హైదరాబాద్, ఏప్రిల్ 13: వైఎస్ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ బృందం అడిగిన ప్రశ్నలకు నావద్దనున్న సమాచారం అందించానని రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. బాధ్యత కలిగిన పౌరుడిగా, రాష్టమ్రంత్రిగా సిబిఐ బృందానికి సహకరించానని విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం సిబిఐ ఎదుట హాజరయ్యారు. దిల్‌కుషా అతిథిగృహంలో దాదాపు 9గంటలపాటు విచారణ సాగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సిబిఐ అధికార్లు మంత్రి ధర్మాన నుంచి వివరాలు సేకరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో ధర్మాన ప్రసాద రావు రెవెన్యూ మంత్రిగా పని చేశారు. అప్పట్లో కొన్ని ప్రైవేటు కంపెనీలకు భూములను కేటాయిస్తూ జీవోలను జారీ చేశారు. జీవోల కారణంగా వేలాది ఎకరాలను ఆయా కంపెనీలకు దారాదత్తం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. మంత్రి ధర్మానతోపాటు అప్పట్లో రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పని చేసిన శామ్యూల్‌ను సైతం సిబిఐ అధికారులు ప్రశ్నించారు. వైఎస్ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, జారీ అయిన జీవోలు తదితర అంశాల గురించి లోతుగా సిబిఐ విచారించింది. విచారణ అనంతరం ధర్మాన అతిథి గృహం వద్ద మీడియాతో మాట్లాడారు. సిబిఐ 28 ప్రశ్నలతో కూడిన డాక్యుమెంట్‌ను అందజేసిందని, వాటికి తన వద్ద ఉన్న సమాధానాలను తెలియజేసినట్టు చెప్పారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా, రాష్ట్ర మంత్రిగా సిబిఐకి సహకరించానని చెప్పారు. అప్పట్లో జీవోలను ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో, వాటి లక్ష్యాలను వివరించానని అన్నారు. ముఖ్యంగా వాన్‌పిక్ సంస్థకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 1500 ఎకరాల భూములను కేటాయించిన అంశంపై ప్రశ్నించారని తెలుస్తోంది. వాన్‌పిక్ ప్రాజెక్టు అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ వైఎస్ జగన్ కంపెనీల్లో భారీగా పెట్టుడులు పెట్టినట్టు సిబిఐ అభియోగాల్లో పేర్కొంది. జగన్ కేసులో త్వరలో ఒకటి రెండు అనుబంధ చార్జిషీట్‌లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున ప్రతి కంపెనీకి సంబంధించిన వివరాలను నిశితంగా సిబిఐ పరిశీలిస్తోంది. ధర్మాన హయాంలో 9జీవోలు జారీ చేసినట్టు సిబిఐ గుర్తించి ఆ దిశగా విచారించింది.
సిబిఐ ఎదుట హాజరైన మంత్రి ధర్మాన ఐఏఎస్ అధికారి శామ్యూల్‌నూ విచారించిన సిబిఐ బృందం 28 ప్రశ్నలకు సమాధానాలు తొమ్మిది గంటల పాటు విచారణ
english title:
naaku
Date:
Saturday, April 14, 2012