Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రజాపథం అధికారులకు చేదు అనుభవం!

$
0
0

రొళ్ళ, ఏప్రిల్ 18: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపథంలో భాగంగా మండలంలో తొలిరోజే అధికారులకు ప్రజల నుండి చేదు అనుభవం ఎదురైంది. ప్రజాపథంలో భాగంగా మండల పరిధిలోని రత్నగిరి, కాకి, దొడ్డేరి గ్రామాల్లో బుధవారం గ్రామసభలు నిర్వహించాల్సి ఉంది. ఉదయం రత్నగిరిలో గ్రామసభ సజావుగా సాగింది. అయితే కాకి గ్రామంలో గ్రామసభ నిర్వహించేందుకు మండల ప్రత్యేకాధికారి, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు బయలుదేరారు. ఈ నేపథ్యంలో కాకి గ్రామస్థులు అధికారులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. రహదారికి అడ్డంగా ముళ్ళకంపలు వేసి గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించిన తర్వాతనే గ్రామసభ నిర్వహించాలని బీష్మించారు. గ్రామంలో నెలకొన్న నీటి సమస్యలపై పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా అధికారులు పట్టించుకున్న పాపానపోలేదని విమర్శించారు. విషయం తెలుసుకొన్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అక్కడికి చేరుకుని గ్రామస్థులతో చర్చించి రెండు రోజుల్లోపు గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించగా అనంతరం గ్రామంలో గ్రామసభ నిర్వహించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం దొడ్డేరి గ్రామంలో గ్రామసభ నిర్వహించేందుకు వెళ్ళిన అధికార బృందానికి అదే చేదు అనుభవం ఎదురయింది. గ్రామస్థులు మూకుమ్మడిగా రహదారికి అడ్డంగా ముళ్ళకంపలు వేసి అడ్డుకున్నారు. మహిళలు గ్రామంలో నెలకొన్న నీటి సమస్యపై ఖాళీ బిందెలతో అధికారుల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య తీర్చాలని, బస్సు సౌకర్యం కల్పించాలని, లో ఓల్టేజీ సమస్య పరిష్కరించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని తదితర సమస్యలను ఏకరవు పెట్టారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యే సుధాకర్ పర్యటించిన సందర్భంగా కూడా ఆయా సమస్యలను విన్నవించినా ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు గ్రామంలోకి రాకూడదని దాదాపు రెండు గంటల పాటు మండుటెండలో అధికారులను నిలదీశారు. మండల ప్రత్యేకాధికారి రామచంద్రారెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు గ్రామస్థులను శాంతింప చేసేందుకు ఎంత ప్రయత్నించినా ససేమిరా అన్నారు. చివరకు చేసేదేమీ లేక అధికారులు దొడ్డేరిలో గ్రామసభ నిర్వహించకుండానే వెనుదిరిగారు.
నల్లచెరువులో..
నల్లచెరువు : మండలంలో బుధవారం నిర్వహించిన ప్రజాపథం కార్యక్రమం జనాలు లేక వెలవెలబోయాయి. ప్రజాపథానికి వచ్చిన జనాలకన్నా పోలీసులు, వివిధ శాఖల అధికారులే ఎక్కువగా ఉండడం గమనార్హం. మండలంలోని పి కొత్తపల్లి, జోగన్నపేట, అల్లుగుండు, ఎస్ మొలకల పల్లి, తవళం మర్రి, పంతుల చెరువుగ్రామాల్లో బుధవారం ప్రజాపథం కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపథంలో ముఖ్యంగా ఉపాధి హామీ పథకం నిర్వహణ, తాగునీటి సమస్య, ఆరోగ్యం, 108, 104 తదితర సమస్యలపై చర్చ జరగాల్సి వుండగా గ్రామాల్లో జనాలు లేక ప్రజాపథం వెలవెలబోయింది. పి కొత్తపల్లి గ్రామంలో పదిమంది లోపలే ప్రజాపథానికి జనాలు హాజరవ్వడంతో అధికారులు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపిస్తుండగా సమావేశంలో ఎవ్వరూ లేక పోవడం గమనార్హం. జోగన్న పేట, అల్లుగుండు, తవళం మర్రి, ఎస్ మొలకల పల్లి గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రజలు అధికారులను నిలదీశారు. ఇన్‌పుట్ సబ్సిడీ సక్రమంగా అందలేదంటూ రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించే వరకు అధికారులెవ్వరూ తమ గ్రామం వైపు రాకూడదని తవళం మర్రి గ్రామస్థులు రోడ్డుకు అడ్డంగా కంచె వేసి అధికారులను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. అధికారులు ఎన్ని విధాల ప్రాధ్యేయపడినా గ్రామస్థులు పట్టువిడక పోవడంతో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు కంచెను తొలగించారు. అనంతరం సమావేశంలో అధికారులు మాట్లాడుతూ గ్రామంలని సమస్యలను పరిష్కరించుటకే ప్రజాపథం నిర్వహించడం జరుగుతోందని వెంటనే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శివయ్య, తహశీల్దార్ హనుమంతప్ప, ప్రభుత్వ వైధ్యాధికారి డా. కవిత, హౌసింగ్ ఎఈ గౌస్‌మొద్దీన్, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మే లో పశుగ్రాసం సరఫరా
* కలెక్టర్ వి.దుర్గాదాస్
ఉరవకొండ, ఏప్రిల్ 18: జిల్లాలో కరవు పరిస్థితులు నెలకొనడంతో పశువులకు గ్రాసం లేక అవస్థలు పడుతున్నారని, రైతులను ఆదుకోవడం కోసం మే మొదటి వారంలో పశుగ్రాసం కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రాసం సరఫరా చేస్తామని కలెక్టర్ దుర్గాదాస్ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో పశుగ్రాసం కేంద్రాల ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. అందులో భాగంగా పశుగ్రాసం కోసం రూ. 54 కోట్ల వ్యయంతో నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. పశుగ్రాసం దొరక్కపోవడంతో కృష్ణ, తూర్పుగోదావరి జిల్లాల నుండి దిగుమతి చేసుకుని మే మొదటి వారంలో జిల్లాలో పశుగ్రాసం కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. కేంద్రాల వద్ద రైతులకు, పశువులకు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పెన్నహోబిలంలోని మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ప్రతి ఒక్కరు పచ్చదనం కోసం తమ ఇంటి వద్ద ఒక్కొక్కరు ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డ్వామా పిడి మురళి, పశుసంవర్దక శాఖ జెడి రమణరావు, ఎసిహెచ్‌ఎఫ్ ఎస్‌డిఓ శ్రీనివాస్ గుప్తా, ఎడి విజయకుమార్, ఎడిహెచ్ సుబ్బరాయుడు, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వికలాంగులకు శాశ్వత
ధ్రువీకరణ పత్రాలు
* కలెక్టర్ వి.దుర్గాదాస్
అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 18: జిల్లాలో సదరం 3వ దశలో 8,155 మంది వికలాంగులకు శాశ్వత వికలాంగ ధ్రువీకరణ పత్రాలను జారీచేయాలని కలెక్టర్ వి.దుర్గాదాస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సదరం పై సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, హిందూపురం డిసిహెచ్‌ఎస్ మెడికల్ బోర్డు డాక్టర్లు, డిఆర్‌డిఏ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 63,05 6 మంది వికలాంగ పెన్షనర్లు ఉండగా ఇప్పటి వరకు సదరం రెండు దశల్లో 54,384 మంది వికలాంగులకు వైద్యపరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఇం దులో 48,064 మంది అర్హులైన వికలాంగులకు శాశ్వత ధ్రువీకరణ పత్రాలను జారీ చేశామన్నారు. సదరం క్యాంపునకు 8,672 మంది హాజరు కాలేదని వారిలో 8,155 మంది సదరం మూడవ దశలో శాశ్వత ధ్రువపత్రాలకోసం దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. మూడవ దశకు అవసరమైన ప్రత్యేక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ లాక్‌ను త్వరలో ఓపెన్ చేయనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం తెలిపారని కలెక్టర్ వివరించారు. గత రెండు విడతల సదరంలో వికలాంగులకు మెడికల్ సర్ట్ఫికెట్లను జారీ చేయించే బాధ్యతను డిఆర్‌డిఏ పిడి చేపట్టారని మూడవ దశలో జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్, హిందూపురం డిసిహెచ్ ఆధ్వర్యంలో శాశ్వత మెడికల్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వీటి ద్వారా నిరంతరం వికలాంగుల పెన్షనర్లను స్క్రీన్ చేసి అర్హులైన వారికందరికీ శాశ్వత ధ్రువీకరణ పత్రాలను జారీచేయాలన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సదరం సాఫ్ట్‌వేర్‌ను, కంప్యూటర్లు, ప్రింటర్లు, టెక్నికల్ సిబ్బందిని మెడికల్ బోర్డులకు వెంటనే అప్పగించి,వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని డిఆర్‌డిఏ పిడి రంగయ్యను కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న 8155 మందికి 40 రోజుల్లోపు శాశ్వత ధ్రువపత్రాలను జారీచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్వో సుదర్శన్‌రెడ్డి, మెప్మా పిడి మల్లీశ్వరీ దేవి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వరరావు, డిసిహెచ్ డా.శివప్రకాష్, డియంహెచ్‌ఓ డా. వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
గుంతకల్లు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు
రాజకీయాలకు అతీతంగా పోరాటం
* అఖిలపక్ష పార్టీల నేతలు
గుంతకల్లు, ఏప్రిల్ 18: గుంతకల్లును రెవెన్యూ డివిజన్‌గా చేయాలని కోరుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటాలు సాగించాలని అఖిలపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో బుధవారం గుంతకల్లును రెవెన్యూ డివిజన్ చేసి అభివృద్ధి చేయాలని అఖిలపక్ష పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత 20 ఏళ్ల కాలంగా గుంతకల్లు అభివృద్ధి పరంగా తిరోగమనం చెందుతుందన్నారు. ప్రధానమైన గుంతకల్లు రైల్వే డివిజన్ కుదింపు, ఉపాధి మార్గంగా వున్న స్పిన్నింగ్ మిల్లు మూతపడటం, చలన చిత్ర పరిశ్రమలు వలస బాట పట్టడంతో ఉపాధి లేక అభివృద్ధి కుంటు పడిందన్నారు. ఇలాంటి తరుణంలో గుంతకల్లును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేయాలన్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్‌కు, మంత్రి రఘువీరారెడ్డికు వినతి పత్రాలు ఇవ్వడం, అనంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవిధంగా ఆందోళనలు ఉద్ధృతం చేయనున్నట్లు తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో గుంతకల్లును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని, కేవలం నేతల స్వార్థ ప్రయోజనాల కోసం రెవెన్యూ డివిజన్‌లను ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని వారు కోరారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్‌ల వల్ల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న రెవెన్యూ డివిజన్‌ల ప్రక్రియను ప్రజల అవసరాలను దృష్టిలో వుంచుకుని ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, నియోజకవర్గ కన్వీనర్ గోవిందు, మండల కార్యదర్శి అబ్దుల్ వాహబ్, టిడిపి పట్టణ అధ్యక్షులు ఆమ్లేట్ మస్తాన్ యాదవ్, నేతలు శ్రీనివాసులు, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ పురిమెట్ల రంగస్వామి, పట్టణ కార్యదర్శి మహేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర నేతలు జెబి సురేష్, లోక్‌సత్తా పార్టీ నేతలు రామ్మోహన్, అంజుమన్ కమిటీ సభ్యులు గౌస్ సాబ్, స్వర్ణకారుల సంఘం నేతలు, సిపిఐ నేతలు వీరభద్రస్వామి, దేవేంద్ర, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ఏర్పాటుకు కృషి:ఎమ్మెల్యే పల్లె
* దీక్ష విరమించిన మహిళా సమాఖ్య ప్రతినిధులు
పుట్టపర్తి, ఏప్రిల్ 18: సత్యసాయి జిల్లా ఏర్పాటుకై ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి అసెంబ్లీలో తన వాణిని వినిపిస్తానని ఎమ్మెల్యే పల్లెరఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎపి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని 24 గంటల నిరసన దీక్షా శిబిరాన్ని పల్లె బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి శివైక్యం తరువాత ప్రభుత్వం పుట్టపర్తి పట్ల నిర్లక్ష్యం చూపుతోందన్నారు. అభివృద్ధి పనులకోసం రూ. 52కోట్లు ప్రతిసాదిస్తే ఇప్పటివరకు రూ. 22కోట్లు మాత్రమే మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం కూడా చేయలేని అభివృద్ధి సత్యసాయి వేలాది కోట్లు వ్యయంచేసి మానవాళికి ఎన్నో సేవలుఅందించారని, విద్యా, వైద్యం, తాగునీటి వంటి బృహత్కర కార్యక్రమాలు అమలు చేశారని ఆయన పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా భౌగోళికంగా రాష్ట్రంలోనే పెద్దదని, బాబా జ్ఞాపకార్థం హిందూపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరడం సమంజసమేనన్నారు. పార్టీలకు అతీతంగా కమిటీని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి జిల్లా సాధనకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. జిల్లా ఏర్పాటుకు కావాల్సిన అన్ని వౌలిక సదుపాయాలు పుట్టపర్తిలో ఉన్నాయన్నారు. అలాగు బాబా జయంతి నవంబర్ 23ను ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని పాఠ్యాంశాలపై బాబా సూక్తులను పొందుపరచాలని డిమాండ్ చేశారు. జిల్లా ఏర్పడితే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి సాధ్యంకాదన్నారు. నిరసన దీక్షలో పాల్గొన్న మహిళలను అభినందించారు. 24 గంటల దీక్ష పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే మహిళలకు కొబ్బరి బొండా తాగించి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కన్వీనర్ కడియాలసుధకార్, నాయకులు బిసి గంగయ్యన్న, బెస్త చలపతి, జ్యోతి వెంకటరాముడు, ఆవుల సుబ్రహ్మణ్యం, వైకాపా నాయకులు రఫీ, శివప్ప, రాజా, సిపిఐ నాయకులు వేమనారాయణ, శ్రీనివాసులు, రామలింగయ్య, ఎం ఆర్ పి ఎస్ నాయకులుగంగాధర్, నరసింహులు,రామయ్య, మహిళా సమాఖ్య నాయకురాళ్ళురాజేశ్వరి, జయలక్ష్మి, సాయిలీలా తదితరులు పాల్గొన్నారు.
వేలం పాటల
క్రమబద్ధీకరణకు సహకరించండి
హిందూపురం రూరల్, ఏప్రిల్ 18: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేలం పాటలను మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో వ్యాపారులు సహకరించాలని సంబంధిత శాఖ సహాయ సంచాలకులు శ్రీకాంత్‌రెడ్డి కోరారు. స్థానిక మార్కెట్‌యార్డులో బుధవారం ట్రేడర్ల సమావేశం నిర్వహించారు. ఎడి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ హిందూపురం మార్కెట్‌యార్డులో చింతపండు, మిరప లావాదేవీల్లో రాష్ట్రంలోనే ప్రాధాన్యం సంతరించుకుందని, ఇక్కడి నిర్వహణ విధానాలు ఆదర్శంగా ఉన్నాయన్నారు. అయితే వేలం పాటల సమయంలో మార్కెటింగ్ సిబ్బంది ప్రమేయం లేకుండా వ్యాపారులు వేలం నిర్వహిస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్దంగా ఉందన్నారు. భవిష్యత్తులో ప్రతి రైతు వ్యవసాయోత్పత్తిని మార్కెట్‌యార్డు సిబ్బంది సమక్షంలో నిబంధనల మేరకు వేలం పాటలు నిర్వహిస్తామన్నారు. తొలుత ఈ విధానాన్ని వ్యాపారులు వ్యతిరేకించినా అనంతరం ఎడి శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపాదనలతో ఏకీభవించి గురువారం వేలం పాటలను తొమ్మిది క్లస్టర్లుగా విభజిం చి నిర్వహించడానికి అంగీకరించా రు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా హిందూపురం మార్కెట్‌యార్డులో గత రెండు రోజులుగా పరిశీలించి వేలంపాటలను క్రమబద్దీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. యార్డు చైర్మన్ డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి మా ట్లాడుతూ, హిందూపురం వ్యవసాయ మార్కెట్‌యార్డు అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకున్నామని, క్రమబద్దీకరణ చర్యలకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల కార్యదర్శులు గోవిందరెడ్డి, ఆదినారాయణ, వీరయ్య, రాంప్రసాద్, వ్యాపారులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించండి
అనంతపురం, సిటీ, ఏప్రిల్ 18: ఎస్సీ, ఎస్టీల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను కోరారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ఫిర్యాదుల దినం నిర్వహించారు. డిఆర్‌ఓ సుదర్శన్‌రెడ్డి, ఎఎస్పీ శివయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రమణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ సంచాలకులు మోహన్‌కుమార్, మెప్మా పిడి మల్లీశ్వరిదేవి 125 మంది ఎస్సీ, ఎస్టీల నుండి అర్జీలు స్వీకరించారు. కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన మాదిగ పాత లింగప్ప భూమి సాగుకు తుంపర్ల సేద్యం పైపులు, బోర్లు, సబ్ మెర్సిబుల్ పంపుసెట్లు మంజూరు చేయాలని కోరారు. రీసోర్స్ సెంటర్‌లో తాను ఐదేళ్లుగా పనిచేశానని, తీరా ఇప్పుడు పని లేదని అధికారులు చెబుతున్నారని, తనకు న్యాయం చేయాలని చెనే్నకొత్తపల్లికి చెందిన సోమశేఖర్ వేడుకున్నారు. శింగనమల మండలం తరిమెల గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఎంఆర్‌పిఎస్ నాయకులు తరిమెల నల్లప్ప అధికారులను కోరారు. ఓడి చెరుపుమండలం ఇనగలూరు గ్రామానికి చెందిన రవి తనకు ఫీజు ఫీజు రీ యింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశాడు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఒకే ఈతలో ఐదు మేక పిల్లలు
పరిగి, ఏప్రిల్ 18: మండల పరిధిలోని కోనాపురం గ్రామానికి చెందిన రైతు నందారెడ్డికి చెందిన ఓ మేక ఒకే ఈతలో ఐదు పిల్లలకు బుధవారం జన్మనిచ్చింది. మొదటి ఈతలో రెండు మేక పిల్లలకు జన్మినిచ్చిన ఆ మేక రెండో ఈతలో మూడు మేక పిల్లలు, మూడో ఈతలో నాలుగు, నాల్గో ఈతలో ఐదు పిల్లలకు జన్మనిచ్చినట్లు రైతు తెలిపారు. ఒకే ఈతలో జన్మించిన ఐదు మేక పిల్లలను చూసేందుకు స్థానికులు నందారెడ్డి ఇంటి వద్ద గుమిగూడారు.
చౌక డిపోల్లో కందిపప్పు
విధిగా విక్రయించాలి
* జిల్లా మేనేజర్ శాంతకుమారి
మడకశిర, ఏప్రిల్ 18: జిల్లాలోని అన్ని చౌక ధాన్యపు డిపోల్లో డీలర్లు కందిపప్పును విధిగా విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ శాంతకుమారి తహశీల్దార్లకు సూచించారు. స్థానిక మడకశిర రెవెన్యూ కార్యాలయంలో బుధవారం ఆహార సలహా సంఘం సమావేశం నిర్వహించారు. శాంతకుమారి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి డీలర్ వచ్చే నెల నుండి కందిపప్పుకు తప్పనిసరిగా డిడి చెల్లించి డిపోల్లో కందిపప్పు విక్రయించే విధంగా తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. గోధుమలు నాణ్యత లేని కారణంగా పంపిణీ చేయడం లేదని, నాణ్యమైన గోధుమలు వచ్చిన వెంటనే అందిస్తామన్నారు. పామాయిల్, చక్కెర పంపిణీలో సైతం హైదరాబాద్ నుండి ఆలస్యం కావడంతో అందించడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. ఆధార్‌కార్డుతో ముడిపెట్టి సరుకులు ఇవ్వని డీలర్ల డీలర్‌షిప్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఓ ప్రశ్నకు సమాధానంగా ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుండి సబ్సిడీ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ వినియోగదారులకు అన్ని సరకులను ఒకే విడతలో అందించాలని డీలర్లకు సూచించారు. అలాగే ప్రతినెలా డీలర్లు సకాలంలో డిడిలు చెల్లించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో తహశీల్దార్లు అశ్వర్థనారాయణ, వెంకటశేషు, శివయ్య, ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, ఆహార సలహా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
భూమి వార్తకు స్పందన
కుళాయి కనెక్షన్లలపై
కమిషనర్ ఆగ్రహం
* నోటీసులు జారీ
హిందూపురం, ఏప్రిల్ 18:పట్టణంలో కుళాయి కనెక్షన్‌లపై మున్సిపల్ కమిషనర్ ప్రభాత్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. పలు వాణిజ్య భవన సముదాయాలకు గృహ అవసర కుళాయి కనెక్షన్లు పొంది నెలకు రూ. 100 మాత్రమే నీటి పన్ను చెల్లిస్తుండటంపై ఈ నెల 13వ తేదీన ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో ‘కుళాయి కనెక్షన్‌లలో గోల్‌మాల్’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆయా యజమానులకు నోటీసులు జారీ చేశారు. పట్టణంలోని పలు వాణిజ్య భవన సముదాయాలు, హోటళ్లు, డైయింగ్ యూనిట్లు, లాడ్జిలు తదితర సముదాయాలు కమర్షియల్ కుళాయి కనెక్షన్లు పొందాల్సి ఉండగా కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించి గృహ అవసర కుళాయి కనెక్షన్లు పొందారు. దీని కారణంగా మున్సిపాలిటీ లక్షలాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. పత్రికల్లో వార్త ప్రచురితమైన తర్వాత ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్ ప్రభాత్‌కుమార్ కమర్షియల్ కుళాయి కనెక్షన్‌ల జాబితాను తయారు చేయించారు. అందులో చాలా వరకు గృహ అవసరాలకు సంబంధించిన కనెక్షన్లు ఉండటంతో ఆయా యజమానులకు నోటీసులు జారీ చేశారు. గృహ అవసరాలకు సంబంధించిన కుళాయి కనెక్షన్లు పొందిన యజమానులు వెంటనే దాన్ని వాణిజ్య కనెక్షన్‌లుగా మార్చుకోవడంతో పాటు రూ.10 వేల అపరాధ రుసుం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేనిపక్షంలో కుళాయి కనెక్షన్లు తొలగిస్తామని కమిషనర్ తెలిపారు.

* పొలిమేరల్లో ముళ్లకంప వేసి కాకి గ్రామస్థుల నిరసన
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>