Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కాంగ్రెస్ ప్రాణం గాల్లో దీపమే

$
0
0

తిరుపతి,ఏప్రిల్ 18: రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణాలు, అవినీతి, అక్రమాలతో ఆ పార్టీ భవిష్యత్తు గాల్లో దీపంలా తయారై మరణశయ్యపై ఊగిసలాడుతోందని టిడిపి చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్ అన్నారు.ఎంత మంది వైద్యం చేసినా ఆ పార్టీ బతికిబట్టకట్టే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతి టిడిపి అభ్యర్ధిగా పొటీ చేస్తున్న చదలవాడ కృష్ణమూర్తి తిరుపతిలోని 3 వార్డులో తెలుగుమహిళా జిల్లా అధ్యక్షుడు వి పుష్పావతి అధ్యక్షతన బుధవారం జరిగిన ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైనా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపైనా ఆయన తనదైన శైలిలో విమర్శలు, చెణుకులు విసిరారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్సకు ఇక పనికిరాదన్నారు. అజాద్ వచ్చినా, వాయలార్ రవి వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దడం ఎవ్వరి తరం కాదన్నారు. ఎంత మంది వైద్యం చేసిన ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్న విధంగా వుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అనే బండికి బోల్టులు,నట్‌లు ఊడిపోతున్నాయన్నారు. ఎప్పుడు ఎక్కడ పార్టీ పడిపోతుందో ఎవ్వరికి తెలియదన్నారు. మరో పార్టీ లోపల బయట ఆట ఆడుతున్నదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీపై చణుకులు విసిరారు. పార్టీ అధ్యక్షుడు జైలుకు వెళితే ఆ పార్టీకి ఇక దిక్కు వుండదన్నారు. ఎప్పటికైనా దేశానికి, రాష్ట్రానికి దిశా, నిర్దేశం చేసేది, ప్రజల్లో వుండే పార్టీ, ప్రజలకు అండగా నిలిచే పార్టీ తెలుగుదేశంపార్టీ మాత్రమేనన్నారు. తిరుపతి ఏ పార్టీకి చెందిన అభ్యర్ధి గెలుస్తారో ఆ పార్టీ అధికారంలోనికి వస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తిరుపతి నుండి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోనికి వచ్చేందుకు ఈ ఉప ఎన్నికలే నాందికావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్‌టిఆర్ తిరుపతిపై ప్రత్యేక అభిమానంతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఆ పరంపర కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు.
బాబు సిఎం అయితేనే రాష్ట్రానికి
మంచిరోజులు :చదలవాడ
రాష్ట్రానికి భవిష్యత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆయనతోనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని తిరుపతి ఉప ఎన్నికల్లో టిడిపి పార్టీ తరపున పోటీ చేస్తున్న చదలవాడ కృష్ణమూర్తి జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలోనే తిరుపతి అభివృద్ధి చెందిన విషయం మీ అందరికి తెలియని కాదన్నారు. తిరుపతిని కూడా హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చినప్పటి నుండి తిరుపతి నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావన్నారు. తాను ఎమ్మెల్యేగా వున్నప్పుడు ప్రజలకు చేసిన అనేక సేవల గురించి ఆయన వివరించారు. ఈ మారు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నా జీవితాంతం తిరుపతి ప్రజల సేవకు అంకితమవుతానని ఉద్వేగంగా అన్నారు. ముఖ్యంగా తిరుపతి నగర ప్రజలు తాగునీటి సమస్యతో విలవిలాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు వచ్చేసిందని ఒకాయన ఊరంతా తిరుగుతున్నారన్నారు. మరోకాయన చేతిలో చేయ్యేసి ఓట్టేసి తనకే ఓటేస్తానని చెప్పాలని ప్రజల విశ్వాసాలతో ఆడుకుంటున్నారన్నారు. ఆ విధానాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఇలాంటి వారిని తిరుపతి ప్రజలు విశ్వసించరని తనకు స్పష్టంగా తెలుసన్నారు. తాను ఎమ్మెల్యే అయితే మీతోనే , మీ మధ్యనే వుంటానన్నారు. పలు మార్లు చదలవాడ ప్రసంగాలకు ప్రజలనుండి హర్షద్వానాలు వ్యక్తం అయ్యాయి. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నరసింహయాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు సూరా సుధాకర్‌రెడ్డి, నీలం బాలాజి, బిసిసెల్ ఉపాధ్యక్షులు గోవిందకృష్ణయ్య, బిజి కృష్ణయాదవ్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి కార్జాల బాలాజి నాయుడు, వసంతమ్మ, జ్యోతి, సంపూర్ణ, జగన్నాదం, తోటా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి
చక్కని వేదిక
తిరుపతి,ఏప్రిల్ 18: ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజాపథం చక్కని వేదిక అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాపథం కార్యక్రమాన్ని బుధవారం తిరుపతిలో ప్రారంభించారు. కార్పొరేషన్ కమిషనర్ టి ప్రసాద్ అధ్యక్షతన బుధవారం ఉదయం ఇందిరానగర్, బొమ్మగుంట, ఐఎస్‌మహాల్, పట్నూలు వీధి ప్రాంతాల్లో ప్రజాపథం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ధఐర్యంగా ప్రజల్లోకి వచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గత ప్రజాపథంలో చేసిన పనులను ప్రతిపక్షాలు విమర్శలు చేయడం విడ్డూరంగా వుందన్నారు. తిరుపతిలో 30వేల గ్యాస్ కనెక్షన్లను ఎంపి చింతామోహన్ ద్వారా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు 450 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిధులు కేటాయించారన్నారు. ట్యాంకర్ల ద్వారా ప్రతి వార్డుకు నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, గ్యాస్ కనెక్షన్లు అడిగిన ప్రతి వారికీ అందించిన ఘనత తమకే దక్కిందన్నారు. కమిషనర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చేందుకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తాము నగర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఇందిరానగర్‌లో పలువురు వృద్దులు తమకు పింఛన్లను మధ్యలో ఆపేశారని ఫిర్యాదు చేయగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ జోక్యం చేసుకుని తన జేబులోని డబ్బులు తీసి వారికి అందించారు. తాగునీటి సమస్యపై పలువురు మహిళలు నిలదీయగా వెంకటరమణ జోక్యం చేసుకుని వెంటనే ఆ ప్రాంతానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చెయ్యాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ కమిషనర్ బండి ఈశ్వరయ్య, హెల్త్ ఆఫీసర్ గీతాంజలి, పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి, టౌన్‌బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీ,మాజీ కౌన్సిలర్లు వెంకటనరసింహులు, నాగభూషణం, చుక్కలదాము,కుడితి సుబ్రమణ్యం, టికె బ్రహ్మానంద, గోపాల్, తాజా కాంగ్రెస్ నేతలు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్‌రాయల్, లతాదేవి, గీత, అరుణ, రాజేశ్వరి, ఎస్ కుమార్, వెంకటేష్, గుంగలయ్య, రఫీ, మునిరాజా, శేఖర్, జయకుమార్, మున్సిపల్ ఇంజనీరింగ్ అదికారులు ఆనందరావు, వెంకట్రామిరెడ్డి, హాసింగ్ వెంకటరత్నం, ఫించన్లు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

పిఆర్‌పిని టిడిపిలో విలీనం చేసిన జంగాలపల్లె
చిత్తూరు, ఏప్రిల్ 18: చిత్తూరు నియోజకవర్గం ప్రజారాజ్యంపార్టీ నాయకులు జంగాలపల్లె డాక్టర్ ఎ.శ్రీనివాసులు బుధవారం తమ పిఆర్‌పిని తెలుగుదేశంపార్టీలో విలీనం చేశారు. స్థానిక విజయదుర్గ కల్యాణ మండపంలో జరిగిన విలీనసభకు సుమారు వెయ్యిమంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. పదిమంది మాజీ కౌన్సిలర్లు గుడిపాల, చిత్తూరు రూరల్ మండలం పిఆర్‌పి అధ్యక్షులు, పలువురు పార్టీ ప్రముఖులు, శ్రేయాభిలాషుల మధ్య ఈకార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా జంగాలపల్లె శ్రీనివాసులు మాట్లాడుతూ ఈనెల 26న తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారాచంద్రబాబునాయుడు చిత్తూరు రానున్నారని ఆయన సమక్షంలో తెలుగుదేశంపార్టీలో లాంఛనంగా చేరుతున్నట్లు శ్రీనివాసులు ప్రకటించారు. దీనికోసం స్థానిక టిడిపి నాయకులతో 26న జరిగే చంద్రబాబు పర్యటన విషయమై చర్చలు జరిపారు. ఈసందర్భంగా శ్రీనివాసులను తెలుగుదేశంపార్టీలో చేరడానికి కారణాలు ఏమిటని అడగడంతో ఆయన సమాధానమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారాజ్యంపార్టీ కాంగ్రెస్‌పార్టి విలీనమైందని చిత్తూరులో కాంగ్రెస్‌పార్టీలో విలీనమయ్యేందుకు మార్గం సుముఖంగా లేదని ఇమడలేనని చెప్పారు. తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబునాయుడు తమకు ప్రాధాన్యత ఇస్తామని పార్టీలోకి ఆహ్వానించడంతో గతంలో టిడిపిలో పనిచేసినందున ఆపార్టీలో మంచి సంబంధాలు వుండడంతో మళ్లీ తెలుగుదేశంపార్టీలో చేరేందుకు సన్నద్ధమైనట్లు ఈసందర్భంగా వివరించారు. ఈకార్యక్రమంలో జెఎంసి శివ, విల్వనాథన్, మాజీ కౌన్సిలర్లు శరవణ, కుప్పన్, సుబ్రహ్మణ్యం, గిరి, అర్జున, నాయకులు పుష్పరాజ్, గుడిపాల నాయకులు ఆనందయాదవ్, సుధాకర్, బాలరామ్మూర్తి పాల్గొన్నారు.
భక్తుల భద్రతకే తొలి ప్రాధాన్యత
ఆంధ్రభూమిబ్యూరో
తిరుపతి, ఏప్రిల్ 18: తిరుమలకు విచ్చేసే భక్తులకు తగిన భద్రత కల్పించడమే తన ప్రధాన బాధ్యత అని టిటిడి ముఖ్య నిఘా , భద్రతాధికారిగా(సివిఎస్‌ఓ) బాధ్యతలు స్వీకరించిన అశోక్‌కుమార్ అన్నారు. బుధవారం ఉదయం అశోక్‌కుమార్ పూర్వ సివిఎస్‌ఓ ఎంకె సింగ్ నుండి బాధ్యతలు స్వీకరించారు. అంతకు పూర్వం ఆయన వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఫైలుపై అధికారికంగా సంతకాలు చేసి టిటిడి నూతన నిఘా భద్రతాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆలయ అర్చకులు తాజా, మాజీ భద్రతాధికారులు ఇరువురికి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద హైందవ ధార్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వహించే బాధ్యతలు రావడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఆ క్షేత్ర సంప్రదాయాన్ని, భద్రతను కాపాడుతూ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడంలో తనవంతు పాత్రను నిర్వహిస్తానన్నారు. అనంతరం మాజీ భద్రతాధికారి ఎంకె సింగ్ మాట్లాడుతూ స్వామివారి కొలువులో రెండేళ్లకు పైగా సేవ చేసే భాగ్యం కలగడం తన అదృష్టమన్నారు. భవిష్యత్తులో మరోమారు స్వామివారి కొలువులో సేవ చేసే భాగ్యం కలగాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భద్రతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో అర్జున తపస్సు

పెనుమూరు, ఏప్రిల్ 18: మండల కేంద్రంలోని శ్రీమహాభారత మహోత్సవాల్లో భాగంగా బుధవారం పెనుమూరు మండలంలోని శ్రీముత్యాలమ్మ దేవాలయ ఆవరణలో ఈనెల 8నుంచి ప్రారంభమైన మహాభారత యజ్ఞంలో భాగంగా బుధవారం అర్జున తపస్సు కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. పెనుమూరులోని శ్రీముత్యాలమ్మ గుడి ఆవరణలో మహాభారతం మహోత్సవాల్లో భాగంగా ఈనెల 8వ తేది ఆదివారం నుండి 25వ తేది బుధవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2నుండి సాయంత్రం 5.30గంటల వరకు తిరుపతి వాస్తవ్యులు రేడియో, టివి ఆర్టిస్ట్ భాగవతారాణి సీతాలక్ష్మిచే హరికథ కాలక్షేపాన్ని రక్తికట్టించారు. ఇందులో భాగంగా రాత్రి సమయాల్లో శ్రీవెంకటేశ్వర కళామండలి నాటక బృందాలచే నాటక ప్రదర్శనను కళ్లకు కట్టినట్లు చూపారు. ఈకార్యక్రమాల్లో మహిళలు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అర్జునుడు తపస్సుమాను పూర్తి అయిన తరువాత చెట్టుపై నుంచి నిమ్మపండ్లు, అరటిపండ్లు, తినుబండారాలను చల్లుతాడు. వాటిని చేజిక్కేందుకు ప్రజలు ఎగబడ్డారు. వీటిని ఇళ్లలో వుంచుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం. ఈకార్యక్రమానికి పెనుమూరు మండల పరిధిలోని 44గ్రామ పంచాయతీలోని ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
గ్రామాల్లో వౌలిక వసతుల కల్పనకే ప్రజాపథం
వెదురుకుప్పం, ఏప్రిల్ 18: గ్రామాల్లో వౌలిక వసతులు మెరుగుపరిచేందుకే ప్రభుత్వం ప్రజాపథం నిర్వహిస్తోందని స్థానిక ఎమ్మెల్యే కుతూహలమ్మ తెలిపారు. బుధవారం మండలంలోని మాంబేడు, తిరుమలకొండమాంబాపురం, పచ్చికాపల్లం, కొమరగుంట, ఇనాంకొత్తూరు, సంతబయలు, మొండివెంగనపల్లి, బ్రాహ్మణపల్లి పంచాయతీ కేంద్రాల్లో ప్రజాపథం కార్యక్రమం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్టచ్రరిత్రలో ఎన్నడూ లేని విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం సమర్థవంతంగా అమలు జరిపిస్తున్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అదనంగా మరికొన్ని కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రూపాయికే కిలోబియ్యం, రైతులకు వడ్డీలేని వ్యవసాయ సంబంధ రుణాలు మంజూరు, మహిళా సంఘాలకు విరివిగా రుణాలు మంజూరు, వంటి కార్యక్రమాలు చేపట్టి ఇతర రాష్ట్రాలకే ఆదర్శవంతంగా ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద కుటుంబాల జీవన పరిస్థితులు మెరుగుపరిచేందుకు అమలు జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోని అధికారులు సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పట్టు, ఉద్యానవనపంటల అభివృద్ధికి ఉపాధినిధులు కేటాయించిందని, అదే తరహాలో మిగిలిన వ్యవసాయ పంటలకు సైతం నిధులు కేటాయింపు జరిపేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మాంబేడు, పచ్చికాపల్లం పంచాయతీలు మినహా మిగిలిన పంచాయతీల్లో ఈ కార్యక్రమం నామమాత్రంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి భాస్కర్, ఎంపిడి ఓ రవికుమార్, తహసీల్దార్ రేణుక, ఎ ఓ మురళి, ఎ ఇ రవి, క్షేత్రస్తాయి సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా ప్రదోష పూజలు
నాగలాపురం, ఏప్రిల్ 18: నాగలాపురం మండలం సురుటుపల్లిలోని శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా బుధవారం ప్రదోషపూజలు నిర్వహించారు. ప్రదోషం సందర్భంగా బుధవారం ఆలయం తెరిచి శుద్ధిచేసి శ్రీ వాల్మీకేశ్వర స్వామికి, మరగదాంబిక అమ్మవాకి, శ్రీ దాంపత్య దక్షిణామూర్తికి విశేషాభిషేక అలంకరణలు చేశారు. సాయంత్రం 4.30గంటలకు ప్రదోషమండపంలోని నందీశ్వరునికి ఏకకాలంలో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కొబ్బరినీళ్లు, పంచతీర్థాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు సమర్పించిన పుష్పాలతో నందీశ్వరునికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు చేశారు. కామధేనువును కూడా వివిధ పుష్పాలతో అలంకరించి ఆలయం చుట్టూ మూడుమార్లు ప్రదక్షిణలు చేయించినట్లు ఆలయ అర్చకులు బాలచందర్, కార్తికేశన్ తెలిపారు. ఈ సందర్భంగా నందీశ్వరుడ్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. నందనంలోని జలసిద్దేశ్వర స్వామి ఆలయంలో, వేంబాకం గ్రామంలోని వాల్మీకేశ్వర స్వామి ఆలయంలో కూడా నందీశ్వరునికి ప్రదోషపూజలు ఘనంగా నిర్వహించినట్లు ఆ గ్రామస్థులు తెలిపారు.

‘కిశోర బాలికలు హక్కుల గురించి తెలుసుకోవాలి’
చంద్రగిరి, ఏప్రిల్ 18: కిశోరబాలికలు తమ చుట్టూ ఉన్న సమాజం గురించి, హక్కులుగురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాస్ బచలన్ ప్రాజెక్టు పిడి రవిచంద్ర అన్నారు. బుధవారం చంద్రగిరి స్ర్తి శిశుసంక్షేమ అభివృద్ధి కార్యాలయంలో కిశోరబాలికల శిక్షణా తరగతుల రెండవరోజు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ నేటి పిల్లలు ఆరోగ్యంపైనే రేపటి రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. కిశోరబాలికలు 11 నుండి 18సంవత్సరాల వయసులో కలిగే శారీరక మార్పులు, పలు సందేహాలను అడిగి తెలుసుకోవడం వలన సమస్యలు పరిష్కరించుకోవచ్చునన్నారు. బాలికల హక్కుల ఉల్లంఘన, చదువుకునే అవకాశం ఇవ్వకపోవడం, లేకపోవడం, వయసుకు మించి పనులు చేయించడం, చిన్నవయసులో వివాహం చేయడం, వేధింపులు, అత్యాచారాలు వంటి వాటి నుండి ఎలా రక్షణ పొందాలి, బాల్య వివాహాల వలన కలిగే నష్టాలు తదితర అంశాలు గురించి రవిచంద్ర వివరించారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు అభివృద్ధి చెందినపుడే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. బాలల హక్కులు గురించి కిశోరబాలికలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. మేజర్ హక్కులు గురించి తెలుసుకోవడం వలన వారికి అవి రక్షణగా ఉంటాయన్నారు. అనంతరం చంద్రగిరి ప్రాజెక్టు ఆఫీసర్ శారద మాట్లాడుతూ మహిళాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి వేలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తుదన్నారు. అనంతరం రీసోర్స్‌పర్సన్ లక్ష్మి లైప్‌స్కిల్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బచవన్ ప్రాజెక్టు సిబ్బంది పుష్పలత, శాంతి, జ్యోత్స్న, తులసి, బిందు, లక్ష్మీప్రియ, దేవిక, అంగన్‌వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి
తిరుపతి, ఏప్రిల్ 18: మీకు అండగా వుంటూ మీ సమస్యను పరిష్కరిస్తానని, తనను తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తన ఎన్నికల ప్రకారంలో భాగంగా ఆయన టాక్సీ ఓనర్లు, డ్రైవర్లతో స్థానిక కోనేటి కట్టవద్ద శ్రీలక్ష్మి శ్రీనివాస జీపు అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, బిసిసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బి జి గోపాలకృష్ణ యాదవ్ అధ్యక్షతన మంగళవారం అర్ధరాత్రి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, ఓనర్లు మాట్లాడుతూ మా పట్ల టిటిడి విజిలెన్స్ అధికారులు, పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులుకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమకు కుటుంబ పోషణ కూడా గగనమవుతోందన్నారు. తమకు రక్షణ కావాలని విజ్ఞప్తి చేశారు. అసలే పెరిగిన ధరలతో మూడు పూటలా భోజనం చేయలేని స్థితిలో వున్న తమను పోలీసులు, టిటిడి విజిలెన్స్ అధికారులు వేధిస్తూ తమ శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన చదలవాడ మాట్లాడుతూ ఇటువంటి విషయాలు తన దృష్టికి కూడా వచ్చాయన్నారు. తాను మీకు అండగా వుంటానని, మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ అధికారంలోనికి రాగానే టాక్సీ డ్రైవర్లకు ఇండ్లస్థలు, వాహనాల కొనుగోలు కోసం రుణాలు అందించేందుకు తాను ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ఈ సమావేశంలో జీపు డ్రైవర్ల సంఘం నేతలు మురళీయాదవ్, ఎన్‌ఎస్ శ్రీను, లోకు సుబ్రమణ్యం, డిల్లీ, టిడిపి నేతలు నీలం బాలాజి, బుల్లెట్ రమణ, ఆనందబాబు యాదవ్, హరి పాల్గొన్నారు.

ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడాలి
తిరుపతి,ఏప్రిల్ 18: ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని బిజెపి నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. భారతీయ జనతాపార్టీ చేపట్టిన పోరుబాటలో భాగంగా బుధవారం తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ న్యాయకత్వంలో తిరుపతి పెద్దకాపు లే అవుట్, తాతానగర్, వినాయకనగర్, కొర్లగుంట, వివేకానందవీధుల్లో బిజెపి నేతలు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ప్రజలు కూడా తమకు నీటి సమస్యలున్నాయని, పింఛన్లు సక్రమంగా ఇవ్వడం లేదని, ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. ఇంటిపన్ను, తాగునీటిపై 150 శాతం పెంచారన్నారు. పెంచిన కరెంటు చార్జిలు, ఇంటి పన్నులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు బిజెపి నేతలకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యలోపం, తాగునీటి సమస్య తీవ్రంగా వుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కనీసం తాగునీరు సక్రమంగా ఇవ్వలేని దుస్దితి వుందన్నారు. ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారన్నారు. వంట గ్యాస్ కూడా సక్రమంగా రావడం లేదన్నారు. వృదాప్య ఫించన్లు ఇవ్వడం లేదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం వలన పెరిగిన నిత్యావసర ధరలతో పరిస్థితి దుర్పరంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జి భానుప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి చంద్రారెడ్డి, నగర అధ్యక్షుడు అజేయ్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వి సుబ్రహ్మణ్యం యాదవ్, మజ్దూర్ యూనియన్ నాయకులు పి భాస్కర్, బిజెవైఎం నాయకులు కె విశ్వనాథ్, గుట్టా నాగరాజు రాయల్, వరప్రసాద్, దళిత మోర్చా నాయకులు రవిప్రసాద్, మహిళామోర్చా అధ్యక్షురాలు విమలమ్మ, సురేష్, మురళీ తదితరులు పాల్గొన్నారు.
ఉప ఎన్నికల జిమ్మిక్కే ప్రజాపథం
తిరుపతి,ఏప్రిల్ 18: రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రజాబలంతో దూసుకుపోవడం ఖాయమని తెలిసి కనీసం డిపాజిట్లు అయినా దక్కించుకుందామని ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రజాపథం కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్న ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు భూమన్ కరుణాకర్‌రెడ్డి విమర్శించారు.
చిరంజీవి రాజీనామా వ్యవహారం తెరపైకి రాకముందునుండే కరుణాకర్‌రెడ్డి గత నాలుగు నెలలుగా తిరుపతి నగరంలోని అన్ని వార్డులలో కలియతిరుగుతున్న విషయం పాఠకులకు విదితమే. అంతేకాకుండా పెన్షన్లు, తాగునీటి సమస్య, రేషన్‌కార్డులు, గ్యాస్ కొరత, కరెంటు కోత, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్యలపై ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు అందుకుని వాటి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు.
ఇటీవల కార్పొరేషన్ కార్యాలయం ఎదుట విజయవంతంగా మహాధర్నా నిర్వహించిన విషయం విదితమే. టిడిపి అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి పేరు ఖరారు కావడంతో మరింత ముమ్మరంగా ఆయన వార్డు పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా
బుధవారం తిరుపతి సుందరయ్యనగర్, యశోదనగర్‌లో ఆయన వార్డు బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ప్రజాపథంలో పేదల నుండి అర్జిల రూపంలో అందుకున్న అనేక సమస్యలను పరిష్కరిచే దిక్కులేదన్నారు. తిరిగి అదే పేరుతో ప్రజల్లోకి రావడం సిగ్గుచేటన్నారు. పేదలకు అండగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలుకు పునరుజ్జీవనం కావాలంటే, పేదవాని కలలు సాకారం కావాలన్నా జగన్ సిఎం అవ్వాలని, అందుకు ప్రతి పేదవాడు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్ రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంవిఎస్ మణి, వెంకటేష్, పుల్లయ్య, హనుమంతనాయక్, ఎంపిటిసి చంద్రమోహన్‌రెడ్డి, ఎస్‌కెబాబు, తిరుమల పెంచలయ్య, సాకం ప్రభాకర్, షఫీ ఆహ్మాద్ ఖాదరీ, పునిత, కుసుమకుమారి, లత, ప్రభావతి, మునీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణాలు, అవినీతి, అక్రమాలతో ఆ పార్టీ భవిష్యత్తు గాల్లో దీపంలా
english title: 
c

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>