చాలా రోజులుగా మిత్రులు ఆడియో క్యాసెట్‌లలో
ఉండే పాటలను కంప్యూటర్లలో ఎక్కించుకోవడం
ఎలాగో చెప్పండి ప్లీజ్ అంటున్నారు. ఇన్నాళ్లకు
సమయం చిక్కింది. పాత క్యాసెట్‌లలోని పాటలను
కంప్యూటర్‌లలోకి ఎక్కించుకోవడం కష్టమేమీ కాదు.
ఎటొచ్చీ క్యాసెట్ కండిషన్, పాట రికార్డింగ్ క్వాలిటీ
బావుండాలి. అంతే.
మీ దగ్గర కంప్యూటర్ ఉందంటే, దానిలో ఆడియో
(సౌండ్) కార్డు ఉండే ఉంటుంది. దానికి లైన్ ఇన్
జాక్ (సాధారణంగా ఇది నీలి రంగులో ఉంటుంది)
ఉంటుంది. మీ కంప్యూటర్‌కు స్పీకర్లు కనెక్టయి
ఉండాలి. కంప్యూటర్‌లో ఉండే ఏ పాత ఫైల్‌నన్నా
విండోస్ మీడియా ప్లేయర్‌లో ఆన్ చేసి పెట్టి స్పీకర్‌లో
వినిపిస్తున్నట్టు నిర్థారించుకోండి. మీ సౌండ్ కార్డు
డ్రైవర్ లేటెస్టుగా ఉంటే మంచిది. మీ దగ్గర టేప్
రికార్డర్ లేదా క్యాసెట్ ప్లేయర్ ఉండాలి. దాని లైన్
ఔట్ నుంచి ఆడియో కేబుల్ కనెక్షన్ కంప్యూటర్ లైన్
ఇన్‌కు ఇవ్వాలి. టేప్ రికార్డర్ లేదా క్యాసెట్ ప్లేయర్
హెడ్ శుభ్రంగా ఉండేలా చూసుకోండి.
దీనికన్నా ముందే మీరో పని చేయాలి. అడాసిటీ
(Audacty2.0) అని ఓపెన్ సోర్సులో ఒక
ఆడియో రికార్డింగ్ సాఫ్టవేర్ ఉంది. ఇది విండోస్,
మాక్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది.
మీ ఆపరేటింగ్ సిస్టం అనుగుణంగా వర్షన్ డౌన్‌లోడ్
చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. దీని వెబ్‌సైటు అడ్రస్
ఇది
http://audacity.sourceforge.net/
download/
సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయండి. న్యూ ఎంచుకోండి. టేప్
రికార్డర్ లేదా క్యాసెట్ ప్లేయర్ ఆన్ చేయండి.
రికార్డు బటన్ నొక్కండి. ముందు క్యాసెట్ ఒక సైడు
అంతా రికార్డు అయ్యాక సేవ్ చేయండి.
ఇపుడు సైడ్ ఏ అంతా రికార్డయ్యి ఉంటుంది. క్యాసెట్
తిప్పించండి. మళ్లీ పైనచెప్పినట్టే చేయండి. తర్వాత
ఒక్కో పాటగా కట్ చేసి ఎంపి3గా సేవ్ చేసుకోండి.
ఇంత సోది ఎందుకులెండి అంటారా. మీ దగ్గర ఎంపి
3 రికార్డర్ ఉంటే దాని లైన్ ఇన్‌కు కనెక్టు చేసి కూడా
రికార్డు చేసుకోవచ్చు. ఎంపి3గా సేవ్ చేసుకోవచ్చు.
ఈ పద్ధతిలో మీరు పాత గ్రామఫోను ప్లేయర్‌ను ఐనా
సరే కనెక్టు చేసుకోవచ్చు. రికార్డు ఉంచి ప్లే చేసాక
అడాసిటీ సాఫ్ట్‌వేర్ వాడి రికార్డు చేసుకోవచ్చు.
అడాసిటి సాఫ్ట్‌వేర్, దాని పనితీరు- వీటి గురించి
వచ్చేవారం తెలుసుకుందాం.