ఖమ్మం, ఏప్రిల్ 18: అధిక లోడుతో వెళ్తున్న ఆటోలను నియంత్రించేందుకు రెవెన్యూ శాఖ సహకారం తీసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తమ కెపాసిటీకి మించి ఆటోడ్రైవర్లు ప్రయాణికులను ఎక్కిస్తూ ప్రమాదాలకు లోనవుతుండటంతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో కేవలం ఆటోల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడినవారు గత మూడు నెలల్లోనే 300మందికి పైగా ఉన్నారు. అయితే కెపాసిటీకి మించి ఎక్కించుకొని వెళ్తున్న ఆటోలపై చర్యలు తీసుకోవాల్సిన రవాణా శాఖాధికారులు తమ సిబ్బంది సరిపోవటం లేదని, తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వానికి తెలియజెప్పటంతో ప్రత్యామ్నాయ మార్గాల అనే్వషణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం ఆయా గ్రామాల్లో ఉన్న గ్రామ కార్యదర్శులకు ఆటోలను నియంత్రించే బాధ్యత అప్పగించనున్నారు. తమ తమ గ్రామాల నుంచి కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ఆటోలపై అక్కడికక్కడే జరిమానా విధించే అధికారాలు వారికి అప్పగించనున్నారు. అయితే తమ గ్రామానికి చెందిన వారిపై తామే జరిమానా విధించలేమని గ్రామకార్యదర్శులు చెబుతున్నారు. అంతేకాకుండా జిల్లాలో 771గ్రామ పంచాయతీల్లో 402 గ్రామ పంచాయతీలకు కార్యదర్శులు లేరని, ఇప్పటికే తాము తమ గ్రామ పంచాయతీకితోడు మరికొన్ని గ్రామ పంచాయతీల విధులు కూడా నిర్వరిస్తున్నామని, అదనంగా మరో బాధ్యతను అప్పగిస్తే తమకు పనిభారం ఎక్కువ అవుతుందని కార్యదర్శులు వాపోతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం గ్రామస్థాయిలోనే ఆటోలను నియంత్రిస్తే ప్రమాదాల నివారణ సులువవుతుందని భావిస్తున్నట్టు సమాచారం.
ఆటోను ఢీకొన్న లారీ..
ఇద్దరి దుర్మరణం
* మరో ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 18: ఓ లారీ ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. బుధవారం ఉదయం మండలంలోని గొల్లగూడెం - బారుగూడెం గ్రామాల మధ్య కంకరమిల్లు వద్ద జరిగిన ఈ హృదయ విదారకర సంఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. స్థానికుల కథనం ప్రకారం... వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఖమ్మం నుంచి ఆరెంపుల వెళ్తున్న ఆటోను కంకరమిల్లు వద్ద ఢీకొని కొంతదూరం తోసుకెళ్ళడంతో అది నుజ్జునుజ్జయింది. అదేసమయంలో ఖమ్మం నుంచి కాకరవాయి వైపు ఓ పత్రిక పార్సిల్ తీసుకెళ్తున్న మరో ఆటో ప్రమాదానికి గురై లారీ కింద కూరుకుపోయి ఉన్న ఆటోను ఢీకొని రోడ్డుపక్కన గోతిలో బోల్తాపడింది. తొలుత ప్రమాదానికి గురైన ఆటోలో పెద్దతండాలో నివాసం ఉంటున్న విజయవాడకు చెందిన పాత టైర్ల వ్యాపారి బూసి సుదర్శన్‌రావు(38), జలగంనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ పేరాల రవి(28) అక్కడికక్కడే మృతిచెందారు. బోల్తాపడ్డ ఆటోలో ప్రయాణిస్తున్న ముదిగొండ మండలం ముత్తారం గ్రామానికి చెందిన డ్రైవర్ నాదెండ్ల విజయ్(20), అతని స్నేహితులు రాయబారపు వీరబాబు(18), బొడ్డు రవి(18) తీవ్రంగా గాయపడ్డారు. 108 ద్వారా వీరిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ నాగరాజు సంఘటనా ప్రదేశానికి చేరుకొని క్రేన్‌ను రప్పించి లారీ కింద కూరుకుపోయిన ఆటో, అందులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయించారు. పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులిద్దరికీ భార్య, ఇద్దరేసి పిల్లలు ఉన్నారు. విజయవాడ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన సుదర్శన్‌రావు, ఇటీవలే ఆటో కొనుక్కొని జీవనం సాగిస్తున్న రవి అకాల మరణం పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు. బంధువులు మృతదేహాల వద్ద రోదించిన తీరు చూపరులను కలచివేసింది.
సారాబట్టీలపై యువకుల దాడి
* వందలాది లీటర్ల పానకం, సారా ధ్వంసం
* స్పందించని ఎక్సైజ్ అధికారులు
కొణిజర్ల, ఏప్రిల్ 18: ఎక్సైజ్ అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కాపుసారా నిరోధానికి యువకులు నడుం బిగించారు. మండల పరిధిలోని పెద్దగోపతి గ్రామానికి చెందిన నేస్తం యూత్ లింగగూడెం గ్రామస్థుల సహకారంతో సారాబట్టీలపై బుధవారం దాడి చేశారు. బొట్లకుంట సమీపంలోని మామిడి తోటల్లో పెద్దఎత్తున సారా తయారు చేస్తున్నారు. ప్రజలు ఎన్నోసార్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించినా ఫలితం లేదు. దీంతో యువకులు బట్టీలపై దాడి జరిపి వందలాది లీటర్ల బెల్లం పానకం, సారాను ధ్వంసం చేశారు. సారా తయారు చేసే సామగ్రిని పగులగొట్టారు. విషయం తెలిసినప్పటికీ ఎక్సైజ్ అధికారులు సంఘటనా స్థలానికి రాకపోవటం గమనార్హం. సారా మహమ్మారిపై దాడి చేసిన యువకులను ప్రజలు అభినందించారు.
మండుతున్న ఎండలు
* రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
* అల్లాడుతున్న జనం
* మధ్యాహ్నానికే రోడ్లు నిర్మానుష్యం
ఖానాపురం హవేలి, ఏప్రిల్ 18: జిల్లాలో ఎండలు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం పూట రోడ్డు మీద ప్రయాణించేవారికి నిప్పుల మీద నడిచినట్లు ఉంటోంది. జిల్లాలో ప్రతిరోజూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23డిగ్రీలు నమోదు కాగా, గరిష్ఠ ఉష్ణోగ్రత 41డిగ్రీలకు పైగా వుంటోంది. గతంలో జిల్లాలో 50డిగ్రీలు నమోదైన రికార్డు కూడా ఉంది. సింగరేణి ప్రాంతమైన కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ప్రాంతాల్లో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 4, 5గంటల మధ్య 22డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావటం గమనార్హం. దీంతో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. గాలిలో తేమ 60శాతంగా నమోదవుతోంది. దీనికితోడు వడగాలి వీస్తుండటంతో శరీరానికి మంటలు తాకినట్లు ఉంటోందని చెపుతున్నారు. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకొని చాలామంది ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. నీడపట్టునే ఉంటూ ఎండ తాపాన్ని తట్టుకునేందుకు ఆలోచిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కష్టజీవులు మాత్రం ఎండను లెక్కచేయటం లేదు. 50డిగ్రీలు దాటితే అనేక అనర్థాలు ఎదురవుతాయి. అసలు ఎండను ఎలా తట్టుకోవాలనే అంశంపై ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలోకి వెళ్ళకుండా నీడలోనే ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అర్థగంటకోసారి గ్లాస్ నీళ్ళు తాగాలి. చెవుల ద్వారా ఉష్ణం శరీరంలోకి చేరుతుంది కనుక చెవులను కప్పి ఉంచుకోవాలి. మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. ఉదయం 11గంటల్లోపు, సాయంత్రం 5గంటల తర్వాత బయటకు వెళ్ళి పనులు చేసుకోవటం మంచిది. పిల్లలు, వృద్ధులు ఎప్పుడూ చల్లదనంలోనే ఉండేలా చూసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు వివరించారు.
నూతన ఆర్థిక విధానాల వల్లే..
వ్యవసాయ రంగం దివాలా
* తమ్మినేని విమర్శ
ఖమ్మం(జమ్మిబండ), ఏప్రిల్ 18: నూతన ఆర్థిక విధానాల ఫలితంగానే వ్యవసాయ రంగం దివాలా తీస్తోందని ఖమ్మం మాజీ ఎంపి, సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బుధవారం సుందరయ్య భవన్‌లో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగం దివాలా తీయటంతో కార్మికులు ఉపాధి లేక వలసలు పోతున్నారని చెప్పారు. ఆర్థిక విధానాల నుంచి వ్యవసాయ రంగాన్ని మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని ప్రజాపథం అవసరమన్నారు. ఆర్థిక ప్రభావం ఎక్కువగా పేదలపై ఉంటుందని, పాలకులు ప్రజలను మరిచిపోయి వారు ప్రశ్నిస్తుంటే సహనం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై నిర్బంధం ద్వారా అణచివేయాలని చూస్తే ఆ ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోతాయని హెచ్చరించారు. ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు నర్సయ్య, కనకయ్య, పుల్లయ్య, కమల్‌రాజు, వెంకయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.
నీటి ఎద్దడి నివారణకు అన్ని వార్డుల్లో మినీ వాటర్ స్కీమ్‌లు
* ప్రజాపథంలో ఎమ్మెల్యే కూనంనేని వెల్లడి
కొత్తగూడెం, ఏప్రిల్ 18: నీటి ఎద్దడి నివారణకు మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో మినీ వాటర్ స్కీములు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటి నుండి ఐదు వార్డులలో జరిగిన ప్రజాపథంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మున్సిపాలిటీలో మంచినీటి సమస్య అధికంగా ఉందని దీని సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రూ 15లక్షలతో కినె్నరసాని ఫిల్టర్‌బెడ్ వద్ద నిరంతరం కరెంట్ ఉండేవిధంగా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కొత్తగూడెం ప్రజలకు నిరంతరం మంచినీరు అందే విధంగా కృషి చేస్తామని వాగ్దానం చేశారు. ఎలాంటి సమస్యనైనా పోరాడి సాధించే తత్వం తనదని సమస్యలను సాధించేవరకు నిద్రపోనని ఉద్వేగంగా అన్నారు. ప్రభుత్వం ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు ప్రజాపథం నిర్వహిస్తున్నదని కాబట్టి సమస్యల పరిష్కారానికి దరఖాస్తులను అధికారులకు అందించాలని కోరారు. 1వవార్డులో రూ 3.54 లక్షలతో నిర్మించే సిసిరోడ్లు, సిసి డ్రైన్‌ల నిర్మాణాలకు, రెండవ వార్డులో రూ 3.54 లక్షలతో, 3వార్డులో రూ 3.54లక్షలతో, 4వవార్డులో రూ 4లక్షలతో, 5వవార్డులో రూ 31.40 లక్షల వ్యయంతో నిర్మించే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. డ్వాక్రా 171 గ్రూపులకు రూ 5,28,768 చెక్కులను పంపిణీ చేశారు. మున్సిపల్ మాజీ వైఎస్ చైర్మన్ సాబీర్ పాషా, కమిషనర్ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ ఎన్‌టి ప్రకాశరావు, విద్యుత్ ఎఇ రవికుమార్, హౌసింగ్ ఎఇ రాము, సిఐ రవి, వైద్యసిబ్బంది అమ్మణి పాల్గొన్నారు.
సీతంపేటలో నాలుగు పూరిళ్లు దగ్ధం
వి.ఆర్.పురం, ఏప్రిల్ 18: మండల పరిధిలోని సీతంపేట గ్రామంలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 5లక్షల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. వివరాల్లోకి వెళితే....సీతంపేట గ్రామంలోని కోలా ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో తెల్లవారుఝామున ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు ఎగిసాయి. వెనువెంటనే ఆ పక్కనే ఉన్న కోలా కృష్ణార్జునరావు, కోలా వెంకటేశ్వర్లు, చెలకోటి అనసూర్యల పూరిళ్లకు సైతం మంటలు వ్యాపించడంతోఅవి దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం తెల్లవారుఝామున అంతా నిద్రిస్తున్న సమయంలో సంభవించడంతో బాధితులంతా ప్రాణభయంతో కట్టుబట్టలతో బయటకు పరుగులు తీశారు. వెంటనే భద్రాచలం అగ్నిమాపక కేంద్రం అధికారులకు సమాచారం అందించగా శకటం అక్కడికి చేరుకునేలోపే ఇళ్లన్నీ దగ్ధమయ్యాయి. ఇదిలా ఉండగా ఈ నాలుగు ఇళ్లకు కాకుండా మంటలు సమీపంలోని ఇళ్లకు వ్యాపించకుండా స్థానికులు మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే గ్రామంలో ఉన్న సుమారు 150 ఇళ్లన్నీ అగ్నికి ఆహుతయ్యేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కోలా ప్రసాద్‌కు చెందిన రూ.60 వేలు నగదు, బంగారు ఆభరణాలు, పాస్ పుస్తకాలు, రేషన్‌కార్డు దగ్ధమయ్యాయి. అలాగే కృష్ణార్జునరావుకు చెందిన రూ.18 వేలు నగదు, పాస్ పుస్తకాలు, వంట సామాగ్రి, మినుము, పెసలు కాలి బూడిదయ్యాయి. అలాగే మిగతా రెండిళ్లలో సైతం సామాగ్రి అంతా దగ్ధం కావడంతో బాధితులంతా రోడ్డున పడ్డారు. తక్షణ సాయం కింద రెవెన్యూ అధికారులు ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 వేలు పరిహారం, ఐదు కిలోల చొప్పున బియ్యం, లీటరు కిరోసిన్ అందించారు. అగ్ని ప్రమాద సంఘటన తెలుసుకున్న రేఖపల్లి ఎఎస్‌డిఎస్ సంస్థ డైరెక్టర్ వి గాంధీబాబు బాధితులను పరామర్శించి ఇంటికి 25 కిలోల చొప్పున బియ్యం, టార్పాలిన్లను అందజేశారు. అలాగే టిడిపి, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల నేతలు అగ్ని బాధితులను పరామర్శించి ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం అందించేందుకు తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని వి.ఆర్.పురం, చింతూరు, కూనవరం మండలాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నా అధికారులు స్పందించకపోవడం పట్ల ఆయా మండలాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
అతి పురాతనం..అతి పవిత్రం ‘అతిరాత్రం’
భద్రాచలం, ఏప్రిల్ 18: నాలుగు వేల సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన వైదిక యాగం అతిరాత్రం. భారతీయ సంస్కృతికి ప్రమాణాలుగా భావించే చతుర్వేదాలలో పేర్కొనబడిన అతి ప్రాచీన యజ్ఞం అతిరాత్రం. ఎంతో విశిష్ట, మహోన్నతమైన ఈ యాగాన్ని భద్రాద్రి క్షేత్రానికి అతి సమీపంలో గల గోదావరి తీరంలో జటాయువు కొలువున్న చోట నిర్వహించనుండటం విశేషం. ఈ నెల 21 నుంచి మే 2 వరకు సమతా లోక్ సేవా సమితి ఆధ్వర్యంలో కేసాప్రగడ హరిహరనాథ శర్మ పర్యవేక్షణలో నిర్వహించే ఈ సోమయాగానికి నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అతిరాత్రం నిర్వహణ ప్రాంతంలో అత్యంత కీలకమైన యాగశాల నిర్మాణం పూర్తయ్యింది. పూర్తిగా వెదురు చెట్లు, తాటి ఆకులు తదితరాలతో వీటిని నిర్మించారు. ఈ నిర్మాణంలో ఏ రకమైన లోహ సామాగ్రిని ఉపయోగించలేదు. పని ముట్లుగా ఉపయోగించినవన్నీ కేరళ ప్రాంతంలో లభ్యమయ్యే కట్టెతోనే తయారవుతున్నాయి. బలి పీఠానికి వాడే ఇటుకలను సైతం కట్టెతోనే తయారు చేసినవే వాడుతున్నారు. అతిరాత్ర యజమాని, ఋత్విక్‌లు, వేద పండితులు స్నానాలు చేసేందుకు ప్రత్యేక చెరువును ఏర్పాటు చేయగా ఈ యాగాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల్లో పురుషులు, స్ర్తిలకు వేర్వేరుగా చెరువులను సైతం ఏర్పాటు చేశారు. వేద ప్రమాణికమైన మహాక్రతువును సప్త సోమయాగాలు అతి ప్రముఖమైనవి. ఇందులో ఉత్కృష్టమైనది అతిరాత్రం (అతిశయతా రాత్రిఃఇతి అతిరాత్రం) రాత్రిని జయించింది. భారతావనిలో సమస్త లోక కల్యాణం కోసం వేద ప్రామాణికమైన మహాక్రతువుల్లో సప్త సోమయాగాలు అతి ప్రముఖమైనవి. అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, ఉక్థ్యం, షోడశీ, వాజ పేయం, అప్తోర్యామం అతిరాత్రములు. ఈ సప్త సోమయాగాలల్లో ఉత్కృష్టమైనది అతిరాత్రం. ఈ అతిరాత్రమనే సోమయాగ నిర్వహణ యావత్ భారతావనిలో కేరళ రాష్ట్రానికే చెందిన అతి కొద్దిమంది నంబూద్రి కుటుంబాల వారికి మాత్రమే వంశపారంపర్యంగా లభిస్తున్న హక్కు. కొన్ని వేల సంవత్సరాలుగా వారి ఆధ్వర్యంలోనే అప్పుడప్పుడు కేరళ రాష్ట్రంలో మాత్రమే నిర్వహిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత కేరళ రాష్ట్రంలోని పంజాబ్‌లో 1956, 1975, 1990లో కుందూరులో, 2006లో కిజక్కంచేరిలో, 2011లో పంజాబ్‌లోనూ నిర్వహించారు. ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికే పరిమితమైన ఈ అతిరాత్రం తొలిసారిగా రెండో అయోధ్యగా భాసిల్లుతోన్న భద్రాచలం సమీపంలోని ఎటపాకలో నిర్వహిస్తున్నారు. ఈ యాగాన్ని నిర్వహించాలంటే ప్రధానంగా నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా యాగం నిర్వహించేందుకు వీలుంటుంది. కాగా భద్రాచలం ఎంపిక విషయంలో మాత్రం నాలుగు అంశాలు కలసి వచ్చాయి. దక్షిణ గంగ అయిన గోదావరి నదీ తీరం కావడం, భద్రగిరిపై వెలసి భాసిల్లుతోన్న చతుర్భుజ శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రాంతం కావడం, దండకారణ్యం, భద్రాచలం ప్రసిద్ధ రామక్షేత్రంగా విరాజిల్లుతుండటం కూడా అతిరాత్రం నిర్వహించడానికి ప్రధాన కారణాలు. అంతేగాక త్యాగ, స్నేహశీలతకు ప్రతిరూపం జటాయువు. జటాయువు కాలు తెగిపడిన చోటనే జటాయువు పాకగా పిలిచే ఎటపాకలో ఈ చారిత్రాత్మక ప్రాం తాన్ని గుర్తించి ఇక్కడ అతిరాత్రం నిర్వహిస్తున్నారు. గరుడ పక్షి రూపంలో ప్రత్యేకంగా నిర్వహించబడే హోమ వేదిక నిర్మాణ సమయంలో ఒక గద్ద లేదా డేగ, రాబందు వచ్చి యాగశాల ప్రాంగణంలో ప్రదక్షిణ చేసి వెళ్లడం, యాగ పరిసమాప్తి తర్వాత ఋతు సంబంధం లేకుండా కుంభవృష్టి కురియడం వీటికి విశేష నిదర్శనాలు. ఈ సోమయాగానికి దశాబ్దాలుగా కఠోర దీక్ష వహిస్తున్న నడువం నారాయణం సోమయాజి దంపతులు యజమానులుగా వ్యవహరిస్తున్నారు. ఎంతో నిబద్ధతగా అన్ని ప్రమాణాలకు అనుగుణంగా యాగశాల నిర్మాణం జరుగుతోంది. మట్టితో తయారు చేసిన పెద్ద పెద్ద ఇటుకలతో గరుడ పక్షి ఆకృతిలో హోమ వేదికను నిర్మించి ప్రతినిత్యం వేద మంత్రాలతో ప్రత్యేక క్రియతో రోజుకో ఓ వరుస చొప్పున ఐదు రోజుల్లో దీనిని పూర్తి చేస్తారు. వివిధ వృక్ష జాతులకు చెందిన చెక్క, మట్టితో నిర్ణీత ప్రమాణాలతో వివిధ ఆకృతుల్లో చేయబడిన పాత్రలు యాగంలో ఉపయోగించనున్నారు. అలాగే బహు అరుదుగా లభించే సోమలతను కేరళకు చెందిన రాజవంశీయుల నుంచి నియామవళిని అనుసరిస్తూ స్వీకరించి సోమరసాన్ని తయారు చేసి ఈ యాగంలో వినియోగిస్తారు. మొత్తం యాగ ప్రక్రియను భగవత్ ప్రీతికరంగా, మనోజ్ఞంగా విధి విధానాలతో నిష్టతో నిర్వహిస్తారు. కేరళ నుంచి వచ్చిన 60 మంది నంబూద్రిలు, 22 మంది ఋత్విక్‌లు, యజమాని నడువమ్ నారాయణన్ సోమయాజి నంబూద్రి నేతృత్వంలో యాగ నిర్వహణ జరుగుతుంది. సప్త సోమయాగాల్లో అత్యంత ఉత్కృష్టమైన అతిరాత్రం నిర్వహించడంలో యజమాని కీలకం. ప్రధాన యజ్ఞకర్తను యజమాని అంటారు. సాధారణంగా నంబూద్రిలే యాగాలు చేసినా వారిలో అందరూ చేయడానికి అర్హులు కాదు. తుళ్ జాతి వంశమూలాలు కల్గిన సాగర నంబూద్రి, సర్రిభట్టాత్రి, ఎంబ్రనాథ తదితర వంశాల వారే అతిరాత్రం నిర్వహించేందుకు అర్హులు. ఎటపాకలో జరిగే అతిరాత్రంను తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున శాస్తవ్రేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, అధికార, అనధికార ప్రతినిధులు తరలిరానున్నారు.