Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

$
0
0

విజయవాడ , ఏప్రిల్ 19: నగర పోలీసు కమిషనర్ గురువారం కమిషనరేట్‌లో నిర్వహించిన క్రైం మీటింగ్ వాడివేడిగా కొనసాగింది. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణ, శాంతి భద్రతలు, రౌడీయిజం అణచివేత, ట్రాఫిక్ సమస్యలు తదితర అంశాలపై అధికారులకు పోలీసు కమిషనర్ ప్రత్యేక సూచనలు చేశారు. నగరంలో సీనియర్ సిటిజన్స్ ఉండే ప్రాంతాలు ఇళ్లను గుర్తించి సంబంధిత ప్రాంతాలను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. తద్వారా సీనియర్ సిటిజన్స్‌కు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని వారికి అందుబాటులో ఉండాలని, అదేవిధంగా భద్రతకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు వారికి తెలియచేస్తూ అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లను వారికి ఇవ్వాలని, అదేవిధంగా ఒంటరిగా నివాసం ఉంటున్న సీనియర్ సిటిజన్స్‌ను గుర్తించి వారి భద్రత విషయంలోనూ, అదేవిధంగా వారికి అందుబాటులో ఉన్న సర్వెంట్స్, డ్రైవర్లు తదితర వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులను సమీక్షించి ట్రేసింగ్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతోపాటు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. దొంగతనాలు కట్టడి చేసేందుకు బీట్‌లు, పెట్రోలింగ్ విధులను సమర్థంగా నిర్వహించాలని, అదేవిధంగా పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించి వారిపై పటిష్ఠమైన నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అపార్ట్‌మెంట్‌లు, కాలనీల్లో నివసించేవారు ఇళ్లకు తాళాలు వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేస్తూ విలువైన వస్తువులను ఎక్కువగా ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలోగాని, ఇతర ప్రదేశాల్లో భద్రపరచుకోవడం శ్రేయస్కరంగా ప్రజలకు సూచించి అవగాహన కలిగించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల వీధి రౌడీయిజం అదేవిధంగా న్యూసెన్స్‌లకు పాల్పడే వ్యక్తులపై దృష్టి సారించి వారిపై షీటు తెరవడం జరగిందని, షీట్లు తెరవడంతోపాటు ఇలాంటి వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ సంబంధిత పోలీస్టేషన్, టాస్క్ఫోర్స్‌లో ప్రతి వారం వారి హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో పెద్ద పెద్ద వాణిజ్య భవనాలు, షాపుల్లో సిసి కెమేరాలు ఏర్పాటు చేయడంతోపాటు రాత్రివేళల్లో వాటిని స్విచ్ ఆఫ్ చేయకుండా, అదేవిధంగా కరెంటు కోత సమయంలో ప్రత్యామ్నయ ఏర్పాటు చేసుకునేలా యాజమాన్యాలకు సూచించాలన్నారు. అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల ప్రధాన ద్వారం కూడా ఈ కెమేరాలు ఉంచాలన్నారు. అదేవిధంగా హోటళ్ల రిసెప్షన్ వద్ద కూడా ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు వాటి పనితీరును విశే్లషించుకోవాలన్నారు. ఇక నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు అనుసరించాల్సిన విధానాలు, ప్రణాళికలపై చర్చించి, నగర రోడ్లపై ట్రాఫిక్ పరిస్థితులపై సమీక్షించారు. నగరంలోని జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రధానంగా ప్రదేశాలను గుర్తించా ఆయాప్రాంతాల్లో రోడ్ నెట్‌వర్క్ తదితర ఇంప్రూవ్‌మెంట్స్ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గత నెలలో మొత్తం 35 రోడ్డు ప్రమాదాలు జరగ్గా అందులో తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై 13, ఐదో నెంబర్ జాతీయ రహదారిపై 9 ప్రమాదాలు జరిగాయన్నారు. వీటిలో ఎక్కువ ప్రమాదాలు రాత్రి వేళలో జరిగిన నేపథ్యంలో జాతీయ రహదారులపై వాహనాల వేగంపై నిఘా ఉంచేందుకు పోలీసుశాఖ తరుఫు నుంచి ఒక హైవే పెట్రోలింగ్ వాహనం, ట్రాన్స్‌పోర్టు శాఖ నుంచి ఒక స్పీడ్‌గన్ హైవే పెట్రోలింగ్ ఇంటర్సెప్టార్ వాహనాలతో పెట్రోలింగ్ చేయించి సంయుక్తంగా ట్రాన్స్‌పోర్టు శాఖతో కలిసి రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గత నెలలో స్పీడ్‌గన్ ఇంటర్‌సెప్టార్ వాహనం ద్వారా 1170 కేసులు నమోదు చేసినట్లు సీపి వెల్లడించారు. ఇదిలావుండగా సమీక్ష అనంతరం మార్చి నెలలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వివిధ కేసులు సంఘటనలకు సంబంధించి విధి నిర్వహణలో మెరుగైన పనితీరు ప్రదర్శించి ప్రతిభ చూపిన 22మంది సిబ్బందికి, అధికారులకు నగదు రివార్డులు అందించిన సీపి వారిన అభినందించారు.

పోలీసుల పహారాలో ప్రజాపథం
సబ్‌కలెక్టరేట్, ఏప్రిల్ 19: గులాబితోటలో జరిగిన ప్రజాపథం ఆద్యంతం పోలీసుల పహారాలో కొనసాగింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సభను బహిష్కరించడంతో స్థానికులెవ్వరూ ఉదయం 10 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొనలేదు. దీంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ యాదల శ్రీనివాసరావును, 8 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపథం కార్యక్రమం గురువారం ఉదయం 44వ డివిజన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా గులాబీతోటలో ఏర్పాటు చేసిన సభలో విష్ణు మాట్లాడుతూ భానూనగర్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బి ఫారం పట్టాలు ఉన్నవారికి రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు పట్టాలు లేనివారికి వాటిని ఇప్పించేలా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని విష్ణు అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. డివిజన్‌లోని చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు పూర్తిస్థాయిలో జవాబుదారీతనంతో వ్యవహరిస్తుందని చెప్పారు. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు అన్యాయం చేయదని ఆయన వివరించారు. మున్సిపల్ కమిషనర్ జి.రవిబాబు మాట్లాడుతూ వ్యాధుల పట్ల ప్రజలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్పొరేషన్ పంపిణీ చేస్తున్న తాగునీటినే వాడాలని చెప్పారు. ప్లాంట్‌ల్లో తయారయ్యే నీటిలో క్లోరిన్ శాతం తక్కువగా ఉంటుందని అందువల్ల ఆ నీటిని తాగకూడదని కమిషనర్ తెలియజేశారు. క్లోరిన్ శాతం తక్కువగా ఉన్న వాటర్ ప్లాంట్లను మూసివేయడం జరుగుతుందని రవిబాబు చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. సభ ముగిసిన తర్వాత 58 డ్వాక్రా గ్రూపులకు రెండు లక్షల ఐదు వేల రూపాయల చెక్కును గ్రూపు సభ్యులకు కమిషనర్, ఎమ్మెల్యే అందజేశారు. సభకు నోడల్ అధికారి భాస్కర్ అధ్యక్షత వహించి ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. పౌర సంఘాల శాఖాధికారి కోమలి పద్మ, ఎమ్మార్వో శ్రీనివాస్‌తోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సమస్యలపై వివరిద్దామని సభాప్రాంతానికి వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 44వ డివిజన్ కన్వీనర్ చైతన్య, ఇ.రాజు, బాబాఖాన్, శ్రీదేవి, 8మంది కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పటమట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సభ ప్రారంభానికి ముందే పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండపల్లి సత్యం, వీరమాచినేని కిషోర్, అఫ్రినా సుల్తానా, నాగలక్ష్మి, బి.మురళి, ఉమ్మడి వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.

27న రాధాకు వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం
గాంధీనగర్, ఏప్రిల్ 19: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఆశయాలు నచ్చినందున తాను ఆ పార్టీలో చేరనున్నట్లు వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. స్థానికంగా ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో తాను వ్యక్తిగతంగా కల్సుకోవడం, జగన్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు. 1983-84 నుంచి తమ కుటుంబమంతా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో శ్రమిస్తూ వస్తోందని, తమ వల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో గౌరవం, మన్నన లభించడం తద్వారా ప్రజల మద్దతుతో గెలుపొందడం జరిగిందని అన్నారు. 1988లో తన తండ్రి కాంగ్రెస్ పార్టీ కోసమే ప్రాణత్యాగం చేశారన్నారు. వైఎస్ పాదయాత్రలో కూడా తమ మద్దతు తెలిపామని తెలిపారు. 1983 నుండి తన తండ్రి ఆశీస్సులతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా అభిమానం పొందామని, ఒక్క కృష్ణా జిల్లాలోనే కాక జిల్లాలన్నింటిలో తమకు అభిమానులు ఉన్నారని అన్నారు. ఈ రోజున రంగా ఆశయాలపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ నాయకులు బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నాకు నచ్చినట్లు నేను చేస్తాను కానీ ఎవరి ఆలోచనలతో పనిలేదని 3సంవత్సరముల నుండి చేస్తున్న కృషికి తగిన ఫలితమే తనకు లభించిన సభ్యత్వం అన్నారు. రాష్ట్రంలో పార్టీ ముందుకెళ్ళేందుకు తనవంతు కృషి చేయగలనని తెలిపారు. జగన్ నిర్ణయం ఆధారంగానే తనకు పదవి కేటాయించటం జరుగుతుందని, పదవిపై తనకు ఏ విధమైన ఆశలేదని అన్నారు. తనకు ఏ విధమైన కుల, మత, రాజకీయ విభేదాలు లేవని అందరూ ఒకటేనని అందరికీ సేవచేయడమే తన కర్తవ్యమని తెలిపారు. ఈ నెల 27వ తేదీన వంగవీటి రంగా విగ్రహం వద్ద వైఎస్ జగన్‌ను కలిసి పార్టీలో చేరతామని అన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు బుద్ధా జగన్నాథం, బొడ్డు అప్పలనాయుడు ఆర్య వైశ్య సంఘ నేత దర్శి వాసు, రాధా రంగా మిత్రమండలి నేత కర్నాటి వెంకటేశ్వరరావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఎయు పరిధిలో 200 పిజి మెడికల్ సీట్లు
హెల్త్‌వర్సిటీ, ఏప్రిల్ 19: డా.ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గురువారం నుంచి ప్రారంభమైన ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలోని పిజి మెడికల్ సీట్ల కౌనె్సలింగ్‌లో 200 సీట్లను భర్తీ చేశారు. ఈ కౌనె్సలింగ్ పిజి మెడికల్ ప్రవేశ పరీక్షలలో ఫస్ట్ ర్యాంకర్ ఐ.శ్రీవాణికి ఓపెన్ కేటగిరిలో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎండి రేడియో డయాగ్నోస్టిక్స్ సీటును కేటాయించారు. డా.శ్రీవాణి రాజమండ్రిలోని జిఎస్‌ఎల్ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్‌ను పూర్తి చేశారు. 5వ ర్యాంకర్ డా.ఎన్.అనే్వష్‌కు బిసి బి క్యాటగిరిలో ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎండి జనరల్ మెడిసిన్ సీటును కేటాయించారు. గురువారం జరిగిన కౌనె్సలింగ్‌లో ప్రయారిటీ ర్యాంకర్లు పాల్గొనడం, క్లీనికల్ డిగ్రీల సీట్లు ఎక్కువగా ఉండటం చేత అభ్యర్థులు వారికి కావలసిన సీట్లను వేగవంతంగా ఎంచుకోవడం వల్ల కౌనె్సలింగ్ ప్రక్రియ సాయంత్రం లోపు ముగిసింది. ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలోని మొత్తం 534 పిజి మెడికల్ సీట్లకుగాను 200 సీట్లు భర్తీకాగా, ఇందులో ఓసి క్యాటగిరీలో 91, బిసి 67, ఎస్‌సి 30, ఎస్‌టి 12 భర్తీ అయ్యాయి. 196 క్లీనికల్ డిగ్రీలు, 4 క్లీనికల్ డిప్లొమాలకు సంబంధించిన సీట్లను భర్తీ చేశారు. శుక్రవారం జరిగే కౌనె్సలింగ్‌లో మిగిలిన 334 సీట్లలో 200, శనివారం 134 సీట్లను భర్తీ చేస్తారు.

రియల్ ఎస్టేట్ రంగాన్ని ముంచిన ఇసుక తుఫాన్
పాయకాపురం, ఏప్రిల్ 19: రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇసుక తుఫాన్ మింగేయడంతో నగరంలో వేలసంఖ్యలో ఉన్న గృహనిర్మాణాలు ఒక్కసారిగా నిలిచిపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో వందలాదిగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు వీధినపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకవైపు కోర్టు ఇసుక తవ్వకాలపై నిషేధం విధించడంతో ఇసుక తవ్వకాలను ప్రభుత్వం నిలిపివేయించింది. దీంతో భవన నిర్మాణ పనులకు అతి ముఖ్యమైన ఇసుక కొరత ఏర్పడటం వల్ల రెండు నెలల క్రితం వరకు యూనిట్ ఇసుక 1,750 ఉంటే ప్రస్తుతం దాని ధర ఐదువేలకుపైగానే ఉంది. అయినప్పటికీ ఇసుక దొరకని స్థితి నగరంలో నెలకొంది. దీనికి తగ్గట్టుగానే ఐరన్ ధరలు కూడా గత మూడు నెలల్తో పోలిస్తే అప్పట్లో టన్ను ఐరన్ ధర 42 వేలుంటే ప్రస్తుతం దాని ధర 58వేలకు పైగానే చేరుకుంది. కంకర, ఇటుక ధరలు కూడా గణనీయంగా పెరిగిపోవడంతో వెంచర్లు వేసి గణనీయమైన ఆదాయన్ని సమకూర్చుకుందామనుకున్న రియల్ ఎస్టేట్ నిర్వాహకుల కలలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఇప్పటికే ఎక్కడి నిర్మాణాలు అక్కడ అర్ధంతరంగా నిలిచిపోవడం, నిర్మాణానికి కీలకమైన వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం బిల్డర్లను, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని కలవరపరుస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబీకులైతే అసలు భవన నిర్మాణాల జోలికే వెళ్లడానికి భయపడే స్థితి ఉంది. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించినవారు సైతం నిర్మాణ వస్తువుల ధరలు తగ్గిన తర్వాత నిర్మాణాల్ని తిరిగి ప్రారంభిద్దామనే ఆలోచనతో వాటి జోలికి వెళ్లడం లేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. భవన నిర్మాణాలకు ఇది మంచి సీజన్ కావడంతో ఈ నాలుగు నెలలు కష్టించి పనులు చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకుందామంటే ఇసుక కొరత, కంకర, ఇటుక, ఐరన్ ధరల పెంపు కారణంగా నిర్మాణాలు ఆగిపోవడం వల్ల వీరు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. నగరంలో దాదాపుగా ఎక్కడ చూసినా భవన నిర్మాణ పనులు (చిన్న, మధ్యస్థ స్థాయికి సంబంధించి) ఆగిపోయే కనిపించడంతో ఎవరూ వీరిని పనులకు పిలువక కుటుంబాలతో సహా ఆకలితో అలమటిస్తూ మంచినీళ్లు తాగి జీవనం గడపాల్సి వస్తుందని పలువురు భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధమైన పరిస్థితి మరో నెలరోజులపాటు కొనసాగితే రైతుల ఆత్మహత్యల మాదిరిగానే భవన నిర్మాణ రంగ కార్మికులు సైతం ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆశాజనకంగా లేని మామిడి సీజన్
నూజివీడు, ఏప్రిల్ 19:వాతావరణం లో ఏర్పడిన ప్రకృతి ప్రతికూల పరిస్ధితుల ప్రభావం తో మామిడి కాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయాయి. ఈ ఏడాది మామిడి సీజన్ చాలా బాగుంటుందని రైతులు ఎంతో ఆశపడ్డారు. గత ఏడాది సీజన్ ముగిసిన తరువాత వర్షాలు పడటం తో మామిడి చెట్లకు రైతులు బలం చేశారు. ఫలితంగా దట్టంగా ఆకులు వచ్చాయి. దీంతో మామిడి కాయల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, ఆర్ధికంగా నష్టాల బారి నుండి బయట పడవచ్చని రైతులు ఎంతో ఆశపడ్డారు. అయితే ప్రస్తుతం రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. ప్రకృతి ప్రతికూల పవనాల వల్ల మామిడి దిగుబడి చాలా దారుణంగా పడిపోయింది. అకాల వర్షాలు, అధికమంచు, వేడి వాతావరణం మామిడి రైతులను నట్టేటముంచాయి. డిసెంబర్, జనవరి నెలల్లో కురిసిన అకాల వర్షాల ప్రభావం తో పూత రావాల్సిన ‘బడ్స్’ నుండి అనలు వచ్చాయి. అంతంత మాత్రంగా వచ్చిన పూత కూడా వివిధ తెగుళ్ళ బారిన పడి రాలిపోయింది. ఏతావాతా మామిడి రైతు ఈ సీజన్ కుదేలయ్యే పరిస్ధితులు ఏర్పడ్డాయి. కేవలం 20 నుండి 30 శాతం మామిడి తోటల్లో మాత్రమే మామిడి కాయలు ఉన్నాయి. నిండు మామిడి కాయలతో కళకళలాడాల్సిన మామిడి తోటలు దట్టమైన ఆకులతో దర్శనం ఇస్తున్నాయి.
రాష్ట్రంలో మామిడి పంట 3.41 లక్షల ఎకరాల విస్తీర్ణం లో సాగు అవుతుండగా, ఒక్క కృష్ణాజిల్లా లో 1.70 లక్షల ఎకరాల విస్తీర్ణం లో సాగు అవుతూ సాలినా కనీసం 20 లక్షల టన్నులకు పైగా మామిడి కాయలు ఉత్పత్తి అవుతున్నాయి. వేలాది కుటుంబాలకు మామిడి పంట ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనాధారంగా ఉంది. అయితే గత దశాబ్దకాలం నుండి మామిడి మామిడి కాయలను ఉత్పత్తి చేస్తున్న రైతులు చేదు అనుభవాన్ని చవి చూస్తున్నారు. మామిడి కాయలు బాగా ఉత్పత్తి అయిన సమయం లో మార్కెట్ లో నిలకడగా ధరలేకపోవటం, మార్కెట్ లో ధర ఉన్న సమయం లో పంట లేకపోవటం జరుగుతోంది. దీంతో రైతులు ఆటు పోట్ల కు గురి అవుతూ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. గతం తో మామిడి కాయల వ్యాపారం చేసే వారు అక్టోబరు, నవంబరు నెలల్లోనే మామిడి చెట్ల పరిస్దితులను బట్టి బేరమాడి కొనుగోలు చేసేవారు. రైతులకు కొంత నగదు బజానాగా ఇచ్చేవారు. ఎకరం కనీసం పది వేల నుండి 20 వేల రూపాయల వరకు కొనుగోలు చేసేవారు. తోటలను కొనుగోలు చేసి మారుబేరాలకు విక్రయించి అధికలాభాలను అర్జించే వారు. ఢిల్లీ కి చెందిన బడా సేఠ్ లు నూజివీడు లో మకాం వేసి పెద్ద స్ధాయి లో మామిడి తోటలు కొనుగోలు చేసేవారు. ఇదంతా చరిత్ర గా మిగిలిపోయింది. ప్రస్తుత సీజను లో మామిడి తోటలను కొనుగోలు చేసే నాధుడే కరవైనారు. మామిడి తోటల కొనుగోళ్ళు అంతగా జరక్కపోవటం తో పంట సస్యరక్షణ కు అవసరమైన నగదును రైతులే భరించుకోవాల్సి వస్తోంది. ప్రవేటు వడ్డీ వ్యాపారుల నుండి డబ్బులు అప్పుగా తీసుకుని మామిడి రైతులు పంట ను సాగుచేస్తున్నారు.
నిలకడలేని ధరతో రైతు గగ్గోలు
స్ధానిక మార్కెట్‌లో మామిడి పంటకు ధర నిలకడగా లేకపోవటం తో రైతులు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. సీజన్ ప్రారంభం బంగినపల్లి రకం కాయలు కనీసం 25 వేల నుండి 35 వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. ఈ ధర ను చూసిన రైతులు పక్వానికి రాని మామిడి కాయలను కూడా కోసి మార్కెట్ కు తరలిస్తుండటం, వాటిని కోనుగోలు చేసేందుకు వ్యాపారులు నిరాకరించి తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో మామిడి రైతులు డీలా పడుతున్నారు. అదేవిధంగా టన్ను మామిడి కాయలకు కనీసం పది నుండి 15 శాతం మామిడికాయలను దళారులు తీసి వేయటం తో రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీనికి తోడు పది శాతం కమీషన్ కూడా దళారులకు వసూలు చేయటం తో మామిడి పంట గిట్టుబాటు కావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి ధర ను నిర్ణయించి, మామిడి రైతుల శ్రేయస్సు కోసం పుగాకు బోర్డు మాదిరిగా మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

కొర్లమండలో ఉన్మాది వీరంగం
విస్సన్నపేట, ఏప్రిల్ 19: మండలంలోని కొర్లమండలో గురువారం తెల్లవారుజామున తేళ్ళూరి మధు అనే ఉన్మాది కత్తితో స్వైర విహారం చేయడంతో కె సత్యం గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. చాట్రాయి మండలం మర్లపాలెంకు చెందిన తేళ్ళూరి మధు కొర్లమండ దళితవాడకు చెందిన తమ బంధువుల ఇంటికి వచ్చాడు. బుధవారం ఉన్మాదిలా ప్రవర్తించడంతో బంధువులు అతడ్ని తాళ్ళతో బంధించి తెల్లవార్లు ఉంచారు. గురువారం వేకువజామున బహిర్భూమికి వెళ్ళాలని చెప్పడంతో బంధువులు అతని కట్లు తొలగించారు. అడ్డు తొలగిపోవడంతో ఒక్కసారిగా మధు వికృత చేష్టలకు పాల్పడి అక్కడ ఉన్నవారిని గాయపర్చాడు. చేతి కత్తి దొరకడంతో దళితవాడలోని వీధుల్లో చంపుతా, నరుకుతా అంటూ స్వైర విహారం చేశాడు. అతని చేష్టలు చూసి భయపడి దళితవాడలోని ప్రజలు తలుపులు వేసుకుని ఇళ్ళలో ఉండిపోయారు. ఇతనిని అడ్డుకోబోయిన సత్యం అనే వ్యక్తిని కత్తితో గాయపర్చాడు. ఈలోగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మధును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి క్షతగాత్రుడు సత్యాన్ని తిరువూరు ఆసుపత్రికి పంపినట్లు ఎస్సై కె పార్ధసారథి తెలిపారు.

భార్యపై దాడి చేసిన భర్తకు నెల రోజుల జైలు
కూచిపూడి, ఏప్రిల్ 19: భార్యపై దాడి చేసి గాయపర్చిన భర్తకు అవనిగడ్డ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అరుణశ్రీ నెల రోజుల జైలు శిక్ష విధించారని కూచిపూడి ఎస్‌ఐ మారగాని గిరి తెలిపారు. పెడసనగల్లు గ్రామానికి చెందిన మాతంగి లక్ష్మి గత యేడాది ఆగస్టు 8న మిఠాయి దుకాణం నుండి రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్ళినందుకు భార్యపై ఆగ్రహించిన భర్త బుజ్జి గాయపరిచాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి పైన తెలిపిన శిక్షను విధించారు.

పకడ్బందీ వ్యూహంతోనే
గంజాయి, వాహనాల సీజ్
* డిఎస్‌పి చందీనాయక్ వెల్లడి
నందిగామ, ఏప్రిల్ 19: తమ అధికారులు, సిబ్బంది పకడ్బందీ వ్యూహంతోనే జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టి రెండు వాహనాలు, 250 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు, వీటి విలువ సుమారు రూ. 25 లక్షల వరకూ ఉంటుందని నందిగామ డిఎస్‌పి చాందీనాయక్ వెల్లడించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భారీ ఎత్తున తరలిస్తున్న గంజాయి స్వాధీనంపై ఆయన వివరాలు వెల్లడించారు. ఇటీవల నేరాల నియంత్రణకు పరిసర జిల్లాల పోలీస్ అధికారులతో ఇక్కడి అధికారులు లైజనింగ్ మెయింటెన్ చేయడంతో విశాఖ జిల్లా పాడేరు నుండి రెండు వాహనాల్లో పెద్ద ఎత్తున గంజాయి హైదరాబాదుకు తరలివెళుతున్నట్లు నందిగామ సిఐ మురళీకృష్ణకు నల్లగొండ జిల్లా పోలీసు అధికారుల నుండి సమాచారం అందిందన్నారు. దీంతో సిఐ మురళీకృష్ణ, ఎస్‌ఐలు పి శ్రీను, వెంకటనారాయణ, సిబ్బంది, నందిగామ తహశీల్దార్ బి శ్రీనివాస్ సమక్షంలో జాతీయ రహదారిపై బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారన్నారు. ఆ సమయంలో టాటా సఫారీ ఎపి 31 బిఆర్ 3338, మారుతీ షిఫ్ట్ ఎపి 9హై టి/ఆర్ 9101 వాహనాలు రాగా వాటిని ఆపడంతో అందులోని వ్యక్తులు పాడేరుకు చెందిన సీసాల రమేష్, తూర్పు గోదావరి జిల్లా తోడంగి మండలం వేమవరానికి చెందిన నెమల తాతబ్బాయి, హైదరాబాదు వివేకానందనగర్‌కు చెందిన గాడిపత్తి అమరేంధర్, విశాఖ రూరల్ పాడేరుకు చెందిన మూసలగంటి రాజేష్ పారిపోయే ప్రయత్నం చేశారని, వారిని అదుపులోకి తీసుకుని ఆ వాహనాలను తనిఖీ చేయగా సఫారీలో 6 బస్తాలు, షిఫ్ట్‌లో రెండు బస్తాల్లో గంజాయి ఉండటాన్ని గమనించి స్టేషన్‌కు తరలించామన్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పాడేరుకు చెందిన మురళి, దయాను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. నందిగామ తహశీల్ధార్ బి శ్రీనివాస్ సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితులను అరెస్టు చేశామని, గురువారం కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గంజాయి రవాణాదారులను అరెస్టు చేసిన సిఐ, ఎస్‌ఐలు, సిబ్బందిని అభినందిస్తూ వారికి రివార్డుల కోసం ఎస్‌పికి సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు.

రెండు రోడ్డు ప్రమాదాల్లో బాలుడితో సహా
ఇద్దరి మృతి
* మరొకరికి గాయాలు
ఉయ్యూరు, ఏప్రిల్ 19 : ఉయ్యూరు, జగ్గయ్యపేట రూరల్ మండలాల్లో జరిగిన రెండు వెర్వేరు రోడ్డు ప్రమాదాలోల ఓ బాలునితో సహా ఇద్దరు మృతి చెందగా మరొకరు గాయపడిన సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉయ్యూరు మండలంలోని చినఓగిరాల వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఉయ్యూరు పట్టణ పోలీసుల కథనం ప్రకారం చినఓగిరాల గ్రామానికి చెందిన తుపాకుల శ్రీనివాసరావు(45),మంచిగంటి పరశురామ్(13) మండలంలోని ఆకునూరు అంబేద్కర్‌నగర్‌లో ఓ శుభకార్యానికి మేళం వాయించడానికి గురువారం ఉదయం వెళ్ళారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత టివిఎస్ ద్విచక్రవాహనపై తిరిగి వస్తుండగా ఓగిరాల సెంటర్ వద్ద విజయవాడ వైపు వెళుతున్న లారీ ఢీకొట్టి, పక్కనే ఉన్న ప్రయాణీకుల విశ్రాంతి భవనం వైపు దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో పరశురామ్ అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనివాసరావుకు, బస్టాపులో బస్సు కోసం వేచి ఉన్న ఆకునూరు గ్రామానికి చెందిన పీతల కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడకు చికిత్స కోసం తరలించారు. పరశురామ్ శవానికి పోస్ట్‌మార్టం నిర్వహించి ఎస్.ఐ జగదీష్‌చంద్రబోసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
జగ్గయ్యపేట రూరల్: 9వ నెంబరు జాతీయ రహదారిపై చిల్లకల్లు సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. చిల్లకల్లు పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం జాతీయ రహదారి విస్తరణ పనులు చేస్తున్న పుంజిలాయిడ్ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్న మధ్యప్రదేశ్ గుణ జిల్లా పట్టూరు గ్రామానికి చెందిన శివప్రకాష్ సింగ్ (35)ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరగ్గా గురువారం ఉదయం గుర్తించారు. అదే సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్న అరుణ్‌శంకర్ తివారీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిల్లకల్లు పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నగర పోలీసు కమిషనర్ గురువారం కమిషనరేట్‌లో నిర్వహించిన క్రైం మీటింగ్ వాడివేడిగా కొనసాగింది
english title: 
crime meeting

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>