ఏలూరు, ఏప్రిల్ 19: రాష్ట్ర కాంగ్రెస్ స్ధితిగతులను పరిశీలించి వ్యూహాన్ని రూపొందించేందుకు అధిష్ఠానం పంపిన దూతగా రంగప్రవేశం చేసిన కేంద్ర మంత్రి వాయలార్ రవి గురువారం ఏజన్సీలో పర్యటన చేశారు. అయితే హిందీ, ఇంగ్లీషు, మళయాళం మినహా తెలుగు అసలు రాని కేంద్ర మంత్రి వాయలార్ రవి క్షేత్రస్ధాయి పర్యటన చేయటం వల్ల ఏవిధమైన ఫలితం ఉంటుందో అర్ధం కాని పరిస్దితి. భాషకి అందని వ్యూహం కాంగ్రెస్‌కు ఏరకంగా మేలు చేస్తుందన్నది కూడా కార్యకర్తలకు అందని పరిస్ధితి. ఏదీఏమైనా పార్టీ పరిస్ధితిని పరిశీలించేందుకు, క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర మంత్రి వాయలార్ రవి గురువారం ఉప ఎన్నికలు జరగనున్న పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెంలో ఉదయం 12గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు ఉన్నారు. ఈ సమయంలో పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించిన రవి ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత భాషాపరమైన సమస్యలు అన్నిచోట్ల తలెత్తుతూనే వచ్చాయి. చివరకు సమావేశంలో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో నేతలే ఆయనకు ఇంగ్లీషులో తర్జుమా చేయాల్సి వచ్చింది. అయితే కార్యకర్తల్లో మాత్రం ఈ పరిస్ధితి నిరాశకు కారణమైంది. ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పరిశీలకుని హోదాలో వచ్చిన వాయలార్ రవి ఇక్కడి సమస్యలను అర్ధం చేసుకుంటారని, వాటికి పరిష్కారాలను చూపుతారని భావించిన కార్యకర్తలకు ఆశాభంగం తప్పలేదు. కార్యకర్తల సమావేశం నిర్వహించిన స్ధలం కూడా చిన్నదిగా ఉండటం, కూడా ఓ వ్యూహం అని పార్టీ నాయకులు చెప్పటం విచిత్రంగా తోస్తుంది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలంటే ఒకరకంగా పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. అదీకూడా పరిశీలకుని ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంటే ఉన్న సమస్యలను ఏకరువు పెట్టేందుకు పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు తరలిరావటం సర్వసాధారణం. అయితే ఆ పరిస్ధితి మాత్రం ఎక్కడా కన్పించలేదు. వచ్చిన కొన్ని వందల మంది కార్యకర్తలకు కూడా కొద్దిసేపట్లోనే పరిస్థితి అర్ధమై కొంతమంది జారుకున్నారు. తెలుగు అర్ధం కాదని ముందుగానే తేటతెల్లం కావటంతో కార్యకర్తల్లో కూడా నిరాశ నెలకొని చివరకు తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం కూడా చేయకుండా మిన్నకుండిపోయారు. వాస్తవానికి ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పరిస్ధితిని పరిశీలించి జగన్ ఎఫెక్టును అంచనా వేసి దానికి అనుగుణంగా పార్టీ వ్యూహాలను తీర్చిదిద్దాల్సిన వాయలార్ రవి చివరకు హైదరాబాద్‌లో కలిసి తిరిగే నేతల అభిప్రాయాలపైనే ఇక్కడ కూడా ఆధారపడాల్సి వచ్చింది. దీంతో అసలు క్షేత్రస్థాయి సమస్య పరిశీలకుని దృష్టికి వెళ్లింది, లేనిది అర్ధం కాక కార్యకర్తలు తిరుగుముఖం పట్టారు. అయితే ఒకరకంగా చూస్తే పోలవరం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉందని ముందునుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. దానికి తగ్గట్టుగా అభ్యర్ధి ప్రకటన కూడా ఇంతవరకు అధికారికంగా జరగనేలేదు. మిగిలిన రెండు పార్టీల అభ్యర్ధులు ఇప్పటికే రంగంలోకి దిగటం, ప్రచార హోరు జోరెత్తించటం తెల్సిందే. అయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్ధి విషయంలో ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ఈనేపధ్యంలో పరిశీలకుని హోదాలో కేంద్ర మంత్రి రావటంతో నియోజకవర్గంలో ఔత్సాహిక నేతలంతా ఉత్సాహంగా ముందుకు వచ్చిన చివరకు అక్కడ పరిస్థితి చూసి వెనక్కి తగ్గిపోయారు. మరోవైపు కార్యకర్తలను, పొగాకు రైతులను ఉద్దేశించి వాయలార్ రవి కొద్దిసేపు ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగంలో అధికభాగం సోనియా భజనకే సరిపోయింది. మరోవైపు మంత్రి వాయలార్ రవి ఇంగ్లీషులో చేసిన ప్రసంగాన్ని ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు తెలుగులోకి తర్జుమా చేయటంతో కొంతలోకొంత నయమన్పించింది. మొత్తంమీద చూస్తే వాయలార్ రవి పర్యటన వల్ల పార్టీకి ఒరిగిందేమిటో అర్ధం కాదు. అలాగే క్షేత్రస్ధాయి కార్యకర్త మనోభావాలకు చోటు లేని పరిశీలన, అంచనా ఏరకమైన ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాలి.
హవ్వ..జగన్ నోట విశ్వసనీయతా
నరసాపురంలో చంద్రబాబు ఎద్దేవా
నరసాపురం, ఏప్రిల్ 19: భావితరాల సంపదను దోచుకున్న వైఎస్ జగన్మోహనరెడ్డి విశ్వసనీయత కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నరసాపురం విచ్చేసిన చంద్రబాబునాయుడు స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు చిన్నచిన్న ప్రయోజనాలు చూపి లక్షలాది కోట్ల రూపాయల ప్రజాసంపదను జగన్‌కు దోచిపెట్టారని ఆరోపించారు. ఓబుళాపురం గనుల నుంచి సంవత్సరానికి రూ. 15 వేల కోట్లు అక్రమ మైనింగ్ జరిపారన్నారు. పోలవరం పనులు పూర్తికాకుండానే రూ. 4 వేల కోట్లు ఖర్చయినట్లు లెక్కలు చూపారన్నారు. డబ్బులకు కక్కుర్తిపడిన రాజశేఖరరెడ్డి కాంట్రాక్టర్ల కమిషన్‌లకు అమ్ముడుపోయారన్నారు. అయితే కొత్తగా పార్టీ పెట్టిన జగన్ విశ్వసనీయత కోసం ఊదరగొట్టడం ఎంతవరకు సబబు అన్నారు. తండ్రి మరణించారన్న బాధ కూడా లేకుండా పదవీ వ్యామోహంతో జగన్ ఎమ్మెల్యేల సంతకాల సేకరణ చేపట్టారని ధ్వజమెత్తారు. అంతేకాక చిరంజీవితో బేరసారాలు సాగించారని ఆరోపించారు. తాము అధికారంలో ఉండగా ప్రజాసంపదకు ధర్మకర్తగా వ్యవహరించామన్నారు. ఎనిమిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వ పాలన సాగుతుందా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పరిపాలనా దక్షత లేదన్నారు. మరోపక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర నష్టం ఎదుర్కొంటున్నారన్నారు. దీనికి తోడు తాజాగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపారన్నారు. రాష్ట్రంలో మద్యం మాఫియా, ఇసుక మాఫియా రాజ్యమేలుతున్నాయన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సారా వ్యాపారం చేయడం నీచమన్నారు. కాంగ్రెస్ తమ కార్యాలయానికి గాంధీభవన్ పేరును బ్రాందీ భవన్ పేరుగా మార్చుకోవాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ దొంగల పార్టీలని విమర్శించారు. ఆ పార్టీలు అధికారంలోకి వస్తే రెండింతలు దోచుకోవాలని ఆశపడుతున్నాయన్నారు. ప్రజలు ఆ పార్టీలను నమ్మితే నట్టేట మునగడం ఖాయమన్నారు. అలాగే సామాజిక న్యాయం నినాదంతో ముందుకు వచ్చిన చిరంజీవి సొంత న్యాయం చూసుకున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే అమలుచేయనున్న పథకాలను చంద్రబాబు వివరించారు. రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు రూ.వెయ్యి నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. పేదలందరికీ 3 సెంట్ల భూమి, ఇళ్ళు నిర్మించి ఇచ్చేందుకు రూ.లక్ష రుణం అందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేంతవరకు ప్రజాపక్షాన పోరాడుతామని చంద్రబాబునాయుడు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బొమ్మిడి నారాయణరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తానేటి వనిత, శివ, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, మాజీ మంత్రులు అంబికా కృష్ణ, మాగంటి బాబు, యర్రా నారాయణస్వామి, నాగిడి బాబు, గరికిపాటి రామ్మోహనరావు, ఎన్.నరసింహారావు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బాబ్జీ, పీతల సుజాత, ఎంఎ షరీఫ్, చలమలశెట్టి రామానుజయ, రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, పి.సోంబాబు, బొమ్మిడి నాయకర్ పొన్నమండ నాగచంద్రరావు, బర్రె ప్రసాద్, భూపతి నరేష్, రాయుడు శ్రీరాములు, మెంటే పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు పదోన్నతి
ఏలూరు, ఏప్రిల్ 19 : జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్‌కు పదోన్నతి లభించింది. ఆమెకు జాయింట్ సెక్రటరీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన డాక్టర్ వాణిమోహన్ జిల్లా కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐ ఎ ఎస్ అధికారులకు నిర్వహించే శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆమెకు పదోన్నతి కల్పించేందుకు అవకాశం కలిగింది. జిల్లా కలెక్టర్‌కు పదోన్నతి లభించడం పట్ల పలువురు అధికారులు, రెవిన్యూ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ప్రతిష్ఠాత్మకం
పార్టీని గెలిపించండి - కరాటం, జెట్టి సహా నేతలందరికీ వాయలార్ సూచన
జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 19: పోలవరం నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతలు మీ భుజస్కంధాలపై వేసుకోవాలని డిసిసిబి ఛైర్మన్ కరాటం రాంబాబు, డిసిసి అధికార ప్రతినిధి జెట్టి గురునాధరావును కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల తాత్కాలిక ఇన్‌ఛార్జి వాయిలార్ రవి కోరారు. గురువారం మధ్యాహ్నం కొయ్యలగూడెం డిసిసిబి అతిథి గృహంలో వీరిద్దరితో వాయిలార్ రవి సుమారు అర్ధగంట విడివిడిగా చర్చలు జరిపారు. ఆ సమయంలో రవితో పాటు పి.సి.సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రమే గదిలో ఉన్నారు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులను సైతం వాయిలార్ రవి లోనికి అనుమతించలేదు. ఇటీవల ఎడమొహం, పెడమొహంగా ఉన్న కరాటం, జెట్టి కలసి పనిచేస్తే నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం తథ్యమని కార్యకర్తలు భావిస్తున్న తరుణంలో వాయిలార్ రవి చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో మీ శక్తి యుక్తులు ఉన్నాయని, పార్టీలో పనిచేసేవారికి ఎల్లప్పుడూ గౌరవం, గుర్తింపు ఉంటుందని వాయిలార్ రవి వారికి చెప్పినట్టు తెలిసింది. పార్టీని నమ్ముకున్న వారికి మేలే జరుగుతుందని, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరినట్టు తెలిసింది. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎవరైనా విజయానికి ఇద్దరు అవిశ్రాంత కృషి చేయాలని, ఈ ఎన్నిక పార్టీకి ప్రతిష్ఠాత్మకమని వాయిలార్ రవి చెప్పినట్టు తెలిసింది. మంత్రి పితాని సత్యనారాయణతో కూడా కొద్దిసేపు ఏకాంతంగా వాయిలార్ రవి చర్చించారు. శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, మద్దాల రాజేష్‌కుమార్, ఈలి నానిలతో కొద్దిసేపు ముచ్చటించారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ ఎంపిక చేసిన అభ్యర్థి బాడిస బొజ్జిదొరపై పలువురు గిరిజన నాయకులు వాయిలార్ రవికి ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. బొజ్జి దొర తండ్రి బాడిస దుర్గారావుకు కాంగ్రెస్ నాలుగు సార్లు టిక్కెట్ ఇచ్చిందని, ఆయన కాంగ్రెస్ ద్రోహం చేసి, తెలుగుదేశం పార్టీలో చేరిపోయారని, తరువాత మృతి చెందారని, తెలుగుదేశం పార్టీలోనే కాలం చేసిన దుర్గారావు కుమారుడికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడం శోచనీయమని పేర్కొన్నట్టు తెలిసింది. అనంతరం వాయిలార్ రవి నియోజకవర్గంలోని మండలానికి ఇద్దరు కార్యకర్తల చొప్పున పిలిపించుకుని వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో సైతం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మాత్రమే గదిలోకి అనుమతించారు. చాలా మంది కార్యకర్తలు డిసిసిబి ఛైర్మన్ కరాటం రాంబాబు సూచించిన వ్యక్తికే ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలని సూచించారని తెలిసింది. తాము పార్టీ విజయానికి చిత్తశుద్దితో పని చేస్తామని వాయిలార్ రవికి హామీ ఇచ్చారని తెలిసింది. పార్టీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలంతా సహకరించాలని, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వాయిలార్ రవి కోరినట్టు తెలిసింది. కాగా, తమకు అభ్యర్థిత్వం ఇవ్వాల్సిందిగా మొడియం శ్రీనివాసరావు(తండ్రి వెంకటేశు), కుంజా జగదీష్ చంద్రబోస్, బాడిస బొజ్జిదొర వాయిలార్ రవికి దరఖాస్తులు అందజేసారు. ఈ ముగ్గురిని రవి పరిచయం చేసుకున్నారు. కొయ్యలగూడెం డిసిసిబి గెస్ట్‌హౌస్‌లో లంచ్‌తో పాటు పై వ్యవహారాలు సుమారు రెండు గంటల పాటు సాగాయి.
కలికాలం
*బీమా సొమ్ము కోసం యువకుడి హత్య
*రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ
*పిట్టల వేమవరం ధాన్యం వ్యాపారి పథకం
*మిస్టరీ ఛేదించిన తూ.గో. పోలీసులు
గండేపల్లి, ఏప్రిల్ 19: వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయి, డబ్బు కోసం తన వద్ద పనిచేసే వారి పేరిట భారీగా బీమా పాలసీలు తీసుకుని, ఆపై వారిని హత్య చేయించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్న ఒక నయవంచకుడి కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ కుట్రకు ఒక యువకుడు బలికాగా, మరొకరు బలి కాకుండా కాపాడగలిగారు. పెద్దాపురం డిఎస్పీ కరణం కుమార్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి... ల గండేపల్లి మండలం మురారి గ్రామం వద్ద గత నెల 4వ తేదీ రాత్రి జాతీయ రహదారిపై గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతడు మృతిచెందినట్టు పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఈ కేసును సాదాసీదా రోడ్డు ప్రమాదంగా చూడకుండా జగ్గంపేట సిఐ పంజా భరత్‌మాతాజీ జరిపిన దర్యాప్తులో దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు వెలుగుచూశాయి. ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న ఒక పాడుబడినన భవనం నుండి మృతదేహాన్ని లాక్కుంటూ తీసుకువచ్చినట్టు ఆనవాళ్లు కనిపించడం సిఐ భరత్‌మాతాజీకి సందేహం కలిగించింది. అదే ఈ కేసుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, ఛేదించడానికి సహకరించింది. నిందితుల మధ్య జరిగిన సెల్‌ఫోన్ సంభాషణలు కూడా కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించాయి. కేసు దర్యాప్తులో ముందుగా మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం పిట్టల వేమవరం గ్రామానికి చెందిన సరెళ్ల మహేష్‌బాబు (20)గా సంఘటనాస్థలంలో ఆధారాలను బట్టి గుర్తించారు. మృతుడి తండ్రి సాయిబాబాను విచారించినపుడు మహేష్‌బాబు తమ గ్రామానికే చెందిన తమనంపూడి రామకృష్ణారెడ్డి అనే ధాన్యం వ్యాపారి వద్ద ఏడాదిన్నర కాలంగా పనిచేస్తున్నాడని తెలిపారు. కృష్ణారెడ్డి గత కొంతకాలంగా ధాన్యం వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈనేపథ్యంలో అప్పులు తీర్చడానికి నకిలీ నోట్ల వ్యవహారం కూడా ప్రారంభించాడు. చివరకు సులువుగా డబ్బు సంపాదించడానికి ఒక పథకం పన్నాడు. తనవద్ద పనిచేసే మహేష్‌బాబుపై సుమారు రూ.26 లక్షల మేర రెండు బీమా పాలసీలు చేయించి, వాటికి సంబంధించిన బాండ్లు తన వద్ద ఉంచుకున్నాడు. అతని తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక వృద్ధురాలిని నామినిగా పెట్టించాడు. తరువాత మహేష్‌బాబును తాగుడుకు బానిసగా మార్చాడు. వెంకటరెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో మహేష్‌ను హత్య చేయించడానికి లక్ష రూపాయలకు వీర్రాజు అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం మహేష్‌బాబును మద్యం తాగించి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మీదుగా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మురారి గ్రామం తీసుకువచ్చారు. మిల్క్‌డెయిరీ వద్ద పాడుపడిన టెలిఫోన్ భవనంలో వీర్రాజు, వెంకటరెడ్డి, షేక్ ఫకీరు (అనపర్తి) కలిసి చొక్కాను మహేష్‌బాబు మెడకు బిగించి, ఊపిరి ఆడకుండాచేసి, హత్యచేశారు. తరువాత మహేష్‌ను జాతీయ రహదారిపై పడవేయగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. మహేష్ చనిపోయాడని నిర్ధారించుకున్న వీరు తమ గ్రామాలకు వెళ్లిపోయారు. అలాగే పిట్టల వేమవరం గ్రామానికి చెందిన కుంజా వరారత్నం అనే వ్యక్తి పేరిట కూడా రూ.16 లక్షలకు బీమా చేయించి, ఇలాగే హత్య చేయడానికి వ్యూహం సిద్ధం చేశారు. ఈలోగా పోలీసు దర్యాప్తులో మహేష్ హత్యోదంతం బయటపడటంతో ఈ పథకం బెడిసికొట్టింది. సెల్‌ఫోన్ సంభాషణల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. ఈ ముఠా సభ్యులను అరెస్టు చేయడంతోపాటు మూడు మోటారు సైకిళ్లు, నాలుగు సెల్ ఫోన్లు, హత్యకు కోనే వీర్రాజుకు ఇచ్చిన రూ.25 వేలు నగదు, బీమా బాండ్లు స్వాధీనం చేసుకున్నారు.
చాకచక్యంగా కేసు ఛేదించిన సిఐ భరత్ మాతాజీని, ఎస్‌ఐ బివి రమణను డిఎస్పీ కరణం కుమార్ అభినందించారు. దర్యాప్తులో చురుగ్గా పాల్గొని కేసు ఛేదించేందుకు సహకరించిన పోలీస్ సిబ్బంది ఎస్‌ఎస్ ప్రకాశరావు, ఎస్‌వి రమణ, సిహెచ్‌వి రమణ, కె సూరిబాబు, హోమ్‌గార్డులు ఎస్ సోమరాజు, కె రాంబాబు, కె నాగేశ్వరరావులు డిఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. అలాగే పోలీసు బృందానికి జిల్లా ఎస్పీ ద్వారా రివార్డులకు సిఫార్సు చేసినట్టు డిఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పీ కరణం కుమార్ గురువారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఒక వ్యక్తిపై అధిక మొత్తంలో వేరే ఎవరైనా బీమా చేయిస్తే వారిని నమ్మవద్దని, ఇది ఆ వ్యక్తి ప్రాణానికే ముప్పు అని గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యవహారంలో బాధితులు, కుట్రదారులు పశ్చిమగోదావరి జిల్లా వాసులు కాగా, నేరం జరిగిన ప్రదేశం, ఛేదించింది తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన జగ్గంపేట ఇన్‌స్పెక్టర్ పంజా భరత్‌మాతాజీ పశ్చిమగోదావరి జిల్లా వాసి కావడం కొసమెరుపు.
కేంద్రం దృష్టికి పొగాకు రైతుల సమస్యలు
-కొయ్యలగూడెంలో కేంద్ర మంత్రి వాయలార్ రవి హామీ
జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, ఏప్రిల్ 19: వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల తాత్కాలిక ఇన్‌ఛార్జి వాయిలార్ రవి హామీ ఇచ్చారు. కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు వేలాన్ని పరిశీలించారు. అనంతరం పొగాకు రైతుల వినతి పత్రం స్వీకరించారు. రైతు సమస్యలపై వర్జీనియా పొగాకు రైతు సంఘాల నేతలు గద్దే శేషగిరిరావు, కరాటం వెంకటరెడ్డి నాయుడు, కాకర్ల సూర్యప్రకాశరావు, ఆచంట గోపాలకృష్ణ, గెడ్డమణుగు సత్యనారాయణ మంత్రికి వివరించారు. వారితో పాటు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివరావు కూడా ఆంగ్లంలో మంత్రికి పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. దీనిపై వాయిలార్ రవి మాట్లాడుతూ పొగాకు వేలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రైతులు ఆహ్వానిస్తున్నారని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి కూడా తీసుకు వెళతానని అన్నారు. దేశానికి ఆహారాన్ని అందిస్తున్న జిల్లాలు గోదావరి జిల్లాలని కొనియాడారు. ఈ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో పొగాకు, పామాయిల్, మొక్కజొన్న, చెరకు తదితర వాణిజ్య పంటలు పండించడం అభినందనీయమని అన్నారు. రైతులకు సేవ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పొగాకు వేలంలో ఒక కంపెనీ గుత్త్ధా పత్యం చెలాయిస్తున్న వైనం తన దృష్టికి వచ్చిందని, విదేశీ కంపెనీలు వేలంలో పాల్గొంటే ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయని అభిప్రాయ పడ్డారు. రైతులకు మంచి ధర లభించినా సిగరెట్ ధరలు పెరిగిపోతాయని, క్రమేణా పొగ త్రాగడం తగ్గిపోతుందన్నారు. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతుల రుణాలు రీషెడ్యూల్ చేసినప్పటికీ రైతుల వద్ద సాధారణ రుణాలకు 7 శాతం వడ్డీ వసూలు చేసి, రీషెడ్యూల్ చేసిన రుణాలకు 14శాతం వడ్డీ వసూలు చేయడంపై ఢిల్లీలో సంబంధిత శాఖలతో చర్చించి న్యాయం చేస్తానని రవి హామీ ఇచ్చారు.
అంతేగాకుండా రైతులు తీసుకునే రుణాలపై వసూలు చేస్తున్న స్టాంప్ డ్యూటీ రద్దు చేసే విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. తొలుత ఎం.పి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ పొగాకు రైతులు జీవితాలు దర్భరంగా మారాయని వాయిలార్ రవి దృష్టికి తెచ్చారు. దేశంలో పండించే నాణ్యమైన పొగాకు ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలోనే పండుతున్నా, ఒక కంపెనీ గుత్త్ధాపత్యం వల్ల గిట్టుబాటు ధరలు లభించడం లేదన్నారు. విదేశీ కంపెనీలను వేలానికి అనుమతిస్తే పొగాకు రైతుల తల రాతలు మారతాయన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. వేలం కేంద్రం వద్ద కేంద్ర మంత్రి వాయిలార్ రవికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.వాణీమోహన్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పి.సి.సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు వట్టి వసంతకుమార్, పితాని సత్యనారాయణ, పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్, టి.రత్నాబాయి, శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, మద్దాల రాజేష్‌కుమార్, బంగారు ఉషారాణి, డి.వై.దాసు, డిసిసిబి ఛైర్మన్ కరాటం రాంబాబు, నేతలు కోటగిరి విద్యాధరరావు, జెట్టి గురునాధరావు, మేడవరపు అశోక్‌బాబు, మట్టా సత్తిపండు తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులపై బాబు హామీల వర్షం
రోడ్ షోకు విశేష స్పందన
భీమవరం, మొగల్తూరు 19: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మత్స్యకారులకు వరాల జల్లు కురిపించారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మొగల్తూరు మండలంలో గురువారం రాత్రి చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షోలో చంద్రబాబునాయుడుకు విశేష స్పందన లభించింది. అడుగడుగునా ప్రజలు చంద్రబాబుకు నీరాజనాలు పలికారు. పూలమాలలతో ముంచెత్తారు. మొగల్తూరు మండలంలోని ఆయా ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించి పెదమైనవానిలంకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ జనరేటర్‌తో నీటిని తోడుకునే ఉప్పురైతులకు కరెంటు ఇస్తామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఉప్పును ఉపాధిగా గుర్తిస్తామని తెలిపారు. ఆదాయం పెరిగేకొద్దీ ఉప్పురైతులపై ఈ ప్రభుత్వం పన్నులు వేస్తుందని ఎద్దేవా చేశారు. వాతావరణంలో వచ్చిన మార్పులవల్ల ఉప్పురైతులు ఎంతోనష్టపోతున్నారని, వారిని ఆర్దికంగా ఆదుకుంటామన్నారు. కలుషితమైన పరిశ్రమలు పెట్టి మత్స్యకారులను వేటకు వెళ్ళనీయకుండా ఈ ప్రభుత్వం చేస్తుందని ఆయన మండిపడ్డారు. వైయస్.రాజశేఖరరెడ్డి నష్టపోయిన మత్స్యకారులకు కనీసం పునరావాసం కూడా కల్పించలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నిరకాలుగా మేలు చేస్తామన్నారు. రూ.1.26లక్షలతో మత్స్యకారులకు బ్రహ్మాండమైన ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు. 50 ఏళ్ళు పైబడిన వారికి రూ.500 ఫించను ఇస్తామని చెప్పారు. పేదపిల్లలను ఉచితంగా చదివిస్తామని వెల్లడించారు. పెదమైనవానిలంకలో తెలుగుదేశం పార్టీ పాఠశాలలను కూడా నిర్మిస్తామని తెలిపారు. నల్లక్రీకును అభివృద్ధి చేస్తామన్నారు. కెపి.పాలెం, చినమైనవానిలంక, వేములదీవి, బియ్యపుతిప్ప వరకు బీచ్‌రోడ్‌గా అభివృద్దిచేసేందుకు తెలుగుదేశం పార్టీ కృషిచేస్తుందని తెలిపారు. సీతారామపురం తూర్పుకాలువగట్టు నుంచి పెదమైనవానిలంక వరకు రివిట్‌మెంట్‌లను ఏర్పాటుచేస్తామని తెలిపారు. గోదావరి డెల్టా ప్రజలకు నీళ్ళు ఇవ్వని ఈ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వమని ఆయన విమర్శించారు. తాను ఎనిమిదేళ్ళుగా ఈ ప్రభుత్వపరిపాలన చూసి ఎంతో బాధపడ్డానని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహనరెడ్డికి బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో ఎన్నో భవంతులు ఉన్నాయని, ఒక వ్యక్తికి అసలు ఎన్ని ఇళ్ళుంటాయని ప్రజలను ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించకుండా వైయస్ మొండికాలువలు తవ్వాడని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఐదేళ్ళలో పూర్తిచేస్తే అసెంబ్లీలో సన్మానం చేస్తానని చెప్పామని గుర్తుచేశారు.
నా తమ్ముళ్ల జోలికి రావద్దు ఖబడ్దార్
తెలుగుతమ్ముళ్ళను కొందరు బెదిరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, నా తమ్ముళ్ళజోలికి రావద్దు ఖబడ్ధార్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. నరసాపురం ఉప ఎన్నికల అభ్యర్దిగా బరిలో ఉన్న డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణను అఖండ మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
ప్రాథమిక పాఠశాలలో మంటలు
మధ్యాహ్న భోజనం షెడ్డులో సిలెండర్ నుండి లీకేజీ - పిల్లల పరుగు - అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
ఆకివీడు, ఏప్రిల్ 19: స్థానిక ఎస్‌కెవిఆర్‌ఎల్ ప్రాథమిక పాఠశాలలో గురువారం అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పాఠశాల విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజన పథకం కోసం ఏర్పాటు చేసిన వంటషెడ్డులోని సిలెండర్ నుంచి గ్యాస్ లీకై పెద్దయెత్తున మంటలు ఎగసిపడడంతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటకు పరుగులు తీసి చుట్టుపక్కలవారిని రక్షించమంటూ ఆర్తనాదాలు చేశారు. ప్రతీరోజూ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా భోజనాలు వండేందుకు నిర్వాహకురాలు బొల్లా అమ్మాజీ పాఠశాల వెనుకభాగాన ఉన్న వంటషెడ్డులో వంటలు చేసేందుకు గ్యాస్ పొయ్యిని వెలిగించింది. అయితే అకస్మాత్తుగా ట్యూబ్ నుంచి గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో ఆమె బయటకు వచ్చి విద్యార్థులను బయటకు వెళ్ళిపోవాలంటూ కేకలు వేసింది. ఉపాధ్యాయులు కేకలు వేయడంతో విద్యార్థులంతా ఒక్కసారిగా పాఠశాల బయటకు వచ్చి పాఠశాలలో మంటలు చెలరేగుతున్నాయంటూ ఆర్తనాదాలు చేశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారి సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకుని తడిచేసిన గోనెసంచులను వంటశాలలోకి విసిరి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ మంటలు చెలరేగడంతో కార్బన్ డయాక్సైడ్ వాయువును పంపి మంటలు అదుపుచేశారు. ఈ సంఘటనలో వంటల నిర్వాహకురాలు బొల్లం అమ్మాజీ చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న పంచాయతీ కార్యాలయం నుండి సిబ్బంది వచ్చి విద్యార్థులకు సహాయ సహకారాలు అందించారు. గ్యాస్ రెగ్యులేటర్ సక్రమంగా లేకపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని అగ్నిమాపకశాఖ అధికారి సుబ్బారావు నిర్ధారించారు.