ఏలూరు, ఏప్రిల్ 17: ఆర్‌డబ్ల్యుఎస్ విభాగం పనితీరు సహజంగానే వేసవి కాలంలో తేటతెల్లమవుతుంది. ఆ సమయంలోనే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమై ఈ విభాగం ఏవిధంగా పనిచేస్తోంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. అయితే జిల్లా పరిస్థితి మాత్రం విడ్డూరంగా తయారైంది. జనం మంచినీళ్లేవి మహాప్రభో అంటుంటే ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ కాంతనాథ్ సెలవుపై వెళ్లిపోయారు. ఈ విభాగం సరిగా పనిచేయటం లేదని పర్యవేక్షించే బాధ్యతలు మంత్రి వట్టి వసంతకుమార్ జిల్లా అదనపు జెసి ఎంవి శేషగిరిబాబుకు అప్పగిస్తే ఆయన కూడా సెలవుపై వెళ్లిపోతున్నారు. మొత్తంమీద అవసరమైనప్పుడు ఆర్‌డబ్ల్యుఎస్ విభాగం ఉత్తచేతులతో దర్శనమిచ్చింది. అలాగే పర్యవేక్షించే నాథుడు కూడా లేక జనం పరిస్ధితి ఆగమ్యగోచరంగా మారిపోతోంది. ఇటీవలే జిల్లాలో ఎక్కడైనా మంచినీటి కష్టాలు తలెత్తితే నేరుగా అదనపు జెసిని సంప్రదిస్తే తక్షణ పరిష్కారాలు సూచిస్తారని, నిధులకు కొరత లేదని స్వయంగా జిల్లా కలెక్టరే చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ బాధ్యతలు నిర్వహించే అధికారులు ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. అసలు వేసవి సమయం వచ్చిందంటేనే జిల్లాను తాగునీటి సమస్య కుదిపేస్తుంటుంది. ఒకవైపు పంచాయితీలకు, మున్సిపాల్టీలకు పాలకవర్గాలు లేక జనం గోడు పట్టించుకునే దిక్కు లేక గగ్గోలు పెడుతుంటే ఇప్పుడు అధికారులు కూడా మొఖం చాటేసే పరిస్థితి తలెత్తింది. జిల్లా కలెక్టరు అయా విభాగాల అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం మినహా ఇటువంటి పరిణామాలకు బ్రేక్ వేయలేకపోవటం కొంత విమర్శలకు కారణమవుతుంది. అలాగే స్వయంగా రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్ ప్రజాపథం ఏర్పాట్ల సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాలు కూడా ఇప్పుడు అమలుకాని పరిస్థితి. ఆ సమావేశం ముగిసిన తర్వాత మూడు రోజులు సెలవు పెట్టిన ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ కాంతనాధ్ తన శెలవును మరో రెండురోజులపాటు పెంచారు. అయితే ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లే యోచనలో ఉన్నట్లు ఆ కార్యాలయ సిబ్బందే పేర్కొంటున్నారు. మరోవైపు జిల్లా అదనపు జెసి ఎంవి శేషగిరిబాబు బుధవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు సెలవుపై వెళుతున్నారు. అప్పటివరకు జిల్లా రెవిన్యూ అధికారి ఎం మోహనరాజు ఇన్‌ఛార్జి ఎజెసిగా వ్యవహరించనున్నారు.
పోతవరంలో రసాభాస
నల్లజర్ల, ఏప్రిల్ 17: నల్లజర్ల మండలంలో మంగళవారం ప్రారంభమైన ప్రజాపథం కార్యక్రమం పోతవరంలో రసాభాసగా సాగింది. కొద్ది రోజుల క్రితం ఎస్సీ కాలనీల అభివృద్ధికి ఉపాధి హామీ పథకంలో మంజూరైన ఒక కోటి 38లక్షల నిధుల వినియోగంపై ఎంపిక చేసిన వర్క్ కమిటీ గురించి గ్రామంలోని ప్రధాన ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం ప్రజాపథం కార్యక్రమంలో తారాస్థాయికి చేరుకుంది. ఇది చినికి చినికి గాలివానగా మారి బాహాబాహీకి దారి తీసింది. ఈ మొత్తం వ్యవహారం గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత సమక్షంలో జరగడం విశేషం. ఉపాథి హామీ పథకానికి సంబంధించి గ్రామసభ ద్వారా ఎంపిక చేయాల్సిన వర్క్ కమిటీని ఏకపక్షంగా ఎందుకు చేయాల్సి వచ్చిందో సభలో వివరించాలని సొసైటీ మాజీ అధ్యక్షుడు గన్నమనేని వెంకటేశ్వరరావుతోపాటు మాజీ ఎంపిటిసి వంగలపూడి ఇజ్రాయిల్, సిర్రా రాజారావు, పెదపాటి రమణ తదితరులు అధికారులను నిలదీశారు. అధికారులు సమాధానం ఇచ్చేలోగా మరో వర్గానికి చెందిన మాజీ ఎంపిపి ఖండవల్లి కృష్ణవేణి, ఆమె భర్త సూర్యారావు, తానింకి బాబూరావు, గౌతు నరసింహమూర్తి తదితరులు వాగ్వివాదానికి దిగారు. వీరికి మద్దతుగా ఆ వర్గానికి చెందిన ఆ వర్గం నాయకులు వంత పాడారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఎస్‌ఐ ఎ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఆందోళనకు దిగిన వారిని బయటకు పంపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎమ్మెల్యే వనిత కూడా పదేపదే సంయమనం పాటించాలంటూ మైకులో కోరినా ఫలితం లేకపోయింది. మరొక దశలో ఇరువర్గాలూ బాహాబాహీకి దిగాయి. ప్రాధాన్యతా అంశాలపై మాట్లాడిన తరువాత ఈవిషయంపై చర్చిస్తామని ఎమ్మెల్యే తెలపటంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. వీధిలైట్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని పలువురు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. సుభద్రపాలెం కాలనీలో పట్టాల పంపిణీ, తాగునీరు, వీధిలైట్లు తదితర అంశాలపై కాలనీ వాసులంతా మూకుమ్మడిగా ప్రజాపథంలో పాల్గొని ఏకరవు పెట్టారు. తాము ఉపాధి పథకంలో పనులు చేసినా తక్కువ వేతనాలు నమోదవుతున్నాయని కుమారి, వెంకాయమ్మ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సంబంధిత ఎపిఒ ఈవిషయంపై ఆమె నిలదీశారు. పోతినీడిపాలెంలో నిర్వహించిన ప్రజాపథం సభలో రైతులు బ్యాంకు నుండి తీసుకునే రుణాలకు సంబంధించి రీ షెడ్యూల్‌కు వడ్డీ రేటును తగ్గించాలని, రైతు అనుమతి లేకుండా బీమా కట్టించుకోకూడదని, ఈవిషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేను కోరారు. అలాగే కౌలూరు, నబీపేట, చీపురుగూడెం గ్రామాల్లో ప్రజాపథం సభలను నిర్వహించారు. కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి టి కల్యాణం, ఎంపిడిఒ శ్రీనాథ్‌నాయిని, తహసీల్దార్ ఎం ఝాన్సీరాణి, ఎపిఒ మల్లేశ్వరరావు, ఐకెపి ఎపిఎం శ్రీలక్ష్మి, ఎంఇఒ కె సంతోషం, పశువైద్యాధికారిణి కె జగదాంబ, ఆర్‌అండ్‌బి జెఇ ప్రభాకరరావు, ఎస్‌ఎం అలీ తదితరులు పాల్గొన్నారు.