సూళ్లూరుపేట, ఏప్రిల్ 19: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట (షార్)ను గురువారం ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ సందర్శించారు. షార్ నుంచి ఈనెల 26వ తేదీన పిఎస్‌ఎల్‌వి- సి19 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. మొదటి ప్రయోగ వేదికపై ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్‌ను ఆయన శాస్తవ్రేత్తలు, షార్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ రాకెట్ ద్వారా 1850 కిలోల బరువుగల మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ రిశాట్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల ద్వారా ఇంత బరువుగల ఉపగ్రహాన్ని ఇస్రో పంపడం ఇదే తొలిసారి. చంద్రయాన్-1 ప్రయోగంలో ఉపయోగించే స్ట్రాపాన్ మోటార్లను ఈ ప్రయోగంలో ఉపయోగించనున్నారు. ఈ ఉపగ్రహం రాడార్‌లో అమర్చిన హై రిజల్యూషన్ కెమెరాల సాయంతో దేశ భూభాగంలో వాతావరణంలో కలిగే మార్పులను ప్రతికూల, అనుకూల పరిస్థితిలోను సంవత్సరం పొడవునా ఛాయాచిత్రాలను తీసి పంపుతుంది. అంతేకాకుండా దేశ సరిహద్దులో ఉగ్రవాదుల కదలికలు, చొరబాటుదారుల కదలికలను కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ప్రయోగాన్ని ఇస్రో పలుసార్లు వాయిదా వేసిన విషయం తెలిసిందే. 26వ తేదీ ఉదయం 5.45గంటలకు ప్రయోగించేందుకు ఇస్రో ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటి వరకు పిఎస్‌ఎల్‌వి ద్వారా మొత్తం 52 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. వీటిలో 26 స్వదేశానికి చెందినవి కాగా, మరో 26 విదేశాలకు చెందినవి. ఈ ఏడాది ఇది తొలి ప్రయోగం కావడంతో ఇస్రో చైర్మన్ ప్రయోగ వేదిక పరిశీలించిన అనంతరం శాస్తవ్రేత్తలతో చర్చించినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట షార్ డైరెక్టర్ చంద్రవదన్ దత్తన్, అసోసియేట్ డైరెక్టర్ శేషగిరిరావు, కంట్రోలర్ భూమా తదితరులు ఉన్నారు.
అత్త వేధింపులు తాళలేక
వివాహిత ఆత్మహత్య
కాపాడేందుకు వెళ్లిన భర్త మృతి
మూడేళ్ల కుమారుడి పరిస్థితి విషమం
నెల్లూరుఅర్బన్, ఏప్రిల్ 19: అత్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం అర్ధరాత్రి స్థానిక సత్యనారాయణపురం టిపి నాయుడుకాలనీలో చోటుచేసుకుంది. మంటల్లో ఉన్న భార్యను కాపాడేందుకు వెళ్లిన భర్త మృతిచెందగా, మూడేళ్ల కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరురూరల్ మండలం కలేపాడు గ్రామానికి చెందిన లేబూరు రమేష్(30), భార్య పల్లిపాడుకు చెందిన మాధవి(25)తో ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నారు. రమేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ రెండవ నగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని సత్యనారాయణపురం టిపి నాయుడుకాలనీలో నివాసం ఉంటున్నారు. వీరితోపాటు మాధవి అత్త కూడా ఉంటోంది. అయితే ఇటీవల నుండి మాధవిని అత్త తరచూ వేధింపులకు గురిచేస్తోంది. ఈక్రమంలో బుధవారం కూడా అనేక విధాలుగా వేధింపులకు గురిచేయడంతో మనస్థాపం చెందిన మాధవి ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోవడంతో గమనించిన భర్త రమేష్ భార్యను కాపాడే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని గాయపడ్డాడు. దగ్గరే ఉన్న కుమారుడు కూడా గాయాలపాలయ్యాడు. భార్యభర్తల కేకలు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి గాయాలపాలైన ముగ్గురిని చికిత్స నిమిత్తం 108లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మాధవి మృతిచెందగా, గురువారం ఉదయం భర్త రమేష్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అలాగే మాధవి కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కోటారెడ్డి, రెండవ నగర ఎస్సై కిషోర్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించిన అనంతరం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం దంపతుల మృతదేహాలను మార్చురి రూమ్‌కు తరలించారు. ఈ సంఘటనపై ఎస్సై కిషోర్‌బాబు మాట్లాడుతూ కేవలం అత్త వేధింపులు తాళలేకే వివాహిత ఆత్మహత్య చేసుకుందని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మాధవి అత్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
జాతీయ రహదారిపై విజిలెన్స్ దాడులు
* ఐదు కంకర లారీలు సీజ్
నెల్లూరుఅర్బన్, ఏప్రిల్ 19: స్థానిక బుజబుజనెల్లూరు జాతీయ రహదారిపై గురువారం ఉదయం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి ఐదు కంకర లారీలను సీజ్ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్స్‌పోర్స్‌మెంట్ ఎస్పీ రామారావు ఆదేశాల మేరకు ఇన్స్‌పెక్టర్లు జాతీయ రహదారిపై దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న ఐదు కంకర లారీలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను ఐదవ నగర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనాలకు లక్షా 50వేల రూపాయలను జరిమానా విధించినట్లు విజిలెన్స్ ఎస్పీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కంకర, ఇసుక తరలిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
‘సామాజిక న్యాయం, రాజ్యాధికారమే నా లక్ష్యం’
ఆత్మకూరు, ఏప్రిల్ 19: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం రాజ్యాధికారమే నాలక్ష్యమని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణమాదిగ అన్నారు. గురువారం ఆత్మకూరు బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లనుంచి ఎస్సీ రిజర్వేషన్‌కు పోరాటం సాగిస్తున్నామని, ఈ పోరాటంలో సామాజిక న్యాయం, రాజ్యాధికారమే నా లక్ష్యమన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన మాదిగల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ విషయంలో అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్త పరిచారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపిస్తే కేంద్రం దాన్ని పట్టించుకోకుండా కమిషన్ వేసిందన్నారు. కమిషన్ విచారణ చేసి ఎ,బి,సిల వర్గీకరణ తప్పని సరి అవసరమని నివేదిక ఇచ్చిందని తెలిపారు. తాను పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నానని ఆయన వద్ద ఉన్న రికార్డులను చూపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 2000-04వరకు ఈ వర్గీకరణను ఆమోదించారని తెలిపారు. అనంతరం 2004లో వర్గీకరణ చేపట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించే సమయంలో జస్టిస్ ఉపామెహ్రా కమిషన్ వేసి 2008 సంవత్సరంలో నివేదికలు కేంద్రానికి పంపించారని తెలిపారు. 2009 సంవత్సరంలో ఎన్నికల సమయంలో వర్గీకరణ తప్పక కల్పిస్తామని సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ హామీలు ఇచ్చారన్నారు. ఎస్సీ వర్గీకరణలో చట్టబద్దంగా జాతీయ పార్టీలన్ని తమకు మద్దతు తెలిపినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ భూములు కోటి ఎకరాలు ఉన్నాయని ఈ భూమిని కోటి మంది కుటుంబ సభ్యులకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు బిఎస్‌ఆర్ సెంటర్ నుంచి మాదిగల యువతతో మోటార్‌బైక్‌లతో మందాకు స్వాగతం పలికారు. బస్టాండ్ సెంటర్‌లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రతి మండల మాదిగ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వింజమూరులో:
వింజమూరు పంచాయతీలోని ఆశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఎమ్మార్పిఎస్ జెండాను రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ గురువారం ఆవిష్కరించారు. దుత్తలూరులో బహిరంగ సభ అనంతరం వింజమూరు బంగ్లాసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాలలు వేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం గతనెల రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల ముందు రిలే నిరాహారదీక్షలు, దిగ్భంధనలు, కలెక్టరేట్ల ముట్టడి చేసినప్పటికి స్పందించని రాష్ట్ర ప్రభుత్వంతో అంతిమంగా తిరుగుబాటు యాత్రకు దిగారు. కృష్ణన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూసిన అశోక్‌నగర్ మాదిగలు జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన ప్రసంగించకపోవడంతో వారు నిరుత్సాహ పడ్డారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
పెంచలకోన అభివృద్ధికి చర్యలు
మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి స్పష్టం
వాకాడు, ఏప్రిల్ 19: రాపూరు మండలం పెంచలకోన గ్రామంలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి తెలిపారు. గురువారం ఆ దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ నెల్లూరు రవీంద్రారెడ్డి మాజీ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవస్థానంకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న 70 మందికి రాజ్యలక్ష్మి సహకారంతో ఇళ్లస్థలాలు మంజూరు కావడంతో ట్రస్ట్ బోర్డు చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆలయంలో పనిచేసే 30 మంది సిబ్బందికి ఇందిరమ్మ పక్కాగృహాలు మంజూరు చేయించాలని కోరగా, నేదురుమల్లి స్పందిస్తూ గృహ నిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌తో చర్చించి పక్కా గృహాలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. రాపూరు మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ పక్కాగృహాలు, నివేశన స్థలాలు, పావలా వడ్డీ రుణాలు, పింఛన్లు అందేలా చూడాలని సూచించారు. రాపూరు మండల నాయకులు పలువురు ఆమెకు పలు సమస్యలను వివరించారు.
6న టిఎస్‌ఆర్ ఆడిటోరియానికి శంకుస్థాపన
* రాజకీయ, సినీ ప్రముఖుల రాక
నెల్లూరు టౌన్, ఏప్రిల్ 19: రాజ్యసభ సభ్యులు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి (టిఎస్‌ఆర్) తన సొంత నిధులు పది కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఏసి ఆడిటోరియంకు వచ్చేనెల 6వ తేదీన భూమి పూజ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అలాగే టి సుబ్బరామిరెడ్డి లలితా కళాపరిషత్ జిల్లా కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గురువారం మధ్యాహ్నం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో టి సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దొడ్ల వరదారెడ్డి మాట్లాడుతూ ఆడిటోరియంతోపాటు ఇతర సేవా కార్యక్రమాలకు కూడా శంకుస్థాపనలు ఉంటాయన్నారు. నెల్లూరు నగరంలోని డిఎస్‌ఆర్, జూబ్లీ ఆసుపత్రులకు వచ్చే రోగుల సహాయకుల కోసం షెల్టర్లను నిర్మిస్తామని గత అక్టోబర్‌లో రాఘవ సినీ మల్టీఫ్లెక్స్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో కళాబంధు టిఎస్‌ఆర్ హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ నెరవేర్చడంలో భాగంగా ఆరవ తేదీన పై మూడు కార్యక్రమాలకు శంకు స్థాపనలుంటాయన్నారు. ఈ కార్యక్రమాలకు పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు తరలి రానున్నట్లు వెల్లడించారు. టిఎస్‌ఆర్ లలితా కళాపరిషత్ ఏసి ఆడిటోరియంను స్థానిక కస్తూరిదేవి విద్యాలయ ప్రాంగణంలో నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ఆడిటోరియంలో తొమ్మిది వందల మంది ప్రేక్షకులు ఆశీనులయ్యేలా సౌకర్యవంతంగా నిర్మిస్తున్నట్లు వివరించారు. ఆడిటోరియంను నిర్మించిన అనంతరం స్థలదాతగా ఉన్న కస్తూర్భా విద్యాలయ, టి సుబ్బరామిరెడ్డి లలితా కళాపరిషత్ నెల్లూరుజిల్లా కమిటీలే పరస్ఫర అవగాహనతో భవిష్యత్‌లో నిర్వహించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అంతేతప్ప నిర్మాణ క్రమం పూరె్తై ప్రారంభోత్సవ అనంతరం టిఎస్‌ఆర్ ఆధిపత్యం వహించబోరని స్పష్టం చేశారు. పూర్తిగా ప్రజలకు అంకితమయ్యేవిధంగానే ఇలాంటి సేవా కార్యక్రమాల్ని ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లా కేంద్రాల్లో చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా డిఎస్‌ఆర్ ఆసుపత్రిలో ఎనభైమంది రోగుల సహాయకులకు, జూబ్లీ ఆసుపత్రిలో పాతిక మంది రోగుల సహాయకులు ఉండేలా రెండు కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న షెల్టర్లను కూడా నిర్మించిన అనంతరం ఆయా ఆసుపత్రులకే అప్పగిస్తామన్నారు. అదేవిధంగా జిల్లాలోని వికలాంగులకు టిఎస్‌ఆర్ సేవాపీఠం ఆధ్వర్యంలో వీల్‌చైర్లు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్కోటి ఏడు వేల రూపాయల విలువైన వీల్ చైర్లను పొందేందుకు వికలాంగులు తమ ధృవీకరణపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. అదేవిధంగా దళితవాడల్లో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కూడా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. షెల్టర్ల శంకుస్థాపనకు రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళీమోహన్, జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరవుతున్నారన్నారు. ఆడిటోరియం శంఖుస్థాపన కార్యక్రమానికి వీరితో సహా సినీ నటులు అక్కినేని నాగేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, మోహన్‌బాబు, జయసుద, జయప్రద, తాప్సి, సినీ రచయతలు పరచూరి సోదరులు పాల్గొంటారన్నారు. విలేఖర్ల సమావేశంలో టి సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ జిల్లా కమిటీ అధ్యక్షులు జెవి రెడ్డి కూడా వివిధ అంశాలు వివరించారు.
రూ. 115కోట్ల ధాన్యం కొనుగోలు
* జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ వెల్లడి
నెల్లూరు టౌన్, ఏప్రిల్ 19: నెల్లూరుజిల్లా పరిధిలో ఇప్పటి వరకు 115.27 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం ప్రభుత్వం తరపున ఏర్పాటైన కొనుగోలు కేంద్రాల ద్వారా స్వీకరించినట్లు కలెక్టర్ బి శ్రీ్ధర్ వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక గోల్డెన్‌జూబ్లిహాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది కేవలం మూడు కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని మాత్రమే సేకరించడం జరిగిందన్నారు. అయితే ఈ సంవత్సరం రైతుల్లో అనూహ్యంగా చైతన్యం కలిగి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతుధర పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు 30లక్షల గోతాలు ధాన్యం నింపి కొనుగోలు కేంద్రాలకు అందించేందుకు రైతులకు అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మరో ఐదులక్షల గోతాలు అవసరమైన చోట పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం వంద ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అందులో 66 ఇందిరాక్రాంతిపథం ద్వారా, మరో 34 ప్రాధమిక సహకార సంఘాల నేతృత్వంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కేంద్రాలను నిర్వహించే సిబ్బందికి జనవరి నెలలోనే తగు శిక్షణా కార్యక్రమాన్ని కూడా ఇచ్చినట్లు తెలిపారు. కేవలం రెండు నెలల వ్యవధిలో నిర్వహించిన ఈ కార్యక్రమం వల్ల ఇందిరాక్రాంతిపథం సిబ్బంది సేకరించిన సుమారు ఎనభై కోట్ల రూపాయల ధాన్యానికి రెండుశాతం కమిషన్ రూపేణా కోటి అరవై లక్షల రూపాయల వరకు సంబంధిత పొదుపుమహిళలకు అందుతున్నట్లు లెక్కలు చెప్పారు. ఇదిలాఉంటే జిల్లా పరిధిలో ప్రతి సీజన్ పరిధిలో 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. ఇందుకు తగినంత నిల్వ సామర్ధ్యం కల రీతిలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ)గోదాములు అందుబాటులో లేవన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా 30 నుంచి నలభై టన్నుల సామర్ధ్యంతో నిల్వ చేసుకునే గోదాముల ఏర్పాటుకై 15 ఎకరాల వంతున జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో స్థలాలు సమకూర్చినట్లు తెలిపారు. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం, బోగోలు మండలం బిట్రగుంట, మనుబోలు మండలం బండేపల్లి, వెంకటాచలం మండలం కంటేపల్లిల్లో ఈ గోదాములను నిర్మించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇందిరాక్రాంతిపథం, పౌరసరఫరా సంస్థలు సంయుక్తంగా జిల్లాలోని 85 ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగువేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కల గ్రామీణ గోదాముల నిర్మాణానికి కూడా శ్రీకారం చుడుతున్నట్లు వివరణ ఇచ్చారు. జిల్లాకు పొరుగున ఉన్న ఏర్పేడు, రేణిగుంట, చిత్తూరుల వద్ద ఉన్న గిడ్డంగులకు ఇక్కడ నుంచి లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ చేసేలా అవకాశం తీసుకున్నామన్నారు. అలాగే భారత ఆహార సంస్థ గిడ్డంగుల నుంచి బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నెలకు కనీసం 15 గూడ్స్ రైళ్లను కేటాయించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఎఫ్‌సిఐ సీనియర్ రీజనల్ మేనేజర్‌లకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. గోతాల కోసం రైతులు ఎగబడుతున్నారు అంటేనే కనీస మద్దతు ధర సఫలీకృతమయ్యేలా తమ చర్యలు ఉంటున్నట్లుగా అర్ధం చేసుకోవ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ రైతులు కనీస మద్దతుధర పొందకుండా విఘాతం కలిగిస్తున్న మూడు రైస్ మిల్లులు, 12 మంది దళారులపై కేసులు బనాయించినట్లు చెప్పారు. విలేఖర్ల సమావేశంలో ఇంకా డిఆర్‌డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట సుబ్బయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి జి ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
తీరంలో నక్షత్రపుతాబేళ్ల విడుదల
నెల్లూరు టౌన్, ఏప్రిల్ 19: జిల్లాలోని విడవలూరు మండలం రామతీర్ధం సముద్రతీర ప్రాంతం వద్ద నక్షత్రపుతాబేళ్లపిల్లల్ని గురువారం అటవీ అధికారులు విడుదల చేశారు. ప్రతి ఏటా జనవరి నెలలో నక్షత్రపుతాబేళ్ల నుంచి గుడ్లు విడుదలవుతుంటాయి. సముద్రతీర ఇసుక తినె్నల్లో ఉండే ఈ గుడ్లు కాస్తా కుక్కలు, నక్కలు, మత్స్యకారుల కాళ్లకింద పడి ధ్వంసమవుతుండటం పరిపాటి. అయితే వీటిని సంరక్షించి తాబేలు పిల్లలుగా తిరిగి సముద్రంలోకి చేర్చేలా అటవీ యంత్రాంగంతో సహా ట్రీ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కూడా కృషి చేస్తోంది. దీని కోసం జిల్లాలోని సముద్రతీర గ్రామాలైన రామచంద్రాపురం, లక్ష్మీపురం, మైపాడు, ఇసక్కపల్లిల్లో హేచరీలు కూడా ఏర్పాటయ్యాయి. కార్యక్రమంలో భాగంగా జిల్లా అటవీ అధికారి ఎన్ నాగేశ్వరరావుమాట్లాడుతూ ఈ ఏడాది మొత్తం 11,609 గుడ్లను సేకరించామన్నారు. అందులో ఇప్పటి వరకు 8.667 తాబేలు పిల్లల్ని తిరిగి కడలిలో కలిసేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు. కార్యక్రమంలో అటవీ అదనపుప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వేటర్ సి బెనర్జీ, తెలుగుగంగ డిఎఫ్‌ఓ పి జయచంద్రారెడ్డి, చెన్నైకు చెందిన ట్రీ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ సుప్రజ ధరణి, తదితరులు పాల్గొన్నారు.
సినిమా వసూళ్లపై రచ్చ
నెల్లూరుసిటీ, ఏప్రిల్ 19: ప్రిన్స్ మహేష్‌బాబు, చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ అభిమానుల గొడవతో గురువారం నెల్లూరు నగరంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. సినిమా వసూళ్ల విషయంలో మొదలైన వివాదం ఘర్షణకు దారి తీసింది. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోవటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. రామ్‌చరణ్ నటించిన రచ్చ సినిమా కలెక్షన్లతో కూడిన ఫ్లెక్సీలను చిరంజీవి అభిమానులు నర్తకి సెంటర్‌లో ఏర్పాటు చేశారు. దీంతో మహేష్‌బాబు అభిమానులు ఒక అడుగు ముందు వేసి బిజినెస్‌మేన్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఏ సినిమాకు రాలేదంటూ పోటీగా మహేష్‌బాబు సినిమా రికార్డుల వివరాలను తెలియచేస్తూ ఫెక్సీలను ఏర్పాటు చేశారు. గురువారం ఇద్దరు నటుల అభిమానులు నర్తకి సెంటర్‌లో చేరి కలెక్షన్ల గురించి వాదనకు దిగారు. మాటల యుద్ధం ముదిరి చివరకు ముష్టి యుద్ధానికి దిగారు. చిరంజీవి అభిమానులు మహేష్‌బాబు ఫ్లెక్సీలను చించడంతో గొడవ పెద్దదయింది. పోటీగా మహేష్ అభిమానులు కూడా రచ్చ ఫ్లెక్సీలను చించేశారు. ఈ విషయం తెలుసుకున్న 3నగర ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని ఇరువురు అభిమానులను చెల్లాచెదురు చేశారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి సినిమా రికార్డుల రచ్చను అదుపు చేయకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది.
తెగిన ఓహెచ్‌ఇ విద్యుత్ లైన్
ఆగిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు
గుమ్మడిపూడి నుంచి వెనుదిరిగిన మెమూ రైళ్లు
సూళ్లూరుపేట, ఏప్రిల్ 19: దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాలెంలో గురువారం గూడ్సు రైలు తగిలి ఓహెచ్‌ఇ విద్యుత్ లైన్ తెగడంతో చెన్నై నుంచి విజయవాడ-హైదరాబాద్ వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు బిట్రగుంట ప్యాసింజర్ రైలు రాత్రి 10.30గంటల వరకు సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూరప్రాంతాలకు వెళ్లే వారు కనీసం తాగునీరు దొరక్క అవస్థలు పడ్డారు. సాయంత్రం హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ వెళ్లిన తరువాత ఈ సంఘటన జరిగింది. దాని వెనుకనే వెళ్లిన బిట్రగుంట ప్యాసింజర్ రైలును సూళ్లూరుపేట సమీపంలోని కోటపోలూరు రైల్వేగేటు వద్ద ఆపివేశారు. దీంతో రాత్రి పదిగంటల వరకు ఆ గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌లో సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. అదేవిధంగా అక్కంపేట సమీపంలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపివేశారు. చెన్నై నుంచి సూళ్లూరుపేట వచ్చే లోకల్ మెమూ రైళ్లను గుమ్మడిపూడి నుంచి చెన్నైకు మళ్లించారు. గూడూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే సింహపురి ఎక్స్‌ప్రెస్‌కు రిజర్వేషన్ చేయించుకున్న వారు రైల్వే అధికారులతో వాగ్వివాదానికి దిగారు. రైళ్లు పంపడం ఆలస్యం అవుతుంది, బస్సులకు వెళ్లి సింహపురి ఎక్స్‌ప్రెస్‌కు వెళ్లండని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో కొందరు రైళ్లు దిగి బస్సుల్లో వెళ్లాల్సి వచ్చింది. సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ నుంచి రైల్వే సిబ్బందిని పంపించి విద్యుత్ లైన్‌కు మరమ్మతులు చేయించారు. రాత్రి 10.30గంటల వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ తడ-దొరవారిసత్రం మధ్యలో నిలిచిపోయాయి.