విజయనగరం ,, ఏప్రిల్ 16: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నాటి గ్రీవెన్స్‌లో వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులే అత్యధికంగా అందాయి. వికలాంగ ధ్రువీకరణపత్రాల కోసం ఎక్కువసంఖ్యలో వినతులందజేశారు. జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య , జాయింట్ కలెక్టర్ పి.ఎ.శోభ వినతులు స్వీకరించారు. బలిజపేట మండలం నారాయణపురం గ్రామంలోని రక్షితనీటి పథకానికి సంబంధించి అక్రమ కుళాయి కనెక్షన్‌లు తొలగించాలని కోరుతూ సింహాద్రినాయుడుతోపాటు పలువురు వినతులిచ్చారు. విజయనగరం అవనాపువీధిలో నివసిస్తున్న గుమ్మడి నారాయణమ్మకు ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇంటికి పునాదులు నిర్మించి మూడు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ హౌసింగ్ అధకారులు బిల్లు ఇవ్వలేదని, ఈ విషయంపై విచారణ జరిపించి న్యాయం చేయాలని జిల్లా రజకసమాఖ్య ప్రతినిధులు కోరారు. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా సేవలందిస్తున్న విద్యావాలంటీర్ల వేతనాలను పెంచాలని తంగుడుబిల్లకు చెందిన సన్యాసప్పడు వినతినిచ్చాడు. సీతానగరం మండలం రామవరం గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్య పరిశీలించాలని ఆ గ్రామమహిళలు అభ్యర్థించారు. తోటపల్లి నిర్వాసితులమైన తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇప్పించాలని బొబ్బిలి మండలం కొండదేవుపల్లికి చెందిన రైతులు కోరారు. ఎస్సీ కార్పొరేషన్ రుణం ఇప్పించాలని బొబ్బిలి మండలం పక్కికి చెందిన జి.అప్పలనాయుడు వినతినిచ్చాడు. వికలాంగ ధ్రువీకరణపత్రం ఇప్పించాలని నెల్లిమర్లకు చెందిన పి.కుమారీ, ఎస్.కోట మండలం గౌరీపురానికి చెందిన విజయ, గంట్యాడకు చెందిన రామవలసకు చెందిన గోవిందరావు, గరివిడికి చెందిన రామస్వామిపేటకు చెందిన అప్పలనాయుడు, మెంటాడకు చెందిన జి.కన్నయ్య కోరారు. వికలాంగ పించను పునరుద్దరించాలని విజయనగరానికి చెందిన రాజేశ్వరి, దేవుపల్లికి చెందిన యాళ్ల రాములమ్మ, జామి మండలం కొట్టాం గ్రామానికి చెందిన కె.కృష్ణ తదితరులు కోరారు.
====
‘నీటి ఎద్దడి ప్రాంతాల్లో ట్యాంకర్లతో సరఫరా’
గజపతినగరం, ఏప్రిల్ 16: నీటిఎద్దడి ఉన్న గ్రామాల్లో ట్యాంకర్లద్వారా మంచినీరు సరఫరా చేయునున్నట్లు స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య చెప్పారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు మంచినీటి సమస్య గురించి ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఎస్సీకాలనీలో రక్షిత మంచినీటి పథకం బావిని నిర్మించినా పైపులైన్లు నిర్మించలేదని మాజీ వార్డు సభ్యుడు నరవ వీరాస్వామి ఫిర్యాదుచేశారు. పనిపూర్తి కావడానికి అవసరమైన నిధులు ఎసిడిపి నుంచి మంజూరు చేయడానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వేసవిలో నిరాటంకంగా మంచినీటి సరపరాకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్రాష్ ప్రోగ్రాం నిధులతో మరమ్మతులు చేశామన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కారంలో అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని కర్రి రమేష్, నరవ వీరాస్వామి, మాజీ ఎంపిటిస ఆల్తి రామునాయుడు ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే ఎఇపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 8గంటలకు ప్రారంభం కావలసిన ప్రజాపథం సదస్సు సుమారు గంట ఆలస్యంగా ప్రారంభించినా అధికారులు, ఉద్యోగులు తప్పా ప్రజలు హాజరు కానందున ఎమ్మెల్యే అప్పలనరసయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కేవలం 10మంది కూడా రాకపోవడంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులకు కూలీలు వెళ్తున్నందున రాలేదని అధికారులు వివరణ ఇచ్చారు.