హైదరాబాద్, ఏప్రిల్ 17: చిరంజీవి రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ఇక ఆయన సొంత గ్రామంలో చిరంజీవిపై ధ్వజమెత్తనున్నారు. నర్సాపురం నియోజక వర్గంలో ఉప ఎన్నికల ప్రచారం కోసం ఆ నియోజక వర్గం పరిధిలోని మొగల్తూరు బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. గురువారం నర్సాపురం నియోజక వర్గంలో పర్యటించనున్న బాబు..మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు నియోజక వర్గం మొత్తం రోడ్ షో కూడా నిర్వహించనున్నారు. అయితే నియోజక వర్గం మొత్తంలో చిరంజీవి స్వగ్రామం మొగల్తూరులో మాత్రమే బహిరంగ సభ నిర్వహిస్తుండటం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా ఈ గ్రామంలో పర్యటించి, సొంత గ్రామానికే ఏమీ చేయని చిరంజీవి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని విమర్శించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ను చూసి రాజకీయాల్లోకి వచ్చి పార్టీని నడపలేక కాంగ్రెస్‌లో విలీనం చేశారని చంద్రబాబు సైతం ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ కాలి గోటికి సరిపోని వారు అంటూ బాలకృష్ణ కూడా పరుష పదజాలంతో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మొగల్తూరు బహిరంగ సభపైనే అందరి దృష్టి పడింది. చిరంజీవి సొంతగడ్డపై బాబు ఏ స్థాయిలో విమర్శలు గుప్పిస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా, చంద్రబాబు పర్యటన విషయానికొస్తే..ఉదయం పది గంటలకు నర్సాపురంలో పార్టీ సర్వసభ్య సమావేశం, మధ్యాహ్నాం మూడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర వరకు రోడ్ షో, రాత్రి 8.46కు మొగల్తూరులో బహిరంగ సభ జరగనున్నాయి.
దళిత వ్యతిరేకి
వైఎస్‌ఆర్ కుటుంబం దళిత వ్యతిరేకులని, అధికారంలో ఉన్నప్పుడు దళితులకు చేసిందేమీ లేదని తెలుగు యువత నేత నాగరాజు విమర్శించారు. అంబేద్కర్ విగ్రహాల పక్కన వైఎస్‌ఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చిరంజీవి రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న
english title:
chiru gramamlo babu
Date:
Wednesday, April 18, 2012