ట్రాన్స్‌ఫార్మర్ సినిమా చాలా మందికి గుర్తుండే వుంటుంది. ఆ సినిమాలో వున్న రోబోల్లాంటి బొమ్మలు కూడా ఇప్పటికీ అమ్ముడవుతూనే వున్నాయి కూడా. అచ్చంగా ఆ సినిమాలోని మిస్టర్ ఐరన్ రోబోల మాదిరిగా వివిధ ఆకృతులు తయారుచేసి, వాటితో ఏకంగా ఓ థీమ్ పార్క్‌నే ఏర్పాటు చేసారు. దీనికి మూలకారకుడు నలభై తొమ్మిదేళ్ల ఆర్టిస్టు ఝూ కెఫెంగ్. అతడు, అతగాడి అనుచరులు పదేళ్ల పాటు కష్టపడి, భారీ సైజు మెటల్ రోబోలు తయారుచేసారు. ఇందుకోసం, రీసైకిల్డ్ ఐరన్, స్టీల్ సామగ్రిని వాడారు. చాలా మంది స్వచ్ఛందంగా కొంత సామగ్రిని ఇచ్చారు. ఝూ తన అపార్ట్‌మెంట్, తన ఆర్ట్‌వర్క్‌లు అమ్మి మరికొంత నగదు సేకరించాడు. ఇలా మొత్తం మీద 600 ఆకృతులు తయారుచేసారు. సైజులన్నీ భారీవైనా, అత్యంత సహజంగా వుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకింత శ్రమపడి, పిల్లల కోసం ఓ థీమ్ పార్క్‌ను రూపొందించారని ఎవరైనా అడిగితే, ‘నాకు నా చిన్నతనం ఇంకా గుర్తుంది, చిన్న చిన్న మెటల్ బొమ్మలతో ఆడుకోవడం అంటే ఎంత ఇష్టం వుండేదో, అందుకే ఇలాంటి రియాల్టీ టాయ్ పార్క్ ఏర్పాటు చేయాలనిపించింది’ అని సమాధానమిస్తున్నాడు.
...............................................................
మీకు బోలెడు కోపం వచ్చింది. చేతిలో వున్న సెల్ నేలకు వేసి కొట్టాలన్నంత. ఎదురుగా వున్న టీవీని బద్దలు కొట్టాలన్నంత. కానీ కంట్రోల్ చేసుకున్నారు. నిజమే కోపం వస్తే, ఎవరికైనా అంతే. కానీ కొందరే కంట్రోలు చేసుకోగలరు. కొందరు అణుచుకోలేరు. కానీ అలాంటి వారిని చుట్టూ వున్నవారు పెద్దగా హర్షించరు. అయినా కూడా కోపం వెళ్లగక్కాలనుకునే వారి కోసం డల్లాస్‌లోని ఓ మహిళా వ్యాపారవేత్త డొన్నా అలెగ్జాండర్ ‘కోపాలగది’ని ఒకదాన్ని ఏర్పాటుచేసారు. ఎవరన్నా తమ కోపాన్ని అణుచుకోకుండా, విచ్చలవిడిగా ఈ గదిలో ప్రవర్తించవచ్చు. అయిదు, పదిహేను, ఇరవై అయిదు నిమిషాల లెక్కన ఈ గదిలో గడపవచ్చు. ఎవరికి కావాల్సిన సెట్టింగ్ వారికి వుంటుంది. కిచెన్, లివింగ్‌రూమ్, ఆఫీస్ రూమ్ ఇలా. తక్కువ రకం ఫర్నిచర్, టీవీ సెట్లు, డెకొరేటివ్ సామగ్రి ఇక్కడ వుంటాయి. కోపంలో ఏదైనా పగల కొడుతున్నపుడు దెబ్బలు తగలకుండా శిరస్త్రాణం, చేతికి గ్లవ్స్, కళ్లకు అద్దాలు, ఫేస్ మాస్క్ ధరించి విధ్వంస రచనకు పూనుకోవచ్చట. ఇంతకీ ఇలాంటి గది ఒకటి ఏర్పాటు చేయాలన్న ఆలోచన డొన్నా అలెగ్జాండర్‌కు పదహారో ఏటే వచ్చిందట. ముందుగా తన ఇంటి గ్యారేజ్‌లో ఇటువంటి దాన్ని ఏర్పాటు చేసి, తన స్నేహితుల్లో కోపాన్ని అణుచుకోలేని వారికి మార్గదర్శకత్వం చేసి, ఆఖరికి ఇలా పూర్తి వ్యాపారంగా మార్చేసారు. కోపం, ఆవేశం ఎంత ఉవ్వెత్తున వచ్చినా, అది కాస్తా పదిహేను నిమిషాల్లోనే అంతమైపోతుందని, విధ్వంసానికి ప్రేరేపించే శక్తి కూడా నీరసించిపోతుందని విశే్లషిస్తున్నారామె. ఇంతకీ ఈ గదిలోకి వెళ్లి కోపం అణుచుకురావడానికి ఎంత చార్జి చేస్తుందో..తెలియదు..అడిగితే ఆవిడకేమైనా కోపం వస్తుందేమో?
ట్రాన్స్‌ఫార్మర్ సినిమా చాలా మందికి గుర్తుండే వుంటుంది.
english title:
blog.. blog
Date:
Sunday, April 15, 2012