పురుగుల నుండి తమను తాము రక్షించుకునేందుకు కాఫీ మొక్కలు కెఫీన్‌ను ఉత్పత్తి చేస్తాయి. కాఫీ వల్ల మేలుకన్నా హాని ఎక్కువ జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కాఫీ, టీలు కొకెయిన్, హెరాయిన్ లాంటి మత్తు మందులంటున్నారు. అలవాటయితే వాటిని మానడం కష్టం. కాఫీ విషయంలో అందులోని కెఫీన్ మెదడుకు తాత్కాలికంగా ఉత్తేజాన్ని కల్గిస్తుంది. దీర్ఘకాలంలో హాని చేస్తుందని అంటున్నారు.
కొంతమంది పరిశోధకులు ‘కెఫిన్’ మత్తు పదార్థం కాదని నిరూపిస్తున్నారు. కాని కెఫిన్ ఆరోగ్యాన్ని ఎంతో కొంత దెబ్బ తీస్తుందని మరి కొందరు పరిశోధకులు చెబుతున్నారు.
మెదడులోని ఇతర భాగాల్లో ఉత్పత్తి అయ్యే ‘అడినోసిన్’ అనే ఒక రసాయనిక పదార్థం మీద కెఫీన్ తన ప్రభావం చూపుతుంది. కాఫీ తాగగానే మన మెదడు చురుకుగా పని చేయడానికి కారణం - ‘అడినోసిన్’ అనే రసాయనాన్ని ప్రేరేపించే నాడీ కణాలను కెఫీన్ అడ్డుకుంటుంది.
మెదడు నుండి నాడీ సంకేతాన్ని తీసుకుపోయే న్యూరోట్రాన్స్‌మీటర్ల చురుకుదనం తగ్గించడం ‘అడినోసిన్’ సహజ లక్షణం. అయితే కెఫీన్ ఈ ‘అడినోసిన్’ను అడ్డుకోవడంతో పరోక్షంగా మెదడు చురుకుదనానికి దోహదపడుతుంది. కొకెయిన్, హెరాయిన్, నికోటిన్లు కూడా ఇదే పని చేస్తాయి. అందుకే కెఫీన్‌ను మత్తుమందులతో పోల్చడం జరిగింది. పరిశోధకులు మాత్రం కెఫీన్‌ను వాటి జాబితాలో చేర్చడం సమంజసం కాదంటున్నారు.
కెఫీన్‌కు మెదడు క్రియాశీలతను పెంపొందించే గుణం ఉన్నప్పటికీ ఇది ఇతర మందులు మాదిరిగా అలవాటయ్యే అవకాశం లేదు. సమయానికి మత్తుమందు తీసుకోకపోవడం వల్ల వచ్చే చికాకు, మానలేకపోవడం లాంటి విషయాల్లో కెఫీన్‌కు ఇతర మత్తుమందులకు చాలా తేడా ఉందని పరిశోధకుల వాదన.
విష ధాతువులను తొలగిస్తుంది
పరిశ్రమల నుండి విడుదలయ్యే విష ధాతువుల వల్ల తాగునీరు కలుషితం కావడం నేడు సాధారణమయింది. రాగి, సీసం, పాదరసం తదితర ధాతువుల కణాలు జలాలను విషతుల్యం చేస్తున్నాయి.
కాలుష్య నీటిని తాగడం వల్ల అనేక రకాల శారీరక, మానసిక అవలక్షణాలు కలుగుతాయి. విష ధాతువులను తొలగించాలంటే నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇది ప్రయాసతో, ఖర్చుతో కూడిన పని. ఒకవేళ శుద్ధి చేసినా నీటిని సరఫరా చేసే పైపుల వల్ల కాపర్, లెడ్ లాంటి ధాతువులు నీటిలో కలుస్తాయి.
ఈ ధాతువులు అయాన్ల రూపంలో ఉంటాయి. ఈ కలుషిత జలాల్లోని విష ధాతువులను కాఫీ రేణువులు తొలగించగలవని తాజా పరిశోధనలలో వెల్లడైంది. నీటిలోని విష ధాతువులను 78 నుండి 90 శాతం వరకు ‘కాఫీ’ తొలగించగల్గింది.
సాధారణంగా నీటిలో కలసిపోయిన విష ధాతువులు ధనావేశం కల్గి ఉంటాయి. కాఫీ పదార్థంలో రుణావేశ, ఆవేశ రహిత కణాలుంటాయి. దీనివల్ల నీటిలో కాఫీ పొడి వేసినపుడు ఈ రెండు రకాల ధాతువులు స్థిరీకరణ చెంది నీటి నుండి వేరుపడతాయి. కాఫీ ఎంత చిక్కగా ఉంటే శుద్ధి అంత బాగా జరుగుతుంది.
మంచినీటికి కాఫీ ప్రత్యామ్నాయం కాఫీ. కాని కాఫీ తాగే సమయంలోనైనా విష ధాతువులకు దూరంగా ఉండవచ్చు నంటున్నారు పరిశోధకులు.
ఇటీవల పరిశోధనలలో కాఫీలో టైప్-2 డయాబెటీస్‌ను నిరోధించే గుణం ఉందని పరిశోధకులు గుర్తించారు.
కాలేయానికి రక్షణ
కాలేయానికి సంబంధించిన ‘సిరోసిస్’ వ్యాధి ప్రమాదకరమైనది. కాలేయంలోని కణజాలం మధ్య నార వంటి పదార్థం ఏర్పడటం వల్ల దానిలోని మృదుత్వం నశించి గట్టిపడుతుంది. వాపు వంటిది ఏర్పడి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.
మితిమీరి మద్యం సేవించే వ్యక్తులు ‘సిరోసిస్’ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు ఇదివరకే హెచ్చరించారు. రోజుకు కనీసం మూడు నాలుగు కప్పుల కాఫీ సేవిస్తే ఈ హానికర వ్యాధి నుండి 50 శాతం వరకు రక్షణ లభిస్తుందని నార్వేకు చెందిన శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.
సిరోసిస్ వ్యాధి నుంచి రక్షణనిచ్చే లక్షణాలు కాఫీలో ఉన్నట్లు వీరు కనుగొన్నారు. రోజుకు రెండు నుండి మూడు కప్పుల కాఫీని మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల నుండి కూడా రక్షణ లభిస్తుందని తెలియజేస్తున్నారు ఈ శాస్తవ్రేత్తలు.
మోతాదు మించని కాఫీ సేవనం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా రక్షణ లభిస్తుంది. జెట్‌లాగ్ నుండి ఉపశమనం దొరుకుతుంది. మానసిక వత్తిడి వల్ల, ఉత్పన్నమయ్యే ఆత్మహత్య వంటి ప్రమాదకరమైన ఆలోచనల నుండి మనసును పక్కకు మళ్లిస్తుంది కాఫీ. పార్కిన్‌సన్స్, ఆల్జీమర్స్ లాంటి వ్యాధులను నిరోధించే శక్తి కాఫీలో ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
*
‘కాఫీ’ కొంగ్రొత్త సంగతులు!
english title:
science site
Date:
Sunday, April 15, 2012