హైదరాబాద్, ఏప్రిల్ 17: రాష్ట్రంలో గత నెల 30 నుండి ఇప్పటి వరకు వడగళ్లు, అకాల వర్షాలతో దాదాపు 41 వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాల్లో తేలిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టంపై మంత్రి మంగళవారం తన ఛాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కర్నూలు, అనంతపురం, నల్లగొండ, వరంగల్, విజయనగరం, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 13,581 ఎకరాల్లో నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఇక మొత్తం పది జిల్లాల్లో కలిపి వరిపంట 36 వేల ఎకరాల్లో, మొక్క జొన్న 5,340 ఎకరాల్లో నష్టం జరిగిందని స్పష్టంచేశారు. వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులందరి వివరాలు సేకరించాలని, ఏ ఒక్క రైతూ తనకు సర్కారు సాయం అందలేదంటూ బాధపడకూడదన్నదే తన ఉద్దేశమని, అందువల్ల సమగ్రంగా ఎన్యుమరేషన్ జరిగేలా చూడాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రైతుల పొలాలకే అధికారులు వెళ్లి నష్టపోయిన పంటల వివరాలను సేకరించాలని, వెంటనే సమగ్ర సమాచారం పంపించాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో గత నెల 30 నుండి ఇప్పటి వరకు వడగళ్లు, అకాల వర్షాలతో దాదాపు
english title:
gale winds and rains
Date:
Wednesday, April 18, 2012