కొయ్యూరు, ఏప్రిల్ 16: విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి, వర్థంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని రాష్ట్ర అల్లూరిసీతారామరాజు యువజన సంఘం అధ్యక్ష ,కార్యదర్శులు పడలా వీరభద్రరావు పి. రామరాజ్యం డిమాండ్ చేశారు. స్థానిక విలేఖర్లతో వారు మాట్లాడుతూ భగత్‌సింగ్, సుభాష్‌చంద్రబోస్ వంటి వీరుల జయంతి,వర్థంతులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంటే బ్రిటిష్‌వారిపై ప్రత్యేక్ష సాయుధపోరాటం చేసి తెలుగుజాతి ప్రతాపాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన అల్లూరి వర్థంతి, జయంతిలను కనీసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం తెలుగుజాతికే సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళినా దున్నపోతుమీద వర్షం కురిసిన చందంగా ఉందని విమర్శించారు. మండలంలోని మంప, రాజేంద్రపాలెంలో అల్లూరి స్మారక మందిరాలు శిథిలావస్ధకు చేరుకుని బహిర్భూములుగా మారుతున్నా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిజన సంక్షేమ శాఖామంత్రి బాలరాజుకు పట్టకపోవడం దురదృష్టకరమన్నారు. అల్లూరు వంటి త్యాగధనుల పోరాటాలతో స్వాతంత్య్ర ఫలాన్ని అనుభవిస్తూ వారిని విస్మరిస్తే చరిత్రలో ద్రోహులుగా నిలిచిపోతారన్నారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంత శాసనసభ్యుడిగానైనా నియోజకవర్గ అభివృద్ధి నుండి నిధులు కేటాయించి అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు. ఈనెల 7వ తేదీన రాజేంద్రపాలెంలో అల్లూరి ప్రధాన స్మారక మందిరాన్ని మరమ్మతులు చేసి శిథిలమైన విగ్రహాల స్థానంలో మరో విగ్రహం ఏర్పాటుచేసి ఆయన వర్ధంతిని ఘనంగా చేయాలని నిశ్చయించుకున్నామన్నారు. అల్లూరి జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని, మంప, రాజేంద్రపాలెంలో శిథిలావస్ధకు చేరిన అల్లూరి స్మారక మందిరాలను పునర్ నిర్మించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి పరచాలన్నారు. కోస్తా జిల్లాల్లో ఉన్న గిరిజన ప్రాంతాలను విలీనం చేసి అల్లూరి జిల్లాగా ఏర్పాటు చేయాలని లేదా విశాఖ జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలని ప్రధాన డిమాండ్లతో ఈనెల 29,30 తేదీల్లో నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి బహిరంగ సభ జరపనున్నట్లు ఆయన తెలిపారు.
* సీతారామరాజు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడాల వీరభద్రరావు
english title:
announce officially
Date:
Tuesday, April 17, 2012