
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: అరశాతం రెపోరేటు తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం పెట్టుబడులకు ఊతమిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అలాగే ఆర్థికప్రగతి వేగవంతం చేసేందుకు, ధరల నియంత్రణకు ప్రభుత్వం తనవంతుగా అదనపుచర్యలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. కొద్దినెలలుగా మందగిస్తూవున్న వృద్ధిరేటు ఇప్పుడిక వేగం పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఆర్‌బిఐ పాలసీ నిర్ణయాలు దేశంలో పెట్టుబడులకు కొత్తఊపునిచ్చి వాణి జ్య సెంటిమెంట్‌ని బలోపేతం చేస్తాయని అన్నారు. అభివృద్ధిని మరింత వేగిరం చేసేందుకు ప్రభుత్వం మరికొన్ని చర్యలు చేపడుతుందని ప్రణబ్ మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. నాలుగునెలలుగా తగ్గుముఖం పట్టిన ద్రవ్యోల్బణం, గత మార్చిలో వస్తూత్పత్తి రంగంలో ద్రవ్యోల్బణం 7.6% నుంచి 4.87 శాతానికి క్షీణించడం ఆర్‌బిఐ తమ కఠిన ద్రవ్యవిధానాన్ని సడలించేందుకు దోహదం చేశాయని ప్రణబ్ పేర్కొన్నారు. అయితే ఆహార, ప్రాథమిక వస్తువుల ధరల పెరుగుదల ఇంకా ఆందోళనకరంగానే వుందని అన్నారు. సరఫరాల్లో అడ్డంకులు తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పా రు. ధరల స్థీరీకరణకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం అమలుచేస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.