నాగార్జున యూనివర్సిటీ, ఏప్రిల్ 18: దేశంలోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీని అగ్రస్థానంలోనికి తీసుకువెళ్లటానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆచార్య నాగార్జున వర్సిటీకి నూతన వీసీగా నియమితులైన ఆచార్య కోదాటి వియన్నారావు తెలిపారు. ఎఎన్ యు నూతన వీసీగా నియమితులైనట్లు సమా చారం అందిన అనం తరం ఆయన మాట్లా డుతూ తల్లిలాంటి నాగార్జున వర్సిటీకి వీసీగా నియమితమవ్వటం ఆనందదాయకమని, అందరి సహాకారంతో మాతృసంస్థను అభివృద్ధి చేస్తానని తెలిపారు. పరిశోధనా రంగానికి ప్రాముఖ్యత నివ్వటంతోపాటు వివిధ విభాగాలలో అవసరమైన మేరకు అధ్యాపక పోస్టుల భర్తీకి కృషి చేస్తానని, నాక్ ఎ గ్రేడు గుర్తింపు తీసుకురావటానికి కావాల్సిన అన్ని చర్యలు చేపడతానని వియన్నారావు తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటం ద్వారా మెరుగైన సేవలందించేలా చర్యలు చేపడతామని, వీసీగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని ఆయన తెలిపారు. ఇలావుండగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నూతన వైస్‌ఛాన్సలర్‌గా కామర్స్ విభాగానికి చెందిన ఆచార్య కోదాటి వియన్నారావును నియమించినట్లు గవర్నర్ కార్యాలయం నుండి సమాచారం అందిందని వర్సిటీ ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో గత కొంతకాలంగా నూతన వీసీ నియామకంపై వర్సిటీలో జోరుగా సాగుతున్న చర్చలకు తెరపడింది. ఆచార్య వియన్నారావు ప్రస్తుతం వర్సిటీ ఇంచార్జి వైస్‌ఛాన్సలర్‌గా పదవీభాద్యతలు నిర్వహిస్తున్నారు. కామర్స్ విభాగానికి చెందిన ఆచార్య కె వియన్నారావు వర్సిటీలో అనేక కీలకపదవులు నిర్వహించటం ద్వారా పాలనాపరమైన అనుభవాన్ని సంపాదించారు. సిడిసీ డీన్‌గా, రిజిస్ట్రార్‌గా, రెక్టార్‌గా పనిచేసిన ఆయన మాజీ వీసీ ఆచార్య వైఆర్ హారగోపాలరెడ్డి పదవీ విరమణ అనంతరం నాగార్జున వర్సిటీకి ఇంచార్జి వీసీగా నియమితులయ్యారు. దీంతోపాటు అదేకాలంలో కృష్ణా వర్సిటీ వీసీ కూడా పదవీ విరమణ చేయటంతో కృష్ణావర్సిటీకి సైతం వియన్నారావు ఇంచార్జి వీసీగా వ్యవహారిస్తున్నారు. నాగార్జున వర్సిటీ నూతన వీసీగా నియమితులైన కె వియన్నారావును వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి ప్రసాద్‌తోపాటు పలువురు అధ్యాపకులు, నాయకులు అభినందించారు.
పారిశుద్ధ్య విభాగంపై
కమిషనర్ కనె్నర్ర
ప శానిటరీ ఇన్స్‌పెక్టర్ మనోహర్ సస్పెన్షన్
గుంటూరు, ఏప్రిల్ 18: నగరంలో పారిశుద్ధ్య సిబ్బంది, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై కమిషనర్ సుధాకర్ విరుచుకుపడ్డారు. పదేపదే పారిశుద్ధ్య నిర్వహణపై సూచనలు చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా స్థానిక శ్రీనగర్, డొంకరోడ్డు, అరండల్‌పేటలోని 7,15,16 లైన్లలో డ్రైన్లు శుభ్రం చేయకపోవడాన్ని గమనించిన కమిషనర్ సంబంధిత శానిటరీ ఇన్స్‌పెక్టర్ కె మనోహర్‌బాబు బాధ్యునిగా చేస్తూ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పారిశుద్ధ్య పనులపై దృష్టిపెట్టండి: నగరంలో ప్రధాన కూడళ్లతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం ఎప్పటికప్పుడు చెత్తకుప్పలను తొలగిస్తూ పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె సుధాకర్ అధికారులను ఆదేశించారు. రోజువారీ పర్యటనలో భాగంగా బుధవారం పొన్నూరు రోడ్డులోని ట్రాన్సిట్ పాయింట్, నాయుడుపేటలోని డంపింగ్‌యార్డు ప్రాంతాల్లో పర్యటించారు. హరిహరమహల్ రోడ్డు, చంద్రవౌళినగర్ 1వ లైను, రోడ్డుకు ఇరువైపులా పలుచోట్ల మట్టి, చెత్తకుప్పలు బిల్డింగ్ మెటీరియల్స్, చల్లా చదురుగా పడవేసి ఉండటాన్ని కమిషనర్ గమనించి సంబంధిత శానిటరీ ఇన్స్‌పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం వాటిని తొలగించాల్సిందిగా ఆదేశించారు. విద్యానగర్ 1వ లైను, బ్రాడీపేట 5వ లైను, చంద్రవౌళినగర్ 1వ లైనులో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరాపై స్థానికులు ఫిర్యాదు చేశారు. తక్షణం సమస్యను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పౌరసేవా కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసిన బిల్డింగ్‌ప్లాన్ అర్జీలను పరిశీలించేందుకు బ్రాడీపేట, చంద్రవౌళినగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్లాన్‌లను పరిశీలించారు. పర్యటనలో కమిషనర్ వెంట శానిటరీ ఇన్స్‌పెక్టర్లు టిపిఎస్ కాలేషా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉపేంద్రసింగ్, ఇ సుధాకరరావు, ఎం సురేంద్రబాబు తదితరులున్నారు.
గిట్టుబాటు ధరలు లేకే రైతుల ఆత్మహత్యలు
ప రైతుసంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
వినుకొండ, ఏప్రిల్ 18: వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, పసుపుపంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలని కోరుతూ వరంగల్‌లో ధర్నా చేస్తున్న రైతు సంఘం నాయకులు కె రామకృష్ణతోపాటు మరికొంతమంది నాయకులను అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఏపి రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక శివయ్య స్థూపం సెంటర్‌లో రాష్ట్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్థం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం ఏరియా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లా శ్రీనివాసరావు, ఉలవలపూడి రాము మాట్లాడుతూ మిర్చి పంటకు ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టగా, క్వింటాకు మూడువేల రూపాయలు కూడా ధర లభించకపోవడంతో రైతులు పంటను పొలాల్లో వదిలివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది క్వింటా మిర్చి పదివేలు, క్వింటా పత్తి ఆరువేల రూపాయలు ఉండగా, ఈ సంవత్సరం ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వరంగల్ మార్కెట్ యార్డు వద్ద ధర్నా చేస్తున్న రైతు సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ అయిన రైతు నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఏరియా కార్యదర్శి మారుతీ వరప్రసాద్, రైతు సంఘం నాయకులు కె శివరామకృష్ణ, బూదాల శ్రీనివాసరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి పఠాన్ లాల్‌ఖాన్, సిపిఐ నాయకులు బండి కోటయ్య, అక్బర్‌వలి, కరిముల్లా ఖాన్, పల్లె మరియబాబు, బీరం కోటయ్య, షేక్ శిలార్, యూనస్, ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
హమాలీల జీవన భద్రతపై నిర్లక్ష్యం తగదు
గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 18: హమాలీల జీవన భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని ఎఐటియుసి రాష్ట్ర నాయకుడు జివి కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని డాల్ మిల్లులో పనిచేస్తున్న హమాలీల సభ ఎఐటియుసి కార్యాలయంలో జరిగింది. ముఠా కార్మిక సంఘ నాయకుడు దేవరపల్లి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో జివి కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పొట్టలు కొడుతూ యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని, కార్మికులు ఐక్య ఉద్యమాల ద్వారా తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా ముఠా కార్మిక సంఘ అధ్యక్షుడు చల్లా చిన ఆంజనేయులు మాట్లాడుతూ 2010లో జరిగిన 30 శాతం ఒప్పందాన్ని తిరిగి అమలు జరపాలని డాల్ మిల్స్ హమాలీలు కోరుతున్నప్పటికీ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె చేయాల్సి వస్తోందని తెలిపారు. హమాలీల కనీస సౌకర్యాలైన ప్రావిడెంట్ ఫండ్, బోనస్, ఈఎస్‌ఐలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ముఠా కార్మిక సంఘ కార్యదర్శి గుంజి వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా ఉన్న హమాలీ, ముఠా కార్మికులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. హమాలీల వర్కర్స్ చట్టం 1976 ప్రకారం పనిభద్రత, నష్టపరిహారం, కూలిరేట్ల చెల్లింపు చట్టాలు, సంక్షేమ బోర్డు, 55 సంవత్సరాలు దాటిన ముఠా కార్మికులకు 2 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరినా నేటికీ అవి నెరవేరలేదన్నారు. ఎఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి జి సురేష్‌బాబు మాట్లాడుతూ పనిచేసే ప్రదేశంలో కార్మికులు గాయాలపాలై అంగవైకల్యం సంభవించినా యాజమాన్యాలు వారికి నష్టపరిహారం అం దించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభలో ఎఐటియుసి నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు, డాల్‌మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సాంబయ్య, సిరిగిరి గరటయ్య, రమణ, వెంకటస్వామిరెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వాగులోపడి బాలుడి మృతి
రెంటచింతల, ఏప్రిల్ 18:ప్రమాద వశాత్తు మూడేళ్ల బాలుడు వాగులోపడి మృతి చెందిన సంఘటన మండలంలోని మిట్టగుడిపాడు గ్రామంలో బుధవారం జరిగింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోచమ్మ వాగువద్ద బట్టలు ఉతికేందుకు ప్రతిరోజూ తనతోపాటు తన కుమారుడైన బాజీని తన వెంట తీసుకువెళుతుంది. బుధవారం ఇంటి వద్దనే బట్టలు ఉతికింది. బాలుడు ఇంటివద్ద ఆడుకుంటూనే అలవాటు చొప్పున వాగువద్దకువెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడిపోయాడు. నీటిని అధికంగా తాగిన బాలుడు మృత్యువాత పడ్డాడు. బాజీ ఎంతసేపటికి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెతులాట ప్రారంభించారు. చివరికి వాగువద్దకు వెళ్ళి చూడగా బాజీ (3) శవమై ఉండటాన్ని గమనించారు. బాలుడు బాజీ మృతితో తల్లిదండ్రులు కన్నీటి శోక సముద్రంలో మునిగిపోయారు. బాజీ మృతదేహం వద్ద తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది.
22న ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మోడల్ ఎంసెట్
గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 18: భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన మోడల్ ఎంసెట్ నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి భగవాన్‌దాస్, బి లక్ష్మణరావు తెలిపారు. బుధవారం స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశానంతరం వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ఐఐటి చుక్కారామయ్య కన్వీనర్‌గా ఎస్‌ఎఫ్‌ఐ మోడల్ ఎంసెట్ నిర్వహిస్తున్నామన్నారు. రాష్టస్థ్రాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన వారికి లక్ష రూపాయల విలువైన గోల్డ్‌మెడల్, జిల్లాస్థాయిలో ర్యాంకు సాధించిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు సౌకర్యాలు కల్పించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటే, అందుకు భిన్నంగా ఎస్‌ఎఫ్‌ఐ కేవలం 40 రూపాయల ఫీజుతో పరీక్ష నిర్వహించి మూడు రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తుందన్నారు. దీని ద్వారా విద్యార్థి తన సామర్థ్యంపై ఒక అవగాహనకు వచ్చే అవకాశముంటుందన్నారు. అప్లికేషన్ కోసం ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
విప్లవ లక్ష్య సాధనకు పీడిత, తాడిత శక్తులు ఏకం కావాలి
మంగళగిరి, ఏప్రిల్ 18: విప్లవ లక్ష్య సాధనకు దోపిడీకి గురువుతున్న పీడిత, తాడిత శక్తులు ఏకం కావాలని, రామకృష్ణ పోరాట స్ఫూర్తితో ముందు కు సాగాలని పలువురు వక్తలు పిలుపు నిచ్చారు. నాస్తికోద్యమ నిర్మాత, దివంగత చార్వాక రామకృష్ణ ఐదవ వర్ధంతి సందర్భంగా బుధవారం మంగళగిరి మండలం నిడమర్రు రోడ్డులోని చార్వాక ఆశ్రమంలో రామకృష్ణ విగ్రహం వద్ద పలువురు నివాళు లర్పించారు. అనంతరం నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు కె అయ్యన్న అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ (ఎంఎల్) కృష్ణాజిల్లా కార్యదర్శి ముప్పాళ్ల భార్గవశ్రీ మాట్లాడుతూ సమాజంలో అనాదిగా మూఢనమ్మకాలు, దైవత్వం పేరిట మోసాలు జరుగుతున్నాయని, ఆర్యులు ప్రవేశ పెట్టిన కులమతాలు నేడు రాజకీయ స్వార్థం కోసం ఉపయోగ పడుతున్నాయని అన్నారు. ప్రత్యామ్నాయ సంస్కృతి, సమాజ నిర్మాణం కోసం జీవితాంతం అనేక ఇబ్బందులు, కష్టాలను తట్టుకుని రామకృష్ణ ఉద్యమించారని అన్నారు. 1970వ దశకంలో తాడికొండ కాలేజీ ప్రధానోపాధ్యాయుడుగా ఉండి ఉద్య మం కోసం ఉద్యోగా న్ని సైతం వదులుకుని చార్వాక ఆశ్ర మం నెలకొల్పి ఎందరో విద్యార్థులకు శాస్ర్తియ విజ్ఞానాన్ని అందించారని గుర్తుచేశారు. నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి రావుల శివారెడ్డి, మంగళగిరి పట్టణ సిపిఎం కార్యదర్శి ఎస్‌ఎస్ చెం గయ్య మాట్లాడుతూ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వలన సామ్రాజ్యవాద విపరీత ధోరణులు పెరిగాయని, ఆర్థిక రాజకీయ పోరాటాలతో పాటు సామాజిక పోరాటాల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రైతులు, కులవృత్తుల వారు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఉద్యమకారులు రామకృష్ణ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అరసం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోలి సీతారామ య్య, ప్రజాసాహితీ సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ సమాజంలో ఒక భావపరమైన విప్ల వం అవసరమని అన్నారు. నాస్తిక స మాజం రాష్టక్రార్యదర్శి బి సుధాకర్, జె సత్యనారాయణ, మోతుకూరి అరుణ్ కుమార్, అరుణ తదితరులు ప్రసంగించారు.
ఐకెపి కార్యాలయం దిగ్బంధం
పెదకాకాని, ఏప్రిల్ 18: తమ సమస్యలను పరిష్కరించాలంటూ యానిమేటర్లు నిర్వహిస్తున్న సమ్మె 9వ రోజైన బుధవారం తీవ్ర రూపం దాల్చింది. సమ్మెలో భాగంగా యానిమేటర్లు మహిళా సమైక్య భవనాలకు తాళాలు వేసి సిబ్బందిని కార్యాలయంలోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సమ్మెకు సంఘీభావం తెలిపిన మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ ప్రభుత్వం యానిమేటర్లతో వెట్టిచాకిరి చేయించుకుంటూ గౌరవ వేతనం 250 రూపాయలు చెల్లించడం దారుణమని, వెంటనే వారికి 3,000 రూపాయలు గౌరవ వేతనం అమలుచేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లను పరిష్కరించకుంటే ప్రజాసంఘాల మద్దతును కూడగట్టుకుని ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉల్లంఘుల శివయ్య, బోయపాటి వెంకటేశ్వరరావు, జిఎన్ ప్రసాద్, యానిమేటర్లు అన్నాదేవి, రాధారాణి, మల్లేశ్వరి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
డెంగ్యూ లక్షణాలతో బాలుడి మృతి
గురజాల, ఏప్రిల్ 18: డెంగ్యూవాధితో బాధపడుతూ బాలుడు మృతి చెందిన సంఘటన గురజాల పట్టణంలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శ్రీరాంపురం కాలనీకి చెందిన షేక్ అన్వర్ (6) గత పదిరోజులుగా విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడిని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అయినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో డెంగ్యూ వ్యాధి సోకిందనే అనుమానంతో అన్వర్‌ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి శరీరంలో ప్లేట్లెట్స్ పూర్తిగా తగ్గిపోవడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొం దుతూ మృతి చెందాడు. దీంతో అన్వర్ కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. తమ ఒక్క కుమారుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
గిట్టుబాటు ధరపై నిర్ణయం తీసుకోవాలి
* పొగాకు బోర్డు చైర్మన్‌కు రైతుల అల్టిమేటమ్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఏప్రిల్ 18: రానున్న వారం, పది రోజుల్లో పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించే విషయమై నిర్ణయం తీసుకోకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వస్తుందని పొగాకు రైతులు హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలోని పలు వేలం కేంద్రాల పరిధిలోని రైతులు, రైతుప్రతినిధులు గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో చైర్మన్ కమలవర్దనరావును బుధవారం కలసి తమ సమస్యలను విన్నవించారు. రైతుప్రతినిధులు చుండూరి రంగరావు, శేషయ్య, కొండ్రగుంట వెంకయ్య, ఎం రంగారావు తదితరులు మాట్లాడుతూ కర్నాటక ఆక్షన్ తర్వాత రాష్ట్రంలో ధరలు పెంచుతామన్న వ్యాపారులు హామీని నిలబెట్టుకోలేక పోయారని అన్నారు. కిలో ఎఫ్-1రకం పొగాకును 110 రూపాయలకు కొనుగోలు చేస్తామని అప్పట్లో చెప్పారని, ప్రస్తుతం 90 రూపాయలకు కూడా కొనుగోలు చేయడం లేదని వాపోయారు. పొగాకు కొనుగోలు చేస్తామని 60 కంపెనీలకు పైగా నమోదు చేసుకోగా కనీసం 6, 7 కంపెనీలకు మించి కొనుగోలు చేయకపోవడంతో ధరలు పతనమవుతున్నాయని అన్నారు. 170 మిలియన్ల నుంచి 162 మిలియన్ కిలోలకు పంట తగ్గించినప్పటికీ గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారని, ఇది బోర్డు అసమర్థతగా భావించాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ఎఫ్-1 రకాన్ని బోర్డే నేరుగా 110 రూపాయలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎగుమతులకు ఆర్డర్ వచ్చేవరకు కొనుగోళ్లు నిలిపివేయాలని సూచించారు. పొగాకు సాగును నిలిపివేసి ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లాలంటూ బోర్డు సూచించిన మీదట ఆ దిశగా వెళ్లినప్పటికీ ఆ పంటల విషయంలో కూడా అప్పులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బోర్డు చైర్మన్ కమలవర్దనరావు స్పందిస్తూ 10 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేయాలంటే వంద కోట్ల రూపాయలు అవసరమవుతాయని, ఇప్పటికీ కేంద్రం నుంచి బోర్డుకు నిర్వహణ ఖర్చులు కూడా విడుదల కాలేదని తెలిపారు. రైతుల నుంచి వసూలు చేసిన అపరాధ రుసుం, వేలం కేంద్రాల ద్వారా వచ్చిన సొమ్ము నుంచే సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణకు నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రైతుల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామని అన్నారు.
గత 15 సంవత్సరాలుగా పొగాకు కొనుగోళ్ల విషయంలో పోటీతత్వాన్ని తీసుకురాకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. ఏదేమైనా రైతుల సంక్షేమమే బోర్డు ప్రధాన ధ్యేయమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారులకు కొమ్ముకాసేది లేదని స్పష్టం చేశారు. మరోమారు ఎగుమతిదారులతో సమావేశమై గిట్టుబాటు ధర కల్పించేలా చూస్తామని చైర్మన్ కమలవర్దనరావు పేర్కొన్నారు.
తండ్రిని కొట్టిన తనయులు
యడ్లపాడు, ఏప్రిల్ 18: తల్లిని బాధిస్తున్నాడని తనయులు తండ్రిని కొట్టి గాయపర్చిన సంఘటన యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలో జరిగింది. యడ్లపాడు పోలీసులు బుధవారం తెలిపిన వివరాల మేరకు... మంగళవారం రాత్రి మస్తానవలి తమ తల్లిని కొట్టడం చూసిన కొడుకులు ఆగ్రహించారు. జాన్‌సైదా, మాబు సుభాని ఇద్దరు కలిసి మస్తాన్‌వలిపై దాడిచేసి రాళ్లతో కొట్టారు. దీంతో తలపగిలిన మస్తాన్‌వలిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు కేసుల్లో ముగ్గురి అరెస్ట్
తాడేపల్లి, ఏప్రిల్ 18: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. మహానాడు ఏరియాలో తాడి వరలక్ష్మి అనే మహిళపై దాడి చేసిన నేపథ్యంలో డి.దుర్గారావు, అనిల్ అనే వ్యక్తులను, పోలికంపాడుకు చెందిన గౌసియా అనే మైనర్ బాలికను కిడ్నాప్ చేసినందుకు తొత్తుక దుర్గారావు అనే ముగ్గురిని తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. తాడేపల్లి ఎస్‌ఐ చిట్టెం కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘దళితులను దగా చేసిన వైఎస్’
గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 18: దళితులను అన్ని రంగాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి దగా చేశారని తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కనగాల చిట్టిబాబు ఆరోపించారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో దళితులు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. టాటా బిర్లాలుగా మారుస్తామని వైఎస్ ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారి అభివృద్ధి, సంక్షేమానికి ఏ మాత్రం కృషి చేయడం లేదని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను కూడా ఎన్నికల్లో ఓడించిన నీచచరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ఒక దళితుడ్ని ప్రధాని కాకుండా అడ్డుకున్న ఘనత కూడా కాంగ్రెస్ సొంతమని దుయ్యబట్టారు. అవినీతి చరిత్ర కల్గిన వైఎస్ రాజశేఖరరెడ్డి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌తో పోల్చడం సిగ్గు చేటన్నారు. ఈ సమావేశంలో టిడిపి ఎస్సీ సెల్ నాయకులు పెండెం వెంకటేశ్వర్లు, కత్తి సత్యానందం, బురదగుంట వెంకట్రావ్, బి సుశీలరావు, చిలకా వెంకటేశ్వరరావు, గుడిమెట్ల దయారత్నం, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రవిచంద్ర సేవలు మరువలేనివి
గుంటూరు (క్రైం), ఏప్రిల్ 18: బదిలీ అయిన రూరల్ ఎస్‌పి ఎ రవిచంద్ర సేవలను పలువురు వక్తలు బుధవారం పోలీసు కల్యాణ మండపంలో జరిగిన వీడ్కోలు సభలో కొనియాడారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ విఎన్ విష్ణు మాట్లాడుతూ రూరల్ ఎస్‌పి ఎ రవిచంద్ర తన పదవీకాలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతోపాటు మానవీయ కోణంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన సేవలను రూరల్ ప్రాంత ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరన్నారు. గుంటూరు రేంజి ఐజి హరీష్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ రవిచంద్ర పనితీరును అభినందించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన అర్బన్ ఎస్‌పి రవికృష్ణ, రూరల్ ఎస్‌పి జె సత్యనారాయణ, ఎస్‌పి శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.
సిసి రోడ్డు పనులను అడ్డుకున్న గ్రామస్థులు
పెదకాకాని, ఏప్రిల్ 18: మండల కేంద్రమైన పెదకాకానిలోని మెయిన్ సెంటర్ నుండి శివాలయం వరకూ చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను బుధవారం ఆలయ చైర్మన్ కాజ అంకమ్మరావు, ఇఒ ఆర్ రమణమ్మ ప్రారంభించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. గతంలో పంచాయతీ వారు సైడ్ కాల్వలు తవ్వి వదిలేశారని, దీంతో రోడ్డుకిరువైపులా మురుగు నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని, సైడ్ కాల్వలు నిర్మించకుండా తిరిగి రోడ్డు విస్తరణ పనులు చేపడితే మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సైడ్ కాల్వలు నిర్మించే వరకూ విస్తరణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించాలంటూ వెల్లువెత్తిన అర్జీలతో
ప్రజాపథంలో అధికారులు ఉక్కిరిబిక్కిరి
పొన్నూరు, ఏప్రిల్ 18: పొన్నూరు మండలంలో బుధవారం ఆరంభమైన ఆరవ విడత ప్రజాపథం కార్యక్రమంలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ అందిన విజ్ఞాపనలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మండల పరిధిలోని మామిళ్లపల్లి గ్రామంలో ప్రజాపథం కార్యక్రమం బుధవారం ఆరంభమైంది. తాగునీటి సమస్య, కరెంట్ కోత విషయమై, సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు గందరగోళం సృష్టించారు. దండమూడి గ్రామంలో జరిగిన ప్రజాపథంలో తమ గ్రామంలో శ్మశానవాటికకు స్థలం కేటాయించి దశాబ్దాలుగా విన్నవించుకుంటున్నా నేటి వరకూ ఎందుకు పరిష్కరించలేదని స్థానిక ఎమ్మెల్యే డి నరేంద్రకుమార్‌ను గ్రామస్థులు ప్రశ్నించారు. గ్రామ నడిబొడ్డున ఉన్న చెరువులో నీరు కలుషితమై దుర్వాసన వెదజల్లుతూ, ఆరోగ్యాన్ని హరిస్తున్నదని, చేపలు చనిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఆరెమండ గ్రామంలో జరిగిన ప్రజాపథంలో తమకు నివేశన స్థలాలు మంజూరు చేయాలని గ్రామంలోని యానాదులు 30 మంది అర్జీలను అందజేశారు. అనంతరం గాయంవారిపాలెం, మునిపల్లె గ్రామాల్లో జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, ఓవర్‌హెడ్ ట్యాంకును నిర్మించాలని అర్జీ అందజేశారు. పలు గ్రామాల్లో శానిటేషన్, మంచినీటి సమస్యను పరిష్కరించడంతో పాటు విద్యుత్ కోత అసౌకర్యాన్ని నివారించాలని అధికారులను ప్రజలు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డి నరేంక్రుమార్, మండల ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, ఎండిఒ కె అంకమ్మ, తహశీల్దార్ పి చినవెంకయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ మరియదాసు, ఇఒపిఆర్‌డి నరసింహారావు, వివిధ శాఖల అధికారులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
మంగళగిరిలో కౌలురైతుల ధర్నా
మంగళగిరి, ఏప్రిల్ 18: కరువు నష్టపరిహారం ఇవ్వాలని, కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కౌలురైతు సంఘం ఆధ్వర్యాన బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి రైతుసంఘం డివిజన్ కార్యదర్శి ఏటుకూరి గంగాధరరావు మాట్లాడుతూ గత జనవరిలో పడిన అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటను రైతులు నష్టపోయారని, వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలురైతుల గుర్తింపు ప్రక్రియ ఏప్రిల్ మాసంలోనే ప్రభుత్వం ప్రారంభించిందని, దీన్ని ఈ నెలాఖరుతో ముగించకుండా కౌలు ఒప్పందాలు పూర్తయ్యే వరకు దరఖాస్తులు పెట్టుకునే అవకాశం కల్పించాలని, జూన్, జూలై మాసాల్లో ఒప్పందాలు జరుగుతుంటాయి కనుక జూలై నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గుర్తింపుకార్డు లేని కౌలురైతులకు బ్యాంకుల్లో వడ్డీలేని పంట రుణాలు ఇవ్వరని, ప్రభుత్వ సబ్సిడీలు వర్తించవని, పంటల బీమా పథకం అమలు కాదని, ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉండవని, నేరుగా కౌలురైతులకే పరిహారం ఇవ్వరని, కనుక కౌలు రైతులు చైతన్య వంతులుగా ఉండి గుర్తింపు కార్డులు పొందాలని గంగాధరరావు కోరారు. రైతుల ఆత్మహత్యల నివారణకు కేరళ ప్రభుత్వ తరహా ప్యాకేజీని ప్రకటించాలని, కరువు ప్రాంతాల్లో పేదలందరికీ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని, రెండేళ్లు వరుసగా కరువు వచ్చిన ప్రాంతాల్లో అప్పులపై వడ్డీ మాఫీ చేయాలని రైతులు నినదించారు. మొసలి పకీరయ్య, కాపరౌతు భాస్కరరావు, వీసం జవహర్‌లాల్, మర్రి శ్రీరాములు, దాసరి గణేష్, జె వీరరాఘవులు తదితరులు నాయకత్వం వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కార్యాలయంలో అందజేశారు.
మంగళగిరిలో లక్షన్నర సొత్తు చోరీ
మంగళగిరి, ఏప్రిల్ 18: పట్టణంలోని భద్రావతీ నగర్‌లో నివాసం ఉంటున్న గోల్డ్ వర్కర్ సంగు ఏడుకొండలు నివాసంలో బుధవారం తెల్లవారుఝామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి లక్షన్నర విలువైన సొత్తును అపహరించుకుని పోయారు. పోలీసుల కథనం ప్రకారం ఏడుకొండలు కుటుంబ సభ్యులతో కలిసి అర్ధరాత్రి వరకు మేలుకుని ఉండి తరువాత నిద్ర పోయారు. తలుపు గడియ పెట్టకుండా దగ్గరకువేసి పడుకోవడంతో దుండగులు లోనికి ప్రవేశించి బీరువా వద్దకువెళ్ళి పక్కనే ఉన్న తాళంతో తెరిచి బంగారు ఉంగరాలు, మాటీలు, ఇతర ఆభరణాలు, 17వేల రూపాయల నగదు అపహరించుకు పోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిఐ వివి రమణకుమార్ నేరస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీంను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వివి రమణకుమార్ తెలిపారు.
డ్రైనేజీలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్
మంగళగిరి, ఏప్రిల్ 18: జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నిధులతో మంగళగిరి పట్టణంలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలను బుధవారం ప్రజారోగ్యశాఖ చీఫ్ ఇంజినీర్ పాండురంగారావు తనిఖీ చేశారు. డ్రైనేజీల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉందంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆయన పట్టణంలో పర్యటించి కొత్తపేట ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలను పరిశీలించారు. సక్రమంగా నిర్మాణ పనులు లేకపోవడంతో ప్రజారోగ్య శాఖ ఎఇ మధుకుమార్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. త్వరలో మళ్లీ పర్యటిస్తానని, ఎటువంటి ఫిర్యాదులు లేకుండా నిబంధనల ప్రకారం డ్రైనేజీల నిర్మాణం జరపాలని, మురుగునీటి పారుదలకు వీలుగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని, కొన్నిచోట్ల అసంపూర్తిగా వదిలేసిన డ్రైనేజీలను పూర్తి చేయాలని చీఫ్ ఇంజినీర్ పాండురంగారావు ఆదేశించారు. డిఇ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి సుచరిత పరామర్శ
కాకుమాను, ఏప్రిల్ 18: మండల పరిధిలోని బికెపాలెం గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇనగంటి జాన్ కుటుంబ సభ్యులను బుధవారం ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పరామర్శించారు. జాన్ కుటుంబ సభ్యులు బుధవారం గ్రామంలో ఏర్పాటు చేసిన జాన్ సంతాప సభలో ఆమె పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మేకతోటి సుచరిత మాట్లాడుతూ జాన్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆమె వెంట పార్టీ మండల నాయకులు నల్లమోతు రామకృష్ణ, రమేష్‌బాబు, కె హైమారావు, మెరిగల రవి, ఆరుమళ్ల వెంకాయమ్మ, శ్రీనివాసరావు తదితరులున్నారు.
పోరాట యోధుడు సత్యమూర్తి
సత్తెనపల్లి, ఏప్రిల్ 18: పీపుల్స్ వార్ ఉద్యమనేత, సిపిఐఎంఎల్ వ్యవస్థాపక సభ్యుడు కెజి సత్యమూర్తి మృతి పట్ల ఎఐటియుసి జిల్లా కార్యదర్శి కంబాల శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం నాడు స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం అలుపులేని పోరాటాలు నిర్వహించిన ఘనత సత్యమూర్తికే దక్కుతుందన్నారు. అటువంటి వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. సత్యమూర్తి తన విప్లవ భావాలను పుస్తకాలు, పత్రిక రూపంలో వ్యక్తం చేస్తూ దళిత బహుజనుల సంక్షేమం కోసం పాటుపడిన మహావ్యక్తని ఆయన కొనియాడారు. ఈ సభలో సిపిఐ పట్టణ కార్యదర్శి ముసాబోయిన శ్రీనివాసరావు, కెకె మూర్తి, షేక్ చాంద్‌బాషా, న్యాయవాది భూసి సుబ్బారావు, కట్టా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
రైతు నాయకులపై కేసులు ఎత్తివేయాలి
సత్తెనపల్లి, ఏప్రిల్ 18: ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వారిని అణిచివేయాలనుకోవడం సిగ్గుచేటని ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరిశేటి గురవయ్య విమర్శించారు. బుధవారం నాడు స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు పండించిన పంటకు ఏవిధంగా గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారో పరిశీలించడానికి వెళ్ళిన రైతు సంఘం నాయకులపై అక్రమ కేసులు బనాయించడం దురదృష్టకరమన్నారు. రైతు పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం రైతుల సమస్యల కోసం పాటుపడే వ్యక్తులపై కేసులు పెట్టడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు సంఘం నాయకులపై అక్రమంగా బనాయించి కేసులను వెంటనే ఉపసంహరించుకొని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ముసాబోయిన శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు కంబాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.