హైదరాబాద్, ఏప్రిల్ 17: రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి కేంద్రమైన సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో జాప్యం జరుగుతోందని, ఫలితంగా తమకు రావాల్సిన సౌకర్యాలు కోల్పోతున్నామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసిస్టెంట్ సెక్రటరీ నుంచి డిప్యూటీ సెక్రటరీలుగా, అలాగే సెక్షన్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ సెక్రటరీలుగా పదోన్నతి చెందాల్సిన ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి డిపిసి (డిపార్టమెంటల్ ప్రమోషన్ కమిటి) సమావేశం జరిగి నెల రోజులు అవుతున్నా అమలుకు నోచుకోవడం లేదని వాపోతున్నారు. ప్రతి నెలా సాధారణ పరిపాలన శాఖ (జిఎడి) నుంచి ఉద్యోగులు పదవీవిరమణ చేస్తుంటారని వాటిని భర్తీ చేయడానికీ ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి వద్ద పదోన్నతుల ఫైల్ పెండింగ్‌లో ఉందని, అర్హత ఉన్న అధికారులకు పదోన్నతులు కల్పించడంలో ముఖ్యమంత్రి నిర్ణయంలో జాప్యం జరిగితే నష్టపోయేది తామెనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఫైళ్ల పరిశీలనలో తమ పనితీరు నెమ్మదించక తప్పదని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.
పదోన్నతుల్లో జాప్యంపై ఆవేదన డిపిసి సిఫార్సులపై తేల్చని సిఎం?
english title:
promotions
Date:
Wednesday, April 18, 2012