సబ్బవరం, ఏప్రిల్ 16: ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పథకాల అమలుపట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంపట్ల ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎంతో నిబద్ధతతోపని చే యాల్సి ఉండగా బాధ్యతారాహిత్యం గా వ్యవహరిస్తున్నారని, ప్రజాపథం విజయవంతం చేసేందుకు ఉద్ధేశించిన సమీక్షా సమావేశానికి తమవద్ద ఉన్న సమాచారాన్ని ఎమ్మెల్యేకి ఇవ్వాలనే కనీస స్పృహ లేకపోవటం దారుణంగా ఉందన్నారు. గత మూడేళ్లుగా ఉన్న ఎమ్మెల్యే పంచకర్లకు ఇకపై ఎమ్మెల్యే రమేష్‌బాబుకు తేడా చూడాల్సి వస్తుందని మండిపడ్డారు. ఇక్కడి ఐకెపి ఎపిఎం.ఓ. రత్నకుమారి పాత్రోను హెచ్చరిస్తూ ఇక్కడ బాధ్యతారహితంగా పనిచేస్తున్నారన్నారు. స్ధానిక పిహెచ్‌సి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీతులసిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి నిర్వహణలో లోపాలపై ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. దీనికి డాక్టర్ లక్ష్మితులసి జవాబిస్తూ ఇప్పుడు బడ్జెట్‌లో నిధులను 80వేల నుంచి లక్ష రూపాయలకు పెంచటంతో సమస్యలు లేవన్నారు. ఆర్‌ఇసిఎస్ ఎపిఇ శివకుమార్‌ను ఎమ్మెల్యే నిలదీస్తూ మీరు ఆర్‌ఇసిఎస్.లో ఉన్నామనే తప్పుడు సంకేతంతో పనిచేస్తున్నారని, మీ సంస్థకూడాప్రభుత్వంలో భాగమని తెలియటంలేదన్నారు. కనీసం ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని, ఎక్కడెక్కడ హైమాస్ట్‌లైట్లు వేశారు? ఎందుకుమరోచోట వేయలేకపోయారో వివరాలు ప్రజాపథంలో తెలిపేందుకు పై అధికారులను ఆహ్వానించమన్నారు. 104,108 అంబులెన్స్ వాహనాల నిర్వహణపై డి.ఆర్.డి.ఎ. అధికారులతో మాట్లాడుతానన్నారు. మంచినీటి సరఫరాలో అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయ ని, ప్రజాపథం సభల్లో ప్రజలు ఫిర్యాదు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు రచ్చబండ, ప్రజాపథంలో ఇచ్చిన దరఖాస్తుల సమస్యలను పరిష్కరించలేమా? అని ప్రశ్నించారు. సుమారు 100 కోట్లరూపాయల నిధులను ప్రజాపథం కోసం ప్రభుత్వం ఖర్చుచేస్తుందని వా టిని సద్వినియోగం చేయటం ద్వారా ప్రజలకు మేలు జరిగేలా చూసి సహకరించాలనేదే తన ఉద్ధేశ్యమన్నారు. ఈసమావేశానికి గైర్హాజరైన అధికారుల జాబితాను ఎమ్మెల్యే తీసుకుని కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి యుసి జి నాగేశ్వరరావు, తహశీల్దార్ ఎస్.డి. అనిత, ఎంపిడిఒ సిహెచ్.వెంకటలక్ష్మి,ఆర్‌ఇసిఎస్ డైరెక్టర్ ఎస్.నారాయణమూర్తి,కాంగ్రెస్ నేతలు గవరశ్రీనివాసరావు,పిబివిఎస్‌ఎన్ రాజు(బుచ్చిరాజు), సాలాపు వెంకటేశ్వరరావు, గొర్లి అచ్చిమనాయుడు, బి.అప్పారావు, కరణం రామనాయుడు, అధికారులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ పనులకు కూలి పెంపు
ఐ.టి.డి.ఎ. పి.ఒ. శ్రీకాంత్
పాడేరు, ఏప్రిల్ 16: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులకు ఈ నెల నుంచి ఉపాధి కూలీ పెంచినట్టు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి కె.శ్రీకాంత్ ప్రభాకర్ తెలిపారు. డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ పరిశీల గ్రామంలో సోమవారం నిర్వహించిన ప్రజాపథంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ప్రస్తుతం రోజుకు 121 రూపాయలు చెల్లిస్తుండగా ఇకపై 137 రూపాయలు చెల్లించనున్నామని చెప్పారు. ఉపాధి పనులపై కూలీలకు చెల్లింపులు చేపడుతున్నప్పుడు తప్పనిసరిగా పేస్లిప్‌లను అందజేసే విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు. పనులు చేస్తున్న కూలీల సొ మ్మును స్వాహా చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని కూలీలకు సొమ్ము చెల్లించేటప్పుడు తప్పనిసరిగా పేస్లిప్‌లను అందజేసే విధంగా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. దీనివలన పనులు చేసిన కూలీలకు ఎం త సొమ్ము వచ్చిందీ స్పష్టంగా తెలిసే అ వకాశం ఉంటుందని, తద్వారా అక్రమాలను నివారించవచ్చునని ఆయన చెప్పారు.
కూలీలు సొమ్ము తీసుకునేటప్పుడు పేస్లిప్‌లను అడిగి తీసుకోవాలని, వీటిని ఇవ్వకపోతే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఉపాధి కూలీలను సకాలంలో చెల్లించేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ పథకం కింద రాతి కట్టడాల పనులు చేయకుం డా ట్రెంచ్ పనులు చేపడితే భూములు అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు. గ్రామంలో దోమతెరల పంపిణీ గురించి ప్రాజెక్టు అధికారి ఆరా తీసారు. కుటుంబ సభ్యుల ఆధారంగా దోమతెరలను పంపిణీ చేయాలని, ఇద్దరు ఉంటే ఒకటి, నలుగురు సభ్యు లు ఉంటే రెండు వంతున పంపిణీ చేయాలని ఆయన చెప్పారు. మన్యంలో మలేరియా నివారణకు పంపిణీ చేస్తున్న దోమతెరలను గిరిజనులు సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. గర్భిణులు ఆసుపత్రులలోనే ప్రసవం చేసుకోవాలని, ప్రసవానికి మూడు రోజుల ముందుగానే ఆసుపత్రి లో చేరాలని ఆయన సూచించారు. ఆసుపత్రిలో ప్రసవించే గర్భిణులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలినప్పుడు తక్షణమే వైద్య సిబ్బందికి సమాచారం అందించి వైద్య సేవలను పొందాలని ఆయన కోరారు.
ఏజెన్సీలో ఎక్కడా మందుల కొరత లేదని, ఆశ కార్యకర్తల వద్ద అవసరమైన మందులను అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆస్థుల పరిరక్షణకు గిరిజనులు సహకరించాలని ఆయన కోరారు. గిరిజన గ్రామాలలో విద్యుత్ తీగలు తరచూ చోరీలకు గురవుతుండడంతో అనేక గ్రామాలకు విద్యుత్ సదుపాయం నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఏజెన్సీలో ఈ నెలలో మలాథియన్ స్ప్రేయంగ్‌ను ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు. గిరిజనులు తప్పనిసరిగా తమ ఇళ్లలో స్ప్రేయింగ్‌ను చేయించుకుని దోమల నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకరించాలని కోరారు. మండలంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాల ప్రగతిపై సరైన సమాచారం అందించని గృహ నిర్మాణ సంస్థ అధికారులపై శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డుంబ్రిగుడ మండల ప్రత్యేక అధికారి జె.వెంకటరావు, తహశీల్ధార్ ఎల్.లక్ష్మీనారాయణ, ఎం.పి.డి.ఒ. అరుణ, గృహ నిర్మాణ సంస్థ డి.ఇ. సి.హెచ్.దేముడు, వైద్యాధికారి విద్యాసాగర్ పాల్గొన్నారు.
ఏలేరు కాలువలో ఇద్దరు మునక
కశింకోట, ఏప్రిల్ 16: భార్యపిల్లలను వదిలి విశాఖ జిల్లా కశింకోట గ్రామంలో జరిగే వివాహానికి ఆదివారం ఇద్దరు స్నేహితులు వచ్చారు. వీరిద్దరు ఒకేచోట వెల్డింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరేసి పిల్లలు ఉన్నారు. ఒకరికి ఇద్దరుపాపలైతే, మరొకరికి ఇద్దరు బాబులు ఉన్నారు. ఒకరికోసం మరొకరు ప్రాణాలు విడిచిన సంఘటన కశింకోటలో సోమవారం చోటుచేసుకుంది. విశాఖపట్నం పూర్ణామార్కెట్ రంగిరీజువీధికి చెందిన వంగలపూడి శివ(36), పెట్లి నాగరాజు(38) వీరిద్దరు విశాఖలో ఉన్న భాస్కర్ వెల్డింగ్ షాపులో పనిచేస్తుంటారు. ఆదివారం కశింకోటలో వివాహ కార్యక్రమం ఉండడంతో వీరిద్దరు ఇక్కడకు వచ్చారు. వివాహానికి వచ్చిన శివ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఏలేరు కాలువ వద్దకు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న మరో స్నేహితుడు నాగరాజు సోమవారం ఉదయం స్నేహితుడు కోసం గాలించేందుకు దిగాడు. దిగిన నాగరాజు ప్రస్తుతం కనిపించలేదు. ఇద్దరు మృతి చెంది ఉంటారని కశింకోట ఎస్.ఐ శ్రీనివాసరావు తెలిపారు. విశాఖకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, గాలించి ఓ మృతదేహాన్ని పట్టుకున్నామని, మరొకరికోసం గాలిస్తున్నామని ఎస్.ఐ తెలిపారు. మృతుడు శివకు భార్య మల్లేశ్వరి, నాలుగేళ్ల అక్షయ, ఏడాది పసిపిల్ల ఐశ్వర్య అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరొకరైన నాగరాజుకు వీర్రాజు, వంశీ అను ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అయితే శివ భార్య మల్లేశ్వరికీ ఈ విషయం ఇప్పటికీ బంధువులు తెలియజేయలేదు. ఈ విషయం తెలిస్తే భార్యపిల్లలు పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్త్తున్నారు. పిల్లలకు దిక్కెవరని వారు కన్నీరుపెడుతుంటే అక్కడున్నవారు సైతం కన్నీరు పెట్టకమానలేదు. ఏలేరుకాలవ ఒడ్డున ఉన్న బట్టలు, స్లిప్పర్స్ ఆధారంగా ఒక మృతదేహాన్ని గాలిస్తున్నట్లు ఎస్.ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.