రామచంద్రపురం, ఏప్రిల్ 20: గ్రామాల నుండి పట్టణాలకు వలసలు తగ్గించాలని, గ్రామీణులకు కనీస వేతనం దక్కించాలన్న తపనతో యుపిఎ ఛైర్‌పర్సన్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఇటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన ఇతర పార్టీల నాయకులకు రాలేదన్న విషయాన్ని గుర్తించాలని కేంద్ర మంత్రి వాయలార్ రవి పేర్కొన్నారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి ఈ పథకాన్ని తనదిగా చెప్పుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేసారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలోని మార్కెట్ కమిటీ ప్రాంగణంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం గురువారం జిల్లా పార్టీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు వాయలార్ రవి ఆంగ్లంలో ప్రసంగించగా, అమలాపురం ఎంపి జివి హర్షకుమార్ ఆంధ్రానువాదం చేసారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ త్యాగధనుల కుటుంబం నుండి వచ్చిన సోనియాగాంధీ ఇందిర, రాజీవ్‌గాంధీల్లా పేద ప్రజానీకాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్న విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలన్నారు. ఎంపిలు సోనియాను పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఎంపిక చేసినప్పటికీ, ప్రధాన మంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించి, ఆర్ధిక నిపుణుడైన మన్మోహన్ సింగ్‌ను ఎంపిక చేసారన్నారు. ప్రపంచ చరిత్రలో అత్యున్నత పదవిని వద్దనుకుని, మరొకరిని అందలం ఎక్కించిన ఏకైక మహిళ సోనియా ఒక్కరేనన్నారు. చాలా మంది ముఖ్యమంత్రి పదవులను కోరుకుంటారని, వారికి ఆ స్థాయి కల్పించిన కాంగ్రెస్ పార్టీని వదులుకుని, ముఖ్యమంత్రి పీఠం కోసం నూతన పార్టీని ఏర్పాటు చేసి, సిఎం కావాలన్న ఆకాంక్షతో వస్తున్న నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. స్వర్గీయ ఇందిరాగాంధీని ఇంకా స్మరిస్తున్నామంటే పేద, బడుగు వర్గాల ప్రజానీకానికి ఆమె అందించిన సేవలే తార్కాణమన్నారు. అదే రీతిలో సోనియా గాంధీ నడుస్తున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిని పార్టీ మార్చమని ఎవరైనా అడిగారా?.. రాజీనామా చేసే ముందు ప్రజలతో సంప్రదించారా?.. మళ్లీ ఎన్నికలలో నిలబడి ఓటేయమని అడిగేందుకు వచ్చిన సమయంలో ప్రజలు నిలదీయాలని పిలుపునిస్తూ.. పిల్ల చేష్టలు మానుకోవాలని హితవుపలికారు. దేశంలో ఆహార భద్రత పథకాన్ని, నిర్భంధ విద్యా బిల్లును ప్రవేశపెడుతున్నట్టు పేర్కొంటూ వాటి వల్ల పేద ప్రజానీకానికి ఎనలేని లబ్ధి కలుగుతుందన్నారు. ఎంపి హర్షకుమార్ ప్రస్తావించిన కొబ్బరి కొనుగోలు సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేసారు. వరి మద్దతు ధర పెంపుదల అంశంలోనూ తన కృషి ఉంటుందన్నారు. మీరు ఓటేసి గెలిపించండి.. మీ సమస్యలు పరిష్కారానికి మీ ప్రాంత ప్రతినిధి యువకుడు తప్పనిసరిగా కృషి చేస్తారని అశేష ప్రజానీక హర్షధ్వానాల మధ్య వయలార్ రవి హామీ ఇచ్చారు. అంతకుముందు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అయినకాడికి దోచుకుని, అవినీతి సామ్రాట్‌లై, ప్రజాస్వామ్యాన్ని నడి బజారులో అపహాస్యం చేసి, తగుదునమ్మా అంటూ మళ్లీ ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితి కల్పించిన యువనేతకు గుణపాఠం చెప్పాలని అన్యాపదేశంగా జగన్‌నుద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. చంద్రబాబునాయుడు తనకు తాను అన్నా హజారేగా ప్రకటించుకోవడం ఈ దశాబ్దపు పెద్ద జోక్‌గా అభివర్ణించారు. రెండెకరాల ఆసామి వేల కోట్లకు అధిపతిగా మారి, నీతిమంతుడినని చెప్పుకోవడం రాజకీయ చరిత్రకే కళంకితమని బొత్స అన్నారు. వచ్చేనెల విద్యుత్ బిల్లు చూసుకుని ప్రతి పక్షాలు గొంతెత్తి అరుస్తోన్న ఆరోపణలు అబద్ధాలనే అంశాన్ని గుర్తిస్తారని, ధనవంతులు, ఎసిలు వాడే వ్యక్తులకు కొద్దిపాటి పెంపుదల చేసినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకులు తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వచ్చిన ఉప ఎన్నిక కాదని, పదవీ కాంక్షతో, ప్రభుత్వాన్ని కూలదోయాలనే లక్ష్యంతో అవినీతిని మరింత పెంపుదల చేసేందుకు అవకాశాల కోసం ఎదురుచూసిన నాయకుల వ్యవహారంతో ఈ ఎన్నికలు వచ్చాయని అన్నారు. మూడు ప్రధాన సమస్యలను ఆయన కేంద్ర మంత్రి వాయలార్ రవి దృష్టికి తెచ్చారు. సభకు అధ్యక్షత వహించిన డిసిసి అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తూర్పు తీర్పే రాష్ట్రానికి కీలకమంటూ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజానీకం 2009లో కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చారని, అదే విధానంలో ఈ ఉప ఎన్నికలో కూడా అభ్యర్ధి తోట త్రిమూర్తులును గెలిపించాలని పిలుపునిచ్చారు. స్వార్ధంతో వచ్చిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అఖండ విజయంతో గెలిపించి ఆ వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, తోట వెంకట నరసింహం, పార్లమెంట్ సభ్యురాలు రత్నాభాయి, ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి దేవి, వంగా గీతా విశ్వనాథ్, రాజా అశోక్ బాబు, నల్లమిల్లి శేషారెడ్డి, రాపాక వరప్రసాద్, పంతం గాంధీ మోహన్, బండారు సత్యానంద రావు, రౌతు సూర్యప్రకాశరావు, కురసాల కన్నబాబు, శాసనమండలి సభ్యులు బలసాడి ఇందిర, కందుల దుర్గేష్, మాజీ శాసనమండలి సభ్యులు గిడుగు రుద్రరాజు, జడ్పీ మాజీ ఛైర్మన్ చెల్లుబోయిన వేణు, శ్రీరాజాకాకర్లపూడి రాజగోపాల నరసరాజు (గోపాల్ బాబు), పేపకాయల బాబ్జి, కొమరిన వీర్రాజు, అల్లూరి దొరబాబు, నున్న రామచంద్రరావు, పామర్తి ఆనంద రాయుడు (బాబులు), పేకేరు బాబ్జి, నెంబర్ వన్ బాబు, బాలాంత్రం రాజు, మల్లిడి హరనాథ రెడ్డి, చింతా రామ్మోహన రెడ్డి, జాన్ విక్టర్ నందా, నేమాని అబ్బు, యాళ్ళ తమ్మారావు, కనకాల వెంకటేశ్వరరావు, వెల్ల జమీందార్ అబ్బు, పంతగడ జీవన జ్యోతి, మీర్జా ఖాజిమ్ హుస్సేన్, తులా రంగారావు తదితరులు పాల్గొన్నారు.
జ్యోతిష్యుడ్ని కాదు
కోరుకొండ, ఏప్రిల్ 19: ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని పరిశీలించడానికే వచ్చానని కేంద్ర మంత్రి, ఎఐసిసి నేత వాయిలార్ రవి అన్నారు. హైదరాబాద్ నుండి స్పైస్‌జెట్ విమానంలో గురువారం మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విమానాశ్రయంలో కొద్దిసేపు విలేఖరులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని పరిశీలించడానికే వచ్చానన్నారు. అదేవిధంగా పార్టీలో ఏ విధమైన విభేదాలు లేవని,రానున్న ఉప ఎన్నికల్లో విజయం తమదేనన్నారు. అదేవిధంగా అడిగిన ప్రశ్నలే ప్రతీసారీ అడగడం బాగోలేదన్నారు. రాష్ట్రంలో రానున్న ఉప ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అడగగా తానేమి జ్యోతిష్కుడ్ని కాదని పార్టీ విజయం కోసం కృషి చేస్తామన్నారు. ఆయన వెంట పిసిసి అధ్యక్షుడు, రవాణశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమానంలో మధురపూడికి వచ్చారు. అనంతరం వాయిలార్ రవి, బొత్స సత్యనారాయణ విమానాశ్రయం నుండి కారులో బయలుదేరి పశ్చిమగోదావరి జిల్లా బయలుదేరి వెళ్లారు.
మధురపూడి విమానాశ్రయానికి వాయిలార్ రవి రాక సందర్భంగా గోకవరం మాజీ జడ్పిటీసి గుల్లా ఏడుకొండలు ఆధ్వర్యంలో కార్యకర్తలను కాపాడండి,కాంగ్రెస్‌ను రక్షించండి అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
నేడు చంద్రబాబు సుడిగాలి పర్యటన
కాకినాడ, ఏప్రిల్ 19: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు జిల్లాలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఎస్‌ఇజడ్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనేందుకు జిల్లాకు వస్తున్న ఆయన జిల్లా కేంద్రం కాకినాడ నుండి ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో పార్టీ కార్యకర్తలు, నాయకులను ఆయన కలుసుకుంటారు. అనంతరం నగరంలోని సూర్యకళామందిరంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రంలో ఎస్‌ఇజడ్‌లకు వ్యతిరేకంగా నిర్వహించనున్న రాష్టస్థ్రాయి వర్క్‌షాప్‌కు హాజరవుతారు. అనంతరం నగరంలోని పోస్టల్ కాలనీలో గల క్రిస్టియన్ కమ్యూనిటీ హాలులో ఏల్చూరి పాపారావు ఆధ్వర్యంలో పార్టీలో కార్యకర్తల చేరిక కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకుని భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సర్పవరం, అచ్చంపేట జంక్షన్, సూర్యారావుపేట మీదుగా ఉప్పాడ కొత్తపల్లి చేరుకుంటారు. మండలంలోని మూలపేటలో సెజ్‌కు వ్యతిరేకంగా జరిగే ధర్నాలో పాల్గొని, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుండి రాత్రి 7 గంటలకు నాగులాపల్లి మీదుగా పిఠాపురం చేరుకుని గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.
జగతా కుటుంబానికి సేవాసంస్థల బాసట
‘్భమి’ వార్తకు స్పందన
3ఆలమూరు, ఏప్రిల్ 19: పినపళ్లకు చెందిన జగతా సత్తిబాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా తన భార్య, ముగ్గురు కుమార్తెలు ఇల్లు లేక వీధిన పడటంతో 3గూడు చెదిరింది2 శీర్షికన ఆంధ్రభూమిలో బుధవారం ప్రచురితమైన వార్తకు జిల్లా నలుమూలల నుండి పలువురు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకువచ్చారు. గుమ్మిలేరు కమ్మ మహా సంఘం రూ.7,500లు గురువారం ఆర్థిక సహాయం అందించగా, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.10వేలు నగదు, 100కిలోల బియాన్ని అందజేశారు. కొత్తూరు సెంటర్‌కు చెందిన శ్రీవిఘ్నేశ్వరా టాక్సీ స్టాండ్ యూనియన్ రూ.2వేలు అందించారు. అలాగే అమలాపురం ఆకొండి సింహాచలం, భారతీయ సేవాసమితి ట్రస్టు ఛైర్మన్ ఆకొండి గోపాలకృష్ణమూర్తి ఆ యువతుల చదువు నిమిత్తం అయ్యే ఖర్చును ట్రస్టు భరిస్తుందని తెలిపారు. కుటుంబానికి ఆశ్రయం కల్పించి ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు.
బీమా సొమ్ము కోసం హత్య
*రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ *ఆర్థికంగా నష్టపోయిన ఓ వ్యాపారి పథకం*మిస్టరీ ఛేదించిన జిల్లా పోలీసులు
గండేపల్లి, ఏప్రిల్ 19: వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయి, డబ్బు కోసం తన వద్ద పనిచేసే వారి పేరిట భారీగా బీమా పాలసీలు తీసుకుని, ఆపై వారిని హత్య చేయించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్న ఒక నయవంచకుడి కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ కుట్రకు ఒక యువకుడు బలికాగా, మరొకరు బలి కాకుండా కాపాడగలిగారు. పెద్దాపురం డిఎస్పీ కరణం కుమార్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి... ల గండేపల్లి మండలం మురారి గ్రామం వద్ద గత నెల 4వ తేదీ రాత్రి జాతీయ రహదారిపై గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతడు మృతిచెందినట్టు పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఈ కేసును సాదాసీదా రోడ్డు ప్రమాదంగా చూడకుండా జగ్గంపేట సిఐ పంజా భరత్‌మాతాజీ జరిపిన దర్యాప్తులో దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు వెలుగుచూశాయి. ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న ఒక పాడుబడినన భవనం నుండి మృతదేహాన్ని లాక్కుంటూ తీసుకువచ్చినట్టు ఆనవాళ్లు కనిపించడం సిఐ భరత్‌మాతాజీకి సందేహం కలిగించింది. అదే ఈ కేసుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, ఛేదించడానికి సహకరించింది. నిందితుల మధ్య జరిగిన సెల్‌ఫోన్ సంభాషణలు కూడా కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించాయి. కేసు దర్యాప్తులో ముందుగా మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం పిట్టల వేమవరం గ్రామానికి చెందిన సరెళ్ల మహేష్‌బాబు (20)గా సంఘటనాస్థలంలో ఆధారాలను బట్టి గుర్తించారు. మృతుడి తండ్రి సాయిబాబాను విచారించినపుడు మహేష్‌బాబు తమ గ్రామానికే చెందిన తమనంపూడి రామకృష్ణారెడ్డి అనే ధాన్యం వ్యాపారి వద్ద ఏడాదిన్నర కాలంగా పనిచేస్తున్నాడని తెలిపారు. కృష్ణారెడ్డి గత కొంతకాలంగా ధాన్యం వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈనేపథ్యంలో అప్పులు తీర్చడానికి నకిలీ నోట్ల వ్యవహారం కూడా ప్రారంభించాడు. చివరకు సులువుగా డబ్బు సంపాదించడానికి ఒక పథకం పన్నాడు. తనవద్ద పనిచేసే మహేష్‌బాబుపై సుమారు రూ.26 లక్షల మేర రెండు బీమా పాలసీలు చేయించి, వాటికి సంబంధించిన బాండ్లు తన వద్ద ఉంచుకున్నాడు. అతని తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక వృద్ధురాలిని నామినిగా పెట్టించాడు. తరువాత మహేష్‌బాబును తాగుడుకు బానిసగా మార్చాడు. వెంకటరెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో మహేష్‌ను హత్య చేయించడానికి లక్ష రూపాయలకు వీర్రాజు అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం మహేష్‌బాబును మద్యం తాగించి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మీదుగా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మురారి గ్రామం తీసుకువచ్చారు. మిల్క్‌డెయిరీ వద్ద పాడుపడిన టెలిఫోన్ భవనంలో వీర్రాజు, వెంకటరెడ్డి, షేక్ ఫకీరు (అనపర్తి) కలిసి చొక్కాను మహేష్‌బాబు మెడకు బిగించి, ఊపిరి ఆడకుండాచేసి, హత్యచేశారు. తరువాత మహేష్‌ను జాతీయ రహదారిపై పడవేయగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. మహేష్ చనిపోయాడని నిర్ధారించుకున్న వీరు తమ గ్రామాలకు వెళ్లిపోయారు. అలాగే పిట్టల వేమవరం గ్రామానికి చెందిన కుంజా వరారత్నం అనే వ్యక్తి పేరిట కూడా రూ.16 లక్షలకు బీమా చేయించి, ఇలాగే హత్య చేయడానికి వ్యూహం సిద్ధం చేశారు. ఈలోగా పోలీసు దర్యాప్తులో మహేష్ హత్యోదంతం బయటపడటంతో ఈ పథకం బెడిసికొట్టింది. సెల్‌ఫోన్ సంభాషణల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. ఈ ముఠా సభ్యులను అరెస్టు చేయడంతోపాటు మూడు మోటారు సైకిళ్లు, నాలుగు సెల్ ఫోన్లు, హత్యకు కోనే వీర్రాజుకు ఇచ్చిన రూ.25 వేలు నగదు, బీమా బాండ్లు స్వాధీనం చేసుకున్నారు.
చాకచక్యంగా కేసు ఛేదించిన సిఐ భరత్ మాతాజీని, ఎస్‌ఐ బివి రమణను డిఎస్పీ కరణం కుమార్ అభినందించారు. దర్యాప్తులో చురుగ్గా పాల్గొని కేసు ఛేదించేందుకు సహకరించిన పోలీస్ సిబ్బంది ఎస్‌ఎస్ ప్రకాశరావు, ఎస్‌వి రమణ, సిహెచ్‌వి రమణ, కె సూరిబాబు, హోమ్‌గార్డులు ఎస్ సోమరాజు, కె రాంబాబు, కె నాగేశ్వరరావులు డిఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. అలాగే పోలీసు బృందానికి జిల్లా ఎస్పీ ద్వారా రివార్డులకు సిఫార్సు చేసినట్టు డిఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పీ కరణం కుమార్ గురువారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఒక వ్యక్తిపై అధిక మొత్తంలో వేరే ఎవరైనా బీమా చేయిస్తే వారిని నమ్మవద్దని, ఇది ఆ వ్యక్తి ప్రాణానికే ముప్పు అని గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యవహారంలో బాధితులు, కుట్రదారులు పశ్చిమగోదావరి జిల్లా వాసులు కాగా, నేరం జరిగిన ప్రదేశం, ఛేదించింది తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. కొసమెరుపు ఏమిటంటే ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన జగ్గంపేట ఇన్‌స్పెక్టర్ పంజా భరత్‌మాతాజీ పశ్చిమగోదావరి జిల్లా వాసి కావడం.
ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ విసిగా జార్జ్ విక్టర్
రాజమండ్రి, ఏప్రిల్ 19: ఎట్టకేలకు రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్శిటీకి పూర్తిస్థాయి వైస్‌చాన్సలర్‌ను నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నన్నయ్య యూనివర్శిటీ వైస్‌చాన్సలర్‌గా ఆంధ్రాయూనివర్శిటీ ఫిలాసఫీ ఆచార్యుడు పసలపూడి జార్జ్‌విక్టర్ నియమితులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమిట్టలో జన్మించిన జార్జ్‌విక్టర్ 1978లో భీమవరం డిఎన్‌ఆర్ కళాశాలలో అధ్యాపక వృత్తికి శ్రీకారం చుట్టారు. 1981లో ఆంధ్రాయూనివర్శిటీలో అధ్యాపకుడిగా చేరారు. 1994లో ఆచార్యుడిగా పదోన్నతి పొందారు. శంకర వేదాంతం, ఉపనిషత్తులు, భగవద్గీతపై నిష్ణాతులైన జార్జ్‌విక్టర్ శంకరవేదాంతంపై పిహెచ్‌డి చేశారు. ఆయనకు పద్మవిభూషణ్ కొత్త సచ్చిదానందమూర్తి మార్గదర్శకులుగా వ్యవహరించారు. ఎలాంటి రాజకీయ సిఫార్సు లేకుండా అర్హుడైన ఆచార్యుడు వైస్‌చాన్సలర్ పదవిని పొందవచ్చనేందుకు తానే నిదర్శనమని విక్టర్ 3ఆంధ్రభూమి2తో చెప్పారు. శుక్రవారం ఉదయం వైస్‌చాన్సలర్‌గా అధికార బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు. కాగా, నిరుపారాణి తరువాత నన్నయ్య యూనివర్శిటీకి పూర్తిస్థాయి వైస్‌చాన్సలర్ నియమితులు కాలేదు. ఆంధ్రాయూనివర్శిటీ వైస్‌చాన్సలర్ బీలా సత్యనారాయణ కొద్దికాలం, ఆతరువాత కాకినాడ జెఎన్‌టియుసి వైస్‌చాన్సలర్ ఆచార్య అల్లం అప్పారావు ఆదికవి నన్నయ్య యూనివర్శిటీకి ఇన్‌చార్జిలుగా వ్యవహరించారు. సుమారు ఏడాది నుంచి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్‌జి గోపాల్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
108లో గిరిజన మహిళ ప్రసవం
*కాన్పు ఆలస్యమవ్వడంతో ఒక బిడ్డ మృతి
వై రామవరం, ఏప్రిల్ 19: సకాలంలో సరైన వైద్య సహాయం అందక ఓ గిరిజన మహిళకు జన్మించిన కవలల్లో ఒక బిడ్డ మృతి చెందిన విషాద సంఘటన మండలంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలో మారుమూల గ్రామమైన చామగడ్డ పంచాయతీ బురదకోటకు చెందిన పల్లాల అప్పయ్యమ్మ తొలికాన్పులో గురువారం ఉదయం ఇంటి వద్ద ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇంకా పురిటి నొప్పులు రావడంతో అటవీమార్గం గుండా ఆమెను అతికష్టం మీద ప్రధాన రహదారికి తీసుకొచ్చారు. అక్కడి నుండి 108లో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకురాగా వైద్య సిబ్బంది అప్పయ్యమ్మను పరీక్షించి గర్భంలో మరోబిడ్డ ఉందని మెరుగైన వైద్యానికి రంపచోడవరం రిఫర్ చేశారు. 108లో రంపచోడవరం ఆమెను తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలో అడ్డతీగల సమీపంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలను అడ్డతీగలప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా డాక్టర్ వెంకటేశ్వరావు పరీక్షించి మగ బిడ్డ చనిపోయినట్లు తెలిపారు. కాన్పుకి కాన్పుకి మధ్య 5 గంటల వరకు ఆమెకు ఎటు వంటి వైద్య సహాయం అందకపోడం వలనే మగబిడ్డ మృతి చెందాడని అప్పయ్యమ్మ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పయ్యమ్మకు, ఆడ బిడ్డకు వైద్యులు చికిత్స అందజేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాపథం దోహదం
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి తోట
కిర్లంపూడి, ఏప్రిల్ 19: ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజాపథం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి తోట నరసింహం అన్నారు. బుధవారం మండలంలోని ముక్కొల్లులో జరిగిన ప్రజాపథం సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రధానంగా తాగునీరు, విద్యుత్, ఉపాధి కూలీలకు పని కల్పించడం వంటి సమస్యలను ప్రజాపథంలో పరిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతుల రుణాలు 13వేల కోట్లను మాఫీ చేసినట్టు తెలిపారు. కౌలురైతు చట్టాన్ని ప్రవేశపెట్టి రైతుకు పంట నష్టపరిహారం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతులకు లక్ష వరకు వడ్డీ లేని రుణం, రూ.3లక్షల వరకు పావలావడ్డీ రుణాలందిస్తున్నట్టు మంత్రి వివరించారు. ఉపాధి హామీ పథకంలో రోజువారీ వేతనాన్ని రూ.121 నుండి రూ.137కు పెంచినట్టు ఆయన తెలిపారు. వికలాంగులకు నెలకు రూ.500 పింఛను ఇస్తూ ఉపాధి హామీ ద్వారా వారానికి రూ.600లు వేతనం వచ్చేలా పని కల్పిస్తున్నామన్నారు. మహిళలకు పావలావడ్డీకే రుణాలందించడమే కాకుండా జనవరి 5 నుండి ఐదులక్షల వరకు వడ్డీలేని రుణాన్ని డ్వాక్రా మహిళలకు అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాల సమావేశాలకు ఉపయోగపడే విధంగా మండల కేంద్రంలో 25లక్షల రూపాయల వ్యయంతో స్ర్తి శక్తి భవనాన్ని నిర్మించడమే కాకుండా స్ర్తి నిధి కింద మండలానికి కోటి రూపాయలు చొప్పున కేటాయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ముక్కొల్లులో పావలావడ్డీ కింద 35 గ్రూపులకు 2లక్షల 46వేల 97 రూపాయలు, అభయహస్తం కింద 34మందికి 17వేలు, పావలావడ్డీ కింద 12మంది రైతులకు రూ.4,350లను మంత్రి లబ్దిదారులకు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ప్రత్యేకాధికారి జీవన్‌బాబు, డ్వామా పిడి మధుసూదన్, ట్రాన్స్‌కో ఎస్‌ఇ కెఎస్‌ఎన్ మూర్తి, వైద్యాధికారులు చంద్రకిరణ్, ప్రసాద్, డిఇఇ చంద్రశేఖర్, ఎపిడి నాగేశ్వరరావు, డిఇ చంద్రశేఖర్, ఎంపిడిఒ అడపా వెంకటలక్ష్మి, తహసీల్దార్ వైవి కృష్ణారావు, కోట వరాలయ్య, సంగిశెట్టి వెంకటేశ్వరరావు, తోట అయ్యన్న, టి నరేంద్ర, నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఎం పద్మశ్రీ, మండల జెఇ వై ఉమాశంకర్, కాంగ్రెస్ నాయకులు చదలవాడ బాబి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకంలో 79, 908 మంది కూలీలకు జాబ్‌కార్డులు
కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్
కాకినాడ, ఏప్రిల్ 19: ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 154 గ్రామ పంచాయితీలోను, 42 పట్టణ ప్రాంత వార్డుల్లోను ప్రజాపధం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద 79 వేల 908 మంది కూలీలకు జాబ్‌కార్డులను అందించడం జరిగిందని, 6, 437 ఉపాధి హామీ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజాపధం కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటి వరకు 14, 454మంది రైతులకు మూడు కోట్ల 54 లక్షల 17 వేల రూపాయలను ఇన్‌పుట్ సబ్సిడీ కింద పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. అలాగే 9069 గ్రామీణ ప్రాంత మహిళ స్వయం సహాయక బృందాలకు ఆరుకోట్ల 84 లక్షల 69 వేల రూపాయల పావలా వడ్డీ రాయితీగా అందించడం జరిగిందన్నారు. అలాగే పట్టణ ప్రాంత మహిళ స్వయం సహాయక బృందాలకు సంబంధించిన 1256 గ్రూపులకు 48 లక్షల 52 వేల రూపాయలను వడ్డీ రాయితీగా అందిచామని పేర్కొన్నారు. అదే విధంగా రైతులకు సంబంధించి 14 వేల 463 మంది రైతులకు 82 లక్షల 37 వేల రూపాయలను పావలావడ్డీ రాయితీ కింద పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపధం కార్యక్రమంలో ఇప్పటి వరకు 153 గ్రామాల్లో రైతులకు 7 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు గమనించడం జరిగిందన్నారు. 77 ప్రాంతాల్లో లోల్టెజీ సమస్యలను గుర్తించి వాటిని సరిచేయడం జరిగిందని, 107 ట్రాన్స్‌ఫార్మర్స్ సమస్యలను గుర్తించడం జరిగిందని, 94 ట్రాన్స్‌ఫార్మర్స్ మంజూరు చేయడం జరిగిందని, 336లూజ్ స్పాన్స్‌లు గుర్తించి, 286 సరిచేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. లోటెన్షన్, హైటెన్షన్ విద్యుత్ సరఫరా లైన్లుకు సంబంధించి 241 సమస్యలను గుర్తించగా వాటిలో 176ను సరిచేయడం జరిగిందని, అలాగే వీధి దీపాలకు సంబంధించి 608 సమస్యలను గుర్తించగా 257 సమస్యలను సరిదిద్దడం జరిగిందన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి 123 గ్రామాలు, వార్డుల్లో సమస్యలను గుర్తించి వాటిలో 60 సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆరోగ్య సంబంధిత అంశానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 105 పిహెచ్‌సి, సిహెచ్‌సిలను ప్రజాపధం మండల, పట్టణ ప్రాంత బృందాలు సందర్శించి వాటిలో 101 వాటికి పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆరోగ్యశ్రీ పధకం కింద 79 వేల 45 ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేయడంతో పాటు 186 వివిధ రకాల ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కలిగించడమైనదని తెలిపారు. 108, 104 అంబులెన్స్ సేవలకు సంబంధించి వాటి ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై ప్రజలకు విస్తృ అవగాహన కలిగించడం జరిగిందని తెలిపారు. 187 ప్రాంతాల్లో 108 సేవలు అందుబాటులో ఉన్నాయని, 84 గ్రామాలు, పట్టణ ప్రాంతాల వార్డుల్లో 104 అంబులెన్స్ సర్వీసులపై అవగాహన సదస్సులు నిర్వహించారాని కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ప్రజాపధం కార్యక్రమం వివిధ ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ తెలిపారు.
ఏడు పిల్లలకు జన్మనిచ్చిన పగ్ జాతి కుక్క
రావులపాలెం, ఏప్రిల్ 19: ఒక మొబైల్ నెట్ వర్క్ వాణిజ్య ప్రకటనలో కనిపించి ప్రపంచ వ్యాప్తంగా హచ్ కుక్కగా ముద్రపడిన ఆస్ట్రేలియా దేశానికి చెందిన అరుదైన పగ్ జాతి కుక్క పిల్లలు మండల పరిధిలోని వెదిరేశ్వరం శివారు కోచూరినగర్‌లో సందడి చేస్తున్నాయి. గ్రామంలోని కోసూరి శివకుమార్‌రాజు (శేఖర్‌బాబు) ఇంట్లో పెంచుతున్న ఈ ఖరీదైన కుక్క తాజాగా ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. కుక్కల పెంపకంపై అమితాశక్తి కలిగిన శేఖర్‌బాబు ఆస్ట్రేలియాలోని బంధువుల నుండి రూ. 30 వేలకు ఐదేళ్ళ క్రితం ఈజాతి కుక్కను కొనుగోలుచేసి తొలిసారిగా గ్రామానికి తీసుకొచ్చారు. తదుపరి ఆ కుక్క ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో ఏడింటిని బంధువులు, మిత్రులకు పెంపకానికి ఇవ్వగా ఒక ఆడ కుక్కను మాత్రం వీరే పెంచారు. తాజాగా ఆ కుక్క ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఈ మూడు తరాలకు చెందిన హచ్ కుక్కలు ఈ ఇంట్లో సందడి చేస్తున్నాయి. వీటి పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మార్కెట్‌లో ఈ జాతి కుక్క పిల్లల విలువ ఒక్కోటి 15 నుండి 25 వేల రూపాయల వరకు ఉంటుందని శేఖర్‌బాబు తెలిపారు. ఈ జాతి కుక్కలు మన జిల్లాలో చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఖరీదు ఎక్కువగా ఉండటంతో పాటు వ్యయప్రయాసలకోర్చి పెంపకం చేయాల్సివుంటుందన్నారు. నోటిచుట్టూ నలుపు రంగుతో పొట్టిగా, ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ జాతి కుక్కలను ఒక దాన్ని చూస్తేనే ఎంతో ఆసక్తి కలుగుతుంది. అలాంటి ఒక ఇంట్లో ఏడు పిల్లలతోపాటు మరో రెండు పెద్ద కుక్కలు సందడి చేస్తుండటంతో వీటిని చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు.
పార్టీ కన్నా వ్యక్తి మిన్న
*తోటకు కీలక సామాజిక వర్గం మద్దతు
రామచంద్రపురం, ఏప్రిల్ 20: పార్టీ కన్నా వ్యక్తి మిన్న అన్న దృష్టితో ఆలోచించి, రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు బేషరతుగా మద్దతునిస్తున్నట్టు నియోజకవర్గానికి చెందిన ఒక కీలక సామాజిక వర్గం ప్రముఖులు ప్రకటించారు. స్థానిక తిలక్ మెమోరియల్ టౌన్ హాలులో పట్టణ కాకతీయ అసోసియేషన్ అధ్యక్షుడు మార్ని సుబ్బారావు, కార్యదర్శి వయిట్ల సూర్యప్రకాశరావు, గౌరవాధ్యక్షుడు గరిగిపాటి సూర్యనారాయణ మూర్తి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొమరిన వీర్రాజు, వల్లూరి వీరవెంకట సత్యనారాయణ మూర్తి (ప్రగతి చౌదరి), కె గంగవరం తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు ఒబిలినేని రాజకుమార్ తదితరుల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి ఆ సామాజిక వర్గీయులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీలోని పరిణామాలు నచ్చక వ్యక్తిగతంగా తామంతా ఒక నిర్ణయానికి వచ్చి, పార్టీ రహితంగా కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు మద్దతు పలుకుతున్నట్టు పట్టణ టిడిపి మాజీ అధ్యక్షుడు గరిగిపాటి సూర్యనారాయణమూర్తి వెల్లడించారు. ఈ అంశంపై తామంతా ఏకగ్రీవ అభిప్రాయానికి వచ్చినట్టు ఆయన చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు మాట్లాడుతూ తన పట్ల నమ్మకం ఉంచి, తన గెలుపుకు కృషి చేస్తామని ప్రకటించిన సామాజిక వర్గీయులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఉండవిల్లి శివ, వయిట్ల రామకృష్ణ, చిలుకూరి వెంకటరావు, కారుకొండ వీరన్న చౌదరి, మేకా బాబులు, గారపాటి జోగారావు, చందళ్ళ వీరశేఖర కుమార్, కొమరిన సూర్యారావు, ఒబిలినేని రామకృష్ణ, రిమ్మలపూడి సతీష్ చౌదరి, బొళ్ళంరెడ్డి శ్రీహరి, చుండ్రు వెంకట్రావు, కొరిపెల్ల వీరవెంకట సత్యనారాయణ, బిక్కిన రామకృష్ణ, ఈదల శేషగిరి రావు, బిక్కిన జగదీష్ చౌదరి, మద్దిపూడి బున్నిలతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు.
రహదారి రక్తసిక్తం
లారీ-ఆటో ఢీ * ఐదుగురు మృతి * నలుగురికి తీవ్ర గాయాలు
తాళ్ళరేవు, ఏప్రిల్ 19: తాళ్ళరేవు మండలం కోరంగి శ్మశాన వాటిక సమీపంలో గురువారం మృత్యువు కరాళ నృత్యం చేసింది. మితిమీరిన వేగం ఐదు నిండు ప్రాణాలను బలిగొంది. మరో నలుగురిని తీవ్రగాయాలతో ఆసుపత్రిపాల్జేసింది. జాతీయ రహదారి 216పై ప్రయాణీకుల ఆటోను లారీ ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా నలుగురు ప్రాణాపాయ స్థితిలో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కాకినాడ నుండి యానాం వైపు వస్తున్న ఆటోను జాతీయ రహదారి యానాం వైపు నుండి కాకినాడ వెళుతున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. నుజ్జునుజ్జయిన ఆటోలో, పక్కన ఛిద్రమైన మృతదేహాలతో ప్రమాదస్థలి భీతావహంగా ఉంది. ఆటో డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్‌లు కూడా మితిమీరిన వేగంతో వస్తున్నారని సంఘటన స్థలంలో వున్న వ్యక్తులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో పాతమంజేరుకు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మురమళ్ళ రాజారావు (28), జార్జిపేటకు చెందిన అడబాల శేషారత్నం (62), అడబాల లక్ష్మి (40), తాళ్ళరేవుకు చెందిన కట్టా జగదీశ్వరి (29), పాతమంజేరుకు చెందిన బురదకవి శ్రీనివాస్ (37) సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. జార్జిపేటకు చెందిన సాగి సావిత్రి, యానాం అగ్రహారంకు చెందిన పాలెపు గణేష్, కాకినాడకు చెందిన ఒల్లు మంగాదేవి, తాళ్ళరేవుకు చెందిన దండు జ్యోతి కొన ఊపిరితో ఉండగా 108 అంబులెన్స్‌లో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కోరంగి ఎస్సై వేణుగోపాలరావు సంఘటన స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో కాకినాడ డిఎస్‌పి సాయిశ్రీ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. జాతీయ రహదారిలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా గొల్లపాలెం ఎస్సై శ్రీనివాస్, కరప ఎస్సై గణేష్‌లు ట్రాఫిక్‌ను వేరే మార్గంకు తరలించే చర్యలు చేపట్టారు. గంటల 1.30 సమయంలో కాకినాడ ఆర్డీవో కిశోర్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఎంపిడివో డాక్టర్ ఎన్ ప్రకాశరావు, తహశీల్దార్ గంపల నాగేశ్వరరావు, తాళ్ళరేవు వైద్యాధికారి నాయక్‌లు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు. తదుపరి చర్యలకు అధికారులను ఆయన ఆదేశించారు. డిసిసి అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుత్తుల సాయి మృతుల కుటుంబాలను ఓదార్చి ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు కృషిచేస్తామని హామీనిచ్చారు. అనంతరం మృతదేహాలకు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.
ఆర్తనాదాలతో కోరంగి
గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంతో 216 జాతీయ రహదారి కోరంగి సమీపంలో రక్తసిక్తమైంది. గాయపడిన వారి ఆర్తనాదాలతో మృతుల బంధువుల రోదనలతో కోరంగి ప్రాంతం హృదయవిదారకంగా ఉంది. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపిస్తున్న దృశ్యం చూపరులను సైతం కంటతడి పెట్టించింది.