న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశంలో గత పదేళ్ల కాలంలో జరిగిన అన్ని పోలీసు ఎన్‌కౌంటర్లపైన స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై తమ అభిప్రాయాలు తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. బూటకపు ఎన్‌కౌటర్లకు సంబంధించిన అన్ని కేసులలో ఒకే విధమైన దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు అఫ్తాబ్ ఆలమ్, రంజనాప్రకాష్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది. ఎన్‌కౌంటర్ మరణాలపై కొన్ని స్వార్థపరశక్తులు ఉద్దేశ పూర్వకంగా తమ రాష్ట్ర పోలీసు బలగాలను టార్గెట్‌గా చేసుకుంటున్నాయని గుజరాత్ ప్రభుత్వం ఆరోపించింది. దేశంలో జరిగిన అన్ని బూటకపు ఎన్‌కౌంటర్ కేసులలో ఒకే విధమైన దర్యాప్తు జరిపించడానికి వీలుగా కోర్టు తగిన ఆదేశాలు జారీ చేయాలని, దీనివల్ల మానవ హక్కుల పరిరక్షణ జరగడంతోపాటు ఉగ్రవాద సమస్య తీవ్రంగా ఉన్న గుజరాత్ రాష్ట్ర పోలీసుల మనోధైర్యం దెబ్బతినకుండా ఉంటుందని పిటిషన్‌లో గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. బూటకపు ఎన్‌కౌంటర్ ఆరోపణలు వచ్చిన అన్ని కేసులను విచారించడానికి గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ఫోర్స్ తరహాలో ఒక జాతీయస్థాయి విధానాన్ని రూపొందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
ఆజాద్ ఎన్‌కౌంటర్‌పై
స్వతంత్ర విచారణ చేయండి
మావోయిస్టు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్, జర్నలిస్టు హేమచంద్ర పాండేలను రాష్ట్ర పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన సంఘటనపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలన్న విజ్ఞప్తికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఆజాద్ తరపు వాదించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై సిబిఐ అందచేసిన నివేదికపై అనేక అనుమానాలను వ్యక్తంచేస్తూ స్వతంత్ర విచారణ జరిగితే తప్పించి నిజానిజాలు బయటపడే అవకాశాలు లేవని జస్టిస్ ఆఫ్తాబ్ ఆలమ్, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయితో కూడుకున్న బెంచి దృష్టికి తీసుకొచ్చినపుడు న్యాయమూర్తులు తమ ఆమోదాన్ని తెలియచేశారు. అంతేకాక ఎన్‌కౌంటర్‌పై సిబిఐ అందించిన నివేదికను కోర్టు రిజిస్ట్రార్ వద్ద పరిశీలించుకోవాల్సిందిగా ఆదేశించింది. రాష్ట్ర పోలీసులు పథకం ప్రకారమే రాజ్‌కుమార్, హేమచంద్ర పాండేలను ఆదిలాబాద్ అడవుల్లో అతి దగ్గరినుంచి కాల్చి చంపేశారని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్ జరిగే సమయానికి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల మధ్య కాల్పుల విరమణపై చర్చలకు రంగం సిద్ధమవుతున్నందున హోమంత్రి చిదంబరం అనుమతి లేకుండా రాష్ట్ర పోలీసులు ఈ చర్యకు పాల్పడే అవకాశాలు లేవని ఆయన చెప్పారు. రాష్ట్ర పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడలేదని సిబిఐ క్లీన్‌చిట్ ఇవ్వటాన్ని ఆయన తప్పుబట్టారు. సిబిఐ అందించిన నివేదికలో అనేక లోపాలున్నాయని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తరువాతే సిబిఐ రాష్ట్ర పోలీసులకు క్లీన్‌చిట్ ఇచ్చిందని సిబిఐ తరుఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. సిబిఐ కచ్చితమైన సాక్ష్యాలను అందించిందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత, కేసు విచారణను 24కి కోర్టు వాయిదా వేసింది.
బూటకపు ఎన్‌కౌంటర్ల దర్యాప్తుపై కేంద్రం, రాష్ట్రాలకు ‘సుప్రీం’ నోటీసులు
english title:
e
Date:
Saturday, April 14, 2012