎంపిటిసి స్థానాలకు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే మునగపాక మండలంలో కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. చోడవరం, కశింకోట, అచ్యుతాపురం, యలమంచిలి, ఎస్. రాయవరం, చీడికాడ, రావికమతం తదితర మండలాల్లో కూడా కేవలం ఒకటి రెండు, మూడు నామినేషన్లు కాంగ్రెస్ పార్టీ తరపున దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ నాటికి వీరు కూడా ఎన్నికల బరిలో నిలిచే పరిస్థితి కానరాలేదు. స్థానిక ఎన్నికల్లో ఎప్పటి మాదిరిగానే సైకిల్ గుర్తుతోపాటు తొలిసారిగా ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీచేస్తున్న వైకాపా తరపున ఫ్యాన్ గుర్తు మాత్రమే దర్శనమిచ్చే పరిస్థితి ఉంది. పూర్వం కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్న వీరాభిమానులు నేతలు, కార్యకర్తలుఉన్నప్పటికీ తమ అభిమాన గుర్తు హస్తానికి ఓటేద్దామన్నా బ్యాలెట్ పేపర్లో ఆ గుర్తు జాడ అసలు కనిపించే పరిస్థితే లేదు.
దయనీయంగా కాంగ్రెస్
* 58 ఎంపిటిసి స్థానాలకు ఒకే నామినేషన్
నర్సీపట్నం, మార్చి 20: నర్సీపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నాయకులెవరూ ముందుకు రాలేదు. ఇదే పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎదురైంది. 27 వార్డులున్న నర్సీపట్నం మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉం డగా, 58 ఎం.పి.టి.సి. సిగ్మెంట్లు ఉన్న నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక్క ఎం.పి.టి.సి. స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేయడం గమనార్హం. గొలుగొండ మండలం జోగుంపేటలో ఎస్సీ మహిళలకు కేటాయించిన ఎం.పి.టి.సి. స్థానంలో చిట్ల పార్వతీ కాంగ్రెస్ అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేసారు. పార్వతి పోటీలో ఉంటారా, ఉపసంహరించుకుంటారా? అనేది నామినేషన్ల ఉపసంహరణ తరువాతనే వెల్లడవుతుంది. ఈమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లైతే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కి అడ్రస్ లేనట్లే.
నాలుగు మండలాల్లో 58 నామినేషన్లు
నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 58 ఎంపిటిసి స్థానాలకు 374 నామినేషన్లు దాఖలయ్యాయి. నాతవరం మండలంలో 18 ఎం.పి.టి.సి. స్థానాలకు వై.కాపా నుండి 56 మంది, తెలుగుదేశం నుండి 58 మంది, సి.పి. ఐ. నుండి 4, సి.పిఎం. నుండి 1, బిజెపి. నుండి 12, ఇండిపెండెంట్లుగా 7 నామినేషన్లు దాఖలయ్యాయి. గొలుగొండ మండలంలో 15 ఎంపిటిసిలకు వై.కాపా నుండి 30, తెలుగుదేశం నుండి 36, కాంగ్రెస్ నుండి 1, సిపిఐ నుండి 9, ఇండిపెండెంట్లు 2, మాకవరపాలెం మండలంలో 16 ఎం.పి.టి.సి.లకు వై.కాపా నుండి 50, తెలుగుదేశం నుండి 48, బిజె.పి నుండి 3, ఇండిపెండెంట్‌గా 1, నర్సీపట్నం మండలంలో 9 ఎం పిటిసిలకు వై.కాపా నుండి 32, తెలుగుదేశం నుండి 20, సిపిఐ నుండి 3, ఇండిపెండెంట్‌గా 1 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఈదురుగాలులు, వర్షానికి
ఇల్లు కూలి మహిళ మృతి
అనంతగిరి, మార్చి 20: మండలంలోని బుధవారం రాత్రి కురిసిన వ ర్షానికి ఇల్లు కూలి ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తూరు పంచాయతీ శివలింగపురం గ్రామంలో బుధవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఓ ఇంటి గోడ పూర్తిగా నాని గురువారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంటిలో నిద్రిస్తున్న శెట్టి దేముడమ్మ(45), ఆమె భర్త అప్పలస్వామి(50)లపై ఇంటి పైకప్పు పడిపోయింది. దేముడమ్మపై గోడ పడిపోవడంతో అప్పలస్వామి గట్టిగా కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి గోడను తొలగించి దేముడమ్మను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న దేవుడమ్మను ఎస్.కోట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందింది. అప్పలస్వామికి తలకు, చేతులకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
నేడు బెల్లం మార్కెట్ బంద్
అనకాపల్లి, మార్చి 20: నల్లబెల్లంపై దాడులను నిరసిస్తూ శుక్రవారం అనకాపల్లి మార్కెట్ బంద్ పాటిస్తున్నట్లు వర్తకసంఘం ప్రముఖులు, ఎఎంఎఎల్ కళాశాల కరస్పాండెంట్ మళ్ల సత్యనారాయణ తెలిపారు. అనకాపల్లి మార్కెట్‌కు వస్తున్న నల్లబెల్లాన్ని కశింకోట వద్ద పోలీసులు స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. అనకాపల్లి మా ర్కెట్ నుండి తూర్పుగోదావరికి వెళుతు న్న బెల్లాన్ని పత్తిపాడు వద్ద పోలీసులు పట్టుకుని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. నల్లబెల్లం రవాణాపై పోలీసులు తనిఖీలు జరిపి స్వాధీనం చేసుకోవడం అన్యాయమని అనకాపల్లి వర్తక సంఘం కార్యదర్శి పూసర్ల సునీల్ నేతృత్వంలో వర్తక ప్రముఖులు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను గురువారం కలసి వినతిపత్రం అందజేశారు. వర్తక ప్రముఖులు తమ్మన సుబ్బారావు,మళ్లసత్యనారాయ ణ పాల్గొన్నారు. నల్లబెల్లంపై అక్రమదాడులను నిరసిస్తూ శుక్రవారం అనకాపల్లి మార్కెట్‌లో బంద్ పాటించడమే కా కు ండా ఆర్డీవోను కలసి వినతిపత్రం అందజేస్తామని సత్యనారాయణ తెలిపారు.