
విరుధ్‌నగర్, మార్చి 21: కేంద్రంలో యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినంత కాలం నదుల అనుసంధానం గురించి ఎందుకు ప్రయత్నించలేక పోయారని అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిఎంకె అధినేత కరుణానిధిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం విరుధ్‌నగర్‌లో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, ప్రముఖ తమిళ కవి, స్వాతంత్య్ర సమర యోధుడు సుబ్రమణ్య భారతి కలను సాకారం చేసేలా నదుల అనుసంధానికి తమ పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో డిఎంకె ఇచ్చిన పలు హామాలను ఆమె అపహాస్యం చేశారు. కుటుంబ సభ్యులను పదవులతో అనుసంధానం చేయడం తప్ప నదుల అనుసంధానం గురించి కరుణానిధికి చిత్తశుద్ధి లేదన్నారు. నదుల అనుసంధానం ప్రమాదకరమని, పర్యావరణానికి చేటు తెస్తుందని రాహుల్ గాంధీ వ్యతిరేకించినపుడు కరుణ నోరు విప్పలేదన్నారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎలాంటి ప్రయ త్నం చేయక పోగా, కేంద్ర ప్రభుత్వంలో పదవుల కోసం కరుణానిధి పాకులాడారని ఆమె విమర్శించారు. ఎన్నికల సందర్భంగా నదుల అనుసంధానంపై డిఎంకె ఇస్తున్న హామీలను ప్రజలు విశ్వసించే ప్రసక్తే లేదన్నారు. 17 ఏళ్లుగా కేంద్రంలో పదవులు పొందిన వారు ఇపుడు న్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. గంగానదితో కృష్ణా, కావేరి, పెన్న, వైగై, తమిరబరణి తదితర నదులను అనుసంధానం చేస్తామని డిఎంకె ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది.