Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమస్యల సాధనకే ప్రజాపథం

$
0
0

శివ్వంపేట, ఏప్రిల్ 18: ప్రజల కష్ట, సుఖాలను తెల్సుకోవడమే ప్రజాపథం లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం నాడు శివ్వంపేట మండలంలో శభాష్‌పల్లి, పరికిబండ, పోతారం, సికింద్లాపూర్, బిజిలీపూర్, గోమారం, గొట్టిముక్కల, నవాబుపేట, సంగాయిపల్లి గ్రామాల్లో వడ్డీలేని రుణాల చెక్కులను మహిళా సంఘాలకు మంత్రి అందజేశారు. సిసి రోడ్లకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజల వద్దకు ప్రజాపథం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో మంచినీటి తదితర సమస్యల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శివ్వంపేట మండలానికి 35 కోట్లు మంజూరు చేశారని అన్నారు. మారుమూల ప్రాంతాల సమస్యల పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రధానంగా తాగునీటి వనరులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రజాపథాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైతే నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు బోర్లను సైతం లీజుకు తీసుకొని నీటి ఎద్దడి తీర్చుటకు కృషి చేస్తున్నామని మంత్రి సునీతారెడ్డి తెలిపారు. ప్రభుత్వం పేదల పక్షాన ఉండి సమస్యల పరిష్కారానికి నిరంతరం గా కృషి చేస్తుందని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజాపథం ద్వారా గ్రామాల్లో పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రజాపథం దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిచండం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ తాలూకా ప్రత్యేక అధికారి బాల్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా సహాకార బ్యాంకు ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, నర్సాపూర్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గోమారం చంద్రాగౌడ్, మాజీ ఎంపిపి గోవింద్‌నాయక్, ఉపాధ్యక్షులు హన్మంతరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరాంరెడ్డి, తహశీల్దార్ మాధవిదేవి, ఎంపిడివో సిద్దిరామప్ప, వివిధ శాఖల ఎఇలు స్వామిదాస్, వీరభద్రయ్య, నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నేతలు యాదాగౌడ్, వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు పులి కుమార్, మనె్న నర్సింలు, సాయిలు, ఆంజనేయచారి, కాంగ్రెస్ నాయకులు అమరేందర్‌రెడ్డి, నారాగౌడ్, గంగిరెడ్డి హన్మంతరెడ్డి, హరిశంకర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, నాయకులు, కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సిడీ
102 కోట్ల రూపాయలు విడుదల
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి,ఏప్రిల్ 18:ఖరీఫ్ 2011 సంవత్సరంలో కరువుతో పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం మూడు రోజుల్లో అందనుంది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.ఇపాటికే ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసినప్పటికీ నిధులను మాత్రం రెండు రోజుల క్రితం విడుదల చేసింది.బ్యాంకుల వారీగా రైతాంగం జాబితాను ఖాతా సంఖ్యతో సహా సిద్ధ్దం చేసి వ్యవసాయ శాఖ డిమాండ్ డ్రాప్ట్‌లను అందచేయనుంది.జిల్లా వ్యాప్తంగా కరువుతో 2011 ఖరీఫ్ సీజన్‌లో 2.10 లక్షల హెక్టార్లలో వివిధ పంటలను రైతాంగం నష్టపోయింది. ఇందులో అత్యధికంగా పత్తి పంట ఉంది. ఇందులో 4,49,378 మంది రైతులు ఉన్నారు.కాగా వీరిలో 1.26,438 మంది రైతులకు బ్యాంకు ఖాతాలు లేవు.బ్యాంకు ఖాతాలు లేని రైతులకు జిరో బ్యాలెన్స్ అకౌంట్లను తెరవాలని జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్ ఇపాటికే బ్యాంకర్లను ఆదేశించారు. అయితే ఈ పని ఇంకా జిల్లాలో కార్యరూపంలోకి రావాల్సి ఉంది. 4,49 378 మంది రైతుల్లో సన్నచిన్నకారు రైతులతో పాటు ఐదెకరాల కంటే భూమి అధికంగా ఉన్న రైతులు 35 102 మంది ఉన్నారు. జిల్లా అధికార యంత్రాంగ వీరికి కూడా పంట నష్టపరిహారం అంటే పెట్టుబడి రాయితీ ఇవ్వాలని ఇందుకుగాను 4.92 కోట్ల రూపాయలను చెల్లించాలని అధికార యంత్రాంగం ప్రతిపాదనలను పంపింది.అయితే ప్రభుత్వం కేవలం సన్నచిన్నకారు రైతులకు మాత్రం ఈ ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేసింది. ప్రజాపథం సందర్భంగా ఈ పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు పంపిణీకి కూడా ఉత్తర్వులను జారీ చేసింది.

జలాల పెంపునకు 6 కోట్లు
*ఎంపి విజయశాంతి
నంగునూరు, ఏప్రిల్ 18: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రతి అధికారి బాధ్యతతో మెదలాలని ఎంపి విజయశాంతి అన్నారు. బుధవారం పాలమాకులలో జరిగిన ప్రజాపథంలో ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని, సభలు, సమావేశాలు పెట్టినప్పుడే ఏలా పరిష్కారమైతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సమస్యలు దృష్టికి తెచ్చినప్పుడు ఎందుకు పరిష్కరించలేదన్నారు. నియోజకవర్గంలో పెద్దగా సమస్యలు లేవని, చిన్న చిన్న సమస్యలున్నాయన్నారు. సమర్థుడైన ఎమ్మెల్యే హరీష్‌రావు ఉండగా మీకు సమస్యలెలా వస్తాయన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో నేతలు సరిగా లేరని, ఇలా ఉంటే అంతటా ఎంతో అభివృద్ది జరిగేదన్నారు. వైద్యసేవలు అందించడంలో వైద్యాధికారులు నిర్లక్ష్యం వహించొద్దన్నారు. గత కొన్ని రోజుల కింద వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయి ఎన్నో గొడవలు జరిగాయని, వీటితో పేదల ప్రాణాలు కోల్పోయి ఎంతో నష పోతున్నారన్నారు. అధికారులు విధులు సక్రమంగా నిర్వహించి ప్రజలకు వైద్యసేవలు అందిం చాలన్నారు. మండలానికి కేంద్ర గ్రామీణాభివృద్ద్ధి శాఖ ద్వారా 6కోట్లు మంజూరైనాయన్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు గతంలో 3కోట్లు మంజూరుకాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈనిధులు ఖర్చు చేస్తారన్నారు.
సంపూర్ణ పారిశుద్ధ్యం కోసం అందరూ కృషి చేయాలి
ఎమ్మెల్యే హరీష్‌రావు
నిర్మల్ పురస్కార్‌లో దేశంలోనే నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. నిర్మల్ పురస్కార్ అన్ని గ్రామాల్లో సాధించేందుకు ఇంటింటా పారిశుద్ధ్యం కార్యక్రమంలో మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ఇప్పటివరకు మండలంలోని 11గ్రామాలు ఈ అవార్డులు సాధించి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. మండలంలో అన్ని గ్రామాలు ఈ అవార్డు సాధిస్తే సంతోషిస్తానన్నారు. వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. రాజగోపాల్‌పేటకు పిహెచ్‌సి మంజూరైందని, దీంతో అందరికి వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. నిర్మాణ పనులు వచ్చే ఏడాదిలో ప్రారంభమైతాయన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా కూరగాయల తోటలు పెంచేందుకు ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీ పథకాన్ని మంజూరు చేసిందని, దీన్ని మండలంలోని ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలానికి ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా 3.45కోట్లు మంజూరైనాయన్నారు. 15రోజుల్లోనే రైతులకు అందేలా అధికారులు చూస్తారన్నారు. గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, విద్యుత్ సమస్యలపై అధికారులు 2రోజుల్లో తనకు నివేదిక అందిస్తే పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, తహశీల్దార్ అంబదాస్, ఎంపిడిఓ ప్రభాకర్, డిఇలు అంజనేయులు, సత్యనారాయణ, మాజీ ఎంపిపి సారయ్య, మాజీ జడ్పిటిసి మల్లయ్య, ఎంపిఎం మహిపాల్, ఎపిఓ నర్సింహరావు, వైద్యాధికారి సుజాత, పశువైద్యాధికారి వేణు, అధికారులు అక్తర్, రవి, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.

దొంగనోట్లు, దొంగతనాలు,
రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి
*జిల్లా ఎస్పీ అవినాశ్ మహంతి
మెదక్, ఏప్రిల్ 18: దొంగనోట్ల చెలామణి, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు జిల్లా ఎస్‌పి అవినాశ్ మహంతి వెల్లడించారు. రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన కొత్త ఎస్‌పి బుధవారం సాయంత్రం మెదక్ డిఎస్‌పి, రూరల్ సిఐ కార్యాలయాలు, టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో దొంగనోట్ల చెలామణి, బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఎస్‌పి దృష్టికి తేగా వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్నారు. పోలీసుల విధులు సక్రమంగా నిర్వహిస్తే ప్రజలకు సరైన సేవ చేసినట్లేనన్నారు. పోలీసు సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నదాంట్లో తనిఖీలు, పెట్రోలింగ్ తదితర కార్యక్రమాలతో పాటు స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. పోలీసులు పని చేస్తున్నారనే విషయం ప్రజలకు తెలియాలన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేందుకు కృషి చేస్తానన్నారు. పోలీసు సిబ్బందికి క్వార్టర్‌ల విషయంలో నివేదికలు పంపి మంజూరుకు ప్రయత్నం చేస్తానన్నారు. ఎక్కడ ఏముంది, ఏం చేయాలో తెలుసుకుని ఒక్కొక్కటిగా వాటి పరిష్కారానికి చర్యలు చేపడతానన్నారు. జిల్లా గురించి తెలుసుకోవడానికి అంతటా పర్యటన చేయనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి సంఘటనలో 33 మందిని అరెస్టు చేశామని, కేసు విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఒడిషాలో ఉన్నట్లు మావోయిస్టుల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో లేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఎస్‌పి గోద్రు, సిఐలు రామకృష్ణ, విజయ్‌కుమార్‌లున్నారు.
గృహ హింస, మహిళలపై వేధింపుల చట్టాలపై
ప్రజలకు అవగాహన కల్పించాలి
సంగారెడ్డి రూరల్, ఏప్రిల్ 18: గృహా హింస, మహిళలపై వేధింపులు, మహిళల అక్రమ రావాణాపై, వాటి చట్టాల అమలుపై ప్రజల్లో అవగాహాన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ హరి జవహర్‌లాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబరులో ఐసిడిఎస్, పోలీస్, జ్యూడిషియల్, స్వచ్చంద సంస్థల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు జాయింట్ కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ స్వచ్చంద సంస్థల సహాకారంతో గృహ హింస, అక్రమ రవాణాలపై అవగాహాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గృహా హింసల బారిన పడిన మహిళలకు వారి కుటుంబాలతో కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. కొత్తగా పెళ్లైన వారికి కుటుంబ వ్యవస్థపై అవగాహన కల్పించాలన్నారు. మహిళల అక్రమ రావాణా అరికట్టేందుకు గాను అక్రమ రావాణా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడి మధ్యవర్తులపై నిఘా పెంచాలని పోలీస్ అధికారులను కోరారు.అదే విధంగా మత పెద్దలతో, గురువులతో అందరికి హిత బోధ చేయించాలన్నారు. కోర్టులో సంవత్సరం నుండి 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని కోర్టు అధికారులను, లాయర్లను కోరారు. ట్రాఫికింగ్ బాధితుల వారికి సంబంధించిన ఎఫ్‌ఎన్‌ఎల్ రిపోర్టును వెంటనే తెప్పించాలని పోలీస్ అధికారులను కోరారు. ఫొరెనిక్స్ రిపోర్టు అందిన వారికి నష్ట పరిహారం చెల్లించేందుకు వీలౌతుందని తెలిపారు. విముక్తి పొందిన బాధితులకు పునరావాసం కల్పించుటకు శిక్షణతో పాటు చదువుకోవాలని ఆసక్తి ఉన్న వారిని వసతి గృహాలలో చేర్పించి చదువుకునే సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. మద్యం తాగడం, వరకట్నం సమస్యల ద్వారా గృహ హింసల కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయని, ఐసిడిఎస్, పోలీస్, జ్యూడిషియల్, స్వచ్చంద సంస్థల సమన్వయంతో గృహ హింసను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని అదనపు జాయింట్ కలెక్టర్ హరి జవహర్‌లాల్ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి కిరణ్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కాంతారావు, ఉప విద్యాధికారి భుజంగం, శిశు మహిళ కమిటీ చైర్మన్ శివకుమారి, న్యాయ సలహాదారు మాధవి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

ఎండల తీవ్రతతో
జంకుతున్న జనం
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఏప్రిల్ 18:జిల్లాలో ఎండలు తీవ్రరూపంతో ప్రజలు జంకుతున్నారు.ఉదయం పది గంటలకే బయటకు రావాలంటే భయపడుతున్నారు.ఉదయం నుండే ఉక్కపోతగా వాతావరణం ఉండడంతో ఎలా ఎండను తట్టుకోవాలో అర్థం కాకా జనం అవస్థలు పడుతున్నారు.ఒంటి మీద వేసుకున్న బట్టలను కూడా వేసవి తాపానికి వేడిగా మారడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. సంగారెడ్డి లాంటి పట్టణాల్లో కొబ్బరి బొండాల చుట్టూ ప్రజానీకం క్యూ కట్టారు. వేసవి దాహాన్ని తీర్చుకోవడానికి ఇతర అనేక మార్గాలను కూడా ప్రజలు అనుసరిస్తున్నారు.పది గంటలైతే చాలు రోడ్లపైకి జనం రావడం లేదు. సాయంత్రం ఆరుగంటల తర్వాత రోడ్లు రద్దీగా మారుతున్నాయి. ఈ నెల 18వ తేదీన గరిష్ట ఉష్ణోగ్రత జిల్లాలో 41.7 డిగ్రీల సెంటిగ్రెడ్‌గా నమోదైనంది. గత నాలుగు రోజులుగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత రికార్డువుతోంది.మూడు రోజుల పాటు ఉదయం , మధ్యాహ్నం ఎండ తీవ్రత వాతావరణంలో మేఘాలు ఏర్పడడంతో కొంత చల్లగా ఉన్నా బుధవారం మాత్రం ఎండ తీవ్రత సాయంత్రం ఆరుగంటల వరకు కూడా తగ్గలేదు.చెరకు రసంతో పాటు,శీతల పానీయాలను ఈ ఎండల తీవ్రతను తట్టుకోలేక జనం ఆశ్రయిస్తున్నారు.ఏప్రిల్ మాసంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మేలో ఇంకా తీవ్రత పెరిగే అవకాశం ఉందని జనం జంకుతున్నారు.

పెళ్లైన 12రోజులకే
భర్త అదృశ్యం

* పోలీసులను ఆశ్రయించిన భార్య
తూప్రాన్, ఏప్రిల్ 18: ప్రేమించి పెళ్లి చేసుకున్న 12రోజులకే భర్త అదృశ్యమవడంతో భార్య తూప్రాన్ పోలీసులను ఆశ్రయించిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు అందించిన వివరాలిలా ఉన్నాయి. రంగాయపల్లికి చెందిన పెద్ద బాలయ్య, భాగ్యమ్మల కుమార్తె మాధవి(20), వర్గల్ మండలం మినాజిపేటకు చెందిన పూసెట్టి వీరయ్య కుమారుడు కుమార్(25)లు కాళ్లకల్ శివారులోని పుట్టగొడు గుల కంపెనీలో గత కొంత కాలంగా కలసి పనిచేస్తున్నారు. ఈక్రమంలో వారి మద్య ప్రేమ చిగురించడంతో వారు పోలీసులను ఆశ్రయించగా, ఇరువర్గాల అంగీకారం మేరకు మార్చి 29న నాచారంలో వీరి వివాహం జరిగింది. అనంతరం నూతన వధూవరులు రంగాయపల్లికి చేరుకొని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. అయితే 12రోజులు కలసి ఉన్న కుమార్ ఈనెల 10న మిత్రుడితోకలసి ఇంటి నుండి వెల్లిగా, తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన మాధవి తనకు న్యాయం చేయాలని కోరుతూ బుదవారం తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్‌ఐ వెంకటయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేపట్టారు.

పాలమాకుల వేంకటేశ్వరాలయంలో
విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
నంగునూరు, ఏప్రిల్ 18: పాలమాకులలో నూతనంగా నిర్మిం చిన వేంకటేశ్వరాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎంపి విజయశాంతి, ఎమ్మెల్యే హరీష్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభం, వేద మంత్రాలతో ఇరువురికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాలువలతో ఘనంగా సన్మానించారు. పాలమాకులలో ప్రజాపథంలో పాల్గొన్న ఇరువురు గ్రామ శివారులో నిర్మించిన వేంకటేశ్వరాలయంలో బుధవారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్‌రావు ఆలయ అభివృద్ది కోసం 25వే చెక్కును నిర్వాహకులకు అందిం చారు. ఈ మహోత్సవానికి మండలం లోని వివిధ గ్రామాల ప్రజలు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదా న కార్యక్రమంలో ఎంపి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ శ్రీనివాస్, నేతలు మల్లయ్య, సారయ్య, శ్రీకాంత్‌రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు ఐఐటిలో ఉచిత శిక్షణకు
29న ప్రతిభ పరీక్ష
సంగారెడ్డి రూరల్, ఏప్రిల్ 18: పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్టు హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఐఐటిలో ఉచిత శిక్షణతో పాటు ఉచిత విద్యను అందించాలనే ఉద్దెశ్యంతో ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ జిల్లా కన్వీనర్ ప్రభాకర్ తెలిపారు.బుధవారం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ హరి జవహార్‌లాల్ చేతుల మీదుగా ఈ ప్రతిభ పరీక్ష గోడ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు డాక్టర్ చుక్కా రామయ్య ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. రాబోవు విద్యా సంవత్సరం 20112-13నుండి ఐఐటి లక్ష్యంగా ఉచిత విద్యను అందించాలని ట్రస్టు నిర్ణయించిందని, 8వ తరగతి పూర్తి చేసిన (14సంవత్సరాలు నిండిన ) నిరుపేద విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు ఉచిత విద్యతో పాటు ఉచిత హాస్టల్ వసతి కూడ ఉంటుంది. దీని కోసం ఈ నెల 29న ప్రతిభ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.ప్రవేశ పరీక్ష 8వ తరగతి మరియు సెంట్రల్ సిలబస్‌కు అనుగుణంగా ఉంటుందని, ఇంగ్లీస్, గణితం, సైన్స్ సబ్జెక్టులలో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్ష జిల్లా, డివిజన్ కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 24లోపు సంగారెడ్డిలోని ప్రజాశక్తి జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని హాల్‌టికెట్లు పొందాలని సూచించారు. ప్రవేశ రుసుం 10రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, దరఖాస్తు చేసుకోవడానికి 8వ తరగతి బోనాఫైడ్ సర్ట్ఫికెట్, ఫోటోలు జతచేయాలన్నారు.ప్రతిభ పరీక్ష తెలుగు, ఇంగ్లీస్ భాషలో ఉంటుందని, విద్యార్థుల ఎంపికలో తుది నిర్ణయం చుక్కా రామయ్యదేనని తెలిపారు.ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఇతర వివరాలకు 08455-277531, 9490099115 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్‌ఓ నాగార్జున, శ్రీనివాస్, అశోక్‌బాబు, మహాబూబ్ పాల్గొన్నారు.

* స్ర్తి శిశు సంక్షేమ శాఖామంత్రి సునీతాలక్ష్మారెడ్డి
english title: 
sa

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>