గుంటూరు, ఏప్రిల్ 15: రానున్న ఉప ఎన్నికల్లో జగన్‌ను ఏవిధంగానైనా అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కుల, మతాల ప్రస్తావన తెస్తూ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరులోని ఓ హోటల్‌లో ఆయన విలేఖరులతో ఆదివారం మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఉప ఎన్నికలను ఎదుర్కొనే సత్తాలేకే కాంగ్రెస్ నాయకులు చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ జగన్‌ను అన్నివర్గాల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సోనియాగాంధీ ఏ కులం, ఏ మతం నుంచి వచ్చారో కూడా ప్రచారం చేయండంటూ అంబటి సూచించారు. జగన్ లక్ష కోట్లు సంపాదించాడని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాకుండా దొడ్డిదారిన మంత్రి అయిన రామచంద్రయ్య ప్రచారం చేయాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లక్ష కోట్లు అన్నమాట ఫ్యాషన్‌గా మారిందని, సాక్షాత్తు సిబిఐ చార్జిషీటులోనే 30 కోట్ల రూపాయల మేరకే అభియోగం మోపారన్న విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. 18 నియోజకవర్గాల్లో గెలుపొంది అసెంబ్లీలో రెండవ అతిపెద్ద ప్రతిపక్షపార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించనుందని చెప్పారు. ఉప ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలకు అకస్మాత్తుగా కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ఘనత ఆయా ప్రాంతాల్లో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. విలువల కోసం రాజీనామా చేయబట్టే ప్రభుత్వం త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కోట్లరూపాయల నిధులను విడుదల చేసిందని ఆరోపించారు. తాజాగా ఎంపి లగడపాటి రాజగోపాల్, మంత్రి టిజి వెంకటేష్ చేస్తున్న వ్యాఖ్యలు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలను బ్లాక్‌మెయిల్ చేసేవిగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌లో నెలకొన్న గందరగోళాన్ని ముందుగా నివృత్తిచేసుకొని ఆ తర్వాత మాట్లాడాలని అంబటి హితవు పలికారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి
english title:
ambati
Date:
Monday, April 16, 2012