Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గిట్టుబాటు ధర కరవు!

$
0
0

చీరాల, ఏప్రిల్ 19: ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడిపోతున్నారు. ఒకవైపు అకాల వర్షాలకు పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోగా మరోవైపు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది. గత ఏడాది డిసెంబర్, ఈ సంవత్సరం జనవరి నెలలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గింది. కారంచేడు, పర్చూరు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు, యద్దనపూడి, వేటపాలెం, చీరాల ప్రాంతాలలో ఎక్కువగా రైతులు వరి సాగుపై ఆధారపడి జీవిస్తుంటారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెట్టుబడులు పెరిగిపోయాయి. ఒక్క కారంచేడు మండలంలోనే 25 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఒక్కో ఎకరానికి రూ. 20 వేల నుంచి 25 వేల వరకు ఖర్చు చేశారు. దిగుబడి 30 క్వింటాళ్ళ నుంచి 40 క్వింటాళ్ళ వరకు వస్తుందని ఆశించిన అన్నదాతలకు అకాల వర్షాలు దెబ్బతీశాయి. ఎకరాకు 20 నుంచి 30 క్వింటాళ్ళ వరకు మించి దిగుబడి రావటం లేదని వాపోతున్నారు. ఇదిలావుండగా గిట్టుబాటు ధరలు లేకపోవటంతో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. 2010-11 సంవత్సరంలో పండించిన ధాన్యంలో 50 శాతం నేటికీ పురుల్లోనే మూలుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త ధాన్యం వస్తుండటంతో నిల్వలు చేసుకునేందుకు గోదాములలో స్థలాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేక రైతులు బేజారవుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో క్వింటాకు 1350 రూపాయల వరకు ధర పలికింది. ఆయన మరణానంతరం ధాన్యం ధరలు గణనీయంగా పతనమయ్యాయి. ప్రస్తుతం 700 నుంచి 800 రూపాయల వరకు మాత్రమే ధరలు ఉన్నాయి. అవి కూడా దళారుల కనుసన్నలలోనే నడుస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ధాన్యం తీసుకెళ్ళిన నెలకు గాని డబ్బులు ఇవ్వటం లేదని, ఒక్కోసారి వచ్చినకాడికి అమ్ముకోవాలని చూసినా కొనేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి
వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో కారంచేడు ప్రాంతంలో అత్యధికంగా రైతులు వరిని సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు. గడచిన మూడేళ్ళలో ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గిట్టుబాటు ధరలు కల్పించాలని ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేసి రోడ్లపై ధాన్యం పోసి తగులబెట్టినా ప్రభుత్వం స్పందించడంలేదు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

25న ఒంగోలుకు చంద్రబాబు రాక
ఒంగోలు, ఏప్రిల్ 19: త్వరలో ఒంగోలు ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 25వ తేదీన నగరంలో పర్యటించనున్నారు. ఆమేరకు జిల్లా పార్టీ కార్యాలయానికి సమాచారం అందింది. అదేరోజు ఉదయం పది గంటలకు కార్యకర్తల సమావేశంలో బాబు పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలులో జరిగే రోడ్ షోలో పాల్గొననున్నారు. ప్రధానంగా చంద్రబాబు నగరంపైనే దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఆయన పర్యటన మొత్తం నగరంలోనే సాగనుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇటీవల నిర్వహించిన సర్వేలో కొత్తపట్నం మండలంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రానుండగా, ఒంగోలు రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీ పటిష్ఠంగా ఉంది. కొత్తపట్నం మండలంపై టిడిపి నేతలు ప్రత్యేక దృష్టిసారించి అక్కడ కూడా పార్టీకి మెజార్టీ తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రధానంగా నగరంపైనే నేతలు దృష్టిపెట్టారు. నగరంలో ఎంత మెజార్టీ సాధిస్తే ఆ మెజార్టీతో విజయం సాధించవచ్చునన్న ధీమాలో పార్టీశ్రేణులు ఉన్నాయి. అందులో భాగంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ముందునుండే వార్డులవారీగా కమిటీలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఇదిలాఉండగా ఒంగోలు నియోజకవర్గంలో తిరిగి పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు నేతలు సమష్టిగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు నియోజకవర్గ ఉప ఎన్నిక బాధ్యతలను తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తికి అప్పగించారు. జిల్లాలోని ముఖ్యనేతలందరూ నియోజకవర్గంలో తిష్ట వేయనున్నారు. ఒంగోలు ఉపఎన్నికకు సహాయ కో ఆర్డినేటర్‌గా మాజీ శాసనసభ్యుడు ఈదర హరిబాబు, కొత్తపట్నం మండల బాధ్యులుగా మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డి, ఒంగోలు నగరానికి నగర పార్టీ అధ్యక్షుడు బొల్లినేని వాసుకృష్ణ, ఒంగోలు రూరల్ మండలానికి నలమోతు గంగాధర్‌లను నియమించారు. కొత్తపట్నం మండలంలో ఒక సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువగా ఉండటంతో ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు కందులను రంగంలోకి దింపారు. ఎన్నికల కార్యాచరణ పర్యవేక్షణ కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీలో కొండెపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డోలా బాలవీరాంజనేయస్వామి, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య, అద్దంకి నియోజకవర్గ కో ఆర్డినేటర్ నాగినేని రామకృష్ణ, జిల్లాపార్టీ ప్రధాన కార్యదర్శి యర్రాకుల శ్రీనివాసరావు, కొండెపి మండల పార్టీ అధ్యక్షుడు గొర్రెపాటి శ్రీనివాసరావులు ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి కార్యక్రమాల నిర్వహణ కమిటీలో రాష్ట్ర తెలుగురైతు ప్రధానకార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్‌సి సెల్ అధ్యక్షుడు కొమ్మూరి రవిచంద్ర, రాష్ట్ర పార్టీ కార్యదర్శి టి అరుణ, మాజీ ఎఎంసి ఛైర్మన్ మారెళ్ళ వివేకనంద, ఒంగోలు మాజీ మునిసిపల్ చైర్మన్ యక్కల తులసీరావులు ఉన్నారు.

అప్రకటిత విద్యుత్ కోతలు
ఒంగోలు, ఏప్రిల్ 19: అప్రకటిత విద్యుత్ కోతలతో జిల్లాప్రజలు విలవిల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తటంతో గత రెండు రోజుల నుండి అప్రకటిత విద్యుత్‌కోతలను ట్రాన్స్‌కో అధికారులు విధిస్తున్నారు. జిల్లాలో ఎప్పుడు విద్యుత్ ఉంటుందో ఎప్పుడు పోతుందో కనీసం ట్రాన్స్‌కో అధికారులకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నగరంలో ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు, మున్సిపాలిటీలు, మండలాలకు ఆరు గంటలపాటు కోతలను విధిస్తున్నారు. కాని ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో భారీగా విద్యుత్ కోతలను విధిస్తుండటంతో జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఒంగోలు నగరం పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగు గంటలతో పాటు మరో మూడు గంటలు అదనంగా అప్రకటిత విద్యుత్‌కోతలను విధిస్తుండటంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా నగర ప్రజల పరిస్థితి ఈవిధంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడంలేదు. ఉదయం నుండి గ్రామాల్లో అసలు విద్యుత్ ఉండదు. అలాగే రాత్రివేళల్లో అప్రకటిత విద్యుత్‌కోతలు విధిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు చిమ్మచీకట్లో గడపాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతుండటంతో పంచాయతీల్లో వీధిలైట్లు వేసే నాథుడే కరవయ్యారు. దీంతో గ్రామీణప్రాంత ప్రజల అవస్థలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికి ఆచరణలో మాత్రం అమలుకాకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసే ఉచిత విద్యుత్ నాలుగు విడతలుగా అరకొరగా సరఫరా చేస్తుండటంతో రైతులు పొలాల్లోనే జాగరణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలోని పండ్లతోటలు ఎండుముఖం పడుతున్నాయి. ఓపక్క జిల్లావ్యాప్తంగా ఎండలు మండుతుంటే మరొకపక్క విద్యుత్‌కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోస్తాతీర ప్రాంతంలోని వేరుశనగ రైతులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నారు. వేరుశనగ పంట కూడా వాడుముఖం పట్టే దశకు చేరుకుంటోంది. అదేవిధంగా తీరప్రాంతంలోని వేలాది ఎకరాల్లో ఉప్పు సాగవుతోంది. ఆ రైతులకు కూడా విద్యుత్ సక్రమంగా అందకపోవటంతో ఉప్పు దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. మొత్తమీద అప్రకటిత విద్యుత్ కోతలతో జిల్లాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జ్వరపీడితులను పరామర్శించిన ఆర్డీఓ
జ్వరాలు తగ్గేవరకు వైద్యశిబిరం
20 మందికి తీవ్రమైన జ్వరం
పెద్దారవీడు, ఏప్రిల్ 19: మండలంలోని బోయదగుంపుల పంచాయతీలోని కర్రోల గ్రామంలో ప్రబలిన విషజ్వరాల బాధితులను మార్కాపురం ఆర్డీఓ ఎం రాఘవరావు గురువారం పరామర్శించారు. సుమారు 100మంది వరకు జ్వరాలు సోకి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వైద్యసిబ్బంది ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. అధికంగా దళితులకు విషజ్వరాలు సోకడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల మాచర్ల ప్రాంతంలో కూలి పనులకు వలసలు వెళ్ళి తిరిగి వచ్చిన దళితులకు విషజ్వరాలు సోకాయి. జ్వరంతోపాటు ఒళ్ళునొప్పులు, వాంతులు, విరోచనాలు కూడా అవుతుండడంతో కొంతమంది ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దదోర్నాల ఎస్‌పిహెచ్‌ఓ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చట్లమిట్ల వైద్యాధికారి ఓ అన్వర్‌భాషాతోపాటు వైద్యసిబ్బంది వైద్యసేవలు అందిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను చేపట్టి మురికి కాలువలపై ఎబెట్ మందులను ఎస్‌సిఓ ఎం పిచ్చయ్య చల్లిస్తున్నారు. సున్నం, బ్లీచింగ్ మందులను రోడ్లకు ఇరువైపులా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీమన్నారాయణ, పంచాయతీ కార్యదర్శి పవన్‌కుమార్‌లు పర్యవేక్షిస్తున్నారు. విషజ్వరాలు సుమారు 100మందికి సోకగా గురువారం 60మందికి వైద్యసేవలు అందించి రక్తనామూనాలతోపాటు నీటిని పరీక్షల కొరకు పంపారు. వీరిలో 20మందికి వైరస్ ఫీవర్ సోకినట్లు వైద్యులు తెలిపారు. మరో 40మంది మార్కాపురం, పెద్దదోర్నాల, ఇతర ప్రాంతాల్లో ప్రైవేటు వైద్యశాలలో చికిత్సలు పొందుతున్నారు. ఈసందర్భంగా మార్కాపురం ఆర్డీఓ ఎం రాఘవరావు మాట్లాడుతూ జ్వరాలు తగ్గుముఖం పట్టే వరకు వైద్యశిబిరం కొనసాగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు వైద్యశిబిరాలను పర్యవేక్షించాలని ఎస్‌పిహెచ్‌ఓ డాక్టర్ చంద్రశేఖర్, తహశీల్దార్ రాజరాజేశ్వరిని ఆదేశించారు. వారం రోజులుగా జ్వరాలు సోకి ఇబ్బందులకు గురవుతున్నా, వైద్యసిబ్బంది వచ్చి వైద్యసేవలు అందించిన దాఖలాలు లేవని గ్రామస్థులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ రాజరాజేశ్వరి, ఐసిడిఎస్ పిఓ ఎస్‌కె రమిజాభాను, డిఎల్‌పిఓ వెంకటేశ్వరరావు, డాక్టర్లు సురేంద్రతోపాటు సూపర్‌వైజర్లు భాషా నాయక్, సంతోషమ్మ, ఎఎన్‌ఎంలు 5మంది, ల్యాబ్ టెక్నీషియన్ నవీన్, విఆర్‌ఓ ప్రభుదాసు, సూపర్‌వైజర్ లలితసలోమి, నైస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కె శ్యాంసన్, అంగన్‌వాడీ కార్యకర్త వనజమ్మ, ఆరోగ్య మిత్ర శంబయ్య తదితరులు జ్వరపీడితులకు సేవలు అందిస్తున్నారు.

దామచర్ల విజయం ఖాయం
మెజార్టీపై దృష్టి సారించండి
టిడిపి శ్రేణులకు కరణం పిలుపు
ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 19: త్వరలో జరగనున్న ఒంగోలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దామచర్ల జనార్దన్ విజయం ఖాయమని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు మెజార్టీపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల కమిటీల సమావేశం గురువారం స్థానిక సాయి గార్డెన్ ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కరణం బలరాం మాట్లాడుతూ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందటం ఖాయమన్నారు. విభేదాలు ఉంటే పక్కనపెట్టి దామచర్ల గెలుపునకు కృషి చేయాలన్నారు. గత ఎన్నికల్లో దొంగ ఓట్లతో బాలినేని గెలిచారని, ఇటీవల 40 వేలకు పైగా దొంగ ఓట్లు తొలగించారన్నారు. బూత్‌లవారీగా ఓటర్లను గుర్తుపెట్టుకునే విధంగా కార్యకర్తలు తయారుకావాలన్నారు. గత నెల 29న పార్టీ ఆవిర్భావం సందర్భంగా మంచి కదలిక వచ్చిందన్నారు. ఒంగోలు ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఒంగోలు రూపురేఖలు మారాయని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేశామన్నారు. అధికార పార్టీ నాయకులు సమస్యలను గాలికి వదిలేసి కుర్చీలకోసం కొట్టుకుంటున్నారన్నారు. కోటీశ్వరులకు తెల్లరేషన్ కార్డులు ఎందుకు పంపిణీ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు రాజా మాస్టారూ మాట్లాడుతూ జగన్ అధికార దాహం వల్లే ఎన్నికలు వచ్చాయన్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారన్నారు. జగన్ అధికారం చేపడితే భావితరాలు మనల్ని క్షమించరన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. అవినీతి రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు తప్పనిసరిగా నెరవేరుస్తానని స్పష్టం చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడంలో బాలినేని ఘోరంగా విఫలం చెందారన్నారు. వాన్‌పిక్ భూములను అప్పనంగా లాక్కున్నారని, పేదలకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేశారని బాలినేనిపై ధ్వజమెత్తారు. ఒంగోలు మాజీ శాసనసభ్యుడు ఈదర హరిబాబు మాట్లాడుతూ కార్యకర్తలు అపోహలు వదిలి సమష్టిగా దామచర్ల గెలుపునకు కృషి చేయాలన్నారు. గత ఎన్నికల్లో తనకు ప్రచారం చేసే సమయం చాలకపోవడంవల్లే ఓటమి చెందామన్నారు. గెలిస్తే పార్టీకి, కార్యకర్తలకు బలమన్నారు. పట్టుదల ముఖ్యమని శుక్రవారం నుండి ఎన్నికల దీక్షను ప్రారంభించాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. అనంతరం శాసనమండలి సభ్యుడు శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి దామచర్ల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో ఒంగోలును కైవసం చేసుకుంటే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఈ ప్రభావం స్పష్టంగా ఉంటుందని, ఆదిశగా పార్టీశ్రేణులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాపార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లంకా దినకర్, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నం శ్రీ్ధర్, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డోలా బాలవీరాంజనేయస్వామి, కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి దివి శివరాం, గిద్దలూరు ఇన్‌చార్జి పిడతల సాయికల్పనారెడ్డి, జిల్లాపార్టీ అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మంలు మాట్లాడుతూ దామచర్ల గెలుపే ధ్యేయంగా ప్రతిఒక్కరు కృషి చేయాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి టి అరుణ, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు తమ్మిశెట్టి రమాదేవి, ఒంగోలు నగర అధ్యక్షులు బొల్లినేని వాసుకృష్ణ, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య, నాయకులు యక్కల తులసీరావు, మారెళ్ల వివేకానంద, బొమ్మినేని మురళీకృష్ణ, కొఠారి నాగేశ్వరరావు, పల్లపోతు వెంకటేశ్వర్లు, దాసరి వెంకటేశ్వర్లు, మహిళా నాయకులు ఆర్ల వెంకటరత్నం, అనంతమ్మ, ఆరె రత్నకుమారి, ఎల్‌టి భవాని తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జామాయిల్ తోటలు దగ్ధం
20 లక్షల ఆస్తి నష్టం
ముండ్లమూరు, ఏప్రిల్ 19: మండలంలోని వేంపాడు, పోలవరం గ్రామాలకు చెందిన 50 ఎకరాల జామాయిల్ తోటలు గురువారం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటనలో 20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఆయా గ్రామాలకు చెందిన మేదరమెట్ల బాపనయ్య 9 ఎకరాలు, మేదరమెట్ల కొండలరావు 4 ఎకరాలు, ముప్పాళ్ళ కోటేశ్వరరావు 5 ఎకరాలు, కొర్రపాటి రవికుమార్ 10 ఎకరాలు, చాగంటి హనుమంతురావు 18 ఎకరాలు, మేదరమెట్ల సుబ్బారావుకు చెందిన జామాయిల్ తోటలు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ రైతులందరు సత్తెనపల్లిలో జరిగే దశదిన కర్మ కార్యక్రమానికి వెళ్ళారు. విషయం తెలిసిన వెంటనే అక్కడి నుండి వచ్చే సరికే అగ్నికి ఆహుతయ్యాయి. చేతికంది వచ్చే తోటలతో అప్పులను తీర్చుకుందామనుకున్న సమయంలో ఇలా జరగడంతో దిక్కుతోచని స్థితిలో బాధిత రైతులు ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారులు తమకు తగిన సహాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.

దత్తాత్రేయ కాలనీ ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలి
ఒంగోలు, ఏప్రిల్ 19: ఒంగోలులోని దత్తాత్రేయ కాలనీ గిరిజన కుటుంబాల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని సిపిఐ ఒంగోలు నగర కార్యదర్శి యు ప్రకాశరావు డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ ఒంగోలు నగర సమితి ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక సిపిఐ కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించచారు. ప్రదర్శనకు వచ్చిన సిపిఐ నాయకులు, పేదలను కలెక్టరేట్ కార్యాలయంలోకి అనుమతించకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఒంగోలు నగర కార్యదర్శి యు ప్రకాశరావు మాట్లాడుతూ గతంలో బాలాజీ నగరంలో ఉన్న పాడుబడిన రైలు పట్టాలపైన వందకుపైగా గిరిజన కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారన్నారు. అప్పటికి కలెక్టర్ టి కృష్ణబాబు ఆధ్వర్యంలో పాత రైలు పట్టాలు అభివృద్ధి చేయాలని, అక్కడి నుండి తొలగించి భక్తులవారికుంట, పక్కన ఉన్న 76/1 శాతం, 76/213 సర్వేనెంబర్ స్థలంలో వారి నివాసానికి ఏర్పాటు చేశారన్నారు. కాని అప్పటి నుండి అధికారులు వచ్చి పోయారేకాని వారి గురించి పట్టింవచుకున్న నాధుడే లేరన్నారు. కాని ఒంగోలు మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, కరెంటు, రోడ్లు, తాగునీటి సౌకర్యం కొంతమేర ఏర్పాటు చేశారన్నారు. అయితే వారికి ఎలాంటి ఇండ్లస్థల పట్టాలు ఇవ్వలేదని, పొజిషన్ సర్ట్ఫికేట్ ఇవ్వకపోవడంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కోల్పోయారని తెలిపారు. ఈసందర్భంగా డిఆర్‌డిఎ పిడి పద్మజ ధర్నానుద్దేశించి మాట్లాడుతూ ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎస్‌డి సర్దార్, పివిఆర్ చౌదరి, చినిగే సుబ్బారావు, గోగినేని వసంత్, నల్లూరి మురళి, కల్లూరి లక్ష్మయ్య, కృష్ణయ్య, శ్రీదేవి, కుమారి, శ్రీను, రాఘవయ్య, రమణమ్మ, సుజాత, శివమ్మ, లక్ష్మి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

నలుగురు చిన్నారులకు డెంగ్యూ లక్షణాలు!
మార్కాపురంరూరల్, ఏప్రిల్ 19: మార్కాపురం పట్టణంలోని తూర్పువీధిలో నలుగురు చిన్నారులకు డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు హుటాహుటీన గుంటూరు, విజయవాడ వైద్యశాలలకు తరలించారు. గత రెండురోజుల నుంచి తూర్పువీధిలో నివాసం ఉంటున్న బత్తుల పుల్లారెడ్డి (5), కె మోహన్‌రెడ్డి (6), డి శివసాయిరెడ్డి (10), డి శ్రీనివాసులరెడ్డి (9)లకు తీవ్రమైన జ్వరాలు ఉండగా పరీక్షలు నిర్వహించడంతో డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో బుధవారం రాత్రి వీరి తల్లిదండ్రులు మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడలోని ప్రైవేటు వైద్యశాలలకు తరలించారు. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
పెద్దారవీడులో...
పెద్దారవీడు: పెద్దారవీడు మండలంలోని ఎస్‌కొత్తపల్లి, పెద్దారవీడు గ్రామాల్లో ఇద్దరికి డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో మెరుగైన వైద్యం కొరకు విజయవాడ, గుంటూరుకు తరలించారు. ఎస్‌కొత్తపల్లి గ్రామానికి చెందిన తాళ్ళ యల్లయ్య (17) ఇంటర్ చదివే విద్యార్థికి జ్వరం రావడంతో మార్కాపురం ప్రైవేటు వైద్యశాలలో పరీక్షల అనంతరం డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. అలాగే పెద్దారవీడులో గొట్టం లోకనాధ్‌రెడ్డి (1) బాలుడికి డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో మెరుగైన వైద్యం కొరకు విజయవాడకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంపిడిఓ ఎ ప్రభాకర్‌రెడ్డి గురువారం కర్రోల గ్రామానికి వెళ్ళి జ్వరపీడితులను పరామర్శించారు. పారిశుద్ధ్య పనులను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

* పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు * ఆందోళనలో అన్నదాతలు
english title: 
remunerative price

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>