తిరుపతి, ఏప్రిల్ 15: తాను నటించిన చిత్రం ఎలా వుంది అన్న విషయాన్ని ప్రేక్షక మహాశయులు చెపుతారని ప్రముఖ టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. గబ్బర్‌సింగ్ ఆడియో రిలీజింగ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగనున్న నేపధ్యంలో ఆయన శ్రీవారి దర్శనార్ధం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుండి కారులో నేరుగా తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆయన్ని కలిసిన విలేఖరులు ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎలా వుంటుందని అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు. ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆయన తాను వచ్చిన ప్రత్యేక విమానంలోనే హైదరాబాద్ తిరిగి వెళ్లారు.
రూ.300 కోట్లతో విత్తన క్షేత్రాల అభివృద్ధి
ఉండి, ఏప్రిల్ 15: రాష్ట్రంలో విత్తన క్షేత్రాల అభివృద్దికి రూ.300 కోట్లతో ప్రణాళిక సిద్ధమయ్యిందని వ్యవసాయ శాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ (సీడ్స్) డాక్టర్ వి జయకుమార్ వెల్లడించారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఉండిలోని వ్యవసాయ శాఖ విత్తనాభివృద్ధి క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో విత్తన కొరత తీర్చడానికి వ్యవసాయశాఖ పలు చర్యలు చేపట్టిందన్నారు. రైతుల అవసరాల మేరకు సీడ్‌ను అందించే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పత్తి విత్తనాల ప్యాకెట్లు గత ఏడాది రాష్ట్రంలో రూ.కోటి 20 లక్షలు సిద్ధం చేయగా అందులో 80 లక్షలు మాత్రమే రైతులు ఉపయోగించుకున్నారన్నారు. తమ శాఖ పలు పరిశోధనలు చేసిన అనంతరం వాటిని మార్కెట్‌కు విడుదల చేసినట్టు చెప్పారు. వరి రైతులకు అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను ఇక్రిసాట్, డిఆర్‌ఆర్ నుండి సేకరించి ఇస్తామన్నారు. వరికన్నా ఇతర అపరాల సాగు కూడా మంచి లాభాలు తెచ్చిపెడుతోందన్నారు. ఉండి విత్తనాభివృద్ధి క్షేత్రం అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని జయకుమార్ కోరారు.
త్వరలో 25 కొత్తమండలాలు, 9 రెవెన్యూ డివిజన్లు...!
మంత్రి రఘువీరారెడ్డి
చిత్తూరు, ఏప్రిల్ 15: త్వరలో రాష్ట్రంలో కొత్తగా 25మండలాలు, తొమ్మిది రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్లు రెవిన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ప్రకటించారు. చిత్తూరు నగరంలో మెసానికల్ గ్రౌండ్స్‌లో రెవెన్యూక్రీడల ముగింపు ఉత్సవం రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.ఆనందరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఖాళీగా ఉన్న 7,200 పోస్టులను త్వరలో భర్తీచేసామన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు ఆనందరావు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీచేయాలని మంత్రిని కోరారు. రెవెన్యూ క్రీడల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి రఘువీరా స్పందిస్తూ భవిష్యత్తులో జరిగే రెవెన్యూ క్రీడలకు బడ్జెట్‌లోనే కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మన ముఖ్యమంత్రి క్రీడాకారుడని ఆయన క్రీడలకు ప్రాధాన్యత ఇస్తారని అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగులకు కలిపి క్రీడాపోటీలు నిర్వహించేలా సి.ఎంనోటిద్వారానే ప్రకటన చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
వైఎస్‌ను విమర్శిస్తే కాంగ్రెస్‌కు నష్టం
మాజీ మంత్రి గాదె
బాపట్ల, ఏప్రిల్ 15: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శిస్తే కాంగ్రెస్‌కు నష్టమని సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో స్థానిక విలేఖర్లతో ఆయన ఆదివారం మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు గొప్పగా ఉన్నాయన్నది వాస్తవమన్నారు. అయితే ఏవైనా తప్పులు జరిగి ఉంటే వాటిని ఎత్తిచూపడంలో తప్పులేదన్నారు. ఆయనను వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లడంతోపాటు, పార్టీకి ప్రజల్లో ఉన్న నమ్మకం పోతుందని గాదె వ్యాఖ్యానించారు.
మళ్లీ రాజకీయాలలోకి వస్తా : మోహన్‌బాబు
తిరుపతి, ఏప్రిల్ 15: అతి త్వరలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని ప్రముఖ సినీనటుడు డాక్టర్ మంచు మోహన్‌బాబు చెప్పారు. శ్రీవారి దర్శనార్ధం ఆదివారం తిరుమలకు వచ్చిన ఆయన తనను కలిసిన విలేఖరులతో ముచ్చటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి నియమాలకు కట్టుబడి వున్న రాజకీయ పార్టీలో చేరతానన్నారు. ఏ పార్టీలో చేరమంటారో మీరే చెప్పండంటూ విలేఖరులకు ప్రశ్నలు సంధించారు.
నేటి నుంచి మెడికల్ పిజి కౌన్సెలింగ్
విజయవాడ, ఏప్రిల్ 15: 2012-13 విద్యా సంవత్సరానికి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మెడికల్ పిజి సీట్ల భర్తీకిగాను సోమవారం నుంచి కౌన్సెలింగ్ జరుగబోతున్నది. ఈ కౌన్సెలింగ్‌లో 2303 సీట్ల భర్తీకిగాను యూనివర్సిటీలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పిజి, డిప్లొమా, సర్ట్ఫికెట్ కోర్సులకు సంబంధించిన సీట్లను యూనివర్సిటీ భర్తీ చేయనుంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1139 సీట్లు, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 1164 సీట్లు ఉన్నాయి. వర్సిటీ ఇటీవల నిర్వహించిన పిజి మెడికల్ ప్రవేశపరీక్ష, పిజి డెంటల్ ప్రవేశపరీక్షలో వచ్చిన ర్యాంకులు ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉస్మానియా, 19 నుంచి 21 వరకు ఆంధ్ర, 22 నుంచి 23వరకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిల్లోని వైద్య కళాశాల్లోని సీట్లను భర్తీ చేస్తారు. చివరిగా 24వ తేదీన నగరంలోని సిద్ధార్థ వైద్య కళాశాలలోని పిజి సీట్లను రాష్టస్థ్రాయిలో కౌనె్సలింగ్ నిర్వహిస్తారు. 25, 26 తేదీల్లో మూడు విశ్వవిద్యాలయాల పరిధిలోను అన్ రిజర్వ్‌డ్ చేసిన 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
వైభవంగా అనాథ వివాహం
తిరుపతి, ఏప్రిల్ 15: ఒక అనాథ బాలిక వివాహం నేడు అంగరంగ వైభవంగా తిరుపతిలో జరిగింది. ఏనిమిదేళ్ల కిందట సాయిలక్ష్మి అనే అనాథను ల తిరుపతిలో శివారు మంగళంలోని ప్రభుత్వ బాలల పునరావాస కేంద్రం పెంచి పోషించింది. ఆమె యుక్తవయస్సుకు రాగానే ఓ ఉద్యోగి వినోద్ వివాహానికి ముందుకు వచ్చాడు. దాంతో అధికారులు వివాహం చేసుకోడానికి ఏర్పాట్లు చేశారు. సాయిలక్ష్మి (18). వినోద్ వివాహానికి చిత్తూరు ఎంపి డాక్టర్ శివప్రసాద్, తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి, ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధి చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, డిఐజి చారుసిన్హా తదితరులు హాజరై ఆశీర్వదించారు.