హైదరాబాద్, ఏప్రిల్ 13: ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉప సంఘాన్ని నియమించింది. ప్రణాళికా నిధులను సక్రమంగా వెచ్చించేందుకు ఈ ఉప సంఘం విధి విధానాలు రూపకల్పన చేయనుంది. తొమ్మిది మంది మంత్రులతో కూడిన ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తూ, జీవో నెం 1640ను శుక్రవారం జారీ చేశారు. సబ్ కమిటీ పని చేసేందుకు వీలుగా నాలుగు మార్గదర్శకాలను రూపొందించారు. మంత్రివర్గ ఉప సంఘానికి ఉప ముఖ్యమంత్రి సి దామోదర రాజనర్సింహ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రణాళిక సంఘం ముఖ్య కార్యదర్శి ఈ సంఘ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ సంఘం ఏర్పాటైనప్పటి నుంచి రెండు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మంత్రివర్గ ఉప సంఘంలో మంత్రులు జె గీతారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, పి బాలరాజు, డాక్టర్ ఎస్ శైలజానాథ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఏరాసు ప్రతాపరెడ్డి, కొండ్రు మురళి మోహన్ సభ్యులుగా ఉంటారు. కేంద్ర ప్రణాళిక సంఘం ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక కింద కేటాయించిన నిధులు ఖర్చు చేసేందుకు నిర్దేశించిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో అమలుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించాలి. లక్ష్య సాధనకు ఇబ్బంది తలెత్తకుండా గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అవరోధాలను గుర్తించాలి. ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధివిధానాలు అధ్యయనం చేయాలి. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు సక్రమంగా ఖర్చు చేసేందుకు వీలుగా పటిష్టమైన శాసనాన్ని రూపొందించాలి. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల జనాభాను పరిగణనలోకి తీసుకుని వివిధ శాఖలకు నిధుల కేటాయింపును పరిశీలించి మార్గదర్శకాలను రూపొందించాలి. ఈ నిధులు మళ్లింపునకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. దీని కోసం ఒక చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాలి. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు, ఇతర శాఖలకు కేటాయించిన నిధుల వ్యయాన్ని పరిశీలించాలి.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు తొమ్మిదిమంది మంత్రులతో కమిటీ చైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి దామోదర్ నివేదికకు కాలపరిమితి రెండు నెలలు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
english title:
upa
Date:
Saturday, April 14, 2012