మాడుగుల, ఏప్రిల్ 16: మండలంలో తాటిపర్తి, ఎం.కోడూరు, గొట్టివాడ, సాగరం పంచాయతి కేంద్రాలలో నిర్వహించిన ప్రజాపథంలో సమస్యల వినతులు వెల్లువెత్తాయి. సోమవారం మండలంలో జరిగిన ప్రజాపథంలో వినతులు, సమస్యలతో అధికారులను ప్రజలు ఉక్కిరిబిక్కిరి చేశారు. తాటిపర్తి, ఎం.కోడూరు, గొట్టివాడ, సాగరం పంచాయతీ కేంద్రాలలో నిర్వహించిన ప్రజాపధంలో అధికారులకు పెద్దసంఖ్యలో ఇందిరమ్మ గృహాల సమస్యలపై వినతులు అందాయి. కొత్త రేషన్ కార్డులు, జాబ్ కార్డులు, పింఛన్లు తమకు కావాలని కొందరు దరఖాస్తుచేసుకోగా, మరికొందరు తమకు జాబ్ కార్డులు ఉన్నప్పటికీ పని కల్పించడం లేదని అధికారులను నిలదీశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలలో పలుమార్లు తమ సమస్యలను అధికారుల ధృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేదని పలువురు వాపోయారు. దీంతో ప్రజాపథంలో ఎం.పి.డి.ఒ.శశీదేవి ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, తాతబ్బాయి. అధికారులు పాల్గొన్నారు.
చింతపండు కొనుగోలు నిలిపివేసిన జి.సి.సి.
పాడేరు(రూరల్), ఏప్రిల్ 16: గిరిజనుల నుంచి కొనుగోలు చేసే చింతపండును గిరిజన సహకార సంస్ధ(జి.సి.సి.) అర్ధాంతరంగా నిలిపివేసింది. జి.సి.సి. తీసుకున్న ఈ నిర్ణయంతో గిరిజనులు చింతపండును విక్రయించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జి.సి.సి. చింతపండును కొనుగోలు చేయకపోవడంతో దళారుల పాలవుతోందని పలువురు గిరిజనులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆర్ధికంగా గిరిజనులను ఆదుకోవలసిన గిరిజన సహకార సంస్థ్ధ వ్యాపార సంస్ధగా మారిందని గిరిజనులు అరోపిస్తున్నారు. గిరిజన సహకార సంస్థ్ధ చింతపండు మద్దతు ధరను కిలో 15 రూపాయలుగా నిర్ణయించి తమను ఆవేదనకు గురిచేసిందని వారు పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్ధితులలో జి.సి.సి. నిర్ణయించిన ధరకు అమ్మకాలను సాగిస్తుంటే, దీనిని కూడా నిలుపుదల చేయడం అన్యాయమని వారు వాపోతున్నారు. ఈనెల 15వ తేదీ నుండి అర్ధాంతరంగా వారపు సంతలలో చింతపండు కొనుగోలును నిలిపివేయడంతో ఎన్నో ఆశలతో వారపుసంతకు తీసుకువచ్చిన చింతపండును విక్రయించుకునేందుకు దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. కనీసం ముందస్తు సమాచారమైనా ఇవ్వకుండా జి.సి.సి. ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని వారు అంటున్నారు. ఈ విషయమై జి.సి.సి. ఉన్నతాధికారిని వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చింతపండు కొనుగోలును నిలిపివేసినట్టు పేర్కొన్నారు.
ఆదిమజాతి గిరిజనులను ఆదుకోండి
డుంబ్రిగుడ, ఏప్రిల్ 16: ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ఆదిమజాతి గిరిజనులు దుర్భర జీవితాలను సాగిస్తున్నారని సి.పి.ఎం.మండల కార్యదర్శి కె.దయానిధి అన్నారు. ఆదిమజాతి గిరిజనులు మారుమూల ప్రాంతాలలో నివసిస్తుండడం వలన ఆ ప్రాంతాల్లో సమస్యలు అరణ్యఘోషగానే మిగిలిపోతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాల అమలు ఈ ప్రాంతాలలో కానరావటం లేదని, వీరి జీవితాలు పూర్తిగా అడవి తల్లిపైనే ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆదిమజాతి గిరిజనుల గ్రామాల్లో మంచినీటి సమస్య అధికంగా ఉందని, సుమారుగా పి.టి.జి.గ్రామాలకు కాలిబాట తప్ప రహదారి నిర్మాణాలు చేపట్టిన దాఖలాలు లేవని ఆయన తెలిపారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కొద్దిపాటి గ్రామాల పి.టి.జి.ప్రజలు ఇందిరమ్మ ఇళ్ళు పొందినప్పటికీ అధికారుల అలసత్వం వలన గృహాలు సైతం నిర్మాణదశలోనే నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. ఆదిమజాతి గిరిజనుల గ్రామాల్లో విద్య, వైద్యం, విద్యుత్ వంటి సౌకర్యాలు మృగ్యమనే ఆయన అవేదన చెండారు. ఇప్పటికైనా అధికారులు గిరిజన ప్రాంతంలోని ఆదిమజాతి గిరిజనుల గ్రామాలకు వౌళిక సదుపాయాల కల్పనకు కృషిచేయాలని కోరారు. గిరిజన ప్రాంత అభివృధ్ధికి ప్రారంభించిన సమగ్ర గిరిజనాభివృధ్ధి సంస్ధ ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు నిధులను కేటాయించి మారుమూల ప్రాంతాల్లోగల ఆదిమజాతి గిరిజనులపై దృష్టిసారించి వారిని ఆదుకోవాలని దయానిధి కోరారు.