కడప, ఏప్రిల్ 18 : జిల్లాలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎన్నికల్లో పట్టు సాధించుకోవాలన్న ప్రయత్నాల్లో భాగంగా ఒక పార్టీ నుండి మరొక పార్టీకి నేతలను జంప్ చేయించే కార్యక్రమాలు పుంజుకుంటున్నాయి. వర్గ సమీకరణల్లో పట్టు నిలుపుకున్న వారికే ఫలితం ఉంటుందన్న ఎత్తుగడతో పార్టీలు కూడా వ్యూహ రచన చేస్తున్నాయి. ఇప్పటికే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులతో ఆయా నియోజక వర్గాల్లో ఓట్లున్న నేతలను తమ వైపునకు మలుచుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. తాజాగా లక్కిరెడ్డిపల్లె మాజీ శాసన సభ్యుడు జి. ద్వారకానాథ్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ తమ వైపునకు మళ్లించుకుంది. ఈ మేరకు శుక్రవారం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు రాజంపేటలో గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటూ అంటీఅంటనట్లుగా వ్యవహిస్తున్న మాజీ శాసన సభ్యుడు బ్రహ్మయ్యకు టిక్కెట్‌ను ఇచ్చి బలిజ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నంలో టిడిపి ముందుకు సాగుతోంది. బ్రహ్మయ్యకే టిక్కెట్ ఖరారైందని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే అంటున్నారు. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న మరి కొందరు బలిజ సామాజిక నేతలు బ్రహ్మయ్యకు మద్దతుగా ఆ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టిడిపి టిక్కెట్ ఆశించి నిరాశకు గురైన మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేందుకు ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాగా రైల్వేకోడూరు టిక్కెట్ ఆశిస్తున్న మాజీ శాసన సభ్యుడు గుంటి ప్రసాద్‌కు టిక్కెట్ ఇప్పించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు సాయిప్రతాప్‌తో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్. రవీంద్రారెడ్డి, మాజీ మంత్రి వైఎస్. వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 21వ తేదీన ఈ రెండు నియోజక వర్గాల్లో జరిగే ప్రజాపథంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇరువర్గాలను సముదాయించే పరిస్థితులు ఉన్నాయి. అయితే అవి ఏ మేరకు సాధ్యమన్నది అంతుపట్టడం లేదు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ మూడు నియోజక వర్గాల్లో పర్యటించి టిక్కెట్లు ఆశిస్తున్న నేతలందరితో చర్చించారు. అయినప్పటికీ టిక్కెట్ల కోసం పోటీ పడుతున్న నేతలు రాజీ మార్గంలో పయనించినట్లు కనబడుటలేదు. ఎందుకంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ నుండి పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశాలున్నాయని, దీని ద్వారా 2014 ఎన్నికల్లో కూడా లబ్ధి పొందవచ్చన్న ఆశలు అధికార పార్టీలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఈ రెండు నియోజక వర్గాల్లో నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు రంగంలోకి దిగింది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా నేతలతో సమీక్షిస్తున్నారు. రాజధానికి వచ్చి తనను కలవాలని మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డికి సూచించారు. అదే విధంగా రైల్వేకోడూరు నియోజక వర్గంలో ఇన్‌చార్జి కట్టా బాలాజీ నాయుడు, గుండయ్య నాయుడు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నేతలను ఏక తాటిపైకి తెచ్చేందుకు బాబు శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో ఇక్కడ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల తరపున అభ్యర్థుల ఎంపిక ప్రకటించాక భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కూలికి వెళ్లి కాటికి
సింహాద్రిపురం, ఏప్రిల్ 18: పొట్టకూటికోసం బతుకుదామని కూలికెళ్లారు. ఉత్సాహంగే పనిచేసి తిరుగు ప్రయాణం అయ్యారు... అయితే రోడ్డు ప్రమాదంలో మృత్యువు వెంటాడుతోందని వారికి తెలియదు... ట్రాక్టర్ రూపంలో మృత్యువు ఎదురు రావడంతో తప్పించుకోలేక విగతజీవులుగా మిగిలారు.... వివరాలల్లోకి వెళ్తే పులివెందుల సింహాద్రిపురం మార్గమధ్యంలోని అగ్రహారం వద్ద బుధవారం చీనీలారీ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగుకి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే మండలంలోని గురజాల నుంచి చీనీ కాయల లోడ్‌తో పులివెందులకు వెళ్తున్న లారీ అగ్రహారం వద్దకు రాగానే అవతలి వైపు నుంచి మట్టిలోడ్‌తో ట్రాక్టర్ మెయిన్‌రోడ్డులోకి వస్తుండగా వేగంగా వెళ్తున్న చీనీ కాయల లారీ ట్రాక్టర్‌ను తప్పించబోయి అదుపుతప్పి చెట్టును కరెంటు స్థంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఇందులో మొత్తం 17మంది కూలీలు ప్రయాణిస్తుండగా వెంకటాపురానికి చెందిన చల్లారవీంద్ర (27) కత్తి వెంకటరమణ (18), కొత్తపల్లె రమణ (29)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు భాగ్య, ఈశ్వరయ్య, బాబులకు తీవ్రగాయాలు కాగా అంబులెన్స్ ద్వారా కడప రిమ్స్‌కు తరలించారు. మరో నలుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. మిగిలిన వారు లారీ క్యాబిన్ నుంచి దూకి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా ధ్వంసం అయింది. బోల్తా పడిన లారీని ప్రొక్లైన్‌ల సహాయంతో వెలికి తీసి అందులోని మృతదేహాలను పోలీసులు బయటికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు సింహాద్రిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.
సంఘటనాస్థలాన్ని పరిశీలించి వైఎస్‌ఆర్ పార్టీ నేతలు
ఆగ్రహారం వద్ద చీనీ కాయల లారీ బోల్తా పడిన సంఘటనా స్థలాన్ని వైఎస్‌ఆర్ సీపీ నేతలు డాక్టర్ ఇసి గంగిరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలు పరిశీలించారు. ప్రమాదం జరిగిన సంఘటన తీరును వారు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి భాదితులకు సహాయం అందేలా కృషి చేస్తామన్నారు.
నేతలు లేని ప్రజాపథం
కడప (కలెక్టరేట్), ఏప్రిల్ 18 : గ్రామ సభల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు వీలుగా అధికారులపై వత్తిడి తెవాల్సిన రాజకీయ పార్టీ ప్రతినిధులు గ్రామ సభలపై కనె్నత్తి చూడలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపథం మూడు రోజులుగా జిల్లాలో కొనసాగుతోంది. పథకం ప్రారంభమైన మొదటి రోజు జిల్లాకు చెందిన ముగ్గురు అమాత్యులు హడావిడిగా పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఏకంగా ఈ ప్రజాపథం శుద్ధ దండగ.. దీనివల్ల ప్రజలకు ఒరిగేది లేమి లేదని స్పష్టం చేసి రాజధానికి వెళ్లిపోయారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య, మైనార్టీ శాఖ మంత్రి అహ్మదుల్లా కూడా హడావిడిగా గ్రామ సభల్లో పాల్గొని వెళ్లి పోయారు. ఇక ఉన్న అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం రాజధానిలో మకాం వేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో నెలకున్న పరిస్థితులను తెలుసుకుని వాటిపై చర్యలు చేపట్టేందుకు రాష్ట్రానికి ప్రత్యేక పరిశీలకునిగా వచ్చిన వాయిలార్ రవిని కలిసేందుకు జిల్లా అధికార పార్టీ నేతలు కూడా క్యూ కట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఆయన్ను కలసి తమ గోడు వెల్లబోసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇక ఉన్న నేతల్లో పలువురు ఉప ఎన్నికల పేరుతో రాజధానిలో తిష్టవేసి చర్చలు సాగిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ వారు కూడా నామమాత్రంగా ప్రజాపథంలో పాల్గొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే విజయమ్మ పులివెందుల నియోజక వర్గంలో జరుగుతున్న ప్రజాపథంలో పాల్గొంటున్నారు. మరో ఎంపి జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నప్పటికీ ఆయన కూడా ఉప ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరపున రాజంపేట పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సాయిప్రతాప్ జిల్లా వైపు తొంగి చూడడం మానేశారు. ఇలా ఎవరికి వారు అటు అధిష్ఠానం, ఇటు ఉప ఎన్నికలు పేరుతో ప్రజాపథం కార్యక్రమానికి శ్రద్ధ చూపడం లేదని స్థానికులు అంటున్నారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితుల్లో గుక్కెటి నీటి కోసం జనం అలమటించే పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా రెండేళ్లుగా కరవు రావడం, వర్షాలు రాకపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భజలాలు తగ్గుముఖం పట్టి నీరు దొరక్క విలవిలలాడుతున్నారు. పశువులకు కూడా గ్రాసం దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు విద్యుత్ కోత పెరిగిపోతూనే ఉంది. ఈ పరిస్థితిపై చర్యలు తీసుకునే నాథుడే కరువయ్యాడు. అనేక ప్రాంతాల్లో వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు రాకపోవడం, నిజమైన పేదలకు రేషన్ కార్డులు లేకపోవడం, స్థలం ఉన్నా పక్కా ఇల్లు నిర్మించుకోలేక పోవడం, ఇళ్ల స్థలాలు లేకపోవడం వంటి సమస్యలతో జనం సతమతమవుతున్నారు. ఈ సమస్యలను దగ్గరుండి పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు పత్తా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఉండిపోయారు. ఏది ఏమైనా జిల్లాలో కొనసాగుతున్న ప్రజాపథం ప్రతినిధులు లేని ప్రజాపథంగా మారిందని చెప్పక తప్పదు.
ఇది చేతల ప్రభుత్వం
చక్రాయపేట, ఏప్రిల్ 18: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతుల్లో చేసి చూపించేది అని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డితులసిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం చక్రాయపేట మండలం నెరుసుపల్లె గ్రామంలో ఏర్పాటు చేసినట విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని వర్గాలను కలుపుకుని మంచి పాలన అందిస్తున్నారన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో ఆరవ విడత ప్రజాపథం కార్యక్రమం జరుగుతోందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారికి కావాల్సిన ఆర్థిక స్థితి గతులను గమనించి నిధులను కేటాయించినట్లు తెలిపారు. అలాగే ఉపాధి పథకం కింద రాష్ట్రంలో 7 వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందని, తాగునీటి కోసం 54 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, అవసరమైతే మరింత విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే కరెంటుకు సంబంధించి 25వేల కోట్ల రూపాయలు, మహిళా సంఘాలకు పావలా వడ్డీ కింద 2011 డిసెంబర్ ఆఖరుకు 501 కోటి 26 లక్షల రూపాయలు ఆన్‌లైన్ ద్వారావారి అకౌంట్‌కు జమ చేసినట్లు తెలిపారు. అలాగే రైతులకు పావలా వడ్డీతో ఆగస్టు 31 వరకు 61 కోటి 69లక్షల 93వేల రూపాయలు వారి అకౌంట్లకు జమ చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి రైతులకు ఎలాంటి వడ్డీ లేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇన్‌పుట్ సబ్సిడీ కింద 1814 కోట్ల 20 లక్షల రూపాయలు సబ్సిడీ అందజేసిందన్నారు. ఇంత నిజాయితీగా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దిక్కరించడం సమంజసం కాదని ఆరోపించారు. ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని, ప్రజా సమస్యల కోసమే పని చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు రుక్మాంగదరెడ్డి, మాజీ సర్పంచ్ సుబ్బరామయ్య, కాంగ్రెస్ నాయకులు భాస్కర్‌రెడ్డి, గంగిరెడ్డి, సుబ్బారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రుల ఆత్మగౌరం ఢిల్లీ పెద్దలకు తాకట్టు
గాలివీడు, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పెద్దలకు తాకట్టుపెట్టారని మాజీ ఎమ్మెల్యే, రాయచోటి ఉప ఎన్నికల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి రఘురామిరెడ్డి విమర్శించారు. బుధవారం మండల పరిధిలోని బోరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీ బక్కిరెడ్డిగారిపల్లెలో ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డితో కలిసి విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా రాష్ట్ర పరిశీలకులు గులాంనబీ ఆజాద్‌కు గులాం గిరి చేసేవారని, ప్రస్తుతం వాయలార్ రవి కాళ్లకు మడుగులొత్తితే కాని ఎలాంటి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరన్నారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఎన్నికల అజెండాలో చేర్చి అమలు చేసిన రైతాంగానికి పంటల బీమా, పంట నష్టపరిహారం, పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర, 7 గంటల ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, 108, 104, పేద విద్యార్థుల ఫీజు రీ యింబర్స్‌మెంటు వంటి సంక్షేమ పథకాల అమలును ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని దుయ్యబట్టారు. రైతాంగం కోసం అహర్నిశలు పాటు పడ్డ వైఎస్ కుటుంబానికి బాసటగా నిలిచి ఎమ్మెల్యే పదవులు కోల్పోయిన 17 మంది శాసనసభ్యులను త్యాగశీలురుగా అభివర్ణించారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని సిఎంగా చూడాలంటే 17 మంది ఎమ్మెల్యేలను తిరిగి ఉప ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ కుటుంబం కష్టకాలంలో ఉందని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో తాము పదవులను కోల్పోయామని, తమకు పదవులు ముఖ్యం కాదని వైఎస్ కుటుంబం బాగోగులే ముఖ్యమన్నారు. అనంతరం వారు బోరెడ్డిగారిపల్లె, గొందిపల్లె, సుగాలితాండా, పూలికుంట, నూలివీడు గ్రామాలలో ఇంటింటా తిరిగి ఓటర్లను తమకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా బోరెడ్డిగారిపల్లె పంచాయతీ సుగాలితండా మహిళలు పలు సమస్యలను ఏకరువు పెట్టారు. అందుకు స్పందించిన మాజీ ఎమ్మెల్యే మీ సమస్యలను వెంటనే పరిష్కరించుటకు చర్యలు చేపడతానని వారికి హామీ ఇచ్చారు.
అలాగే ఎర్రతిప్పారెడ్డి కుంటలో ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి మీకు కూలి ఎంత పడుతోంది, తాగునీరు ఉందా, నీడ ఏర్పాటు చేశారా అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి కడప నియోజకవర్గం ఇన్‌చార్జి అంజాద్‌బాషా, జిల్లా మైనారిటీ నాయకులు అఫ్జల్ అలీఖాన్, అఫీజుల్లా, మదీనా దస్తగిరి, అఖిల భారత ఉక్కు వినియోగదారుల సభ్యులు యధుభూషన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు నాగభూషన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు భాస్కర్‌రెడ్డి, వెంకటనారాయణరెడ్డి, రెడ్డెప్ప, విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఉమాపతిరెడ్డి, ప్రభాకర్, హరినాథరెడ్డి, గుమ్మా అమరనాథరెడ్డి, మాబుల్లా, ఎస్‌ఆర్ బాషా, అమానుల్లా, తదితరులు పాల్గొన్నారు.
రసూల్‌పల్లెలో
ప్రజాపథం బహిష్కరణ
చింతకొమ్మదినె్న, ఏప్రిల్ 18: మండలంలోని రసూల్ పల్లె గ్రామ పంచాయతీ ప్రజలు బుధవారం ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించిన ప్రజాపథం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవ్వగా, తమ పంచాయతీలో గతంలో నిర్వహించిన ప్రజాపథం, రచ్చబండలో గ్రామానికి రోడ్ల వసతులు, తాగునీటి వసతులపై ఫిర్యాదు చేశామని, అయితే ఇంతవరకూ తీర్చలేదని దీంతో ప్రజాపథం ద్వారా తమకు ఎలాంటి మేలు జరగలేదని కావున ప్రజాపథాన్ని బహిష్కరించాలని అధికారులను నిలదీశారు. దీంతో చింతకొమ్మదినె్న ఎంపిడిఓ సాంబశివారెడ్డి గ్రామస్థులతో మాట్లాడుతూ మంచినీటి సమస్య తన పరిధిలో ఉందని తక్షణమే సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. అయినా గ్రామస్థులు తమకు అవసరం లేదని ప్రజాపథాన్ని బహిష్కరించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రసూల్‌పల్లె వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, టిడిపి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
సిఎం పర్యటనతో అధికారుల
ఉరుకులు పరుగులు..
* ఏర్పాట్లలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం
రాజంపేట, ఏప్రిల్ 18:రాజంపేట డివిజన్‌లో ఈ నెల 21వ తేదీ జరగనున్న ప్రజాపథంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొంటుండడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉరుకులు, పరుగులు కనిపిస్తున్నాయి. ప్రజాపథంలో తమ శాఖకు సంబంధించి ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు వస్తాయో అన్న ఆందోళన అన్ని ప్రభుత్వ శాఖల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా డివిజన్ అధికారులకు సిఎం పర్యటనతో మచ్చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే డివిజన్ పరిధిలోని రాజంపేట, రైల్వేకోడూరుల్లో జరగనున్న ప్రజాపథం రెండు సభల్లో సిఎం పాల్గొంటున్నారు. దీంతో తమ శాఖకు సంబంధించి గత ప్రజాపథంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై ఆయా శాఖల అధికారులు దృష్టి కేంద్రీకరించారు. త్వరితగతిన ఆర్థిక సమస్యతో సంబంధంలేని సమస్యలన్నింటిని పరిష్కరించే దిశగా అన్ని ప్రభుత్వశాఖలు చర్యలు తీసుకోవడం మొదలెట్టాయి. ఇందుకు తగ్గట్టే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ ఇతర జిల్లా ఉన్నతాధికారులు సిఎం పర్యటన విజయవంతమయ్యేలా చూడాల్సిన బాధ్యతపై ఆదేశాలు వస్తుండడంతో తమతమ శాఖలకు సంబంధించి ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా చూసుకునేందుకు దృష్టి కేంద్రీకరించారు. మొత్తానికి సిఎం పర్యటన పుణ్యమా అని దీర్ఘకాలిక సమస్యలు అనేకం పరిష్కారమయ్యే దిశగా ముందుకు సాగుతుండడం శుభపరిమాణం. ఇది ఇలా ఉండగా ప్రజాపథంలో పాల్గొంటున్న సిఎం ద్వారా ఉప ఎన్నికలను ఆధారం చేసుకుని వీలైనన్ని అభివృద్ధి పనులు మంజూరు చేసుకునేందుకు వీలుగా ప్రతిపాదనలను అధికార పార్టీ నేతలు యుద్ద ప్రాతిపదికన సిద్ధం చేయిస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి దృష్ట్యా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు అధికంగా వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఈ శాఖ అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రాజంపేట మున్సిపల్ అధికారులు కూడా ప్రజాపథంలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను ఆర్థిక సమస్యతో ముడిపెట్టి తప్పించుకునే ఎత్తుగడల్లో ఉన్నారు. మొత్తానికి సిఎం ఎన్నికల పర్యటన అయి ఉంటే అధికారులకు ఇబ్బంది ఉండేది కాదు.. ప్రజాపథం కావడం, ప్రజాపథంకు జనాలను కూడా పెద్దఎత్తున చేరవేయాల్సిన బాధ్యత కూడా ఉండడం, జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తే ఫిర్యాదులు కూడా ఎక్కువవుతాయని ఒక పక్క ఆందోళన ఎటు చూసినా సిఎం పర్యటన సజావుగా ఎలాంటి సమస్యలు తమ తమ శాఖలకు ఎదురుకాకుండా ముగియాలన్న తలంపుతో వివిధ ప్రభుత్వ శాఖలు ఆందోళనతో ఉన్నాయి.
అభివృద్ధి పనులకు శ్రీకారం
రాజంపేట ట్రాన్స్‌కో పరిధిలో 21వ తేదీన ముఖ్యమంత్రి పాల్గొంటున్నందున సిఎంచే ట్రాన్స్‌కోకు చెందిన 6 అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్టు స్థానిక ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నూతనంగా రూ. 4 కోట్ల విలువైన నాలుగు 33/11 కె.వి సబ్‌స్టేషన్స్ నిర్మాణాలను ముఖ్యమంత్రిచే ప్రారంభించనున్నామన్నారు. ఇప్పటికే కోటి రూపాయల వ్యయంతో పూర్తయ్యిన హెచ్.చెర్లోపల్లె 33/11 కె.వి సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారన్నారు. అలాగే కోటి రూపాయల వ్యయంతో రాజంపేట ట్రాన్స్‌కో డివిజన్ నూతన కార్యాలయం భవన నిర్మాణాలను కూడా ముఖ్యమంత్రిచే శంకుస్థాపన చేయించడం జరుగుతుందన్నారు.
ధరలు తగ్గించకపోతే
సిమెంట్ ఫ్యాక్టరీలను స్తంభింపజేస్తాం
కడప (కలెక్టరేట్), ఏప్రిల్ 18 : సిమెంట్ ధరలు తగ్గించాలంటూ రెండు రోజులుగా కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి బుధవారం విరమించారు. అదనపు జాయింట్ కలెక్టర్ జోషిబాబు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. సిమెంట్ ధరలు తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆ మేరకు ప్రభుత్వాన్ని కూడా నివేదించామని త్వరలోనే ఫ్యాక్టరీ యాజమాన్యాల సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుంచం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ సిమెంట్ ఫ్యాక్టరీ దారులు తక్షణమే సిమెంట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన నేటితో ముగిసిపోలేదని, మరి కొద్దిరోజుల్లో ప్రజాపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమదాటికి యాజమాన్యాలు దిగి రాకపోతే ఫ్యాక్టరీల నుండి ఒక సిమెంట్ బస్తా కూడా బయటకు రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకుని, ఇక్కడ గనులను వాడుకుంటూ కోట్లాది రూపాయలు వెనవేసుకున్న యాజమాన్యాలు స్థానికులకు అధిక ధరలకు సిమెంట్‌ను విక్రయించడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. ఇక మీదట జరగబోవు ఆందోళనలో అన్ని రాజకీయ పార్టీలు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చాయని, రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు, ఇతర సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా రెండు రోజులు పాటు సాగించిన దీక్షకు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు, కార్మిక సంఘాలు సహకరించినందుకు కుంచం అభినందనలు తెలిపారు.
కుంచం ఆందోళనకు
అండగా నిలుస్తాం : లింగారెడ్డి
జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు సిమెంట్ ధరలను భారీగా పెంచి జిల్లా ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రొద్దుటూరు శాసన సభ్యుడు, తెలుగుదేశం పార్టీ కన్వీనర్ లింగారెడ్డి ధ్వజమెత్తారు. నిరాహార దీక్ష విరమిస్తున్న కుంచంకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటిస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సిమెంట్ ఉత్పత్తి చేసుకుంటున్న ఫ్యాక్టరీలు ఇతర జిల్లాల్లో అతి తక్కువ ధరకు సిమెంట్ విక్రయిస్తూ మన జిల్లాలో అధిక రేటుకు అమ్మడం ఎంత వరకు సమంజసన్నారు. అధిక ధరకు సిమెంట్ విక్రయిస్తున్న యాజమాన్యాలపై చర్య తీసుకోవాలని గతంలో అనేక దపాలుగా జరిగిన పలు సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసిందని అయితే ప్రభుత్వంగాని, ఇటు అధికారులు గాని ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడం వల్లె సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ధరలు పెంచి పేద ప్రజల కడుపుకొట్టుతున్నాయని ధ్వజమెత్తారు. అనంతరం ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ పేదల సమస్యలపై పోరాడుతున్న కుంచం వెంకటసుబ్బారెడ్డికి సంపూర్ణ మద్దతు ఇస్తామని వెల్లడించారు. సిమెంట్ ధరలపై ఆయన చేసిన ఉద్యమం మరింత ఉద్ధృతం అవుతుందని, ఈ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీతో పాటు అన్ని పార్టీలు అవసరమైతే జైలు వెళ్లడానికైనా సిద్ధమేనన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ కుంచం వెంకటసుబ్బారెడ్డి చేపట్టిన ఈ ఉద్యమం ప్రజాధారణ ఉద్యమమని, ఇలాంటి ఉద్యమాలు జరిగినప్పుడే కరుడుకట్టిన సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు కళ్లు తెరిసే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గోవర్ధన్‌రెడ్డి, అమీర్‌బాబు, బాలకృష్ణ, తెలుగు మహిళా అధ్యక్షురాలు సుధారాణి, ఉపాధ్యక్షురాలు రేఖ పలువురు నేతలు పాల్గొన్నారు.
తెలుగు పద్యానికి
జవ సత్వాలు కల్పిస్తున్న ‘ఇంటాక్’
* ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి
కడప (కల్చరల్), ఏప్రిల్ 18:తెలుగు పద్యానికి జవ సత్వాలు కల్పించే దిశలో ఇంటాక్ కృషి చేస్తోందని ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా బుధవారం ఇంటాక్ సంస్థ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటాక్ చైర్మన్‌గా కలెక్టర్ ప్రోత్సాహంతోనే జిల్లా సాంస్కృతిక వైభవం పరిఢవిల్లుతోందన్నారు. ప్రపంచ భాషలకు లేని ప్రత్యేకత తెలుగు భాషకు ఉందన్నారు. తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రత్యేక ప్రక్రియ పద్యమన్నారు. తెలుగు సాహిత్య ప్రాచీనత తెలుగు పద్యంలో కనిపిస్తుందన్నారు. ప్రాచీన కళలను ప్రోత్సహిస్తూ కాపాడుకునే దిశలో కడప శాఖ ఇంటాక్ పని చేయడం అభినందనీయమన్నారు. ఇందులో భాగంగా ప్రాచీన వారసత్వ భాషగా తెలుగు పద్య రచన శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఈ శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటాక్ కో- కన్వీనర్ ఎలియాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల తెలుగు పద్యానికి ఆదరణ తగ్గిందన్నారు. తెలుగు పద్యం పట్ల, భాష పట్ల మమకారం, అభిరుచి పెంచేలా తెలుగు పద్య రచన శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. విద్వాన్ కట్టా నరసింహులు మాట్లాడుతూ భాష కూడా వారసత్వ సంపదేనన్నారు. సాధారణంగా సంస్కృతం నుండి అన్ని భాషలు పుట్టుకొచ్చాయని అంటుంటారని అది నిజం కాదన్నారు. తెలుగు భాష ద్రావిడం నుంచి పుట్టికొచ్చిందన్నారు. ద్రావిడ భాష మాండలికాలుగా ఉన్న తమిళం, తెలుగు, కనడం, మలయాళం అన్నారు. మాండలికాలుగా నున్న మూల ద్రావిడం ఏదని ఖచ్ఛితంగా చెప్పలేమన్నారు. 7, 8 శతాబ్ధాల నుంచే తెలుగు ఉందన్నారు. కడప జిల్లా తెలుగుభాష రెండవ శతాబ్ధందేనన్నారు. ప్రాచీన భూగోళ శాస్తజ్ఞ్రులు టాలని ప్రకారంగా అన్నారు. ప్రాచీనత తెలుగు పద్యంలోనే ఉందన్నారు. ఇటువంటి బృహత్తరమైన తెలుగు పద్య రచన శిక్షణ శిబిరం ఇంటాక్ ఏర్పాటు చేయడం తెలుగువాడు గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమ సమన్వయ కర్త రమణయ్య మాట్లాడుతూ తెలుగుపద్యాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. నేడు లాంఛనంగా ప్రారంభించామని మే 12 నుంచి 10 రోజుల పాటు పద్య రచన శిక్షణ శిబిరం కొనసాగుతుందన్నారు. పద్య శిక్షణ నిర్వాహకులుగా సాహితి వేత్త కట్టా నరసింహులు వ్యవహరిస్తున్నారన్నారు. అర్థమయ్యే రీతిలో సరళంగా పద్యాలు రచించే విధంగా శిక్షణా కార్యక్రమం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు రరమణయ్య, కో- ఆర్డినేటర్ ఇంటాక్ కడప శాఖ కళాక్షేత్రం చిరునామాకు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పార్వతి శంకర్, డాక్టర్ నిభానుపూరి సుబ్బరాజు, గౌరి శంకర్, పవన్‌కుమార్, శివారెడ్డి, ఉపాధ్యాయులు, సాహితి వేత్తలు తదితరులు పాల్గొన్నారు.