ఒకప్పుడు అమెరికా వెళ్లటమంటేనే చాలా గ్రేట్! ఎంత పెద్ద టౌన్ అయినా మహా అయితే ఏ పది మందో అమెరికా వెళ్లిన వాళ్లుండేవారు.
వెళ్లిన వాళ్లు ఓ పట్టాన వెనక్కు వచ్చేవారు కాదు. ఏ పదేళ్లకో సెలవు పెట్టి ఇండియా వచ్చి ఓ నెల రోజులు గడిపి మళ్లీ పారిపోయేవాళ్లు.
ఆ నెల రోజులూ వాళ్లు ఇండియాలోని భయంకరమైన పరిస్థితులను చూసి షాకయిపోతుండేవాళ్లు.
‘ఓ గాడ్! మున్సిపాలిటీ సప్లయ్ చేసే ప్రొటెక్టెడ్ వాటర్‌లోనే ఇన్ని రకాల పురుగులున్నయ్యా?’
‘ఓర్నాయనో గవర్నమెంట్ బస్‌లే ఇంత పొల్యూషన్ కలిగిస్తున్నాయా?’
‘అమ్మో! జనం అలా వందలు వేలు అలా రోడ్‌పక్కనున్న ఓపెన్ కిచెన్‌లో ఆ దుమ్మూ ధూళిలో వండే ఫలహారాలు తింటున్నారా?’
‘హెల్! రోజుకి ఆరు గంటలు కరెంట్ ఉండదా?’
‘హా! ఇది నేషనల్ హైవేనా? మూడొంతుల రోడ్ లారీలూ, కార్లూ, ఆటోలూ పార్క్ చేసేశారు. మిగతా ఒక వంతులో తోపుడు బళ్లు, ఫుట్‌పాత్ బిజినెస్‌లూ..’
ఇవన్నీ వాళ్లు సిన్సియర్‌గా ఫీలయ్యిన కామెంట్సే గానీ దేశాన్ని కించపరిచేవి కాదు.
అంటే అమెరికాలోని ఒక మంచి జీవితానికి అలవాటు పడి, మన దేశం ఇంకా ఇంత వెనుకబడుందా అనే ఫీలింగ్ వారికుండేది. ఇండియా కూడా అమెరికా లాగా మారిపోవాలని వాళ్లు కలలు కంటూండేవారు.
కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.
ఇప్పుడు ఊరికి పది శాతం ఫామిలీస్ నుంచే అమెరికా మొఖం చూడని వాళ్లుంటున్నారు. మిగతా అందరూ కేరాఫ్ అమెరికా!
ఎక్కువ చదివిన వాళ్లూ, అస్సలు చదువుకోని వాళ్లూ, డబ్బెక్కువయిన వాళ్లూ, అందరూ అమెరికాలోనే మకాం!
పాత జనరేషన్‌కీ ఈ జనరేషన్‌కీ తేడా ఏంటంటే వీళ్లు అమెరికాలోని మంచికి ఇన్‌ఫ్లుయెన్స్ అవరు. అమెరికాలో ఉన్నందుకు ఒక మంచి అమెరికన్ సిటిజన్ లాంటి వ్యక్తులుగా రూపొందాలని ఏ మాత్రం ప్రయత్నించరు.
ఇండియాలో ఫ్రెండ్ పెళ్లికి అమెరికా నుంచి వచ్చిన వాళ్లు బిహేవియర్ చాలా పెళ్లిళ్లలో మనక్కనపడుతుంది.
‘కట్నం ఎంత తీసుకున్నావ్? వ్వాట్ పాతిక లక్షలేనా? హారిబుల్! నాకు రెండు కోట్ల కట్నం ఇచ్చాడు మా ఇండియన్ మామ తెలుసా?’
‘పెళ్లవనీరా - మనాడు మాత్రం వదుల్తాడేంటి? ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో వసూలు చేస్తాడు’
ఇంకో పెళ్లిలో పెళ్లికూతురి కజిన్ సిస్టర్ అమెరికా నుంచి వస్తుంది.
‘వ్వాట్! ఆ చెత్త విడిదింట్లో ఉండాలా? అయామ్ సారీ! నాకు హోటల్‌లో ఏసీ రూమ్ వేయించండి’
‘సరే మేడమ్ - విడిదింటి దగ్గరే ఒక హోటలుంది. అందులో ఏసీ రూమ్ బుక్ చేస్తాం...’
‘హలో - అలాంటి చెత్త హోటల్లో ఉండను. ఫైవ్‌స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేయండి. అంతేకాదు ఒక కారు నా కోసం ఏర్పాటు చేయండి. మా హజ్‌బెండ్ సైట్ సీయింగ్ కెళ్లాలంటున్నాడు’
ఇలా ఎదుటోడి డబ్బుతో లైఫ్ ఎంజాయ్ చేయాలనే వాళ్ల మెంటాలిటీ ప్రపంచమంతా తిరిగినా మారదు.
అమెరికాలో కూడా మనవాళ్ల ప్రవర్తన ఎంత దారుణంగా ఉంటుందంటే ‘ఇండియన్’ అంటేనే అమెరికన్స్‌కి ద్వేషం కలిగించేలా ఉంటుంది. ఇండియన్ టెంపుల్‌కి మన వాళ్లు వెళ్లారంటే ఆ టెంపుల్ చుట్టుపక్కల రోడ్లపై మన వాళ్లు అడ్డదిడ్డంగా - ఇంకో కారు కదలడానికి వీల్లేని విధంగా - పార్క్ చేసిన వాహనాలతో నిండిపోయి ఉంటుంది.
చాలా సందర్భాల్లో ఆ చుట్టుపక్కల రెసిడెంట్స్ పోలీస్ సాయంతో ఆ కార్లు తొలగిస్తూంటారు.
ఇక ఇండియన్ సినిమా అక్కడ రిలీజయిందంటే చాలు - ఇండియాలో అభిమాన సంఘాల వాళ్ల కంటే ఎక్కువ న్యూసెన్స్ చేస్తూంటారు. థియేటర్‌లో అరుపులు, కేకలు, ఈలలు.
ఇవన్నీ అమెరికన్స్‌కి చికాకు కలిగించే విషయాలు.
అయితే అక్కడి ఇండియన్స్‌ని అమితంగా లైక్ చేసే అమెరికన్స్ కూడా కొంతమంది ఉన్నారు.
వాళ్లు రాబరర్స్-
వాళ్లు కేవలం మన వాళ్లుండే కాలనీల్లోనే - మన వాళ్ల ఇళ్లల్లోనే దొంగతనాల కొస్తారు.
ఎందుకంటే మన వాళ్లకు బంగారం మీదున్న మోజు వాళ్లకు తెలుసు.
*
సరదా సంగతులకు సెటైర్ తాలింపు
english title:
hello mike testing
Date:
Sunday, April 15, 2012