విజయనగరం , ఏప్రిల్ 16: యుగపురుషుడు, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి రోజున సీనియర్ రంగస్థల కళాకారులను సన్మానించడం గర్వంగా ఉందని అదనపు జాయింట్ కలెక్టర్ ఎం.రామారావు అన్నారు. స్థానిక ఆనందగజపతి కళాక్షేత్రంలో సోమవారం తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా జిల్లాకుచెందిన సీనియర్ రంగస్థల నాటక కళాకారులు వంగపండుప్రసాదరావు, నైదాన సత్యనారాయణ, అంపోలు జగ్గఅప్పలాచార్యులు. అంబళ్ళ సన్యాసప్పలనాయుడు, పెనుమత్స సద్గుణాదేవిలను రాష్ట్రప్రభుత్వం పక్షాన ఘనంగాసన్మానించి 10వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సన్మానితులందరూ తమ స్పందన తెలియజేస్తూ ఈ సత్కారాలు పొందడం తమకెంతో ఆనందంగా ఉందని చెబుతూ వారి స్పందనను పాటా, మాటా, పద్యాల ద్వారా తెలియజేశారు. ముందుగా తెలుగు నాటకరంగ చరిత్రను నటుడు ఎవి సుబ్బారావు వివరిస్తూ ప్రసంగించారు. కందుకూరి వీరేశలింగం ముందు ఎజెసి రామారావు జ్యోతిప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో పివి నరసింహరాజు, డిపిఆర్వో రమేష్, ఎపిఆర్వో జాకనమ్మ తదితరులు పాల్గొన్నారు. సభానంతరం కెకెఎల్ స్వామి రచించిన రాజువెడలె నాటిక ప్రదర్శించారు.
పర్యావరణంపై ప్రజాచైతన్య వారోత్సవాలు
విజయనగరం, ఏప్రిల్ 16: ఈనెల 22న ధరిత్రి దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణతోపాటు, భవిష్యత్తులో వచ్చే ముప్పు తదితర అంశాలపై ప్రజాచైతన్య వారోత్సవ కార్యక్రమాలను మంగళవారం నుంచి 22వరకు నిర్వహిస్తున్నట్లువ పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు ఎం.అప్పలనాయుడు మండలి సత్యనారాయణ తదితరులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం స్థానిక పంచాయతీరాజ్ చాంబర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిని విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల భూమి త్వరగా వేడెక్కుతుందని దీనికారణంగా అనేక అనర్థాలను మనం ఇప్పటికే చూస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రళయాలు రాకుండా నివారించేందుకు మనభూమిని మనం కాపాడుకునేందుకు మానవాళి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకుగాను నేటినుంచి పట్టణంలోని ఆర్టీసీకాంప్లెక్స్ రైల్వేస్టేషన్, అరుణాజ్యూట్ మిల్లు, కంటోనె్మంటు, గంటస్తంభం, తదితర ప్రధాన కూడళ్ళలో ప్రజాచైతన్య వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా 22న స్థానిక కోటజంక్షన్ వద్ద ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం చైతన్యవారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.
సామూహిక ఉపనయనాలు
విజయనగరం , ఏప్రిల్ 16: పట్టణ బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక గాయత్రి భవన్‌లో సోమవారం సామూహిక ఉపనయనాలను నిర్వహించారు. చేవూరి అనిల్ కుమార్ శర్మ, శీలా సోమేశ్వర శర్మ 12 మంది వటువులకు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు. ఈ సందర్భంగా పట్టణ బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షడు దవళ వెంకటరావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా సమాఖ్య ఆధ్వర్యంలో సామూహిక ఉపనయనాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సమాఖ్య కార్యదర్శి టి.ఎస్.ప్రకాశరావు, కూరెళ్ళ శ్రీనివాస్, ఎన్.బి.ఎస్.రామం, పి.వి.రమణమూర్తి, భరద్వాజ చక్రవర్తి, కాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఉపనయన కార్యక్రమాలతో ఈ ప్రాంతం కళకళలాడింది. సుమారు 300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు
గరివిడి, ఏప్రిల్ 16: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాపథం కార్యక్రమాన్ని వేదికగా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను ఇక్కడ చర్చించుకుని వాటిని పరిష్కరించుకునే దిశగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపథం కార్యక్రమాన్ని ఈమండలం చుక్కవలస గ్రామంలో సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఉద్ఘాటించారు. రాజకీయలబ్ది, ప్రభుత్వంపై బురదజల్లేందుకు విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజీలేని చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యుత్ ఛార్జీల విషయంలో విపక్షాలు చేస్తున్న రాద్ధాంతంలో వాస్తవం లేదన్నారు. 60 శాతం సామాన్య ప్రజానీకంపై విద్యుత్ ఛార్జీల భారం ఉండదని పేర్కొన్నారు. ఇక తాగునీరు, రైతుకు విద్యుత్ సరఫరా, ఉపాధి హామీ పనుల కల్పన, రైతులకు, మహిళా సంఘాలకు పావలా వడ్డీ రాయితీ వంటి సంక్షేమ పథకాలు క్రమం తప్పకుండా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు వాస్తవాలను మరుగున పెట్టి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి సభా వేదికపైనే ఉపాధిహామీ పథకం అమలు, కూలీలకు పనులు, వేతనాల చెల్లింపు వంటి అంశాలపై సమీక్షించారు. కూలీలను వేదికపైకి పిలిచి వేతనాల చెల్లింపు విషయంలో యంత్రాగం నుంచి వస్తున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స ఉపాధి హామీ పథకం అమలు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు మంచిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరొస్తుంది, చెడు చేస్తే ఆప్రభావం మాపై పడుతుందని అన్నారు. అలాగే తాగునీటి సమస్యలపై చర్చిస్తున్న సందర్భంలో స్థానికులు గ్రామంలో సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో 10 మంచినీటి బోర్లు ఉండగా ఎనిమిది పనిచేస్తున్నాయని, మరో రెండు మరమ్మతుకు గురయ్యాయని వివరించారు. అలాగే గ్రామంలోని రక్షిత మంచినీటి పథకం కింద 10 కొళాయి కనెక్షన్లు ఉండగా మరో అయిదు అవసరం అని స్థానికులు కోరగా రెండు బోర్లను, అయిదు కొళాయిలను అక్కడికక్కడే మంత్రి మంజూరు చేశారు. అనుకున్న సమయానికి గంటన్నర ఆలస్యంగా ప్రజాపథం కార్యక్రమం ప్రారంభంకాగా కొద్ది సేపటికే వర్షం మొదలు కావడంతో అర్ధాంతరంగా ముగించేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, ఆర్డీఓ రాజకుమారి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపిపికె.కృష్ణం నాయుడు, ఎంఎంసి చైర్మన్ విశే్వశ్వర రావు, ఆర్‌ఇసిఎస్ డైరెక్టర్ లక్ష్మణ, మాజీ సర్పంచ్ విజయ తదితరులు పాల్గొన్నారు.