విజయనగరం, ఏప్రిల్ 16: ఇప్పటికే గత రెండేళ్ళుగా ఖరీఫ్ సీజన్‌లో తగులుతున్న ఎదురు దెబ్బలతో జిల్లా రైతాంగం కుదేలవుతోంది. గత సారి తీవ్ర దుర్భిక్షం నెలకొనడంతో వేసిన వరి నారు దశలోనే ఎండిపోయింది. అంతకు ముందు సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వాతావరణం అనుకూలించి రికార్డు స్థాయిలో సాగు జరిగింది. ఇక పంట పండిందనుకున్న రైతును అకాల వర్షాలు ఒక్కసారిగా ముంచేశాయి. రెండు సంవత్సరాల్లో ఎదుర్కొన్న ఎదురు దెబ్బలతో వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితికి రైతులు వచ్చేశారు. ఈ తరుణంలో రానున్న ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయంపై రైతులు ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు. సాగు ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో పాటు ప్రకృతి సైతం చిన్నచూపు చూస్తుండటంతో రైతు ఖరీఫ్‌పై ఆశలను చంపుకోలేక, పెంచుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఏరువాకకు సాగితే దుక్కిదున్నడం నుంచి మొదలు పెట్టి పెట్టుబడుల మోత మోగుతోంది. ఇక ప్రభుత్వం తరపున అవసరమైన మేలు రకం విత్తనాలు రాయితీపై పూర్తిగా లభిస్తాయన్న ఆశ లేదు. జిల్లాలో ప్రతి ఖరీఫ్ సీజన్‌లోను 1.2 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తుంటారు. వీరికి దాదాపు 85 వేల క్వింటాళ్ళ వరి విత్తనాలు అవసరమవుతాయి. అయితే ప్రభుత్వ పరంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కేవలం 40 శాతం విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంచుతోంది. ఇవి కూడా రైతుకు అవసరమైన స్వర్ణ మసూరి వంటి రకాలు దొరకని పరిస్థితి. ఇక ప్రైవేటు డీలర్ల దగ్గర కొనుగోలు చేసిన విత్తనాలకు గ్యారెంటీ లేని పరిస్థితి. ఇవి కూడా ప్రతి సంవత్సరం ధరలు పెరుగుతూ రైతుకు అందనంత ఎత్తున ఉంటున్నాయి. ఇక ఎరువుల ధరలు, వాటి లభ్యతపై కూడా రైతుకు ఇప్పుడు పూర్తిస్థాయి నమ్మకం కుదరట్లేదు. ఇప్పటికే యూరియా ధర గత రెండేళ్ళతో పోలిస్తే విపరీతంగా పెరిగాయి. జిల్లా ఖరీఫ్ అవసరాలకు గాను 42వేల టన్నుల యూరియాతో పాటు 20 వేట టన్నుల డి.ఎ.పి, మరో 13వేల టన్నుల పొటాష్, 17 వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువురు అవసరమవుతాయి. వీటి ధరలు సైతం గతేడాదితో పోలిస్తే నూరు శాతానికి పైబడిపెరిగాయి.
ఇక వ్యవసాయ పనులకు ఉపయోగించే యంత్ర పరికరాలు, వాటి ఇంధన ఖర్చులు సైతం తడిసిమోపెడవుతున్నాయి. కూలీల విషయంలో కూడా రైతు మాటకు చెల్లుబాటు దక్కట్లేదు. వ్యవసాయ పనుల్లో అధికంగా మహిళా కూలీలు పనులు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు ముమ్మరంగా జరుగుతుండటంతో మహిళలు వ్యవసాయ పనులపై మక్కువ చూపని పరిస్థితులు ఉన్నాయి. రోజుకు ఆరు గంటల పాటు పనిచేస్తే 130 రూపాయల కూలి గిట్టుబాటయ్యే విధంగా ఉపాధి పనులు చేపడుతున్నారు. ఉపాధి పనులకు వెళ్ళడం వల్ల ఇతర ప్రభుత్వ తాయిలాలు కూలీలకు అందే పరిస్థితులు ఉన్నాయి. దీంతో వ్యవసాయ పనుల సమయంలో కూలీలు దొరక్క రైతు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు గతంలో సంభవించాయి. మొత్తం మీద వ్యవసాయం అంటేనే హడలిపోయే పరిస్థితుల్లో రైతు రాబోయే ఖరీఫ్‌కు సమాయత్తమవుతున్నాడు.
కోర్కెలను నియంత్రించుకోవాలి
విజయనగరం, ఏప్రిల్ 16: మానవుల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి, కోరికలు నశించాలని శివనాగబాబా అన్నారు. మూడు దశాబ్దాల అనంతరం స్వస్థలమైన గోవిందపురానికి సోమవారం వచ్చిన ఆయనకు స్థానిక రామాలయం వద్ద ప్రజానీకం ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా బాబా మాట్లాడుతూ ఆత్మనిగ్రహాన్ని పెంచుకోవడం ద్వారా కోరికలను నియంత్రించుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. మనిషి అవసరాలు తీర్చుకునేందుకు కోరికలు పుట్టడం సహజమని, అయితే మితిమీరిన అత్యాశ, కోరికలు మనిషిని పెడత్రోవన పెడతాయన్నారు. తృప్తిలో ఉన్నంత హాయి మరెక్కడా ఉండదన్నారు. కోరికలు పెరిగితే ఆత్మనిగ్రహం కోల్పోతామని, తద్వారా అనేక శారీరక రుగ్మతలు మనిషిని పట్టి పీడిస్తాయని అన్నారు. చాలాకాలం తర్వాత గ్రామానికి వచ్చిన శివనాగబాబాకు స్థానిక రామాలయం వద్ద మాజీ సర్పంచ్ విక్రమ్ జగన్నాధం స్వాగతం పలికారు. భక్తులు, మహిళలు బాబాను దర్శించుకున్నారు. మాజీ ఎం.పి కె.సంజీవరావు, కె.రఘుబాబు, పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన భక్తులు ఆయనను దర్శించుకున్నారు. అనంతరం ఆయన గోవిందపురం ముక్త్ధిమ్‌ను సందర్శించారు. ముక్త్ధిమ్ అమ్మకు రెండో కుమారుడైన శివనాగబాబా మూడు దశాబ్దాల కిందటే దేశ సంచారానికి వెళ్ళిపోయారు. ఈ కాలంలో ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తూ 108 ఆశ్రమాలను స్థాపించారు. మానవునిలో జ్ఞానం, దయాగుణం వంటి అంశాలను పెంపొందించేందుకు ప్రచారం చేస్తున్నారు.