ముంచంగిపుట్టు, ఏప్రిల్ 16: కుమడ పంచాయతి, మద్దులబంద గ్రామంలోని ప్రజలందరూ రోగాల బారినపడి ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతుంటే వైద్యసిబ్బంది జాడ కానరావడం లేదని గిరిజన సంఘం నాయకులు వి.వెంకటరావు, కె.కామేశ్వరరావు అవేదన వ్యక్తం చేశారు. మండలంలోని కుమడ పంచాయతీ మద్దులబంద గ్రామంలో గత వారంరోజులుగా జ్వరాల బారినపడి కిల్లో కామయ్య(35), కిల్లో లక్ష్మి(55) మృతిచెందగా కిల్లో పండ్లో(25), వి.సత్తిబాబు(26), వంతలరాధ(24), వంతల కావ్య((3),వంతల సొనబం(55), కిల్లో సొనారి(45), కిల్లో లలిత(7), కిల్లో బొజ్జయ్య(25),కిల్లో గోపాలరావు(35)కిల్లో తిరుమల్లు(2),కిల్లో కామేశ్వరరావు(22),కిల్లో చిన్నమ్మి(21),కిల్లోసాయిబాబు(3),వంతల సత్తిబా బు(23),నూకరాజు(45),వంతల చిత్ర (55) తీవ్ర అనారోగ్యంతో బాదపడుతూ మంచం పట్టారని వారు తెలిపారు. గ్రామంలోని వీరంతా సుమారు వారంరోజుల నుంచి విపరీతమైన జ్వరం, వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్నారని అన్నారు. గ్రామంలోని మూగజీవాలు సైతం ఇదే సమయంలో సుమారుగా 14 మంది వరకు మరణించాయని వారు తెలిపారు. వెంటనే వైద్యాదికారులు ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి గిరిజనుల ప్రాణాలను కాపాడాలని వారు కోరుతూ పశువైద్యశిబిరం ఏర్పాటు చేయాలని వారు కోరారు.
వైద్య సిబ్బంది పనితీరుపై
ప్రజారోగ్య అధికారి అసంతృప్తి
అరకులోయ, ఏప్రిల్ 16: విశాఖ మన్యం వైద్య సిబ్బంది పనితీరుపై అరకులోయ డివిజన్ సీనియర్ ప్రజారోగ్య అధికారి, విశాఖ కె.జి.హెచ్. ఎస్.సి., ఎస్.టి. ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.శంకరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో సోమవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది పనితీరు మెరుగ్గా లేకపోవడంవల్ల గ్రా మాల్లో ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుండడంతో వ్యాధుల బారిన పడే గిరిజనులు మృత్యువాత పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు అందుబాటులో ఉండకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో వ్యా ధులు విజృంభించి గిరిజనులను బలి తీసుకుంటున్నాయని ఆయన వాపోయారు. స్థానికంగా నివాసం ఉండి గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అం దించాల్సిన సిబ్బంది విశాఖపట్నం, విజయనగరం, శృంగవరపుకోట ప్రాంతాల లో నివాసం ఏర్పాటు చేసుకుని రాకపోకలను సాగిస్తున్నారన్నారు. వారంతా గ్రామాలకు వెళ్ళలేక మండల కేంద్రాల కు పరిమితం అవుతున్నారని చెప్పారు. గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేయవలసిన వైద్య సిబ్బంది చిత్తశుద్ది, అంకితభావంతో విధులు నిర్వర్తించక పోవడంవల్ల వ్యాధులు విలయతాండవం చేస్తూ గిరిజనులను పొట్టన పెట్టుకుంటున్నాయన్నారు. రోజువారి, నెలవారీగా ఇవ్వలసిన సమాచా రం అందజేయడం లేదని, కొందరు సి బ్బంది ఇచ్చే సమాచారం తప్పుల తడకగా ఉంటున్నాయని ఆయన విమర్శించారు. ఆశా వర్కర్లవద్ద ఉండే రికార్డులను సూపర్‌వైజర్లు తనిఖీ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడంవల్ల జనన మరణాలు, రో గుల వివరాలతో కూడిన నివేదికలు అందడంలేదని సిబ్బంది విధులకు డు మ్మా కొడుతున్న కారణంగా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. వైద్య సిబ్బంది తప్పుడు లెక్కలు చూపి పబ్బం గడుపుకొంటున్నారని, దీంతో పలు సమస్యలతో సతమతం కావల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయన్నారు. జనాభాను నియంత్రించడంలో భాగంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించవలసి ఉన్నప్పటికీ ఆ దిశగా ఎవరు ప్రయత్నించడం లేదని, దీంతో లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతున్నట్టు ఆయన వెల్లడించారు.
రెండో విడత పల్స్‌పోలియో నిర్వాహణకు నిధులను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ ఆ నిధులు సక్రమంగా వినియోగం కాలేదని ఆయన చెప్పారు. పల్స్‌పోలియో నిధుల ఖర్చుపై పలువురు సిబ్బంది దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపించారు. మాడగడ, గనె్నల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మాతాశిశు మరణాల సంఖ్య రోజురోజు కు పెరిగిపోతుందన్నారు. రెండు నెలల్లో 30 మంది తల్ల్లీబిడ్డలు మరణించినట్టు తమ ప్రాధమిక సర్వేలో వెల్లడైందని ఆయన తెలిపారు. రక్త హీనత, పౌష్టికాహార లోపం, ఇళ్ళ వద్ద ప్రసవం కారణాలవల్ల మాతాశిశు మరణాలు ఎక్కువగా జరుగుతున్నట్టు గుర్తించామన్నా రు. గిరిజన ప్రాంతాల్లో మాతాశిశు మరణాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని ఆయన కోరారు. మారుమూల గ్రామ గిరిజనులు జననీ శిశు సంరక్షక కార్యక్రమాన్ని వినియోగించుకునేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. స్వైన్‌ఫ్లూ వ్యాధిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త్త చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక నుంచి తమ ఆధీనంలో 104, 108 వాహనాలు ఉంటాయన్నారు. ప్రభు త్వం ప్రజారోగ్య అధికారి పర్యవేక్షణలో వాహనాలను ఉంచుతూ అవసరమైన ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆయన చెప్పారు. అత్యవసర కేసులకు ఈ వాహనాలను వినియోగించి గిరిజనుల మరణాలను నివారించేందుకు కృషి చేస్తామని శంకరరావు తెలిపారు.