గుంటూరు, ఏప్రిల్ 19: మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి మిర్చి రైతులను ఆదుకోవాలని, మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించే వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతూ గురువారం టిడిపి బృందం గుంటూరు మిర్చియార్డున సందర్శించింది. అనంతరం సర్కారు వైఖరికి నిరసనగా చిలకలూరిపేట రోడ్డుపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. తొలుత మిర్చియార్డున సందర్శించి మిర్చి ధరలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిర్చికి గిట్టుబాటు ధర లభించడం లేదని తెలుగుదేశం పార్టీ బృందం ఎదుట రైతులు వాపోవడంతో యార్డు కార్యదర్శిని కలిసి వివరణ కోరారు. ధరవరలపై జాతీయ, అంతర్జాతీయ స్థాయి సరుకు డిమాండ్ ఆధారంగా ఆధారపడి ఉంటుందని, అందునా ఎప్పటికప్పుడు ధరలను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నందున ఈ ఒక్కచోట ధరలను ఎవరూ ప్రభావితం చేయలేరని ఆయన సమాధానమిచ్చారు. తర్వాత తెలుగుదేశం నేతలు మిర్చియార్డు ఎదుట రోడ్డుపై బైఠాయించి, ధర్నాకు దిగారు. ధర్నానుద్దేశించి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, గత ఏడాది 12వేలు పలికిన మిర్చి క్వింటా ధర ఈ ఏడాది మూడువేలకు దిగజారడం రైతులను కుంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి ధరలు పెరగకుండా రైతులను నిలుపుదోపిడి చేస్తున్నారని, జిల్లా నుండి వ్యవసాయశాఖ మంత్రిగా కన్నా లక్ష్మీనారాయణ ప్రాతినిథ్యం వహిస్తున్నా రైతులకు ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని అన్నారు. గిట్టుబాటు ధర విషయమై అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. మిర్చిబోర్డును వెంటనే ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగం కనె్నర్ర చేస్తే ఈ ప్రభుత్వానికి పుట్టగతులుండవని హెచ్చరించారు. టిడిపి విప్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ మంత్రులు మామూళ్లకు అలవాటుపడి మార్కెట్‌యార్డుల వైపు కనె్నత్తి చూడటం లేదని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ను రంగంలోకి దించి మిర్చి ధర పతనం కాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి ఏడాది గుంటూరు యార్డుకు 42 కోట్ల ఆదాయం వస్తుందని, ఈ ఆదాయం నుండి 10 కోట్లు వెచ్చించి మార్క్‌ఫెడ్‌ను ఏర్పాటు చేసి కొనుగోలు చేయలేరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో మిర్చి, పసుపు, పత్తి, ధాన్యంకు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కోల్డ్‌స్టోరేజి యాజమాన్యం విపరీతంగా ధరలు పెంచితే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంఘ నాయకులు జంపని వెంకట్రాయుడు మాట్లాడుతూ రైతులందరూ సంఘటితంగా పోరాడితే ప్రభుత్వం దిగివస్తుందని, అప్పుడే రైతు సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, టిడిపి నాయకులు నిమ్మకాయల రాజనారాయణ, చల్లా అచ్చిరెడ్డి, దారపనేని నరేంద్ర, మానుకొండ శివప్రసాద్, చంద్రగిరి ఏడుకొండలు, షేక్ లాల్‌వజీర్, చిట్టాబత్తుని చిట్టిబాబు, ఎంఎవి జగన్నాథం, కనగాల చిట్టిబాబు, ముత్తినేని రాజేష్, కొర్రపాటి నాగేశ్వరరావు, అడకా శ్రీనివాసరావు, చుండూరు మురళీకృష్ణ, నాగళ్ల తిరుపతయ్య, కసుకుర్తి హనుమంతరావు, సగ్గెల రూబెన్, పులివర్తి కార్తీక్, వజ్జా రామకృష్ణ, జాన్ సైదా తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమం కోసం
2 వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ
గుంటూరు, ఏప్రిల్ 19: రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రస్తుతం జరుగుతున్న ప్రజాపథం కార్యక్రమంలో 2 వేల కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ పావలావడ్డీ బకాయిలను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గురువారం గుంటూరు రూరల్ మండలంలోని జొన్నలగడ్డ, రెడ్డిపాలెం, గొళ్లవారిపాలెం, అడవి తక్కెళ్లపాడు, గోరంట్ల పంచాయతీల పరిధిలో ప్రజాపథం కార్యక్రమం మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో గత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో కరవుతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం 1800 కోట్ల రూపాయలను ఇన్‌పుట్ సబ్సిడీగా మంజూరు చేసిందన్నారు. రైతులు తీసుకున్న పంట రుణాలకు పావలావడ్డీ బకాయిల కింద మరో 475 కోట్ల రూపాయలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించిందని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 2004 సంవత్సరం వరకు రైతులకు పంట రుణాలపై 11 శాతం వడ్డీ ఉండేదని, దీనిని కేంద్ర ప్రభుత్వం 7 శాతంకు తగ్గించిందని తెలిపారు. ప్రస్తుతం రైతులకు పావలావడ్డీ కింద రుణాలు అందిస్తుండగా రానున్న రోజుల్లో వడ్డీలేని రుణాలను మహిళలకు, రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 40 కోట్ల రూపాయలు ఇన్‌పుట్ సబ్సిడీ, మరో 40 కోట్ల రూపాయల పావలావడ్డీ బకాయిలను చెల్లించిందన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు 600 కోట్ల రూపాయలతో తాగునీటి పథకాల పనులను ప్రారంభించామని, వచ్చే రెండేళ్లలో ఈ పనులను పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. జొన్నలగడ్డలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మంచినీటి పథకానికి కోటి రూపాయలు మంజూరు చేశామని, రెడ్డిపాలెం పంచాయతీలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మరో 75 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల తెల్లరేషన్‌కార్డులు ప్రభుత్వం పంపిణీ చేసిందని, ఇవికాక మొదటి విడత రచ్చబండలో 4 లక్షలు, రెండవ విడత రచ్చబండలో 6 లక్షలు, మొత్తంగా 10 లక్షల తెల్లరేషన్ కార్డులను అదనంగా ప్రజలకు ఇచ్చామని చెప్పారు. రెండవ విడత రచ్చబండలో వచ్చిన అర్జీలను పరిష్కరించి అందుకు సంబంధించిన మంజూరు పత్రాలను మూడవ విడత రచ్చబండలో ప్రజలకు అందజేస్తామన్నారు. ప్రజాపథం కార్యక్రమంలో భాగంగా జొన్నలగడ్డలో 38 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 1,28,50,000 రూపాయల బ్యాంకు లింకేజీని చెక్కుల రూపంలో మంత్రి పంపిణీ చేశారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో పావలావడ్డీ బకాయిల కింద 89 సంఘాలకు 11,52,880 రూపాయల చెక్కులను మహిళలకు పంపిణీ చేశారు. జొన్నలగడ్డలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న 19 మంది లబ్ధిదారులకు 3,200 రూపాయల వంతున అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బి వెంకటరెడ్డి, గృహనిర్మాణ శాఖ పిడి సురేష్‌బాబు, వ్యవసాయశాఖ జెడి శ్రీ్ధర్, గుంటూరు రూరల్ మండల ప్రత్యేక అధికారి కె కృష్ణ, తహశీల్దార్ రజని, ఎండిఒ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల భవనం పైకప్పు కూలి కూలీ మృతి
గురజాల, ఏప్రిల్ 19: శిథిలమైన పాఠశాల భవనంలో కూలీలు పనిచేస్తుండగా పైకప్పు కూలిపోవడంతో ఒక కూలీ మృతి చెందగా, మరో కూలీకి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం పట్టణంలో జరిగింది. సంఘటన వివరాల ప్రకారం...స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌లో ఉన్న మండల పరిషత్ ఉర్థూ ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడిపోయి ప్రమాదకరంగా మారడంతో గత ఏడాది నుండి ఉర్ధూ పాఠశాలను స్థానిక పుట్ట్భావి ప్రాథమిక పాఠశాల భవనంలో కొనసాగిస్తున్నారు. ఉర్ధూ పాఠశాల పాత భవనాన్ని తొలగించి, నూతన భవనాన్ని నిర్మించేందుకు పది లక్షల 64వేల రూపాయల నిధులు మంజూరయ్యాయి. పాఠశాల పాత భవనాన్ని కూలుస్తుండగా ప్రమాద వశాత్తు పైకప్పు ఊడి కూలీలపై పడింది. దీన్ని గమనించిన స్థానికులు కూలీలను రక్షించేందుకు శిథిలాలను తొలిగించారు.
ఈ ప్రమాదంలో గురజాలకు చెందిన మహంకాళి శ్రీనివాసరావు(40) అక్కడికక్కడే మృతి చెందగా, మరో కూలీ ఎం శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు శ్రీనివాసరావును గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్సానంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు గురజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎంఇవో ఏసురత్నం, గురజాల డిఎస్పీ రావుల గిరిధర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు మహంకాళి శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు న్నారు.
సమస్యలు పరిష్కరించాలని యానిమేటర్ల దీక్షలు
పొన్నూరు, ఏప్రిల్ 19: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పొన్నూరు మండలంలోని ఐకెపి యానిమేటర్లు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం రిలే దీక్షలు ప్రారంభించారు. పట్టణ కూడలి అయిన ట్రాఫిక్ ఐలాండ్ సెంటర్ వద్ద నుండి ర్యాలీ ప్రదర్శనగా తరలివెళ్లిన యానిమేటర్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు జరిపారు. సిఐటియు పొన్నూరు డివిజన్ కార్యదర్శి ఎంఎ బాషా అధ్యక్షతన జరిగిన దీక్షల్లో 29 గ్రామాల యానిమేటర్లు పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్నుద్దేశించి బాషా మాట్లాడుతూ అన్ని రంగాల్లోని ఉద్యోగుల వలె యానిమేటర్లకు కూడా కనీసం వేతనాలు అందజేయాలని డిమాండ్ చేశారు. యానిమేటర్లకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిరంకుశత్వ ధోరణికి నిదర్శనమన్నారు. ఇంటింటికీ తిరిగి మహిళా గ్రూపులను కూడగట్టి కోట్లాది రూపాయలు పొదుపు చేసేందుకు ప్రధాన భూమిక పోషిస్తున్న యానిమేటర్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నాలో యానిమేటర్ల డివిజన్ అధ్యక్షులు కొర్నెపాటి ప్రభావతి, కార్యాదర్శి సౌపాటి కుమారి, కోశాధికారి ఏలూరి జయలక్ష్మి, ఎం లక్ష్మి, ఉషారాణి, విజయనిర్మల, సుందరి, సిపిఎం నాయకులు వెంకట్రావ్, ఆవాజ్ నాయకులు రవూఫ్, కెవిపిఎస్ నాయకులు డి సుకుమార్, పోలిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం తహశీల్దార్ చిన వెంకయ్యకు వినతిపత్రాన్ని అందజేశారు.
నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
గుంటూరు, ఏప్రిల్ 19: సిసిరోడ్లు, డ్రైన్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ కె సుధాకర్ హెచ్చరించారు. గురువారం తన రోజువారీ పర్యటనలో భాగంగా మారుతీనగర్, నారుూబ్రాహ్మణ కాలనీ, వికాస్‌నగర్, రింగురోడ్డు, సంజీవయ్యనగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాల్లో రాజీలేకుండా, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న మట్టిని, హోర్డింగులను తొలగించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. నారుూబ్రాహ్మణ కాలనీలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు పనులను తనిఖీ చేసి సంబంధిత ఫైలును ఆమోదించారు. అక్కడికి సమీపంలోని ఖాళీస్థలంలో నీరు నిలబడి ఉండటం, గేదెలను కట్టివేసి ఉంచడం గమనించి పరిసర ప్రాంతాలన్నీ అపరిశుభ్రంగా మారే ప్రమాదం ఉందని, తక్షణం గేదెల యజమానులకు నోటీసులు జారీ చేసి, ఖాళీ స్థలంలోని నీటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మారుతీనగర్ మెయిన్ రోడ్డు విస్తరణకు అంచనాలను సిద్ధం చేయాలని సంబంధిత ఎఇని ఆదేశించారు. వికాస్‌నగర్ 10వ లైనులో సిసి రోడ్డు నిర్మాణ పనులను తనిఖీ చేసి సంబంధిత ఫైలును ఆమోదించారు. మంచినీటి సరఫరాపై స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే పైపులైను మరమ్మతులను పూర్తిచేసి మంచినీటి సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, పివి రమణ, కృష్ణారెడ్డి, డిఇ ఆర్ నగేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
అనధికార కట్టడాల తొలగింపు
స్థానిక జిన్నాటవర్ సెంటర్‌లోని శీలంవారివీధిలో జిప్లస్-3 కట్టడానికి అనుమతి తీసుకుని 4వ అంతస్థు నిర్మించడంపై పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సంబంధిత యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నాల్గవ ఫ్లోర్ కూల్చివేసేందుకు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ నారాయణరావు, ఎసిపి ఎ రవింద్ర, పట్టణ ప్రణాళికాసిబ్బంది పాల్గొన్నారు.
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
అచ్చంపేట, ఏప్రిల్ 19: మండలంలోని చల్లగరిగ గ్రామంలో అప్పుల బాధ భరించలేక కౌలురైతు మునగాల సిద్దయ్య (26) గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య రోజారాణి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామానికి చెందిన తేళ్లూరి పిచ్చిరెడ్డి రెండున్నర ఎకరాల పొలాన్ని సిద్దయ్య కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. పెట్టుబడి, కౌలు, ఇతర ఖర్చులు మొత్తం రెండున్నర లక్షల వరకూ అయింది. ఈ ఏడు మిర్చి దిగుబడి 20 క్వింటాళ్లు వచ్చిందని, ఈ మొత్తం పెట్టిన ఖర్చులకు ఒక మూలకు కూడా సరిపోలేదని, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తన భర్త మానసిక ఆందోళనకు గురయ్యాడని చెప్పింది. ఎంత ధైర్యం చెప్పినా మానసికంగా కుంగిపోయిన తన భర్త ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని రోదిస్తూ సిద్దయ్య చేసిన అప్పుల ప్రామిసరి నోట్లను చూపించింది. సిద్దయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆర్‌ఐ అప్పారావు, విఆర్‌ఒ బోసుబాబు, శవపంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
‘ఆదాయానికే మద్యాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం’
గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 19: ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకే మద్యాన్ని ప్రోత్సహించి, మహిళల జీవితాలతో చెలగాటమాడుతోందని తెలుగుమహిళా విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నియంత్రణ కోరుతూ గురువారం మహిళా విభాగం ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళా విభాగం నాయకురాలు పానకాల వెంకట మహాలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు పౌష్టికాహారంతోపాటు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఆదాయం కోసం మద్యం అమ్మకాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తోందని ఆరోపించారు. దశలవారీగా మద్య నిషేదం, బెల్టుషాపులను రద్దు చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు కూలినాలి చేసుకున్న మొత్తాన్ని మద్యానికి ఖర్చు చేయడంతో ఆ కుటుంబాలు వీధినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర తెలుగు మహిళా ప్రచార కార్యదర్శి రామిదేవి హనుమాయమ్మ మాట్లాడుతూ గత 8 సంవత్సరాల్లో రాష్ట్రంలోని వ్యవసాయం, పారిశ్రామిక, చేనేత, విద్యుత్ రంగాలు నష్టాల బాటలో నడుస్తున్నాయని, ఒక్క మద్య పరిశ్రమ మాత్రమే కాంగ్రెస్ పాలనలో పురోగతి సాధించిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు ఇందిరా ప్రియదర్శిని, తిరువళ్లూరి పద్మావతి, తాళ్లూరి బుచ్చమ్మ, నల్లపనేని విజయలక్ష్మి, బత్తుల రమణమ్మ, గొట్టిముక్కల సుజాత, మన్నవ లక్ష్మి, లంకా మాధవి, ప్రమీల, టి గురువులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపథంను బహిష్కరించిన గ్రామస్థులు
ఈపూరు, ఏప్రిల్ 19: తమ సమస్యలు అధికారులు పరిష్కరించడంలేదంటూ మండలంలోని కొండ్రముట్లపాలెం గ్రామస్థులు ప్రజాపథాన్ని బహిష్కరించారు. మండల ప్రత్యేకాధికారి భీమ శంకరరావు అధ్యక్షతన ప్రజాపథం గురువారం జరిగింది. కొండ్రముట్లపాలెం వెళ్ళిన అధికారులకు చేదు అనుభవాన్ని చవిచూశారు. గ్రామస్థులు ప్రజాపథంను బహిష్కరించారు. అధికారులు ప్రజాపథం నిర్వహించేందుకు సిద్ధం కాగా, ఒక్క గ్రామస్థుడు కూడా సమస్యను తెలిపేందుకు ముందుకు రాలేదు. పంట కాలువల్లో పూడిక తీత తీయకపోవడంతో చివరి భూములకు నీరందటంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిమార్లు విన్నవించుకున్న ఫలితం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడకు చేరుకున్న వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విషయం తెలుసుకుని ప్రజాపథం వద్దకు వెళ్ళకుండానే చెట్టు కింద కూర్చుని అధికారులను పిలిపించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఎస్‌పి ఇఇ శరత్‌చంద్రారెడ్డితో ఫోన్‌లో మాట్లాడి, పంట కాలువలను బాగుచేయించి, రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇందిరమ్మ బిల్లులు చెల్లించడంలేదని గ్రామస్తులు తెలుపడంతో హౌసింగ్ ఎండితో ఫోన్‌లో మాట్లాడి పేద వారికి ఇళ్ళు నిర్మించుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలని ఆంజనేయులు కోరారు. అనంతరం కొండ్రముట్లలో జరిగిన ప్రజాపథంలో తహశీల్దార్ పాస్‌పుస్తకాలు ఇవ్వడంలేదని, ఉపాధిహామీ పనులను ఒక పార్టీకి చెందిన వారికే ఇస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. తహశీల్దార్ వాహానానికి గ్రామస్థులు అడ్డుపడి వాగ్వివాదానికి దిగారు.
అనంతరం కొచ్చెర్ల, బ్రహ్మాండపురం, ఉప్పరపాలెం, అంగలూరు, వనికుంట గ్రామాల్లో ప్రజాపథం సజావుగా సాగింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నిధులుకేటాయించకుండా ప్రజాపథంలో సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో హీరాలాల్, తహశీల్దార్ కోటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
నకరికల్లు, ఏప్రిల్ 19: గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని చల్లగుండ్ల అడ్డరోడ్డు వద్ద గురువారం జరిగింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై చల్లగుండ్ల అడ్డరోడ్డుపై సిడి-100 ద్విచక్ర వాహనంపై వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి సుమారు 30 ఏళ్లలోపు వయస్సు ఉంటుందని, తెల్లచొక్కా, లుంగీ ధరించి ఉన్నాడు. ఆ వ్యక్తి జేబులో ఉన్న సెల్‌ఫోన్ నంబర్ అధారంగా...ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రేషన్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే సహించేది లేదు
రెంటచింతల, ఏప్రిల్ 19:స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం రేషన్ డీలర్ల సమావేశం జరిగింది. సమావేశంలో మండలంలోని అన్ని రేషన్ దుకాణాల డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ బి శాంతిప్రకాష్ మాట్లాడుతూ రేషన్‌ను పంపిణీ చేయడంలో డీలర్లు అవకతవకలకు పాల్పడితే సహించేది లేదన్నారు. రేషన్ డీలర్లు ఉదయం, సాయంత్రం రేషన్ దుకాణాలను తెరచి రేషన్ కార్డుదారులకు నిత్యావసర వస్తువులను సక్రమంగా పంపిణీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో డిటి విశే్వశ్వరరావు, ఆర్‌ఐ ప్రసాద్, విఆర్‌ఓలు ఆర్‌విఆర్‌వి ప్రసాదరావు, మల్లిఖార్జునరావు, ముక్కంటి, బాలయ్య, వెంకటరామిరెడ్డి, మండలంలోని రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి
గురజాల, ఏప్రిల్ 19: ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేసి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు అన్నారు. గురజాల పట్టణంలోని జిఐసి కాలనీలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు కె వెంకయ్య సన్మాన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను బోధించాలని అన్నారు. అనంతరం పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు వెంకయ్యను పూలమాలలు, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గురజాల ఎండిఓ గరకపాటి ఏసురత్నం, యుటిఎఫ్ నాయకులు సాల్మన్ రాజు, మోహన్‌రావు, చిరంజీవి, తాళ్ళూరి అరుణ్‌కుమార్, పిచ్చయ్య, స్వర్ణలత, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యకు ముఖ్యమంత్రి పరిష్కారం
మాచర్ల, ఏప్రిల్ 19: దుర్గి మండల పరిధిలోని అడిగొప్పల గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోటి రూపాయల నిధులు మంజూరుకు గురువారం సానుకూలంగా స్పందించారని గండ్రకోట రాంబాబు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం మాజీ ఎమ్మెల్యే పున్నారెడ్డి కుడికాలువ పక్కనే ఉన్న ప్లోరిన్ నీటి సమస్యతో ఆగ్రామ ప్రజలు భాదపడుతున్న విషయాన్ని వివరించగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి నిధులు మంజూరుకు సంబంధిత అధికారులను ఆదేశించారని వారు తెలిపారు.
ప్రజాపథంపై ఆశక్తిచూపని ప్రజలు
మాచర్ల, ఏప్రిల్ 19: ప్రజాపథం కార్యక్రమానికి ప్రజలు ఆశక్తి కనబరచకపోవడంతో గురువారం మాచర్ల పట్టణ పరిధిలో నిర్వహించిన కార్యక్రమాలు వెలవెలబోయాయి. ఉదయం 8గంటలకు స్థానిక నెహ్రునగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన ప్రజాపథం కార్యక్రమానికి సకాలంలో ప్రజలు కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో అధికారులు ప్రజలరాక కోసం సుధీర్ఘంగా ఎదురు చూశారు. పురపాలక సిబ్బంది కలగజేసుకొని ఆప్రాంతంలోని డ్వాక్రా మహిళలను, మరికొందరిని తరలించటంతో ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ లక్ష్మయ్య ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాల గురించి వివరించారు. నెహ్రునగర్ ప్రాంతంలో పురపాలక సంఘం వారి నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉందని మహిళలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. బోరింగ్ మరమ్మతులకు గురైతే మా నీటికష్టాలు వర్ణనాతీతం అని ఆప్రాంత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ఇన్‌చార్జి కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ బోరింగ్ సమస్య ఉన్న సమయాల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నీటి ట్యాంకర్లను పంపిణీ చేస్తున్నామని వారికి తెలిపారు. పురపాలక సంఘం కొద్ది నెలలుగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొందని అందువలన కొద్దిరోజుల క్రితం ఈ సమస్య ఉత్పన్నమైన మాట నిజమేనని ఇక నుండి ఇటువంటి సమస్యలు పునరావృతం కావన్నారు. సాయంత్రం నిర్వహించిన 8వ వార్డు ప్రజలు సైతం నీటి సమస్యపైనే గళమెత్తారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఇ గురవయ్య, ఎలక్ట్రికల్ ఎఇ రాంబాబు,ఎఒ కృష్ణయ్య, మెప్మా అధికారులు శ్రీనివాసరావు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం
విజయపురిసౌత్, ఏప్రిల్ 19: విజయపురిసౌత్ నుండి హైదరాబాదుకు నూతనంగా ఆర్టీసీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మాచర్ల ఆర్టీసీ డిఎం జయశంకర్ తెలిపారు. గురువారం విజయపురిసౌత్ నుండి హిల్‌కాలనీకి నూతనంగా బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ ప్రైవేటు వాహనాలను ప్రయాణీకులు ఆశ్రయించవద్దని, ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమన్నారు. ప్రతిరోజూ మాచర్ల నుండి ఉదయం ఐదుగంటలకు విజయపురిసౌత్‌కు బస్సు బయలుదేరి ఆరుగంటలకు చేరుతుందన్నారు. ప్రతి గంటకు విజయపురిసౌత్ నుండి హిల్ కాలనీకి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఏర్పాటు చేశామన్నారు. ఈ ఆర్టీసీ బస్సు సర్వీస్ రాత్రి 8.30 గంటలకు నడుస్తుందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయపురిసౌత్ నుండి హైదరాబాదుకు ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
వాగు పోరంబాకు భూమిని ఆక్రమించిన సిపిఐ నాయకులు, పేదలు
రెంటచింతల, ఏప్రిల్ 19: మండల కేంద్రమైన రెంటచింతలలో సిపిఐ నాయకులు, మాచర్ల డివిజన్ కార్యదర్శి చవ్వా బాలస్వామిరెడ్డి, మండల కార్యదర్శి కేతావత్ రంగనాయకులు ఆధ్వర్యంలో వాగు పోరంబాకు భూముల్లో పేద ప్రజలు జెండాలు పాతి భూములను అక్రమించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పేదలకు రెంటచింతలలో స్థలాలను కేటాయించడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఫ్యాక్టరీలకు చెందిన బడాబాబులకు వేలాది ఎకరాలను కట్టబెట్టిన రెవెన్యూ అధికారులు పేదల నివేశన స్థలాలకు సెంటుభూమిని కేటాయించకపోగా, ఎక్కడా భూములు లేని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఇళ్ల స్థలాల కోసమే అనేకమార్లు పోరాటాలు చేసి తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేసినప్పటికీ ఇంతవరకు స్థలాలను కేటాయించలేదన్నారు. రెంటచింతలలోని 879/ఎ2లో రెవెన్యూ పోరంబాకు భూమిలో పేదప్రజలు జెండాలు పాతినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న విఆర్‌ఓ ఆర్‌విఆర్‌వి ప్రసాదరావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేయర్‌చే పొలాలకు కొలతలు వేయించి, పోరంబాకు భూమి అయితే పేదలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జాన్ దానయ్య తదితరులు పాల్గొన్నారు.
జీతాలు కోసం కార్మికుల ధర్నా
వేమూరు, ఏప్రిల్ 19: గత 14మాసాలుగా తమకు జీతాలు రావటంలేదంటూ పస్తులు గడపాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జంపని సుగర్ ఫ్యాక్టరీకి చెందిన సుమారు 200మంది కార్మికులు సుగర్ ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా బసివిరెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీ స్థాపించిన నాటి నుండి అభివృద్ధికి కార్మిక ఉద్యోగులు నిరంతర కృషి చేస్తున్నారన్నారు. క్రషింగ్‌లో నిమిత్తంలేకుండా రైతులతో అటు అధికారులతో ఇటు పాలక వర్గంతో సంబంధాలు కొనసాగిస్తూ ఫ్యాక్టరీ దినదినాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల పాలకవర్గం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరివల్ల ఈనాటు సంవత్సర కాలంగా కార్మికులకు జీతాలు లేకుండా పోయాయన్నారు. దీంతో కార్మికుల కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోందన్నారు. ఈధర్నాలో కార్మికసంఘ నాయకులు ఎం బసివిరెడ్డి, జంపని పాల్ ప్రసాద్, ఉద్యోగ కార్మికులు పాల్గొన్నారు.
టిడిపి అధికార ప్రతినిధిగా రాజాకాశయ్య
నరసరావుపేట, ఏప్రిల్ 19: నరసరావుపేట నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఇటీవల తెలుగుదేశంపార్టీలో చేరిన రాజాకాశయ్యను నియమిస్తున్నట్లు పట్టణపార్టీ అధ్యక్షుడు వేల్పుల సింహాద్రియాదవ్ తెలిపారు. గురువారం స్థానిక తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుండి ఎన్టీ రామారావు బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. అదేవిధంగా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లను కేటాయించనున్నట్లు ప్రకటించారని తెలిపారు. కొల్లి ఆంజనేయులు మాట్లాడుతూ టిడిపి ఎల్లప్పుడు బీసీలకు, ఎస్సీ, మైనార్టీలకు అండగా ఉంటుందన్నారు. కొల్లి బ్రహ్మయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు, సింహాద్రియాదవ్ ఆధ్వర్యంలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యతను కలుగజేస్తున్నారన్నార. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్ర ప్రజలు తెలుగుదేశంపార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశంపార్టీ, కోడెల గెలుపుకోసం కార్యకర్తలతో అవిశ్రాంతంగా కృషి చేస్తాననని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నియోజకవర్గంలో కోడెల గెలుపుఖాయమన్నారు. ఈ సమావేశంలో జిలానిమాలిక్, బాబు, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులపై మంత్రి ఆగ్రహం
రేపల్లె, ఏప్రిల్ 19: నీటి కుళాయిలకోసం నగదుచెల్లించి సంవత్సరం గడుస్తున్నా ఇదిగో...అదిగో అని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పదేపదే తిప్పుతున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణారావుకు 11,12వార్డులకు చెందిన 12మంది వినియోగదారులు ఫిర్యాదుచేశారు. గురువారం 7-12 వార్డుల్లో మంత్రి మోపిదేవి ఆధ్వర్యంలో ప్రజాపథం జరిగింది. ఈసందర్భంగా తాగునీటి కుళాయిల కోసం ఒక్కొక్క కుటుంబం ఆరువేల రూపాయలు చెల్లించి సంవత్సరం గడుస్తున్నా అధికారులు నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారని, ఇక కుళాయిలు వద్దు మహాప్రభో ....అంటూ నగదు తిరిగి చెల్లించాలని మంత్రిని వేడుకోవటంతో ఏఇ ఇమ్మాయేల్, డిఇ నాగమల్లేశ్వరావుపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫీల్డులోకివెళ్ళి విధివిధానాలను సమీక్షించి ప్రజలు అవసరాలను తీర్చాలేతప్ప అధికారులు నిర్లక్ష్యధోరణి విడనాడాలని మంత్రి అధికారులపై మండిపడ్డారు. అలాగే కమిషనర్ జెడి సంపత్‌కుమార్ ఉల్లాసంగా... ఉత్సాహంగా అధికారులతో పనులు చేయించాలేతప్ప కార్యాలయానికే పరిమితం కాకూడదని ఆయన కమిషనర్‌ను మందలించారు. అలాగే తెనాలి ఆర్డీఓ శ్రీనివాసమూర్తి తెనాలి నుండి వచ్చి ఆయా కార్యాలయాల్లో కూర్చుంటే సరిపోదని, ప్రజల అవసరాలను గమనించి వారి సమస్యల పరిష్కారంకోసం కృషి చేయాలేతప్ప కార్యాలయాలకు పరిమితం కాకూడదని ఆర్డీఓను హెచ్చరించారు. ఈకార్యక్రమంలో వితంతు, వికలాంగ, వృద్ధాప్య పింఛన్లు, దీపం పథకంకింద గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, ఇరిగేషన్, డ్రైనేజీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జంపని షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు మంత్రి మోపిదేవికి ఫిర్యాదు
జంపని ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్న సుమారు 100కిపైగా రేపల్లె పట్టణానికి తరలివచ్చి గురువారం మంత్రి మోపిదేవికి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా మంత్రి మోపిదేవి వెంకట రమణారావు స్పందిస్తూ సమస్యలను సిఎం వద్దకు తీసుకువెళ్ళి సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని కార్మికులకు మంత్రి హామీ ఇచ్చారు.
వెలవెలబోయిన ప్రజాపథం
దాచేపల్లి, ఏప్రిల్ 19: దాచేపల్లి మండలంలో గురువారం ప్రారంభమైన మొదటిరోజు ప్రజాపథం ప్రజలు లేక వెలవెలపోయింది. పొందుగల, రామాపురం, శ్రీనగర్, గామాలపాడు, నడికుడి గ్రామాల్లో జరిగిన ప్రజాపథం కార్యక్రమాల్లో అధికారులు అధిక సంఖ్యలో హాజరుకాగా ప్రజలు పదుల సంఖ్యలో కూడా హాజరుకాకపోవడంతో సభలు కళతప్పాయి. గతంలో జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో ఇచ్చిన హామీలే ఇంతవరకు అమలుజరగలేదు తిరిగి ఇపుడు ప్రజాపథం కార్యక్రమం నిర్వహించి ఉపయోగమేమిటని ప్రజలు అధికారులను నిలదీశారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎంఎల్‌సి టిజివి కృష్ణారెడ్డి ప్రసంగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామపంచాయతీల సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేకాధికారులుగా పదవీ బాధ్యతలు చేపట్టినవారు గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషిచేయాలని ఎంఎల్‌సి సూచించారు. ఈకార్యక్రమంలో దాచేపల్లి మండల ప్రత్యేకాధికారి కెవి రామారావు, గృహనిర్మాణ శాఖ డిఇ లక్ష్మణ్‌స్వామి, తహశీల్దార్ వెంకట రమణానాయక్, ఎంపిడివో అల్లం స్లీవారెడ్డి, విద్యుత్‌శాఖ ఎఇ కన్నా నారాయణ, దాచేపల్లి ప్రాథమిక వైధ్యాధికారి లక్ష్మీభవాని, వ్యవసాయ శాఖాధికారి పాపకుమారి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ సోమయ్య, గృహనిర్మాణ శాఖ ఎఇ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.