విజయనరగం, ఏప్రిల్ 17: ఆడపిల్లలు పుట్టారన్న ఒకే ఒక కారణంతో జిల్లాలో ఇద్దరు తండ్రులు, ఒక తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జిల్లాలో విషాదాన్ని నింపింది. కేవలం ఆడపిల్లను ప్రసంవించిందన్న కారణంగా ఒక భర్త తన భార్యను పుట్టింట్లో వదిలిపెట్టగా ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆ ఇల్లాలు తనువు చాలించింది. మరో రెండు సంఘటనల్లో తమకు వంశాంకురం పుట్టలేదన్న నిరాశతో ఇద్దరు తండ్రులు ఆత్మహత్యకు పాల్పడి మరణాన్ని ఆశ్రయించారు. విషాదాన్ని నింపిన ఈసంఘటనలు విజయనగరం జిల్లా బొబ్బిలి పరిధిలో మంగళవారం చోటుచేసకోవడం గమనార్హం. కురుపాం మండలం నాగూరుకు చెందిన గౌరన్నదొర (28), బొబ్బిలి మండలం కమ్మవలసకు చెందిన జి.శ్రీరాములు (33), బొబ్బిలి మండలం నాయుడు కాలనీకి చెందిన కోటేశ్వరి (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల కుటుంబాలు, వారి ప్రాంతాలు వేరైనా వీరి మరణానికి కారణం మాత్రం ఒక్కటే. ఆత్మహత్యకు పాల్పడిన మూడు కుటుంబాల్లోను ఆడపిల్ల జన్మించడమే కారణం కావడం దారుణం. మృడుడు గౌరన్నదొరకు ఆర్.గౌరితో ఏడాది కిందట వివాహమైంది. 11 రోజుల కిందట గౌరి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టడాన్ని జీర్ణించుకోలేని గౌరన్నదొర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో సంఘటనలో జి.శ్రీరాములుకు ఇదే గ్రామానికి చెందిన లక్ష్మితో వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడ సంతానం. ఇటీవలే నాలుగో కాన్పులో కూడా లక్ష్మి ఆడపిల్లలనే కనడంతో తీవ్ర నిశ్పృహకు గురైన శ్రీరాములు సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక మూడో సంఘటనలో కోటేశ్వరికి బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన రమేష్‌తో రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి తొలి కాన్పులో ఆడపిల్ల జన్మించింది. అప్పటి నుంచి రమేష్ తన భార్యను పుట్టింట వదిలేశాడు. ఆడపిల్ల పుట్టిన కారణంగా భర్త తనకు దూరం కావడంతో మనస్తాపం చెందిన కోటేశ్వరి సైతం గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఒకే రోజు బొబ్బిలి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈసంఘటనలు ఈ ప్రాంతంలో కలకలం రేపాయి.
ఆడపిల్లలు పుట్టారన్న ఒకే ఒక కారణంతో జిల్లాలో
english title:
female child
Date:
Wednesday, April 18, 2012