రాజమండ్రి, ఏప్రిల్ 18: తూనికలు, కొలతలశాఖకు చెందిన ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు గురువారం ఏలూరు నుండి తుని వరకు వే బ్రిడ్జిలు, పెట్రోలు అవుట్ లెట్లపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 వే బ్రిడ్జిలు, 10పెట్రోల్ అవుట్‌లెట్లలో జరుగుతున్న అక్రమాలను గుర్తించి కేసులు నమోదుచేయటంతో పాటు, సీజ్ చేసినట్టు తూనికలు, కొలతల ఫ్లైయింగ్ స్క్వాడ్ అసిస్టెంట్ కంట్రోలర్ కె భాస్కర్ ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. వే బ్రిడ్జిలకు వచ్చిన వాహనాల అసలు బరువు కన్నా, ఎక్కువ బరువు లేదా తక్కువ బరువును చూపిస్తూ వే బ్రిడ్జిల నిర్వాహకులు పాల్పడుతున్నట్టు ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో గుర్తించినట్టు అసిస్టెంట్ కంట్రోలర్ భాస్కర్ చెప్పారు. ఉదాహరణకు ఇసుక లోడును ఎక్కువగా చూపించాలని భావిస్తే, అసలు బరువు కన్నా ఎక్కువ బరువు ఉన్నట్టు నమోదుచేసి స్లిప్పు ఇస్తారని, దీనివల్ల కొనుగోలుదారుడు నష్టపోతారన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను తగ్గించాలనుకున్నపుడు లారీలో రవాణా అవుతున్న సరుకు అసలు బరువు కన్నా తక్కువ బరువు ఉన్నట్టు నమోదుచేసి బ్రిడ్జిలో స్లిప్పు ఇస్తారన్నారు. ఈ తప్పుడు విధానాల కోసం కొన్ని వే బ్రిడ్జిల్లోని సిబ్బంది లేదా నిర్వాహకులు ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తున్నారన్నారు. పాయకరావుపేటలోని చెరకు ఫ్యాక్టరీ వద్ద ఉన్న వే బ్రిడ్జిలో సీల్‌ను తొలగించి ఎలా కావాలంటే అలా బరువును నమోదుచేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల వే బ్రిడ్జి నిర్వాహకులు చేతితో తూకం వివరాలు రాసి ఇస్తున్నారన్నారు. పెట్రోల్ అవుట్‌లెట్లను తనిఖీచేసినపుడు కొన్ని అవుట్ లెట్లలో 5లీటర్లకు 140మిల్లీలీటర్లు, మరికొన్ని అవుట్‌లెట్లలో 30 నుండి 50మిల్లీలీటర్లు తక్కువ కొలత నమోదవుతున్నట్టు గుర్తించామన్నారు. ఇలాంటి తప్పుడు కొలతలు నమోదవుతున్న సుమారు 10పెట్రోల్ అవుట్‌లెట్లపై కేసులు నమోదుచేసినట్టు అసిస్టెంట్ కంట్రోలర్ భాస్కర్ చెప్పారు. అసిస్టెంట్ కంట్రోలర్ భాస్కర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి వచ్చిన ఫ్లైయింగ్ స్క్వాడ్‌లో జిల్లా ఇనస్పెక్టర్ నిర్మల్‌కుమార్, ఇనస్పెక్టర్లు వెంకటేశ్వర్లు, కరుణాకర్‌రెడ్డి ఉన్నారు.
డి పట్టా భూముల్లో భారీగా
అక్రమ మట్టి తవ్వకాలు
గ్రామీణ ప్రాంతాల్లో ఇదో రకం దందా
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, ఏప్రిల్ 18: గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా భారీగా మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా సాగిపోతున్నాయి. పేద వర్గాల కోసం రాష్ట్రప్రభుత్వం పంపిణిచేసిన డి పట్టా భూములు, లంక భూముల్లో ఈ తరహా మట్టి తవ్వకాలు యధేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇటుకల తయారీలో ఈ మట్టికి భారీ డిమాండ్ ఉండటంతో ఎక్కడ అవకాశం ఉంటే, అక్కడ మట్టి తవ్వుకుపోతున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ముఖ్య నగరాలకు ఉభయగోదావరి జిల్లాల నుండే ఇటుకలు సరఫరా అవుతుంటాయి. గోదావరి జిల్లాల్లోని మట్టితో తయారుచేసే ఇటుక తేలికగా, బలంగా ఉండే అరుదైన లక్షణం ఉంటుంది. అందులోనూ తూర్పుగోదావరి జిల్లాలోని మాచవరం గ్రామంలో తయారైన ఇటుకకు నిర్మాణ రంగంలో ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. దాంతో రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాలతో పాటు, పెద్ద నిర్మాణ సంస్థలకు గోదావరి జిల్లాల నుండే ఇటుకల సరఫరా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఇటుకల తయారీకి సరఫరాచేసే మట్టి కోసం గోదావరి జిల్లాలో ఎక్కడ మట్టి దొరికితే అక్కడ అక్రమంగా కొంత మంది అక్రమార్కులు తవ్వుకు పోతున్నారు. అది కూడా అర్ధరాత్రి దాటిన తరువాత జనం కంటపడకుండా లంకల్లో మట్టి తవ్వకాలు సాగిపోతున్నాయి. కొన్ని చోట్ల రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన డి పట్టా భూముల్లో మట్టి తవ్వకాలు సాగిపోతున్నాయి. ఈ భూముల్లో లబ్ధిదారులు వ్యవసాయం చేసుకుని తమ కుటుంబాన్ని పోషించుకోవటంతో పాటు, ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్నది రాష్ట్రప్రభుత్వ ఉద్దేశ్యం. కానీ అందుకు విరుద్ధంగా కొంత మంది లబ్ధిదారులు తమ డి పట్టా భూమిలో మట్టిని అమ్ముకుంటున్నారు. గోదావరి వరద గట్టుకు లోపల ఉన్న లంక భూముల్లో మట్టిని తవ్వితే, కనీసం ఏదో ఒక సంవత్సరం గోదావరికి భారీ వరద సంభవించినపుడు మళ్లీ ఎంతో కొంత మట్టి వచ్చి చేరుతుంది. అదే గట్టుకు బయట ఉన్న భూమిలో మట్టిని తవ్వితే, మళ్లీ మట్టి చేరేందుకు చాలా ఏళ్లు పడుతుంది. ఒక మీటరు మందంలో మట్టి చేరాలంటే కనీసం వందేళ్ల సమయం పడుతుందని భూగర్భశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాంటిది వ్యవసాయానికి వినియోగించాల్సిన భూమిలో మట్టిని తవ్వుకుపోతే, ఆ భూమి వ్యవసాయానికి ఇక ఎప్పటికీ ఉపయోగపడదు. ఇలాంటి ముప్పు గ్రామీణ ప్రాంతాల్లోని డి పట్టా భూములకు, లంక భూములకు పొంచి ఉన్నట్టు ఆలస్యంగానైనా అధికారులు గుర్తించారు. దాంతో ఇప్పుడిప్పుడే గనులు, రెవెన్యూశాఖ అధికారులు దృష్టిసారించారు. అసలు ఇటుకల బట్టీలను క్రమబద్ధీకరిస్తే తప్ప ఇలాంటి అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయగలిగే పరిస్థితి కనిపించటం లేదు. ఇటుకల బట్టీని ఏర్పాటుచేసుకునేందుకు కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ, ఈ నిబంధనలను ఎవరూ పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. నివాసప్రాంతాలు, ఆసుపత్రులు, విద్య తదితర సంస్థలకు కనీసం 1కిలోమీటరు దూరంలో ఇటుకల బట్టీలు ఉండాలి. పొరుగున వ్యవసాయ భూములు, ఉద్యాన పంటలకు, వరదగట్లకు 100మీటర్ల దూరంలో ఉండాలి. జాతీయ, రాష్టహ్రైవేలకు 200మీటర్లు దూరంలోను, గ్రామీణ రోడ్లకు 25మీటర్ల దూరంలోను ఉండాలి. ఈ నిబంధనల ప్రకారం ఉన్న ఇటుకల బట్టీకి పరిశ్రమలశాఖ జిఎం ఎక్‌నాలెడ్జ్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇటుకల బట్టీలు నిబంధనలను అమలుచేస్తున్నాయో లేదో పర్యవేక్షించాల్సిన బాధ్యతను రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా నిబంధనలు అమలుజరుగుతున్న దాఖలాలు లేవు. దీనిని ఇలాగే చూస్తూ వదిలేస్తే, ఇది కూడా ఇసుక తవ్వకాలు, మద్యం సిండికేట్ల తంతులా తయారయ్యేలా కనిపిస్తోంది.
నేటి రాత్రికే చంద్రబాబు రాక
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఏప్రిల్ 18: కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి (ఎస్‌ఇజడ్) పేరుతో జరిపిన అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా ఈనెల 20న ఆందోళన చేపట్టనున్న టిడిపి అధినేత చంద్రబాబు గురువారం రాత్రికే కాకినాడ చేరుకోనున్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పర్యటన ముగించుకుని రాత్రి 9 గంటల ప్రాంతంలో తూర్పు గోదావరి జిల్లా పర్యటనకై రోడ్డుమార్గంలో చేరుకోనున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీలతో కలసి సెజ్‌లకు వ్యతిరేకంగా ఈనెల 20న కాకినాడ నుండి ఆందోళనకు తెర తీయాలని నిర్ణయించారు. ఈ ఒకరోజు ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న తమ అధినేతకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రచారానికై జిల్లాకు రానున్న చంద్రబాబు ఈలోగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే సెజ్‌పై ఆందోళన పేరుతో ముందుగానే రావాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం! ఇటీవలి కాలంలో పార్టీపరంగా ఏ విధమైన కార్యక్రమాలు లేకపోవడంతో తెలుగు తమ్ముళ్ళు నీరసించిపోవడాన్ని గమనించిన ఆ పార్టీ అధినేత రానున్న ఉప పోరుకు కార్యోన్ముఖుల్ని చేసే దిశగా ముందుకు కదలాలని భావించినట్టు స్పష్టమవుతోంది. కాగా చంద్రబాబు గురువారం పశ్చిమ గోదావరి జిల్లా నుండి రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, యానాం మీదుగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో కాకినాడ చేరుకునే అవకాశం ఉన్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన రాజప్ప చెప్పారు. ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేసి 20న ఉదయం 10 గంటల నుండి నగరంలోని శ్రీ సూర్యకళామందిరంలో నిర్వహించనున్న సెజ్‌పై రాష్టస్థ్రాయి వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్క్‌షాప్‌లో పాల్గొని అనంతరం అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల మధ్య సెజ్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. నిర్వాసితులు, రైతులు చేపట్టిన వంటావార్పు, ఏరువాక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. తర్వాత మూలపేట గ్రామంలో ధర్నా నిర్వహించి, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కాకినాడ చేరుకుని రాత్రి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక గల క్రిస్టియన్ కమ్యూనిటీ సెంటర్‌లో ఏల్చూరి పాపారావు ఆధ్వర్యంలో జరిగే ప్రజాచేరిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఏల్చూరి ఆధ్వర్యంలో ఆరోజు సుమారు 2వేల మంది టిడిపిలో చేరనున్నట్టు పార్టీ నాయకులు తెలియజేశారు.
రుణ అర్హత కార్డుదార్లకు ల రుణాలు అందించేందుకు
బ్యాంకర్లు సహకరించాలి
బ్యాంకర్లకు జెసి పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఏప్రిల్ 18: రుణ అర్హత కార్డుదారులకు ఈ ఏడాది కనీసం 100 కోట్ల రుణాలందించేందుకు బ్యాంకర్లు తోడ్పాటునందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ బాబు కోరారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో బుధవారం బ్యాంకర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రుణ అర్హత కార్డులు జారీ చేసిన కౌలుదార్లకు గత సంవత్సరం కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలుగా ఇవ్వగలిగామని, ఈ ఏడాది కనీసం వంద కోట్ల రుణాలిచ్చేందుకు సహకరించాలని కోరారు. జిల్లాకు 10 కోట్ల 62 లక్షల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ నిధులు విడుదల కాగా వాటిని ప్రస్తుతం ప్రజాపథం కార్యక్రమంలో రైతులకు ఆన్‌లైన్ విధానంలో ఆయా ఖాతాలకు జమ చేద్దామని ప్రయత్నించినప్పటికీ అందరు రైతులకు ఖాతాలు లేకపోవడం పెద్ద అడ్డంకిగా మారిందన్నారు. ఫలితంగా మాన్యువల్ విధానంలోనే ఖాతాలకు ఇన్‌పుట్ సబ్సిడీని ఇవ్వాల్సి వస్తోందన్నారు. అలాగే 2 కోట్ల 50 లక్షల వడ్డీ రాయితీ నిధులు విడుదల కాగా ఆ మొత్తాన్ని రైతులకు చెల్లించాలంటే ఆయా బ్యాంక్‌లు ఇంతవరకు క్లెయిమ్‌లు ఇవ్వకపోవడం అడ్డంకిగా మారిందన్నారు. ఆయా బ్యాంక్‌లు గ్రామాల వారీగా బ్యాంక్ ఖాతాల్లేని వారిని గుర్తించి జీరో బేలన్స్ విధానంలో వారికి ఖాతాలు తెరిచేందుకు సహకరించాలని సూచించారు. ఈ విషయంలో వేరే ప్రత్యామ్నాయం లేదని, ప్రతి ఒక్కరికి ఖాతాలు తెరవాల్సిందేనని స్పష్టం చేశారు. ఆధార్ ద్వారా ప్రభుత్వం నుండి వచ్చే వివిధ రకాల సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, ఇతర అన్ని రకాల ప్రయోజనాలను అర్హులైన లబ్దిదార్లకు బ్యాంక్ ఖాతాల ద్వారానే అందుతాయని చెప్పారు. జిల్లాలో ఈనెలాఖరులోగా ప్రతి మండలంలో ఒక శాశ్వత ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. అలాగే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌ను నిరంతర ప్రక్రియగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో ఆర్‌బిఐ ఎజిఎం కులకర్ణి, లీడ్‌బ్యాంక్ మేనేజర్ జగన్నాధరాజు వివిధ శాఖల అధికార్లు పాల్గొన్నారు.
నేడు కేంద్ర మంత్రి వాయలార్ రవి రాక
కాకినాడ సిటీ, ఏప్రిల్ 18: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వాయలార్ రవి గురువారం జిల్లాకు రానున్నారు. రామచంద్రపురం శాసన సభ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగుతన్న నేపధ్యంమలో ఆయన పర్యటనకు ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆయనకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుతో పాటు పాలకుల సేవలను స్వయంగా అంచనా వేసేందుకు ఆయన రాష్ట్రంలో పర్యటిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో వాయలార్ రవి పర్యటనపై కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకోంది. గురువారం ఉదయం రాజమండ్రికి చేరుకుని అక్కడ నుండి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం పర్యటనకు వాయలార్ రవి వెళ్ళనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రామచంద్రపురం నియోజకవర్గానికి చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రాత్రికి రాజమండ్రికి చేరుకుని గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు తిరిగి వెళ్ళనున్నారు.
పిసిసి అధినేత బొత్స నేడు రాక.....
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వాయలార్ రవి ఉభయ గోదావరి జిల్లాలోని పోలవరం, రామచంద్రపురం నియోజకవర్గాలలో పర్యటిస్తున్న నేపధ్యంలో ఆయన వెంట బొత్స పర్యటించనున్నారు.
ర్యాబిస్ వ్యాధితో మహిళ మృతి
కాకినాడ సిటీ, ఏప్రిల్ 18: ర్యాబీస్ వ్యాధికి గురైన ఓ మహిళ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కధనం ప్రకారం.... యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామానికి చెందిన రాగాల మరియమ్మ(40) అనే మహిళ కుక్కకాటుకు గురి కావడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో బాధితురాలిని బుధవారం వేకువ జామున 2 గంటల సమయంలో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందింది. ఈ సంఘటనపై యు కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిధులు సక్రమంగా వినియోగించండి
ఆకస్మిక తనిఖీలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ రామారావు
సామర్లకోట, ఏప్రిల్ 18: ఏ శాఖకూ లేని రీతిలో వైద్య శాఖకు ప్రభుత్వం నిధులు పుష్కలంగా మంజూరు చేస్తోందని, ఆ నిధులు మురిగిపోకుండా ఆసుపత్రి అభివృద్ధికి కృషిచేయాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బి రామారావు ఆదేశించారు. బుధవారం సామర్లకోట ప్రభుత్వ క్లస్టర్ ఆసుపత్రిని ఎజెసి రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను ఆయన ఆరా తీశారు. అనంతరం వార్డులో ప్రసవానంతరం ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు తక్షణం అందుతున్నాయా లేదా అన్న విషయంపైన, ఆపరేషన్లు చేయించుకున్నవారిని, బాలింతలను ఎజెసి ప్రశ్నించారు. అలాగే ఆసుపత్రిలో మందులు, ఎఆర్‌వి ఇంజక్షన్ల సరఫరాపై స్టోర్‌రూంను ఆయన నిశితంగా పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారికి, ప్రసవాలు జరిగిన వారికి ప్రభుత్వ ప్రోత్సాహక నిధులను సక్రమంగా చెల్లించాలని ఆదేశించారు. ఆసుపత్రి పనితీరు, నిర్వహణ తదితర అంశాలపై ఆయన ఇన్‌చార్జి సీనియర్ పబ్లిక్ హెల్త్‌ఆఫీసరు డాక్టర్ ఎస్ ప్రవీణ్, డాక్టర్ పుష్పలతో సమీక్షించారు. ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు ఆహారం నిమిత్తం రోజుకు రూ.50 చొప్పున ఏ రోజుకారోజు చెల్లించాలన్నారు. జాప్యం లేకుండా ఆపరేషన్లు చేయించుకున్న వారికి ప్రోత్సాహకాలు అందించాలన్నారు. కాగా 24 గంటల వైద్య సేవలందించుటకు వీలుగా సిబ్బంది కొరత ఉన్నట్లు ఎజెసి దృష్టికి తీసుకురాగా సిబ్బంది భర్తీకి కృషిచేస్తామన్నారు. రాత్రివేళ కేసులకు హాజరయ్యేలా వైద్యులు ఫోన్ నంబర్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఎజెసి వెంట తహసీల్దార్ సిహెచ్ వెంకటరామ సుధాకర్, విఆర్వో నల్లజర్ల మురళీకృష్ణ , క్లస్టర్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
విద్యా నైపుణ్యంపై దృష్టి పెట్టాలి
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఈ జిల్లాలోని హాస్టళ్లలో ప్రత్యేక మెనూను అమలు చేస్తున్నామని, దానిని సద్వినియోగం చేసుకుని విద్యా నైపుణ్యం పెంచుకోడానికి విద్యార్థులు కృషిచేయాలని ఎజెసి రామారావు కోరారు. స్థానిక ఎస్సీ బాలికల వసతి గృహం పనితీరును ఎజెసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే విద్యార్థినులు ఆయన అడిగిన ప్రశ్నలకు సరిగా జవాబులు చెప్పలేకపోయారు. దాంతో ఆయన విద్యా ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలని సూచించారు. అలాగే భోజన, వసతి సదుపాయాలపై ఆయన విద్యార్థినులను ఆరా తీశారు. నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ సిహెచ్ వెంకటరామ సుధాకర్, విఆర్వో ఎన్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కట్టుబట్టలే మిగిలాయి
గొల్లుమంటున్న
అగ్ని బాధితులు
యానాం, ఏప్రిల్ 18: యానాంలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో సర్వంకోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన అగ్నిబాధితులు గూడుచెదిరి గొల్లున విలపిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం ఒక్కొక్క కుటుంబానిది ఒక్కొక్క ధీనగాధగా చూపరులను కంటితడి పెట్టిస్తోంది. కోలా రమేష్ అనే వ్యక్తి ఇంటి నుండి రాత్రి గం. 9.40 నిముషాల సమయంలో ఎగసిన అగ్నిజ్వాలలు సుడులుగా తిరిగి గ్రామాన్ని క్షణాల్లో చుట్టుముట్టడంతో ప్రాణభయంతో బయటకు పరుగులు తీసారు. దీంతో ఇళ్లలో వున్న సర్వం అగ్నికి ఆహుతైంది. మే నెలలో కూతురు ధనకుమారి వివాహం చేసేందుకు సంబంధం కుదుర్చుకున్న అరదాడి ఏడుకొండలు లక్షా 50 వేల రూపాయల నగదు, పెండ్లికుమారుడిని కుటుంబానికి బుధవారం అందజేయనుండటంతో నగదుతో పాటు మూడు కాసుల బంగారం బీరువాలో పెట్టి అగ్నికి ఆహుతికావడంతో కుమార్తె వివాహం ఏమవుతుందోనేమోనని ఆ కుటుంబం తల్లడిల్లిపోతున్న దృశ్యం చూపరులను కంటతడి పెట్టిస్తోంది. అలాగే చింతాడ వెంకటేశ్వర్లు 70 వేల రూపాయలు బీరువాలో పెట్టి ఉంచడంతో నగదుతో పాటు బంగారు ఆభరణాలు, మూడు లక్షల విలువచేసే మంగళి షాపు పూర్తిగా దగ్దమై అతని కుటుంబం గొల్లున విలపిస్తోంది. అలాగే పెసింగి అప్పారావు భార్య వెంకటలక్ష్మి మూడు కాసుల బంగారు తాడుతో పాటు పది తులాల వెండి పట్టీలను, అలాగే ఇంట్లోని సర్వం అగ్నికి ఆహుతికావడంతో గొల్లున విలపిస్తున్నారు. అలాగే పాలెపు లక్ష్మి, సంగాడి దేవకి, మల్లాడి ఈశ్వరరావు, తిమ్మాడి ధనలక్ష్మి వారి వారి కుటుంబాలు కోల్పోయిన నగదు, బంగారు ఆభరణాలు తిరిగి రావని గొల్లున విలపిస్తున్నారు.
బాధితులకు పునరావాసం
మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో బాధిత కుటుంబాలైన 120 కుటుంబాలకు యానాం రెవిన్యూశాఖ పాఠశాలలోను, కమ్యూనిటీ హాల్‌లోనూ పునరావాసం ఏర్పాటుచేసింది. 93 పూరిగుడిసెలు దగ్ధంకాగా వాటిలో నివాసం ఉంటున్న 120 కుటుంబాలు నిరాశ్రయులైనట్లు డిప్యూటీ తహశీల్దార్ మార్కండేయులు తెలిపారు. సమాచారాన్ని పుదుచ్ఛేరి ఉన్నతాధికారులకు అందించడం జరిగిందని, వీరికి భోజన వసతి రెవిన్యూశాఖ ఏర్పాటుచేస్తుందని ఆయన తెలిపారు.
సంఘటనపై పలు అనుమానాలు
మంగళవారం రాత్రి దరియాలతిప్ప ఫ్లడ్‌బ్యాంక్ ఏరియాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆహుతైన పూరిగుడిసెలు ప్రమాదవశాత్తూ జరిగింది కాదంటూ స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఒకే కమ్యూనిటీకి చెందిన ఈ కాలనీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరుకు సంబంధించి ఈ అగ్నిప్రమాదం జరిగిందంటూ పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ కాలనీకి అండగా నిలిచిన మల్లాడి సత్తిబాబుపై ప్రత్యర్ధి వర్గం ఆధిపత్యం సాధించేందుకు కుట్ర పూరితంగా ఈ ప్రమాదాన్ని సృష్టించారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ప్రమాద నష్టం అంచనా
ఈ అగ్నిప్రమాదంలో 18 లక్షల నుండి 20 లక్షల ఆస్థినష్టం ఉంటుందని డిప్యూటీ తహశీల్దార్ మార్కండేయులు వివరించారు. ప్రాథమిక అంచనాగా ఈ నివేదికలు తయారుచేసామని ఆయన తెలిపారు.
రంగురాళ్లు తవ్వుతున్న నలుగురు అరెస్టు
అడ్డతీగల, ఏప్రిల్ 18: మండలంలో రక్షిత అటవీ ప్రాంతంలోని తపస్సికొండ సమీపంలో అక్రమంగా రంగురాళ్ళు తవ్వకాలు సాగిస్తున్న నలుగురు యువకులను బుధవారం ఉదయం అరెస్టుచేసినట్టు అటవీ శాఖాధికారి శివకుమార్ తెలిపారు. బుధవారం ఆయన ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తపిస్సికొండ రక్షిత అటవీ ప్రాంతంలోని పిచ్చిమెటల్ క్వారీలో తవ్వకాలకు పాల్పడుతున్న వేటమామిడికి చెందిన మొల్ల రాజేష్, బొంతు నాగేశ్వరరావుతో పాటు అడ్డతీగలకు చెందిన అన్నిక నరేష్, బాకూరి మహేష్‌లను అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురు సంఘటనా స్థలం నుంచి పరారయ్యారని, దొరికిన వారిలో కోసూరి కొండబాబు, పుడిగి రాజు, నాగేంద్రలు వున్నట్లు చెప్పారన్నారు. వీరిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రంగురాళ్ళ తవ్వకాలకు ప్రోత్సహిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక మీదట రంగురాళ్ళ క్వారీలపై పోలీసు సహాయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డిఆర్‌ఒ చల్లా రాణి, ఎఆర్వో తన్నీరు అనూష , సిబ్బంది పాల్గొన్నారు.
రహదారి నిర్మాణం కోసం
ప్రజాపథాన్ని అడ్డుకున్న గిరిజనులు
రాజవొమ్మంగి, ఏప్రిల్ 18: తమ గ్రామానికి బిటి రహదారి నిర్మించనందుకు నిరసనగా ప్రజాపథాన్ని అడ్డుకున్న గిరిజనుల వైనం ఇది. రంపచోడవరం ఎమ్మెల్యే కెకె విశ్వనాథ్, ఐటిడిఎ పివో నాగరాణిలతో కూడిన అధికార బృందాన్ని మండలంలో లోదొడ్డి గ్రామంలోకి రాకుండా గ్రామం బయటే గిరిజనులు నిలిపివేసారు. లోదొడ్డి, పాకవెల్తి, పూదేడు గ్రామాలకు చెందిన గిరిజనులు రోడ్డుపై బైఠాయించారు. కొమరాపురం గ్రామం నుండి పాకవెల్తి గ్రామం వరకు రహదారి నిర్మిస్తేనే గ్రామంలోకి రానిస్తామని గిరిజనులు గట్టిగా చెప్పారు. ఈ సందర్భంగా రహదారి నిర్మించాలంటూ నినాదాలు చేసారు. రహదారి సౌకర్యం లేకపోడం వలన 108 వాహనం రాక సకాలంలో వైద్య సహాయం సకాలంలో అందక గర్భిణీలు, పాముకాటుకి గురైనవారు మృతి చెందినా, ఎవ్వరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. తమకు రహదారి నిర్మించేంత వరకు తమ గ్రామాల్లో ఎటువంటి అధికార కార్యక్రమాలు జరగనీయమని మొండికేసారు. ఎమ్మెల్యే కోసూరి, పివో నాగరాణిలు ఎంత నచ్చజెప్పినా గ్రామస్థులు వినిపించుకోలేదు. మహిళలు, యువకులు రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. తాము గత 20 ఏళ్లుగా రహదారి నిర్మించాలంటూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్న వించుకొంటున్నా, పట్టించుకునే నాధుడే లేడని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వానికి, నాయకులకు వ్యతిరేకంగా గిరిజనులు నినాదాలు చేసారు. ప్రజాపథం కార్యక్రమం గ్రామంలో నిర్వహిస్తామని అన్ని విషయాలు సభలో మాట్లాడుకుందామని, రూ 3.65 లక్షలతో రహదారి నిర్మాణానికి నాబార్డ్‌కు ప్రతిపాదనలు పంపామని, ఏజెన్సీలో అనేక గ్రామాలకు రహదారుల లేవని ఐటిడిఎ పివో నాగరాణి ఆందోళనకారులకు నచ్చ జెప్పసాగారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపథాన్ని జరగనివ్వమని మొండి కేయడంతో, విధి లేని పరిస్థితిలో ఎమ్మెల్యేతో సహా అధికారులు వెనుతిరిగారు. అనంతరం వాతంగి, చికిలింత, మారేడుబాక గ్రామల్లో యధావిధిగా ప్రజాపథాన్ని నిర్వహిచారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలను, పంట నష్టాన్ని పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ విఎస్ సత్యనారాయణ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఒ పివివి సత్యనారాయణ, సిడిపివో కె గ్లోరీ, ఎఒ కె సావిత్రి, పలు శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.