Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అడ్డంగా దొరికేశారు!

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 13: ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడదామని భావించిన రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ, బిఇడి కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టు ఆదేశాలతో కుడితిలో పడిన ఎలుక చందంగా వారే చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో చెల్లించడం లేదని, ఏకీకృత ఫీజు అమలు చేయాలంటూ ఆరు ప్రధాన డిమాండ్లతో యాజమాన్యాలు ఉమ్మడిగానూ, విడివిడిగానూ హైకోర్టును ఆశ్రయించి 32 పిటిషన్లు దాఖలు చేశాయి. తమకు అనుకూలంగా తీర్పువస్తే ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టవచ్చని భావించాయి. హైకోర్టు ప్రైవేటు యాజమాన్యాలకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రైవేటు యాజమాన్యాల దిమ్మ తిరిగింది. వాస్తవానికి యాజమాన్యాలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం కాలేజీలను నిర్వహిస్తున్నాయా? వసూలు చేస్తున్న ఫీజులకు తగ్గట్టు సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నాయా? ఆదాయ పన్ను చెల్లిస్తున్నాయా? వస్తున్న ఆదాయానికి ఏ లెక్కలు చూపుతున్నాయనే అంశంపై సుప్రీంకోర్టు దృష్టి సారించడంతో యాజమాన్యాలు ఇరకాటంలో పడ్డాయి. తొలుత ఉత్సాహంగా వేర్వేరు పేర్లతో అసోసియేషన్లను ఏర్పాటు చేసి యాజమాన్యాలు పిటిషన్లను దాఖలు చేశాయి. కన్సార్టియం ఆఫ్ ఇంజనీరంగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం (సిఇసిఎంఎ), సెల్ఫ్ ఫైనాన్స్ రూరల్ ఇంజనీరంగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం (ఎస్‌ఎఫ్‌ఆర్‌ఇసిఎంఎ), ఇంజనీరంగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం (ఇసిఎంఎ), ఎపి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం (పిపిఇసిఎంఎ) పేరిట డాక్టర్ పి రాజేశ్వర్‌రెడ్డి, కె కృష్ణారెడ్డి, ఎన్ రమేష్ బాబు, వి మాలకొండారెడ్డిలు వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు. ఇవికాకుండా ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాల సంఘం తరఫున ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె సునీల్‌కుమార్ కూడా మరో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవు అప్పీల్ యాజమాన్యాల మెడకు చుట్టుకుంది. ఫీజులు పెంచాలని, ఇంజనీరింగ్ సహా వృత్తి విద్యా కళాశాలల్లో ఏక రూప ఫీజుల విధానాన్ని అమలు చేయాలని నిన్నటివరకూ గట్టిగా కోరిన కాలేజీల యాజమాన్యాల పరిస్థితి, సుప్రీంకోర్టు ఆదేశాలతో పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్టయింది. 2009-10, 10-11 విద్యా సంవత్సరాలకు వచ్చిన జమా ఖర్చుల లెక్కలు ఆడిట్ రూపంలో తక్షణం సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. అక్కడితో ఊరుకోని సుప్రీంకోర్టు 2011-12 విద్యా సంవత్సరానికి సైతం లెక్కల అంచనాలను ఇవ్వాలని కోరింది. ఏదో కాకి లెక్కలు చెప్పకుండా చార్డెర్డ్ అకౌంటెంట్ల నివేదికలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలనడంతో యాజమాన్యాల పరిస్థితి న్యాయ వివాదాల పులిబోనులో తలపెట్టినట్టయింది.ఏకరూప ఫీజు అమలు చేయాల్సిం దేనని హైకోర్టు ఆదేశాలతో ఎగిరి గంతేసిన కాలేజీల యాజమాన్యాలు, ఇపుడు లెక్కలు చెప్పమనే సరికి కుయ్యో మొర్రో అంటున్నాయి. సుప్రీం ఆదేశాలతో ప్రభుత్వం కాలేజీలు తమ జమా ఖర్చుల వివరాలను అందించాలని కోరుతూ బహిరంగ ప్రకటన జారీ చేయగా, చాలా కొద్ది యాజమాన్యాలు మాత్రమే స్పందించాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావు శుక్రవారం చెప్పారు. ఎస్‌ఎల్‌పి 34050 నుంచి 34080 వరకూ ఉన్న అన్ని పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, యాజమాన్యాలు తమ ఖర్చుల వివరాలు అందించాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు 710, ఫార్మసీ 283, ఎంసిఎ కాలేజీలు 625, ఎంబిఎ కాలేజీలు 958 ఉండగా కేవలం 384 కాలేజీలు మాత్రమే జమా లెక్కలు చూపేందుకు ముందుకొచ్చాయని జయప్రకాశ్‌రావు తెలిపారు. వీటికితోడు పిజి స్థాయిలో ఎం.్ఫర్మసీ కాలేజీలు 225, ఎం.టెక్ కాలేజీలు 365 ఉండనే ఉన్నాయి. దాదాపు 2576 కాలేజీలకుగానూ 384 కాలేజీలు మాత్రమే స్పందించాయని ఆయన చెప్పారు. ఏయే కాలేజీలు సవ్యమైన నివేదికలు ఇచ్చాయో పరిశీలించటంతో, దిగ్భ్రాంతికర నిజాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. కేవలం నాలుగు కాలేజీల యాజమాన్యాలు మాత్రమే పద్ధతి ప్రకారం నివేదికలను ఇచ్చాయని జయప్రకాష్ తెలిపారు. మిగిలిన కాలేజీలు క్రమపద్ధతిలో లెక్కలు చెప్పలేదని, ఇదే విషయాన్ని తాము సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లామని ఆయన పేర్కొన్నారు. అయితే తమ నివేదికలను పరిశీలించిన సుప్రీంకోర్టు మరింత సమగ్రంగా ప్రభుత్వ విధానం ఏమిటో తెలియజేయమని కోరిందని, ప్రభుత్వం నిర్ణయంతో తాము ఈనెల 24లోగా వివరణ దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టులో 24న కేసు మళ్ళీ విచారణకు రానుంది.
కాలేజీలు బోధన సిబ్బందికి ఎఐసిటిఇ నిబంధనల ప్రకారం యుజిసి వేతనాలు చెల్లించాలని 2010 జనవరి 22న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తాము ఎఐసిటిఇ ఉత్తర్వులు ప్రకారం అంతకంటే ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని, కాలేజీలు నిర్వహణ తలకుమించిన భారం అవుతోందని చెబుతూ యాజమాన్యాలు ఫీజు పెంపును డిమాండ్ చేశాయి. కానీ వాస్తవికంగా రెండు డజన్ల కాలేజీలు మినహాయిస్తే ఏ ఇతర కాలేజీ లెక్చరర్లకు పూర్తి వేతనాలను ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా సుప్రీంకోర్టుకు వాస్తవిక లెక్కలు ఇస్తే ఒక ఇబ్బంది, తప్పుడు లెక్కలిస్తే మరో ఇబ్బంది అన్నట్టు తయారైంది. ముందుకెళ్తే గొయ్యి, వెనక్కొస్తే నుయ్యి అన్నట్టు లబోదిబోమంటున్నామని ఒక కాలేజీ యజమాని పేర్కొన్నారు. తప్పుడు లెక్కలు సమర్పిస్తే లేనిపోని న్యాయ సమస్యలు వస్తాయని యాజమాన్యాలు భయపడుతున్నాయి.
జారుకుంటున్న యాజమాన్యాలు
కేసుల నుంచి పలు యాజమాన్యాలు జారుకున్నాయి. 32కేసులకు సంబంధించి 22మంది న్యాయవాదులను సిద్ధం చేసుకున్న యాజమాన్యాలు, తమ వాదనలు బెడిసికొట్టడంతో కేసుల నుంచి తప్పుకుంటున్నాయి. ప్రస్తుతం యాజమాన్యాల తరఫున ప్రముఖ న్యాయవాది ఎఫ్‌ఎస్ నారిమన్ వాదిస్తుండగా, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ జిఇ వాహనవతి, సీనియర్ అడ్వకేట్ ఆర్ వెంకటరమణి వాదిస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు వాదనల సమయంలో హాజరుకే గంటకు లక్షల్లో ఫీజు చెల్లించాల్సి రావడంతో యాజమాన్యాలు చేతులెత్తేశాయి.

సుప్రీం ఆదేశాలతో ‘ప్రైవేటు’ క్లీన్ బౌల్డ్ లెక్కలు అడిగేసరికి చుక్కలు చూస్తున్న వృత్తివిద్యా సంస్థల యాజమాన్యాలు 24న విచారణకు రానున్న కేసు
english title: 
addanga

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles