Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తప్పుకుంటున్న మద్యం బినామీలు!

$
0
0

కర్నూలు, ఏప్రిల్ 18: పెద్దల మద్యం దుకాణాలకు బినామీలు మెల్లగా పక్కకు తప్పుకుంటున్నారు. వారిని బినామీలుగా ఉపయోగించుకుంటున్న వారే పరిస్థితి మెరుగయ్యే వరకు ముఖం చాటేయమని చెప్పడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో వెళ్లిపోయి మద్యం దుకాణ అసలు యజమాని, కుటుంబ సభ్యులకు మినహా మరెవరికీ ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. దీనికంతటికీ కారణం మద్యం దుకాణాలపై అవినీతి నిరోధక శాఖ అధికారుల ప్రత్యేక విచారణ బృందం (సిట్) అరెస్టు చేస్తుందనే భయమేనన్న విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలో మద్యం మాఫియా చెలరేగిపోతోందన్న కారణాన్ని ఎత్తి చూపుతూ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో భాగంతో ఒక దాని వెంట మరొకటి ఎసిబి అధికారులు చేపట్టిన శోధనలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో మొదట మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహించి ఆరుగురు వ్యక్తులను ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. ఆ తరువాత ఇద్దరు అధికారులను కూడా అరెస్ట్ చేయడంతో మద్యం సిండికేట్ల వ్యవహారం రసకందాయంలో పడింది. ఆ సమయంలో మద్యం సిండికేట్ల వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన కొందరు వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురై తమను కూడా అరెస్టు చేస్తారేమోనన్న భయంతో అప్పట్లో వారు కూడా జాగ్రత్తపడ్డారు. మద్యం సిండికేట్ల పర్వంలో వెలుగు చూస్తున్న అక్రమాల నేపథ్యంలోనే కాకుండా స్థానికంగా అధికారులపై ఒత్తిడి ఉంటుందని ఆలోచించిన ఎసిబి ఉన్నతాధికారులు మద్యం కేసులకు సంబంధించి ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను నియమించింది. వీరి విచారణలో తెలుపు కార్డులున్న వారు సైతం మద్యం దుకాణ యజమానులుగా తేలడంతో అసలు వీరికి దుకాణాలకు సంబంధం ఏంటన్న కోణంలో విచారించారు. మద్యం దుకాణ లైసెన్సులు తెలుపు కార్డుదారులవే అయినా ఆ వ్యాపారంతో వారికి సంబంధం లేదని తేలింది. దీంతో బినామీలుగా ఉన్న వారిపై ఎసిబి అధికారులు కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 194 మద్యం దుకాణాలు ఉండగా వీటిలో 121 మద్యం దుకాణ లైసెన్సులు బినామీలకు ఉన్నాయని, మరో తొమ్మిది మంది ఇతర జిల్లాలకు చెందిన వారుగా తేల్చి వారికి కూడా మద్యం దుకాణాలతో ప్రత్యక్ష సంబంధం లేదని ఎసిబి అధికారులు ప్రకటించారు. వీరందరిపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించడంతో ఇపుడు బినామీల వెన్నులు చలి మొదలైంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్న బినామీలు ఎందుకైనా మంచిదని పక్కకు తప్పుకుంటుండగా వారిని ఉపయోగించుకున్న పెద్దలు ఆ కేసుల నుంచి తమ బినామీలను ఎలా బయట పడేయాలా అన్న ఆలోచనలో నిమగ్నమయ్యారు. మరోవైపు మద్యం లైసెన్సులు పొందిన బినామీల్లో కొందరు తమ బియ్యం కార్డులు రెవెన్యూ అధికారులకు సరెండర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బినామీల వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా జోక్యం చేసుకుంటూ కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి మద్యం దుకాణాల లైసెన్సులను పొందడానికి, ఆ తరువాత లక్షల పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి అవసరమైన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సొమ్ముకు తగిన పన్నులు చెల్లిస్తున్నారా లేదా అనే అంశాలపై బినామీలను ప్రశ్నించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. బినామీలు తమవే దుకాణాలు అని చెబితే ఆదాయపు పన్ను అధికారులు లెక్కలు అడిగేందుకు సిద్ధపడుతుండగా తమవి కాదని చెబితే ఎవరి దుకాణమో చెప్పాలని ఎసిబి అధికారులు ఉక్కిరి బిక్కిరి చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అడకత్తెరలో బినామీలు చిక్కుకున్నారు. తాము కష్టాల్లో పడేందుకు కారణమైన మద్యం దుకాణ లైసెన్సుల వ్యవహారంపై బినామీలు ఆందోళన చెందుతూ దుకాణ యజమానులు అండగా ఉంటారా లేక తమ దారిన తమను వదిలేస్తారా అన్న విషయం కూడా వారి ఆందోళనకు కారణంగా మారింది. మొత్తం మీద మద్యం బినామీల వ్యవహారంపై జిల్లాలో రసవత్తర చర్చకు అవకాశం కల్పించింది.

ప్రజా సంక్షేమానికి పెద్దపీట
మహానంది, ఏప్రిల్ 18: ప్రజా సంక్షేమానికై, ప్రజల అభ్యున్నతికై పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మహానంది మండలంలోని అబ్బీపురం, తిమ్మాపురం, బుక్కాపురం, తమడపల్లె గ్రామాల్లో జరిగిన ప్రజాపథం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల ప్రత్యేక అధికారి మురళి మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ప్రజాపథంలో నాలుగు గ్రామాల ప్రజలు సమస్యలతో కూడిన వినతిపత్రాలను మంత్రికి అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించి అన్ని శాఖల అధికారులను తమ గ్రామాలకే తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించేందుకై కృషి చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన వారందరికి ఇళ్ళ పట్టాలు అందిస్తామని, అబ్బీపురంలో ఇప్పటికే 52 పట్టాలను అందించామన్నారు. ఇంకా అవసరమైతే మరో 5 ఎకరాల స్థలం తీసుకొని అయినా పేదలకు ఇళ్ళ పట్టాలు అందజేస్తామన్నారు. ఐదుమాన్ల రస్తాను పూర్తి చేయాలని రైతులు కోరగా రూ.49 లక్షలతో నిర్మించామన్నారు. అబ్బీపురం, యు బొల్లవరం రస్తాకు రూ.50 లక్షలు, అబ్బీపురంలోని బాలిరెడ్డి ఇంటి దారికి రూ.6.6 లక్షలు, బుక్కాపురం, తిమ్మాపురం గ్రామాల మధ్యలోని దారికి రూ.22.50 లక్షలు, కృష్ణనంది రస్తాను రూ.64 లక్షలతో పూర్తి చేశామన్నారు. మైక్రో ఫైనాన్స్‌లో అప్పులు తీసుకొని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారిని కాపాడేందుకే స్ర్తి నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అబ్బీపురంలో కమ్యునిటి హాలు నిర్మాణానికై రెండు ప్లాట్లను అందించి తన సొంత నిధుల ద్వారా భవన నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
మంత్రికి కోకొల్లలుగా వినతిపత్రాలు
మండలంలోని అబ్బీపురం, బుక్కాపురం గ్రామాల్లో రైతులు, మహిళలు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను కోకొల్లలుగా సమర్పించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ మంత్రిని చుట్టుముట్టారు. బుక్కాపురం గ్రామంలో రైతులు తమ పొలాలు ఎండిపోతున్నాయని, విద్యుత్ సరిగా లేక పంటలు చేతికి రాక రైతు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. మహిళలు గ్రామాల్లో ఉన్న సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందించారు. పొదుపు మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందిస్తామన్న హామీ అలాగే ఉందన్నారు. స్పందించిన మంత్రి గ్యాస్ కనెక్షన్లు ఏ ప్రభుత్వం అందించనన్ని మహానందికి అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇఇ సుధాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ యర్రగుంట్ల రమణారెడ్డి, కాకనూరు శివనాగిరెడ్డి, ఒంటెద్దు వీరారెడ్డి, చిట్టిబొట్ల భరధ్వాజశర్మ, మాజీ ఉపాధ్యక్షులు కొండారెడ్డి, రవినాధరావు, మిలిటరి సుబ్బారెడ్డి, తహశీల్దార్ మునికృష్ణయ్య, ఎంపిడివో సువర్ణలత, డాక్టర్‌లు భగవాన్‌దాస్, ఆయూస్ మెడికల్ అధికారులు డాక్టర్ షేక్ హుసేన్, జయప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరీక్షలంటే చూచి రాతలా...!
కర్నూలు (స్పోర్ట్స్), ఏప్రిల్ 18: పరీక్షలంటే భయం లేదా... పరీక్షలంటే మీకు ఎందుకు అంత చులకన విద్య పూర్తిచేసుకున్న తరువాత ఉద్యోగాలుచేసే వారిని ఇలా చూచిరాతకు ప్రోత్సాహిస్తారా అని రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్సిలర్ కృష్ణా నాయక్ ఆత్మకూరులోని పిజి కళాశాల యాజమాన్యంపై సీరియస్ అయ్యారు. వైస్ ఛాన్సిలర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన రోజే విసి మీడియాతో మాట్లాడుతూ పరీక్షలు వర్శిటీ వెనె్నముక్కలాంటిదని, పరీక్షల నిర్వాహణ, ముల్యాంకనంలో ఎటువంటి రాజిపడకుండా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని హెచ్చరికలు జారీ చేసినప్పటికి కొన్ని కళాశాలలు తమ తీరును మార్చుకోలేక చూచిరాతను ప్రోత్సాహిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ బుధవారం ఆత్మకూరులో జరిగిన పీజీ పరీక్షలే. రాయలసీమ యూనివర్శిటీ పరిధిలోని పిజి కళాశాల్లో ప్రస్తుతం నాల్గవ, రెండవ సెమిస్టర్ పిజి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ మేరకు బుధవారం జిల్లాలోని నందికొట్కూరు మీదుగా ఆత్మకూరులో వైస్ చాన్సలర్ కృష్ణానాయక్ సామూహిక తనిఖీల్లో భాగంగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆత్మకూరు మండలంలోని కరివేణ గ్రామంలో వున్న ఎస్‌ఎన్‌ఆర్ పిజి కళాశాలను తనిఖీ చేశారు. ఎస్‌ఎన్‌ఆర్ కళాశాలలో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నాల్గవ సెమిస్టర్ పరీక్షను రెండు గదుల్లో 35 మంది విద్యార్థులు ముకమ్మడిగా చూచి రాతకు పాల్పడుతూ విసి కంటికి పట్టుబడ్డారు. దీంతో ఆగ్రహించిన విసి కళాశాల యాజమాన్యంపై సీరియస్ అయ్యారు. చూచిరాతకు ప్రోత్సాహిస్తున్న కళాశాలను సీజ్, పరీక్ష కేంద్రాన్ని రద్దు చేస్తున్నట్లు విసి కృష్ణానాయక్ ఆదేశించారు. అదే విధంగా 35 మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు విసి ప్రకటించారు. గురువారం ఇదే కళాశాలలో జరగాల్సిన రెండవ సెమిస్టర్ పిజి పరీక్షలను ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరీక్ష కేంద్రంగా మార్చినట్లు వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్‌టికే.నాయక్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి రెండవ సెమిస్టర్ పరీక్షలను ఆత్మకూరు డిగ్రీ కళాశాలలో రాయాలని ఆయన తెలిపారు.

మంత్రి ఏరాసును పదవి నుంచి తప్పించి
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి

నంద్యాల అర్బన్, ఏప్రిల్ 18: బండి ఆత్మకూరు మండలంలో జరిగిన ప్రజాపథంలో ఎంపిడివో డేవిడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడిన న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిని పదవి నుంచి తొలగించి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరుతూ బుధవారం నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మంత్రి దిష్టిబొమ్మను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియం సాంబశివుడు మాట్లాడుతూ దళిత ఉద్యోగి అన్న చులకనతో అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్యకరంగా మాట్లాడడం హేయమైన చర్య అన్నారు. మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాపథంలో బహిరంగంగా దళిత ఉద్యోగిని దుర్భాషలాడడం మంత్రి హోదాకు తగదని వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాముడు, మిట్నాల దావీదు, పరదేశి రంగయ్య, చిన్నోడు, దాసు, జోసఫ్, బాలాజి, కిరణ్, వెంకటేశ్వర్లు, ఎంఆర్‌పిఎస్ పట్టణ ఉపాధ్యక్షులు జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో..
దళిత అధికారులను కించపరచడం మంత్రి ఏరాసుకు తగదని ఎమ్మార్పీఎస్ పట్టణ ఉపాధ్యక్షులు పేరపోగు జోసఫ్ ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా దళిత అధికారులను అవమానపరుస్తూ వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుందని ఇలాగే జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.
మంత్రి ఏరాసుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాల మహానాడు కారెం శివాజి వర్గం జిల్లా ప్రధాన కార్యదర్శి వైసి పుల్లయ్య, కెజె శ్రీనివాస్, బండి దేవాంతకుడులు ఖండించారు. బొమ్మలసత్రం జంక్షన్‌లో మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపాలు, నరసింహుడు, మోహన్, సాదె వౌలాలి, బండి రమణ, రామకృష్ణ, వేణుగోపాల్, యేసేపు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తాం

కర్నూలు, ఏప్రిల్ 18: ప్రజాపథం ద్వారా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలు పరిష్కరిస్తారని చిన్న నీటిపారుదలశాఖ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ప్రజల అవసరాలు తీర్చేందుకే ప్రభుత్వం ప్రజాపథం కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. బధవారం నగరంలోని 6,7 వార్డులు ఖడక్‌పుర, తెలుగువీధుల్లో ఏర్పాటు చేసిన ప్రజాపథం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల తక్షణ అవసరాలైన తాగునీరు, విద్యుత్ సమస్య పరిష్కరించనున్నామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను పూర్తి చేస్తున్నామన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక కొత్త పథకాలను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. కర్నూలు నగరాభివృద్దికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వేసవిలో తాగునీరు నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం 6వ వార్డు తెలుగువీధిలో పొదుపు మహిళలకు రూ.1.64 కోట్లు, 7వ వార్డు ఖడక్‌పురలో రూ.3కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఇంజనీరు సత్యనారాయణమూర్తి, ఎస్‌ఇ ఆంజనేయులు, మెప్మా పిడి సుధాకర్‌రావు, తాసీల్దార్ హుసేన్‌సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

పూర్తికాని బైపాస్ రోడ్డు నిర్మాణం

ఆదోని, ఏప్రిల్ 18: ఆదోనిలో పెరిగిన ట్రాఫిక్‌ను నియంత్రించడానికి భారీ వాహనాలను బైపాస్ రోడ్డుగుండా మళ్లించడానికి ప్రారంభించిన బైపాస్ రోడ్డు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. రెండు వైపులా మాత్రమే పూర్తయింది. మరోవైపు పూర్తికాకపోవడంతో రెండు వైపులా బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయినా ప్రయోజనం లేకుండాపోయింది. బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తికాకపోతే రెండు వైపులా రోడ్లు నిర్మించిన నిధులన్ని కూడా వృథా అయినట్లే. ఆదోని మున్సిపాలిటీగా ఏర్పడి 140 సంవత్సరాలు దాటింది. పట్టణంలో జనాభా రెండు లక్షలకు చేరింది. ఒకప్పుడు 25కు మించి బస్సులు, 10నుంచి 15మించి లారీలు, 100కుమించి మోటర్‌సైకిళ్లు ఉండేవి కావు. ఇప్పుడు ఆర్టీసి బస్సుల సంఖ్య 100కు చేరింది. లారీలు 200పైగా ఉన్నాయి. మోటర్‌సైకిళ్లు వేల సంఖ్యలో ఉన్నాయి. ట్రాక్టర్లు, ఆటోలు కూడా పెరిగిపోయాయి. పట్టణం కూడా విస్తరించింది. ట్రాఫిక్ ఎంతో పెరిగి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదోని మున్సిపాలిటీకన్నా ఎంతో వెనుకగా మున్సిపాలిటీ అయిన ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. మేజర్ గ్రామ పంచాయతీ అయిన పత్తికొండలో బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగింది. కానీ ఆదోనిలో మాత్రం బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. ఎమ్మెల్యే మీనాక్షీనాయుడును అడిగితే తాను ప్రతిపక్షంలో ఉన్నానని, అయినా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చామని స్పష్టం చేశారు. ఇంతవరకు బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. ఒకవైపు పట్టణంలో మున్సిపల్ మెయిన్ రోడ్డు, పండిట్ నెహ్రూ రోడ్డు, ఎమ్మిగనూరు రోడ్లలో ట్రాఫిక్ పెరగడంతో వన్‌వే ప్రవేశపెట్టారు. అయినప్పటికీ బయట ప్రాంతం నుంచి వస్తున్న వాహనాలు, స్థానిక వాహనాలతో రోడ్లన్ని కిటకిటలాడుతున్నాయి. అందువలన ఆదోనిలో బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని నిర్మించాలని 1996 జూలై 29న మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం పెట్టి కౌన్సిల్ ఆమోదించింది. అయితే తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నా బైపాస్ రోడ్డు నిర్మాణం ఊసే ఎత్తలేదు. ఈ కాలంలో రెండుసార్లు మీనాక్షీనాయుడు ఎమ్మెల్యేగా కొనసాగారు. అయినా కౌన్సిల్ ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. అయితే 2008లో ఆనాటి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కృషి వలన రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్ల 30లక్షలు మంజూరయ్యాయి. అయితే పత్తికొండ- ఎమ్మిగనూరు రోడ్లను, ఆలూరు - శిరుగుప్ప రోడ్లను కలుపుతూ బైపాస్ రోడ్డును 7.9కి.మీ., మేర నిర్మించారు. కానీ ఆలూరు రోడ్డు నుంచి పత్తికొండ రోడ్డును కలిపే 5 కి.మీ., రోడ్డును ఇప్పటికీ నిర్మించలేదు. ఈ రోడ్డులోనే రైల్వే ట్రాక్ ఉండడం వలన పెండింగ్ పడిందని నేతలు పేర్కొన్నారు. అయితే రైల్వే ట్రాక్‌పై కూడా బ్రిడ్జి నిర్మించి బైపాస్ రోడ్డు నిర్మించడానికి ప్రతిపాదనలు తయారుచేసి పంపినట్లు 2008 సంవత్సరంలో ఆర్‌అండ్‌బి అధికారులు పేర్కొన్నారు. అయితే ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ ప్రతిపాదనలు ఇప్పటికీ కూడా వెలుగులోకి రాలేదు. బైపాస్ రోడ్డు నిర్మాణం సగంలోనే నిలిచిపోయింది. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకొని బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. లేకపోతే రెండు వైపులా రూ.20 కోట్ల 36 లక్షలతో నిర్మించిన రెండు రోడ్లు వృథా అవ్వడం ఖాయం.

మున్సిపాలిటీలో
వెలగని వీధి దీపాలు

నందికొట్కూరు, ఏప్రిల్ 18: నగర పాలికగా మారిన నందికొట్కూరు నాటి నుండి నేటి వరకు నగరంలో వీధి లైట్లు పలు విధుల్లో వెలగకపోవడంతో ప్రజలు అంధకారంలో వుండి ఇబ్బందులకు గురి అవుతున్నారు. మున్సిపాలిటికి రెగ్యూలర్ కమిషనర్ లేకపోవడంతో ఇంచార్జ్ పాలనతో అభివృద్ధి కుంటుపడింది. ప్రజలకు అందాల్సిన వౌళిక సదుపాయలు సైతం అందక పట్టణ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది. పురపాలక సంఘానికి కావల్సిన సిబ్బంది ఇంతవరకు నియమించకపోవడం శోచనీయం. కర్నూలు నరగపాలికకు ఉన్న కమిషనర్ నందికొట్కూరు పురపాలికకు ఇన్‌చార్జ్ కమిషనర్‌గా వుండటంతో భాద్యతలు పెరగడంతో ఆయన కార్యలయానికి ఎప్పుడు వచ్చేది తెలియకపోవడంతో ప్రజలు పనుల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతు ఇబ్బందులకు లోనవుతున్నారు. పర్యవేక్షణ అధికారి స్థానికంగా కార్యాలయంలో లేకపోవడంతో సిబ్బంది తమ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. నగరంలో పారిశుద్ధ్యం కార్యక్రమాలు పర్యవేక్షించవల్సిన ప్రధాన అధికారి లేకపోవడంతో పారిశుద్ధ కార్యక్రమాలు సక్రమంగా జరుగక కాలనీలలో మురికినీటి కాలువలు దుర్వసన వెదజల్లుతున్నాయి. గత నెలలో నిర్వహించిన పురపాలక సమీక్ష సమావేశంలో పట్టణంలో వెలగని వీధి దీపాల గురించి ప్రజలు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, కమిషనర్ వివిఆర్ మూర్తి దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ దీపాలు వెలిగేలా చుడాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించి నెల రోజులు గడిచినప్పటికి విద్యుత్ దీపాలు కాలనీల్లో వెలగడం లేదు. కమిషనర్ ఆదేశాలు సైతం బేఖాతరు కావడం గమనార్హం. నందికొట్కూరుతో పాటు నగరపాలికలుగా మారిన వాటికి రెగ్యూలర్ కమిషనర్‌ను నియమించబడి అబివృద్ది పథంలో ముందుకు కొనసాగుతున్నది. కాని నందికొట్కూరుకు మాత్రం అభివృద్దికి నోచుకోకా వెనుకబడిపోతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రెగ్యూలర్ కమిషనర్‌ను నియమించి ప్రజల సమస్యలను పరిష్కరించి నగర అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలు కోరుతున్నారు.

పెద్దల మద్యం దుకాణాలకు బినామీలు మెల్లగా పక్కకు తప్పుకుంటున్నారు.
english title: 
t

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>